close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రేమ ఎంత మధురం...

ఆకలి వెయ్యదు. నిద్ర పట్టదు. మనసు మనసులో ఉండదు. మనిషి మనిషిలానూ ఉండడు... ఎవరితో ఉన్నా ఏం మాట్లాడినా అతడికి ఆమె... ఆమెకు అతడు... తప్ప మరో ప్రపంచం కనిపించదు. అదే ప్రేమ మాయ. అందులో పడితే సంతోషం ముఖం మీద బ్రేక్‌ డాన్స్‌ చేస్తుంది. ఆనందం ఒళ్లంతా వైఫైలా చుట్టేస్తుంది. అందమైన ఆ అనుభూతి వెనుక అయస్కాంతంలా ఆకట్టుకునే అంశాలూ ఎన్నో! హ్యాపీ వేలంటైన్స్‌డే.

ప్రేమంటే ఇలా ఉంటుంది అని చెప్పలేం...
దీన్నే ప్రేమంటారు... అని వివరించనూలేం.
ఏ రోజుకారోజు గతాన్ని మర్చిపోయే విచిత్ర
పరిస్థితిలో ఉన్న ప్రేమికురాలిని ప్రతిరోజూ
ప్రేమలో పడేసి తన ప్రేమను నిరూపించుకునే ప్రేమికుడు ఒకరైతే నచ్చిన వాడిని
ప్రేమించుకోవచ్చంటూ ఆడపిల్లకి ప్రత్యేకంగా లవ్‌హట్స్‌ వేసిచ్చే వాళ్లు ఇంకొకరు.
ప్రేమికుల కోసం ప్రత్యేకంగా శిల్పాలూ
విధికి తలవంచి విడిపోయిన ప్రేమ జంటలు ఏటా కలుసుకునే పండుగలూ...
మనచుట్టూ చాలానే ఉన్నాయి. అంతేకాదు... ప్రేమను తెలిపేందుకే పండే హృదయాకారపు పండ్లూ, ఎప్పటికీ వసివాడని పూలూ...
ఇలా చెప్పుకుంటూపోతే ప్రేమ సంగతులెన్నో.

పండంటి ప్రేమ!

ప్రేమలో పడినవారికి అంతా ప్రేమమయంలానే ఉంటుంది. వారికి సృజనాత్మకత కూడా ఎక్కువేనండోయ్‌. అలా జపాన్‌కి చెందిన కుమమోటో ఏకంగా పండ్లూ కూరగాయల్ని హృదయాకారంలో పండించడం మొదలుపెట్టాడు. అవునుమరి, ప్రియమైనవారికి పండ్లను కానుకలుగా ఇవ్వాలంటే గుండ్రంగా బంతుల్లా ఉన్నవాటిని ఇస్తే ఏం బాగుంటుంది... అదే హృదయంలా ఉన్న యాపిల్‌నో పుచ్చకాయనో చేతిలో పెట్టి ‘నా హృదయంలో నిదురించే చెలీ నీ హృదయంలో చోటిస్తావా మరీ...’ అంటే రొమాంటిక్‌గా ఉంటుంది కానీ..! అందుకే, కుమమోటో పండించిన ఈ హృదయాకారపు పండ్లకు ప్రేమికుల్లో తెగ క్రేజ్‌ వచ్చేసింది. ఇంకేముందీ, ఇపుడు జపాన్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ ప్రేమ పంటను పండిస్తున్నారు. ఇంతకూ హృదయాకారంలో పండ్లు ఎలా పండుతున్నాయంటారా... పిందెలు పెద్దయ్యే క్రమంలో వీటికి ఆ రూపంలో ఉన్న ప్లాస్టిక్‌ మౌల్డుల్ని అమర్చుతారు. దాంతో అవి హృదయాకారంలో పెరుగుతాయి. పండంటి ప్రేమ కదూ...

ప్రేమ శిల్పం!

