close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
చిన్నారుల కోసం చిట్టి పాపాయిలు

చిట్టి చేతులూ... బుల్లి పాదాలూ... లేత బుగ్గలూ... అప్పుడే పుట్టిన చంటి పాపలు ఎంత అపురూపంగా కనిపిస్తారో. ఆ రూపాన్ని చూసి కన్నవారే కాదు, ఎవరైనా తన్మయత్వం చెందాల్సిందే. ఓసారి ముద్దాడాల్సిందే. అదేం మాయో తెలీదు కానీ ఎలాంటి వారైనా పసివాళ్లను చూడగానే అన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుతారు. అందుకే, చంటి పిల్లలంటే ఇష్టపడని వాళ్లు చాలా అరుదు. అలా అని ఎప్పుడూ మనింట్లో ఓ పసిపాప ఉండాలి... ఆ చిన్నారితో మనం ఆడుకోవాలి... అంటే సాధ్యం కాని పని. అయినా నిరుత్సాహ పడనక్కర్లేదులెండి. ఇపుడు మార్కెట్లోకి అచ్చం నిజమైన చిన్నారుల్లా ఉండే చిన్నిచిన్ని బొమ్మలొస్తున్నాయి. కెనడాకు చెందిన ఆర్టిస్ట్‌ ‘కామిల్లె అలెన్‌’ రూపొందించే ఈ మీనియేచర్‌ డాల్స్‌ చూడ్డానికి అచ్చం నిజమైన పిల్లల్లానే ఉంటాయి. కళ్లూ ముక్కూ నోటితో పాటు, కాళ్లూ వేళ్లూ గోళ్లూ ఆఖరికి చర్మం రంగూ ముడతలతో సహా అన్నీ పుట్టిన పిల్లలకు ఉన్నట్లే ఈ బొమ్మల్లోనూ కనిపిస్తాయి మరి. క్లేతో చిన్నారి రూపాన్ని తయారుచేసి ఆపైన చర్మం, జుట్టు, కళ్లను పోలినట్లు రంగులద్ది సహజమైన రూపం వచ్చేలా చేస్తుంది కామిల్లె. కాబట్టే, హఠాత్తుగా ఎవరైనా ఈ బొమ్మల్ని చూస్తే ఒక్క నిమిషం పాప ఇంత చిన్నగా పుట్టిందేంటీ... అని షాకయినా అవ్వగలరు. నిజానికి కామిల్లె మొదట పెద్ద బొమ్మల్ని చెయ్యడమే నేర్చుకుంది. ఓసారి తన దగ్గర ఎక్కువ క్లే లేకపోవడంతో సరదాగా ఇలా వేలెడంత బొమ్మల్ని చేసిందట. అవే ఆమెకు బాగా నచ్చడంతో తర్వాతా వాటినే తయారుచెయ్యడం మొదలుపెట్టింది. ఆ బొమ్మలకి మార్కెట్లోనూ అంతే బాగా గిరాకీ వచ్చింది. అవునుమరి, వీటినైతే ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు, ఎంచక్కా టేబుల్‌మీదా షోకేస్‌లో పెట్టుకోవచ్చు. పిల్లలు బొమ్మలాటలాడుకోవడానిక్కూడా బాగుంటాయి. గర్భం దాల్చిన మహిళలకు కానుకలుగానూ ఇవ్వొచ్చు. సీమంతం, పుట్టినరోజు వేడుకల సమయంలో కేకుల మీద కూడా వీటిని అలంకరిస్తున్నారు. బుల్లి పాపాయి బొమ్మలు భలే ఉన్నాయి కదూ..!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు