close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆల్‌ రౌండర్‌

- ఉమా మహేష్‌ ఆచాళ్ళ

ఎత్తు మరిగిన పిల్లాడు దింపగానే గుక్కపెట్టినట్టు- ఉదయం అయిదు గంటలకు పెట్టిన అలారం ఆరోహణంలో అలుపు లేకుండా మోగుతోంది. ముందుగా శారద లేచి దేవుడి క్యాలెండర్‌ని కళ్ళకు అద్దుకుని, అలారం ఆఫ్‌ చేసి మంచం దిగింది. మరో అయిదు నిమిషాలు మంచం మీద అటూ ఇటూ దొర్లి, రంగనాథ్‌ కూడా లేచాడు.
ఆమె కుక్కర్‌ స్టౌ మీద పెట్టి పిల్లల్ని లేపడానికి వెళ్తే, అతను క్రికెట్‌ కిట్‌ పట్టుకుని పక్కనే ఉన్న గ్రౌండ్‌కి వెళ్ళాడు.
రంగనాథ్‌ రైల్వే గ్రౌండ్స్‌లో ప్రతిరోజూ క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేస్తాడు. డిపార్ట్‌మెంట్‌లో జరిగే ఇంటర్‌, ఇంట్రా జోనల్‌ పోటీల్లో రెగ్యులర్‌గా పాల్గొంటూ ఉంటాడు. శారద పిల్లలకి పాలు కలిపిచ్చి, టిఫిన్‌లు పెట్టి, లంచ్‌బాక్స్‌లు
సర్ది, ఇంజినీరింగ్‌ ఫోర్త్‌ ఇయర్‌ చదువుతున్న కొడుకుని పంపి, పనిమనిషికి గిన్నెలు వేసేలోపు రంగనాథ్‌ ప్రాక్టీస్‌ నుంచి అలసిపోయి వచ్చి బాల్కనీలో ఉన్న వాలుకుర్చీలో కూలబడ్డాడు.
వెంటనే శారద అతనికి ఓ గ్లాసుతో మంచినీళ్ళూ మరో గ్లాసుతో కాఫీ తీసుకెళ్ళి అందించింది. అతను కాఫీ తాగుతూ పేపర్‌ చదువుతూ ఉండగా అడిగింది- ‘‘ఏమండీ, ఇవాళ చంటిదాని ఆటోవాడు రాడట. కొంచెం మీరు దింపేస్తారా... అలాగే వచ్చేటప్పుడు బియ్యం తీసుకురావాలి’’ అంది కొంచెం భయం భయంగా.
సాధారణంగా ఇంటిపనులేవీ అతనికి చెప్పదు. విసుక్కుంటాడని భయం. అనుకున్నట్టుగానే అతను విసుక్కున్నాడు.
‘‘శారదా, నేనేం నీలా ఖాళీగా లేను. ఇలా ప్రాక్టీస్‌ చేసి వచ్చానో లేదో మళ్ళీ ఆఫీసుకి వెళ్ళి పనిచెయ్యాలి. ఇలాంటి పనులు నాకు పెట్టకు. అయినా నీకూ బండి కొనిచ్చానుగా, నువ్వెళ్ళు’’ అన్నాడు ఆమె జవాబు కోసం చూడకుండా పేపరులోకి దూరి.
‘‘సరే సరే, పనిమనిషి ఇంట్లో ఉంది కదా అని మిమ్మల్ని అడిగాను. నేనే వెళ్తాలెండి. కొంచెం చూస్తూ ఉండండి’’ అంటూ తయారై ఉన్న కూతుర్ని తీసుకుని బయలుదేరింది.
రంగనాథ్‌ పేపర్‌ చదివి, ఫ్రెండ్స్‌తో వాట్సాప్‌ చాటింగ్‌ అయిపోయాక స్నానం చేసేలోపు శారద వచ్చి, అతనికి రెండు చట్నీలతో నాలుగు ఇడ్లీలూ మజ్జిగలో కలిపిన రాగి జావా టేబుల్‌ మీద రెడీగా పెట్టింది.
‘‘శారదా, జోనల్‌ స్పోర్ట్స్‌మీట్‌ కోల్‌కతాలో ఉంది. నేను ఎల్లుండి బయలుదేరాలి.