తాము ప్రేమలో ఉన్నామని ప్రపంచమంతా చెప్పేయాలనుకుంటారు ప్రేమికులు. అందుకే, గట్టిగా అరిచి చెప్పలేకపోయినా ‘హనీ లవ్స్‌ నానీ, ఐలవ్యూ లక్కీ’... అంటూ ముద్దు పేర్లతో రకరకాలుగా చెట్ల మీదా బెంచీల పైనా గోడల మీదా రాసేసుకుంటుంటారు. ఇలాంటి వారి కోసం పోర్చుగల్‌లో ఏకంగా హృదయాకారమూ ఆ పక్కనే లవ్‌(ః్న‌్ర’) అంటూ ఆంగ్ల అక్షరాలతో ఓ ప్రేమ శిల్పాన్నే ఏర్పాటు చేశారు. లిస్బన్‌లోని టాగూస్‌ నది ఒడ్డున ఉన్న ఈ అక్షర శిల్పాలన్నిటికీ మెష్‌లు ఉంటాయి. దాంతో ప్రేమికులు స్థానికంగా అమ్మే హృదయాకారపు తాళాలను కొని తమ పేర్లూ సందేశాలూ రాసి వాటికి తగిలిస్తుంటారు. అలా తాళాలు వెయ్యడం వల్ల వారి ప్రేమ పదిలంగా ఉంటుందని నమ్ముతారు. ఇక, ఈ చోటు ప్రేమ పక్షులకు ప్రియమైన పర్యటకస్థలం అవడంలో ఆశ్చర్యం ఏముందీ...

ప్రేమించుకుందాం రా...

‘ప్రేమ విలువ ప్రేమలో పడినవారికీ ప్రేమలో బతికిన వారికీ మాత్రమే తెలుస్తుంది’... కంబోడియాలోని క్రెయంగ్‌ తెగ ప్రజలు గట్టిగా నమ్మే సూత్రమిది. అందుకే, అక్కడ అమ్మాయికి పదిహేనేళ్లు రావడం ఆలస్యం, తండ్రి ఆమెకోసం ఇంటి వెనక భాగంలో ఓ ప్రేమ కుటీరాన్ని కట్టిస్తాడు. అంతేకాదు, ‘నీకు ప్రేమలో పడే వయసొచ్చింది. నీ మనసుకు నచ్చినవారినెవర్నైనా ఇక్కడికి తీసుకురావొచ్చు. వారితో స్నేహం చేస్తావో సహజీవనం చేస్తావో నీ ఇష్టం. సరైన తోడు దొరికి, నిజంగా ప్రేమలో పడినపుడు మాత్రం చెప్పు. పెళ్లి చేస్తాం’ అని కూతుళ్లకు చెబుతారు తండ్రులు. అక్కడ ప్రేమకు తప్ప ఆస్తులూ అంతస్తులకు విలువ ఇవ్వరు పెద్దలు. కలిసి బతికినపుడే ఒకరిలోని మంచి చెడులు మరొకరికి తెలుస్తాయి. ఇద్దరి మధ్యా ఉన్నది ప్రేమా ఆకర్షణా అన్న విషయమూ అర్థమవుతుంది. పెళ్లికి ముందే ఇదంతా తెలుసుకునే అవకాశం పిల్లలకిస్తే సరైన భాగస్వామి దొరికాకే పెళ్లి చేసుకుంటారు. కాబట్టి ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది... అన్నది వారి నమ్మకం. నిజంగానే అక్కడ విడాకులు తీసుకునే జంటలు చాలా అరుదు. ఇక, తమ దగ్గరికి వచ్చే అబ్బాయితో స్నేహం చెయ్యాలా సహజీవనం చెయ్యాలా అన్నది పూర్తిగా అమ్మాయిల ఇష్టమే. దానికి వ్యతిరేకంగా అబ్బాయిలు ప్రవర్తించడానికి లేదు. కొంతకాలం స్నేహం తర్వాత అతడు ఆమెకు నచ్చకపోతే ‘ఇక, నా ఇంటికి రావొద్దు’ అని చెప్పేయొచ్చు.

ఈ ప్రేమ వాడిపోదు!

