close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నోటి క్యాన్సర్‌... కొంత స్వయంకృతమే

‘కొన్ని క్యాన్సర్లు రోగి ప్రమేయం లేకుండానే రావచ్చు, కానీ నోటిక్యాన్సర్‌ మాత్రం దాదాపు స్వయంకృతాపరాధమే. అలవాట్లే దీనికి ప్రధాన కారణం. పేదలూ, మధ్యతరగతి ప్రజలూ అధికంగా ఉన్న దేశాల్లో నోటి క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో ఈ వ్యాధికీ తక్కువ ఆదాయానికీ మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది’ అంటున్నారు ప్రముఖ దంతవైద్యులు.

మనదేశంలోని క్యాన్సర్లలో నోటి క్యాన్సర్‌ది రెండోస్థానం. దేశంలో ఏటా లక్షా ఇరవై వేల మంది ఈ క్యాన్సర్‌ బారిన పడుతుంటే, వారిలో సుమారు 73 వేల మంది మరణిస్తున్నారు. నోటిక్యాన్సర్‌ను వృద్ధాప్య సమస్యగానే భావిస్తారు కానీ అత్యధిక కేసులు 50-70ల మధ్య వయస్కులే కావడం గమనార్హం. పెదవులు, నాలుక, అంగుటి, దవడ లోపలిభాగం, లాలాజల గ్రంథులు, చిగుళ్లు, నాలుక కింద భాగం, గొంతు... వీటిలో ఎక్కడ వచ్చినా అది నోటి క్యాన్సరే. వీటిల్లోనూ ఓరో ఫారింక్స్‌(నోటికీ గొంతుకీ మధ్య భాగం), హైపోఫారింక్స్‌ (గొంతుకీ అన్నవాహికకీ మధ్యభాగం)ల్లో వచ్చే క్యాన్సర్‌ కారణంగానే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.

ఎందుకొస్తుంది?
దేశంలో 57 శాతం మంది పురుషులు, 11 శాతం మంది స్త్రీలు- అదీ 15- 49 మధ్య వయసువాళ్లు పొగాకును ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారు. దాంతో 90 శాతం కేసులు సిగరెట్లు, బీడీలు, చుట్టలు, గుట్కాలు తదితర పొగాకు ఉత్పత్తుల వినియోగంవల్లే సంభవిస్తున్నాయి. ఎక్కువగా మద్యం సేవించడం, వక్క నమలడం, హ్యూమన్‌పాపిలోమా వైరస్‌కి గురికావడం... వంటివీ నోటిక్యాన్సర్‌కి కారణాలే. అయితే పొగాకు నమిలేవాళ్లలో ఇది మరీ ఎక్కువ. ఆనువంశికత, నోటి శుభ్రత లేకపోవడం, పౌష్టికాహార లోపం, రోగనిరోధకశక్తి తగ్గడం, అతినీలలోహిత కిరణాలకి గురవడం కూడా నోటి క్యాన్సర్‌కు కారకాలే.

లక్షణాలు గుర్తించేదెలా?
నాలుక, చిగుళ్లు, దవడలు.. ఇలా నోటిలో  తెల్లమచ్చలు కనిపిస్తే ల్యూకోప్లాకియా అనీ, ఎర్ర మచ్చలు కనిపిస్తే ఎరిత్రోప్లాకియా అనీ, కిందిదవడలో వాపులా వస్తే అమిలోబ్లాస్టోమా అనీ చెబుతారు. కొందరిలో ఎరుపూతెలుపూ రెండూ కలగలిసిన మచ్చలూ కనిపిస్తాయి. ఇవన్నీ పొగాకు వాడేవాళ్లలోనే ఎక్కువ. వక్క నమిలేవాళ్లలో నోరు పూర్తిగా తెరవలేకపోవడం, నాలుక కుంచించుకు పోవడం, బుగ్గలు లోపలికి వెళ్లిపోవడం, నోటి లోపలిభాగం నునుపు దేలడం జరుగుతుంది. దీన్నే ఓరల్‌ సబ్‌మ్యూకస్‌ ఫైబ్రోసిస్‌ అంటారు. ఆటోఇమ్యూన్‌ డిజార్డర్‌ కారణంగా కొందరికి నోటిలోపల తెల్లని గీతల్లా ఏర్పడితే దాన్ని ఓరల్‌ లిచెన్‌ ప్లానస్‌ అంటారు. సూదుల్లాంటి దంతాల వల్ల ఏర్పడే కణితులని ఒడెంటోజెంట్‌ ట్యూమర్లు అంటారు. మొత్తమ్మీద మెడమీద ఉబ్బు కనిపించినా, నోరు, దవడలూ, నాలుకా నొప్పి పుడుతున్నా, మింగుతున్నా నములుతున్నా ఇబ్బందిగా అనిపించినా, పెదవులూ, చిగుళ్లూ నోటిలోపల మందంగా తయారై వాపులు కనిపించినా, ఆకస్మికంగా నోట్లో రక్తం కారుతున్నా, గొంతులో మార్పు వచ్చినా, దంతాలు వదులుగా అయి రంధ్రాలు పడుతున్నా, అకారణంగా బరువు తగ్గుతున్నా వెంటనే అనుమానించాలి. నోటిలోని చిన్న మచ్చ లేదా పుండు ఏదయినా రెండు వారాలయినా తగ్గకపోతుంటే అల్సర్‌ కారణంగా వచ్చింది అని వదిలేయకుండా దంత వైద్యుణ్ణి సంప్రదించాలి.