నా బట్టలు సర్దు. ఇదిగో మొద్దూ, మొన్న టంగ్‌క్లీనర్‌ పెట్టడం మర్చిపోయావు, కొంచెం శ్రద్ధగా సర్దు. రోజంతా ఏం చేస్తావు ఖాళీయేగా’’ అంటూ టిఫిన్‌ తిని విసుగ్గా లేచి ఆఫీసుకి బయలుదేరాడు రంగనాథ్‌. అతను వెళ్ళాక మిగతా పనులన్నీ ఆపి, అటక మీద నుంచి ట్రావెల్‌ బ్యాగ్‌ తీసి దులుపుతూ ఉంటే అందులోంచి కిందపడింది టంగ్‌క్లీనర్‌. నవ్వుకుని, ఓ నాలుగు జతల స్పోర్ట్స్‌ డ్రెస్సులూ వారం టూర్‌కి సరిపడా మిగతా వస్తువులూ సర్దిపెట్టింది.
ఆరోజు సాయంత్రం అతనికి కావలసిన వస్తువులేవో కొనుక్కోవాలంటే పక్కనే ఉన్న డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌కి ఇద్దరూ వెళ్ళారు. సామాన్లు తీసుకుంటూ ఉండగా, రంగనాథ్‌కి సృజన కనపడింది. సృజన రంగనాథ్‌ సెక్షన్‌ ఇన్‌చార్జ్‌. కొత్తగా జాయిన్‌ అయ్యింది.
చిన్న వయసే అయినా, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కావడంతో పెద్ద పొజిషన్‌లో ఉంది.
‘‘నమస్తే మేడమ్‌’’ అన్నాడు రంగనాథ్‌ వినయంగా.
‘‘నమస్తే అండీ, ఎలా ఉన్నారు. మీ వైఫా?’’ అడిగింది సృజన శారదకేసి చూసి నవ్వుతూ.
‘‘అవును మేడమ్‌, తను శారద. శారదా, మేడమ్‌ మా బాస్‌. మల్టీ టాలెంటెడ్‌. మేడమ్‌ మంచి సింగర్‌. నెక్స్ట్‌వీక్‌ జరిగే జోనల్‌ కల్చరల్‌ మీట్‌లో మేడమ్‌ కూడా పార్టిసిపేట్‌ చేస్తున్నారు’’ అంటూ ఒకరినొకరికి పరిచయం చేశాడు రంగనాథ్‌.
‘‘మీరేం చేస్తుంటారు’’ అడిగింది సృజన.
దానికి శారద సమాధానం చెప్పేలోపే ‘‘ఖాళీయే మేడమ్‌. అదే నాకూ అర్థంకాదు మేడమ్‌... రోజంతా ఆ టీవీ చూస్తూ ఎలా గడుపుతుందో! మనలాంటి ఆల్‌ రౌండర్స్‌కి ఇరవైనాలుగు గంటలు టైమ్‌ చాలటం లేదు’’
అని గట్టిగా నవ్వాడు రంగనాథ్‌. మేఘంచాటు ఎండలా మౌనంగా ఉండిపోయింది శారద. ఇంతలో రంగనాథ్‌ ‘‘మీరు మాట్లాడుతూ ఉండండి మేడమ్‌, నేను మళ్ళీ వస్తాను’’ అంటూ వెళ్ళి తనకి కావాల్సిన వస్తువులు తీసుకుని బిల్లు పే చేసి వచ్చి, ఇంకోసారి మేడమ్‌కి నమస్తే చెప్పి శారదని తీసుకుని ఇంటికి బయలుదేరాడు.
‘‘ఏమండీ, ఆవిడ నా గొంతు బాగుందని మెచ్చుకున్నారండీ’’ అంది బండి వెనకాల కూర్చున్న శారద మురిపెంగా.
‘‘చాల్లే. ఏదో ఆవిడ నామీదున్న గౌరవంకొద్దీ మాట వరసకు అనుంటారు. అది పట్టుకుని నువ్వు రేపట్నుంచి ఇంట్లో మళ్ళీ కచేరీలు మొదలెట్టకు’’ అన్నాడు రంగనాథ్‌ విసుగ్గా యాక్సిలరేటర్‌ రైజ్‌ చేస్తూ.

* * *

కాలింగ్‌బెల్‌ మోగడంతో మిషన్‌ మీద ఫాల్‌ కుడుతున్న శారద లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా నీరసంగా రంగనాథ్‌. అతని చేతిలోని బ్యాగ్‌ అందుకుని, అతను కూర్చున్నాక మంచినీళ్ళు అందించి ‘‘ఎలా జరిగిందండీ మీ ట్రిప్‌? మీరు బాగా ఆడారా? మ్యాచ్‌ ఏమైంది?’’ అంటూ ఆదుర్దాగా అడిగింది.