ఎవరికైనా ‘ఐలవ్యూ’... చెప్పాలంటే చేతిలో ఏమున్నా లేకపోయినా అందమైన గులాబీ ఉండడం మాత్రం కనీస అర్హత. ఇక, ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు, గులాబీ బొకేలతో ప్రేయసీప్రియుల్ని ముంచెత్తుతుంటారు అబ్బాయిలూ అమ్మాయిలూ. సున్నితంగా, చూడగానే మనసును ఆహ్లాదంలో ముంచెత్తేలా ఉండే గులాబీలు ఎంతో అందంగానూ ఉంటాయి. కానీ రెండో రోజుకే వాడిపోయే పువ్వుల్ని మిగిలిన కానుకల్లా జీవితాంతం అపురూపంగా దాచుకోలేం. అందుకే, ఈతరం ప్రేమికులు ఎప్పటికీ వాడిపోని గులాబీలను కానుకలుగా ఇచ్చుకుంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ‘ఫరెవర్‌ రోజ్‌ లండన్‌’ కంపెనీ వీటిని తయారుచేస్తోంది. గులాబీలు మొక్కకు ఉన్నపుడే కాడల్లోనుంచి వాటికి మైనం, గ్లిజరిన్‌, ఇతర నూనెలు ఎక్కించడం ద్వారా అవి వాడిపోకుండా రాలిపోకుండా ఉండేలా చేస్తోంది. ప్రత్యేకమైన గాజు డబ్బాలో పెట్టిన ఇవి ఇరవయ్యేళ్లవరకూ తాజా పువ్వుల్లానే ఉంటాయట. ఇవి ఆన్‌లైన్‌ షాపుల్లోనూ అందుబాటులో ఉండడంతో వేలంటైన్స్‌డే కానుకల్లో వీటికి డిమాండు విపరీతంగా పెరిగిపోయిందట.

ప్రేమను కొలిచేద్దాం...

‘నామీద నీకున్న ప్రేమ ఎంత...’ అని గోముగా అడిగిన ప్రియురాలి ప్రశ్నకు ‘చెప్పలేనంత’ అంటూ కొంటెగా చెబుతుంటారు అబ్బాయిలు. ప్రేమను కొలిచి చెప్పడం కష్టమే మరి. కానీ తమ ప్రేమ బంధం ఎంత దృఢమైనదో తెలుసుకోవాలని సరదాపడుతుంటారు ప్రేమికులు. అలాంటివారికోసమే ‘లవ్‌ క్యాలిక్యులేటర్‌’ పేరుతో రకరకాల వెబ్‌సైట్లున్నాయి. వీటిలోకి వెళ్లి ప్రేమికులు తమ పూర్తి పేర్లను టైప్‌ చేస్తే వారి ప్రేమ ఎంత శాతం దృఢమైందో తెలిపే వివరాలొస్తాయి. సంఖ్యాశాస్త్రం ఆధారంగా పేర్లను బట్టి ప్రేమను తెలుపుతాయన్నమాట. ఇవి ఎంతవరకూ నిజమో కానీ సరదాగా చూసుకోవడానికి బాగుంటాయి.

భగ్న ప్రేమికుల మార్కెట్‌!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కంటారు. కానీ కొన్ని ప్రేమ కథలు అనుకోని మలుపులు తిరుగుతాయి. పెద్దల్ని ఒప్పించలేకో ఇంకో కారణంతోనో మరొకరిని పెళ్లి చేసుకునేవారు ఎంతోమంది ఉంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టినా పిల్లలు పెద్దవాళ్లైనా గుర్తొచ్చినప్పుడల్లా ఆ తొలిప్రేమ జ్ఞాపకాలు గుండెల్ని గుచ్చుతూనే ఉంటాయి. అలాంటివారు తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకుని ఓ రోజంతా గడిపేందుకు వియత్నాంలో ఏటా నిర్వహించేదే ‘లవ్‌మార్కెట్‌’. ఎన్నో ఏళ్ల కిందట స్థానికంగా రెండు వేరువేరు తెగలకు చెందిన అబ్బాయీ అమ్మాయీ ప్రేమించుకున్నారట. వాళ్లిద్దరికీ పెళ్లి చెయ్యడం ఇష్టంలేక రెండు తెగలూ గొడవలు పడటంతో రక్తపాతం అయిందట. అది చూడలేక ఆ ప్రేమికులు తాము విడిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ ఏటా ఓరోజు కవాయ్‌ అనే గ్రామంలో కలుసుకునేవారట. ఆచోటే తర్వాత లవ్‌మార్కెట్‌గా ఏర్పడింది. ఎంతోమంది భగ్నప్రేమికులు అక్కడికి వచ్చి కలుసుకోవడం మొదలుపెట్టారు. వందేళ్ల కిందట మొదలైన ఈ సంప్రదాయాన్ని స్థానికులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వారి క్యాలెండర్‌ ప్రకారం ఏటా మూడోనెల 26వ తేదీన జరిగే ఈ సంబరంలో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలూ నిర్వహిస్తుంటారు. ఎంతోమంది ఇక్కడికొచ్చి మాజీ ప్రేమికులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. వారికి భాగస్వాములూ అడ్డుచెప్పరు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఈ మార్కెట్‌కి వచ్చి విడివిడిగా తమ మాజీ ప్రేమికుల్ని కలుసుకోవడం కూడా జరుగుతూనే ఉంటుంది.

