close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఊపిరితిత్తులు జాగ్రత్త!

గుండె కొట్టుకోవడం లాంటి ఇతర ప్రక్రియలు సజావుగా ఉన్నప్పటికీ శ్వాస సరిగ్గా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్‌ అందక కణాలన్నీ పనిచేయకుండా నిలిచిపోతాయి. కాబట్టే ఊపిరితిత్తులకు ఏ చిన్న సమస్య వచ్చినా అది పెను ముప్పే. ఇక క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. అందుకే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ గురించి అవగాహన తప్పనిసరి.

ఊపిరితిత్తుల్లో క్యాన్సర్‌ కణితులు ఏర్పడి అవి పెరిగేకొద్దీ ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుంది. ఫలితంగా రక్తంలోకి ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. దీన్నే ఊపిరితిత్తుల క్యాన్సర్‌గా చెబుతారు. మనదేశంలో ఎక్కువగా కనిపించే అయిదు క్యాన్సర్లలో ఇది ఒకటి. ఈ క్యాన్సర్‌ రావడానికి కారణాల్ని కచ్చితంగా చెప్పలేం. ఈ క్యాన్సర్‌ కారకాల్లో ప్రధానమైంది పొగాకు. ఇందులో ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, తారు వంటి పలు క్యాన్సర్‌ కారకాలుంటాయి. ఇవి నేరుగా శ్వాసనాళంద్వారా లేదా రక్తంద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకొని స్థిరపడతాయి. క్రమంగా ఊపిరితిత్తుల కణజాలంలోని జన్యువులను దెబ్బతీసి కణితులకు దారితీస్తాయి. పొగ తాగే అలవాటు లేనంత మాత్రాన ఈ క్యాన్సర్‌ రాదని అనుకోవటానికి లేదు. అయితే పొగ తాగే వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మన రోగనిరోధక శక్తి పొరపాటున మన మీదే దాడి చేయడంవల్ల తలెత్తే జబ్బులు, ఎక్స్‌రేలు, వాతావరణంలో ఉండే రేడియో ధార్మికత, అరుదుగా జన్యువులు కూడా ఈ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టొచ్చు.

క్షయతో పోలిక
ఊపిరితిత్తుల్లో కణితి విస్తరించిన తీరునిబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. విడవకుండా దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కళ్లెలో రక్తం పడటం, బరువు తగ్గటం, ఆకలి మందగించటం, గొంతు బొంగురు పోవటం, ముద్ద మింగటంలో ఇబ్బంది, ఆయాసం, బ్రాంకైటిస్‌, న్యుమోనియా, జ్వరం, నిస్సత్తువ, కామెర్లు, తలనొప్పి-వాంతి, నాడీ సమస్యలు లాంటి లక్షణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నవారిలో కనిపిస్తాయి. దగ్గు, ఆయాసం, బరువు-ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు క్షయలోనూ కనిపిస్తాయి. దీంతో రెంటి మధ్య తేడాను గుర్తించడం కాస్త కష్టమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చేవారిలో దాదాపు సగం మంది క్షయ చికిత్స తీసుకుని ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్‌ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించాలి. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. లేకపోతే వెంటనే అప్రమత్తమవ్వాలి.

పరీక్షలు... చికిత్స
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరినా, ఛాతీలో గుండె స్థానం జరిగినా, శ్వాసనాళం పరిస్థితి బాగాలేకున్నా దీనిద్వారా తెలుస్తాయి. క్యాన్సర్‌ అనుమానాలూ, లక్షణాలూ కనబడుతుంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి(బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్‌ నిర్ధారణ కావటమే కాదు, అది ఏ రకానికి చెందిందనేది తెలుస్తుంది. ఇవి కాకుండా అవసరమైతే ఎముక స్కాన్‌, పెట్‌ స్కాన్‌ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్‌ ఏ దశలో ఉన్నదీ, ఎక్కడెక్కడికి విస్తరించిందీ బయటపడుతుంది. మొదటి దశ... కణితి కేవలం ఒక ఊపిరితిత్తిలోనే ఏర్పడటం, లింఫ్‌ గ్రంథులకు విస్తరించకపోవడం. రెండో దశ... కణితి లింఫ్‌ గ్రంథులకు విస్తరించటం. ఈ రెండు దశల్లో కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. సర్జరీతో కణితిని తొలగించినప్పటికీ సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెడుతుంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలిస్తారు. అది జబ్బు తిరగబెట్టేదే అనిపిస్తే కీమో, రేడియో థెరపీలూ చేయాల్సి ఉంటుంది. మూడో దశ... ప్రధాన శ్వాసనాళం చుట్టూ ఉండే లింఫ్‌ గ్రంథులకూ, ఛాతీ గోడకూ, డయాఫ్రమ్‌కూ కణితి విస్తరించటం. వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. ఊపిరితిత్తుల్లోనూ గుండె చుట్టూ నీరు చేరటం, కణితి ఇతర భాగాలకు విస్తరించటాన్ని నాలుగో దశగా గుర్తించాలి. ఈ దశలో క్యాన్సర్‌ నయం కావటం దాదాపు అసాధ్యం. ఇందులో క్యాన్సర్‌ వృద్ధికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి అది పనిచేయకుండా టార్గెటెడ్‌ థెరపీ(మాత్రలు) ఇస్తారు. రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే ఇమ్యూనోథెరపీ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. టార్గెటెడ్‌, ఇమ్యూనోథెరపీల రాకతో జీవనకాలం బాగా పెరిగింది.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90శాతం, రెండో దశలో 70 శాతం వరకూ నయం చేయొచ్చు. కానీ ఎక్కువగా ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతుంది. మూడో దశలో 30 శాతం నయమయ్యే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటానికి ధనిక దేశాల్లో ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి, పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్‌ పరీక్ష చేస్తున్నారు. కానీ ఇది చాలా ఖరీదైన ప్రక్రియ. అందుకే నివారణ మీదే దృష్టి పెట్టాలి. పొగ తాగడం, పొగాకు నమలటం లాంటి అలవాట్లుంటే మానెయ్యడం, పండ్లూ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామంతో అధిక బరువుని తగ్గించుకోవడంద్వారా ఈ క్యాన్సర్‌కి కొంతవరకూ చెక్‌ పెట్టొచ్చు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.