‘‘మ్యాచ్‌ పోయింది. అంతా పాలిటిక్స్‌. ఈసారి సరైన టీమ్‌ని సెలెక్ట్‌ చెయ్యలేదు.
సరే సరే, స్నానానికి నీళ్ళు పెట్టు. ఈ మిషన్‌ ఇక్కడ అడ్డుగా తియ్యి’’ అంటూ విసుక్కున్నాడు. స్నానం చేసి, భోజనం చేసి బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి తలుపు వేసుకుంటూ చెప్పాడు- ‘‘మా మేడమ్‌కి సింగిల్స్‌లో ఫస్ట్‌ ప్రైజ్‌ వచ్చింది. సాయంత్రం క్వార్టర్స్‌లో చిన్న అభినందన సభ ఏర్పాటు చేస్తున్నాం. నిన్ను కూడా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు. అయిదింటికి నన్ను లేపు. నువ్వూ తయారవ్వు’’ అంటూ ఆమె సమాధానం కోసం కూడా వెయిట్‌ చెయ్యకుండా తలుపేసుకున్నాడు రంగనాథ్‌.
ఆ సాయంత్రం రైల్వే క్వార్టర్స్‌ ఆడిటోరియంలో సృజనకు అభినందన సభ ఘనంగా ఏర్పాటు చేశారు. కాలనీ ప్రెసిడెంట్‌ అయిన రంగనాథ్‌ ముందుగా మాట్లాడాడు. ‘‘మిత్రులారా, ప్రతి ఏటా మన జోన్‌కి క్రికెట్‌లో తప్పకుండా ప్రైజ్‌ వచ్చేది. అటువంటిది ఈ ఏడు అది తప్పినా, మన సృజనా మేడమ్‌గారు అద్భుతమైన ప్రతిభ కనబర్చి సంగీతంలో ఫస్ట్‌ ప్రైజ్‌ తెచ్చి మన జోన్‌ పరువు నిలిపారు. మేడమ్‌ ఆఫీసులో ఎంతో బిజీగా ఉంటూ కూడా, ఇంకా పైచదువులు చదువుతూ సంగీతం నేర్చుకుంటూ ఓ ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు. సన్మానానికి ముందు ఆవిడ మాట్లాడాలనుకుంటున్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను’’ అంటూ సృజనని స్టేజీ పైకి ఆహ్వానించి, మైక్‌ ఆమెకిచ్చి వచ్చి శారద పక్కన కూర్చున్నాడు.
ఆవిడ బాస్‌ కావడంతోనో లేక చిన్న వయసులోనే పెద్ద పొజిషన్‌లో ఉన్నందువల్ల గౌరవంచేతనో ఒక్కసారి అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది. సృజన నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది.
‘‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఎప్పుడూ నాతో చెబుతూ ఉండేది... చిన్నప్పుడు తను చదివిన గర్ల్స్‌ హైస్కూలులో తనకో బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉండేదట. జూనియర్‌ అయినా తనే వాళ్ళ స్కూలుకి లీడర్‌. బాస్కెట్‌బాల్‌, వాలీబాల్‌ టీమ్స్‌కి కెప్టెన్‌ కూడానట. చదువులో కూడా ఆమె టాపర్‌గా ఉండేదట. నాకెప్పుడూ ఆమె గురించే చెబుతూ నేను కూడా ఒక్క చదువులోనే కాకుండా అన్నింటిలోనూ ముందుండేలా ఇన్‌స్పైర్‌ చేసేది. అలా నేర్చుకున్నదే ఈ సంగీతం.
ఇక్కడికొచ్చాక నాకు ఒకావిడ పరిచయమయింది. మర్చిపోయిన సంగీతాన్ని గుర్తుచేసుకోవటానికి ఆవిడ హెల్ప్‌ తీసుకునే ప్రాసెస్‌లో ఓ నాలుగు రోజులు ఆవిడతో ఎక్కువ సమయం గడిపాను. అప్పుడు గమనించానావిణ్ణి... ఓ గృహిణిగా ఉదయం ఐదు గంటలకి లేచి, పెద్దవాళ్ళకి ముద్దకూర, చిన్నవాళ్ళకి పన్నీర్‌ కర్రీ, భర్తకి కాఫీ, బిడ్డకి బోర్నవిటా, ఒకరికి ఇడ్లీ, ఇంకొకరికి గుడ్డూ, ముగ్గురికీ మూడు రకాల క్యారేజీలు. మళ్ళీ రాత్రికి నైస్‌గా ఉండేవాళ్ళకి రైస్‌, డైటింగ్‌లో ఉన్నవారికి రోటీ... ఇలా ఇంట్లో పనులేకాక బయటకెళ్ళి కూరలు, కిరాణా తెచ్చుకోవటం. మనలా వీళ్ళకి వీకెండ్‌ సెలవులుండవు.