ప్రియమైన కానుకలివే!

ప్రేమికుల రోజున ప్రియమైన వారికి ‘ఏ బహుమతి ఇస్తే బాగుంటుందీ...’ అని ముందునుంచే తెగ ఆలోచించేస్తాం. బోలెడన్ని షాపులు తిరిగేస్తాం. ఇది అందరూ చేసే పనే అనుకోండీ. ఇంతకీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇచ్చే ప్రేమ కానుకల లిస్టులో మొదటిస్థానంలో ఏమున్నాయో తెలుసా... నగలేనట. ఆ తర్వాత గ్రీటింగ్‌ కార్డులూ చాకొలెట్లూ పువ్వుల్ని ఎక్కువమంది ఇచ్చి పుచ్చుకుంటున్నారు. భారతీయుల ప్రేమ బహుమతుల్లోనూ వీటిదే పైచేయి. క్యాష్‌కరో.కామ్‌ సర్వే ప్రకారం భారత్‌లో ప్రేమికులు 23శాతం ఆభరణాలనూ 14శాతం గ్రీటింగ్‌ కార్డులూ 12శాతం చాకొలెట్‌లనూ ఇచ్చుకుంటున్నారు. ఇక, కానుక ఏదైనా దాన్లో ప్రేమను ప్రతిబింబించే హృదయాకారం తప్పనిసరి అని తెలిసిందేగా.

ప్రేమంటే ఇదేరా...

మరుయమ, లీ హయు... జపాన్‌కి చెందిన ఈ ఇద్దరు ప్రేమికులూ రెండున్నరేళ్లు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. ఎన్నో బాసలూ ఊసులూ చెప్పుకున్నారు. ‘ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకుందాం...’ అనీ అనుకున్నారు. అంతలోనే విధి వారి కలల్ని కల్లలు చేసింది. స్కూటీ మీద వెళ్తున్న మరుయమను ఓ కారు ఢీ కొట్టడంతో కోమాలోకి వెళ్లిపోయింది. కొద్దిరోజులకు కోలుకుందికానీ గతమంతా మర్చిపోయింది. తల్లిదండ్రులూ ప్రేమికుడూ స్నేహితులూ ఎవర్నీ గుర్తుపట్టలేదు. అంతేకాదు, ఇప్పుడు కూడా ఈరోజు జరిగింది రేపు నిద్రలేచేసరికి మర్చిపోతోంది. ఆమె పరిస్థితి చూసి మరొకరైతే వదిలేసి వెళ్లిపోయేవారేమో. కానీ లీ అలా చెయ్యలేదు. ఆమెతోనే ఉండి ప్రతిరోజూ ఉదయాన్నే పాత జ్ఞాపకాల తాలూకూ ఫొటోల్నీ రుజువుల్నీ చూపించి మళ్లీ మళ్లీ మరుయమ ప్రేమను పొందేందుకు తపిస్తున్నాడు. దగ్గరుండి ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. ఆమ్నీసియాతో బాధపడుతున్న మరుయమ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. కాబట్టి, ప్రతిరోజూ జరిగిన విషయాల్నీ తర్వాతి రోజు చేయాల్సిన పనుల్నీ పడుకునేముందు ఓ డైరీలో రాసుకోమని వైద్యులు ఆమెకు సూచించారు. అలా... రాసుకోవడంతో చివరికి లీ తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో మరుయమకు అర్థమైంది. ఆనందంతో ‘నన్ను పెళ్లి చేసుకుంటావా...’ అని ఓరోజు లీ హయుని అడిగింది. దానికి అతడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె చేయందుకున్నాడు. నిజమైన ప్రేమ ఎన్ని సమస్యలొచ్చినా తోడు వీడదు... అని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుందీ...