పరీక్షించేదెలా?
నోటి క్యాన్సర్లకి సంబంధించిన లక్షణాలన్నీ క్యాన్సర్‌ మొదలైన తరవాతే కనిపిస్తాయి. కాబట్టి దీన్ని ముందుగా గుర్తించాలంటే ఎప్పటికప్పుడు దంత వైద్యుల దగ్గర రొటీన్‌ చెకప్‌కి వెళ్లడం, ఎవరికి వాళ్లు ఒకసారి నోటిని తెరిచి అంగుటిపైనా కిందా అన్నివైపులా అద్దంలో నిశితంగా పరీక్షించుకోవాలి. తేడాగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలిస్తే పరీక్షలు చేస్తారు.
బ్రష్‌ సైటాలజీ:  ధూమపానం, గుట్కా నమలడం, కిళ్లీ వేసుకునే అలవాట్లు ఉన్నవాళ్లలో నోట్లో పుండ్లూ మచ్చలూ కనిపిస్తే- అనుమానాస్పద భాగంలోని కణాలను బ్రష్‌తో తీసి పరీక్షిస్తారు.
ఫైన్‌ నీడిల్‌ యాస్పిరేషన్‌ సైటాలజీ: నోట్లోని పుండు నుంచి కొన్ని కణాలను సిరంజి ద్వారా తీసుకుని గ్లాస్‌ స్లైడ్‌ మీద వేసి మైక్రోస్కోప్‌ ద్వారా పరీక్షిస్తారు.
ఆ తరవాత అనుమానాస్పద భాగం నుంచి చిన్న ముక్కను బయటకు తీసి బయాప్సీ ద్వారా క్యాన్సర్‌ను నిర్ధరిస్తారు. క్యాన్సర్‌ ఇతర భాగాలకు వెళ్లిందా లేదా అన్నది తెలుసుకునేందుకు అవసరాన్నిబట్టి ఎక్స్‌రే, సీటీస్కాన్‌, ఎమ్మారై, పెట్‌ స్కాన్‌లు కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హెచ్‌పీవీ వైరస్‌ వల్ల కూడా నోటిక్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్‌ ఉందేమోననీ పరీక్షిస్తారు.

చికిత్సా విధానం
క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని గుర్తిస్తే ఆ అలవాట్లను మానుకోవడం, యాంటీ ఆక్సిడెంట్లు వాడటం ద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చు. తొలి దశలో ఉంటే ఆ భాగంలో సర్జరీ చేస్తే తగ్గిపోతుంది. సర్జరీ తరవాత ఏమైనా మిగిలి ఉంటే నేరుగా గామా లేదా ఎక్స్‌రే కిరణాలను ఆ భాగానికే గురిపెట్టి చేసే ఎక్స్‌టర్నల్‌ బీమ్‌ రేడియోథెరపీ లేదా చిన్న పరికరం ద్వారా ఆ భాగంలోకి కిరణాలను పంపించే బ్రాకీ థెరపీల ద్వారా క్యాన్సర్‌ను నివారిస్తారు. రెండోదశకి చేరితే- అంటే లింఫ్‌ నోడ్స్‌కు వెళితే మాత్రం మెడ దŸగ్గర ఉన్న గ్రంథుల్నీ శస్త్రచికిత్స ద్వారా తొలగించాలి. తరవాతి దశలో సర్జరీ తరవాత రేడియోథెరపీ, కీమోథెరపీలు ఇవ్వాల్సి ఉంటుంది. బాగా ముదిరిన దశలో మాత్రం రోగికి సాంత్వన కోసం కొన్ని మందులు ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేరు. ప్రస్తుతం చికిత్సలతో నోటి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుల జీవితకాలం ఐదు సంవత్సరాలకు మించి పెరగడం లేదు. కాబట్టి పండ్లూ కూరగాయలూ ఎక్కువగా తింటూ పొగాకుకి పూర్తి దూరంగా ఉండటం ద్వారా మాత్రమే నోటిక్యాన్సర్‌ను నివారించగలం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.