పైగా, సండే స్పెషల్‌ బిర్యానీ, ముసురేస్తే మిరపకాయ బజ్జీ... లాంటి ఎక్స్‌ట్రా వంటలు. ఏ ఏడాదికో రెండేళ్ళకో ఏదైనా ఊరెళ్ళొస్తే ఆ తర్వాత వారం రోజులు ఒళ్ళు హూనమయ్యేంత పని. ఇవన్నీ ఫిజికల్‌ వర్క్స్‌. ఇక మెంటల్‌ స్ట్రెస్‌ విషయానికొస్తే... నెలలో ఎన్ని పాల ప్యాకెట్లు తీసుకోలేదు, ఇస్త్రీకి ఎన్ని బట్టలు వేశాం, పనిమనిషికిచ్చిన అడ్వాన్స్‌ ఇంకా ఎన్ని నెలల్లో పట్టుకోవాలి... లాంటి రోజువారీ టెన్షన్‌లతోబాటు పిల్లలకి పదో ఏడొస్తే ఓ టెన్షన్‌, పద్దెనిమిదో ఏడొస్తే మరో టెన్షన్‌. రాత్రి పడుకునేముందు కూడా రేపటికి టిఫిన్‌కి ఏముందో టెన్షన్‌. ఆఖరికి సినిమా హాల్లో ఉన్నప్పుడు కూడా మబ్బేస్తే మొత్తం కుటుంబం బట్టలు బయట ఆరేసి ఉన్నా, టెన్షన్‌ మాత్రం గృహిణికే.

‘‘కొంచెం బోరుకొట్టిస్తున్నానేమో సారీ’’ అంటూ వాటర్‌ బాటిల్‌లో నీళ్ళు తాగి, మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది సృజన.
‘‘రెండు లీటర్ల పాలు పొంగే వరకూ స్టవ్‌ దగ్గర నిల్చోవటం, మండు వేసవిలో ఊరగాయల కోసం కేజీలకొద్దీ వెల్లుల్లిపాయలు ఫ్యాన్‌ కట్టేసి మరీ వొలవటం, క్యారెట్లు తురమడం... ఇలాంటి పనులు చేసేటప్పుడు వాళ్ళల్లో భూదేవంత సహనాన్ని గమనించొచ్చు.
ఈ నాలుగు రోజులూ ఆవిడ ఓ పక్క నాకు సంగీతం నేర్పుతూనే మరోపక్క ఉతికిన బట్టలు మడతపెట్టడమో, కూరగాయలు తరగటమో ఏదో ఒకటి చేస్తూనే ఉంది.
టీవీ పెట్టుకున్నా, ఏ వంటల ప్రోగ్రామ్‌ చూసి పిల్లలకి ఏ వెరైటీ స్నాక్స్‌ చెయ్యాలన్నదే ఆవిడ ధ్యాస.
ఇక అసలు విషయానికొస్తే... నేను పైన చెప్పిన మా అమ్మ ఫ్రెండూ నాకు సంగీతం నేర్పిన గృహిణీ ఇద్దరూ వేరు కాదు, ఒక్కరే. ఆవిడ మనమధ్యే ఉన్న శారదగారు...
ఐ మీన్‌... మిసెస్‌ శారదా రంగనాథ్‌.’’
ఒక్క క్షణం తర్వాత హాలంతా చప్పట్లు. అందర్నీ ఆగమని సైగ చేసి, సృజన తిరిగి చెప్పటం మొదలుపెట్టింది.
‘‘ఇందాక రంగనాథ్‌గారు నన్ను ఆల్‌ రౌండర్‌ అన్నారు. స్కూలు రోజుల్లో అంత టాలెంట్‌ ఉండి కూడా, పెళ్ళి కాగానే అవన్నీ వదిలేసి తన ప్రతిభనీ శక్తినీ మొత్తం తన కుటుంబం కోసమే వెచ్చించే ఆవిడే నా దృష్టిలో నిజమైన ఆల్‌ రౌండర్‌.