ప్రేమలోపడితే అంతేగా!

ప్రేమలో నిండా మునిగిన వాళ్లు కళ్లలోకి కళ్లుపెట్టుకుని చూసుకుంటే చాలు, వారి మనసులు కూడా ఒకదాని అధీనంలోకి మరొకటి వచ్చేస్తాయట. నిజమండీ బాబూ... ప్రేమలో పడినవాళ్లు మూడు నిమిషాల పాటు కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకుంటే వారి గుండెలు కూడా ఒకేలా కొట్టుకుంటాయని ఓ పరిశోధనలో తేలింది. 
* ప్రేమలో పడితే తిండీ నిద్రా అన్నీ గాయబ్‌. అయినా మనిషిలో ఎంతో ఉత్సాహం. ఆనందం. ప్రేమ ఎక్కించే మత్తు అలాంటిలాంటిది కాదు మరి. అది ఓ డోస్‌ కొకెయిన్‌కి సమానం అని తేల్చేశారు నిపుణులు. మత్తుమందులు తీసుకున్నప్పుడు మెదడులో కలిగే మార్పులే ప్రేమలో పడినపుడూ కలుగుతాయట.
* ప్రియుడ్ని లేదా ప్రియురాలిని హత్తుకుంటే నొప్పులు మాయమైపోతాయట. ఎందుకంటే ఆ సమయంలో శరీరం ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఇది నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు, ప్రియమైనవారి ఫొటోని చూసినా, వారి చేతిలో చెయ్యివేసి పట్టుకున్నా కూడా నొప్పులు తగ్గుతాయని పరిశోధనల్లో రుజువైంది.
* ఈడూజోడూ బాగుందా... అని చూసుకోవడం ముమ్మాటికీ కరెక్టే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ఒకేస్థాయిలో ఆకర్షణ కలిగిన జంట త్వరగా ప్రేమలో పడతారట మరి.
* అచ్చం ఒకేలా లేదా పూర్తిగా భిన్నంగా ఆలోచించే ప్రేమికుల కన్నా, కొన్ని విషయాల్లో ఏకీభవిస్తూ మరికొన్నిటిలో విభేదించే ప్రేమికుల బంధమే ఎక్కువకాలం దృఢంగా ఉంటుందట.
* ప్రేమలో విఫలమైన వాళ్లు ‘గుండె బద్దలైంది’ అంటుంటారు కదా, ఇష్టమైనవారికి దూరం అయినపుడు నిజంగానే గుండెలో గుచ్చినంత బాధ కలుగుతుందట. ఆ సమయంలో మెదడు విడుదలచేసే కొన్ని రసాయనాలు గుండెను బలహీనం చేస్తాయన్నది పరిశోధకుల మాట. దీన్నే బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అంటారు.
* ప్రేమకు కొన్ని లెక్కలున్నాయి. దాన్నే ట్రయాంగిల్‌ థియరి అంటారు. అరమరికలు లేని బంధం, దగ్గరితనం, బాధ్యత... ఈ మూడూ ఉంటేనే ఆ ప్రేమ దృఢంగా ఉంటుందట.
* చూడచక్కని శరీర సౌష్టవం కన్నా అందమైన ముఖకవళికలు ఉన్నవారిని పెళ్లి చేసుకునేందుకే అమ్మాయిలూ అబ్బాయిలూ ఎక్కువగా ఇష్టపడతారంటోంది ఓ అధ్యయనం.
* ప్రేమలో పడిన అమ్మాయిలు అనుక్షణం అతడి సమక్షాన్నే కోరుకుంటారట. అర్ధరాత్రిదాకా మాట్లాడినా, ‘గుడ్‌నైట్‌ స్వీట్‌డ్రీమ్స్‌’ అంటూ ఫోన్‌ పెట్టేసినప్పట్నుంచీ మళ్లీ మర్నాడు వచ్చే ఫోన్‌కాల్‌ కోసం ఎదురు చూస్తారట. అదే అబ్బాయిలైతే... ‘ఇప్పటిదాకా మాట్లాడాంగా, ఇంకేముంటాయి’ అనుకుంటారట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.