ఆల్‌ రౌండర్‌ అంటే ఏదైనా చెయ్యగలిగేవారు మాత్రమే కాదు, టీమ్‌ కోసం ఏదైనా వదులుకునేవారు కూడా. దాదాపు ఎనభై వన్డే మ్యాచ్‌లు సెకండ్‌ డౌన్‌లో బ్యాటింగ్‌ చేసి, కంఫర్ట్‌ జోన్‌లో ఉండి కూడా ఆ తర్వాత టీమ్‌ కోసం ఓపెనింగ్‌ బ్యాట్స్‌మేన్‌గా మారిన సచిన్‌లా, కెప్టెన్‌ అయ్యుండీ బ్యాటింగ్‌లో ఒక నిర్దుష్టమైన స్థానం అంటూ లేకుండా టీమ్‌ కోసం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఆడే ధోనీలా, శారదగారూ ఆవిడలాంటి అందరు గృహిణులూ నిజమైన ఆల్‌ రౌండర్స్‌. మాలాంటి వర్కింగ్‌ విమెన్‌ ఇంటిపనీ ఆఫీసు పనీ కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ మాలాగా ఇంట్లో వంటమనిషిని పెట్టుకోవడం, పిల్లల్ని క్రెచ్‌లో ఉంచటం లేదా పెద్దవాళ్ళకి అప్పజెప్పటం ఆఫీసులో మెటర్నిటీ లీవ్‌లూ చైల్డ్‌కేర్‌ లీవ్‌లూ... లాంటి ప్రివిలేజెస్‌ ఏవీ లేకుండా, ఎటువంటి గుర్తింపూ ఆశించకుండా, బ్యాక్‌ ఎండ్‌లో శారదలాంటి గృహిణులు చేసే సేవ అద్వితీయం. చీరకొంగుకు మాత్రమే తెలిసే వారి కష్టమూ వీధిగుమ్మం దాటని వారి ప్రతిభా గుర్తించడానికి రెండు కళ్ళుంటే చాలదు... నిండు మనసుండాలి. అందుచేత ఈ సన్మానం జరగవలసింది నాక్కాదు, శారదగారికి’’ అంటూ శారదని స్టేజీ మీదకి పిలిచింది సృజన.
అప్పటివరకూ ఆవిడ చెప్పేది వింటున్న శారద తన గురించి చెప్పి, తన పేరు పిలిచేటప్పటికి కంగారుగా భర్తకేసి చూసింది. రంగనాథ్‌ నవ్వుతూ వెళ్ళమని సైగ చేశాడు. అక్కడున్న గృహిణులంతా శారదని చుట్టుముట్టి మరీ స్టేజి మీదకి తీసుకెళ్ళారు. ఆదివారం ఉదయం దుప్పట్లోంచి బయటకొచ్చిన స్కూలు పిల్లాడిలా మబ్బుల్లోంచి చంద్రుడు ఉత్సాహంగా బయటకొచ్చి ఇంకొంచెం వెన్నెల పరిచాడు. అంతా ఆపేసినా, రంగనాథ్‌ చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఒక్కోసారంతే, మనింట్లో నీరు తియ్యగా ఉంటుందని రోజూ తాగే మనకి తెలియదు- బయటవాళ్ళొచ్చి చెబితే తప్ప.

* * *

ఆ మర్నాడు ఉదయం ‘‘శారదా, సంచీ ఇవ్వు, కూరలకి వెళ్ళొస్తా’’ అన్న రంగనాథ్‌ పిలుపుకి కిచెన్‌లోంచి బయటకొచ్చిన శారద ‘‘అదేంటండీ, మీరు క్రికెట్‌కి వెళ్ళరా?’’ అడిగింది ఆశ్చర్యంగా.
‘‘వయసు పెరుగుతోంది కదా, ఈ ఆటలు కొంచెం తగ్గించమని డాక్టర్‌ చెప్పారు. శని, ఆదివారాలు వెళ్తాలే... చాలు’’ అన్నాడు రంగనాథ్‌ నవ్వుతూ.
వేసవి సెలవుల ముందురోజు లాస్ట్‌ పీరియడ్‌ తర్వాత పిల్లాడిలా శారద కళ్ళల్లో ఓ రిలీఫ్‌తో కూడిన మెరుపు.
కూరలకి వెళ్తూ వెళ్తూ ఆ కాలనీలో ఉన్న నోటీసు బోర్డులో ఓ పేపరు అంటించి వెళ్ళాడు రంగనాథ్‌. ‘‘ఉచిత సంగీత శిక్షణ కొరకు సంప్రదించండి, శ్రీమతి శారద, క్వార్టర్‌ నంబర్‌ 2/12.’’

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.