close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పేగు క్యాన్సర్‌ నివారణ సాధ్యమేనా?

శరీరంలో కొన్నిభాగాలకి క్యాన్సర్‌ ఎందుకొస్తుందో తెలీదు. ఎలా వస్తుందో తెలీదు. అలాంటి వాటిల్లో ఒకటి కొలొరెక్టల్‌(పెద్దపేగు, మలద్వార)క్యాన్సర్‌. మనదేశంలో  ఏటా వేలాది మందిని బలితీసుకుంటున్న ఈ రకం క్యాన్సర్‌ను కాస్త అవగాహనతో ముందుగా గుర్తించగలిగితే, నూటికి తొంభై శాతం నివారించగలం.

విదేశాలతో పోల్చితే గతంలో మనదగ్గర కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ తక్కువే. కానీ క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది. ఏటా యాభైవేల మంది దీని బారిన పడుతుంటే, అందులో నలభై వేలమంది మరణిస్తున్నారు. యాభై దాటిన వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ.
శరీరంలో పెద్ద పేగు ప్రాధాన్యం తెలిసిందే. జీర్ణాశయ వ్యవస్థలో కీలకమైన భాగాలే ఈ పేగు(కోలన్‌), మలద్వార లేదా పురీషనాళ (రెక్టమ్‌)భాగాలు. పెద్దపేగులో పేగు భాగం ఐదు నుంచి ఏడు అడుగుల పొడవు ఉంటే అందులోని చిట్టచివరి ఐదు అంగుళాల భాగమే రెక్టమ్‌(మలద్వారం). ఈ రెండు భాగాలూ మలవిసర్జనలో కీలకపాత్ర వహిస్తాయి. వ్యర్థ ఆహారంలోని నీటిని పీల్చుకుని విసర్జన సాఫీగా అయ్యేందుకు పేగు తోడ్పడితే, ఆ ప్రక్రియలో మలాన్ని నిల్వ ఉంచే భాగమే రెక్టమ్‌. అందుకే ఈ రెండు భాగాల్లో ఎక్కడ క్యాన్సర్‌ కనిపించినా ఒక్కటిగానే వ్యవహరిస్తుంటారు.

ఎందుకు వస్తుంది?
ఆనువంశికంగా వచ్చే అవకాశం ఐదు శాతమే. కానీ తల్లీతండ్రీ, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లలో ఎవరికైనా చిన్నవయసులోనే అంటే 45 ఏళ్లలోపే వస్తే మిగిలినవాళ్లకీ ఇది వచ్చే ప్రమాదం ఉంది. లేదూ గతంలో కొన్ని రకాల పాలిప్స్‌(గడ్డలు) రావడం, అల్సరేటివ్‌ కొలైటిస్‌, క్రోన్స్‌ వ్యాధిల్లాంటివి ఉంటే భవిష్యత్తులో అవి క్యాన్సర్‌కు దారితీసే అవకాశం లేకపోలేదు. చిన్నవయసులోనే ఈ క్యాన్సర్‌ వచ్చి తగ్గినవాళ్లకి భవిష్యత్తులో మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది. ఇంకా ఊబకాయం, ధూమపానం, మధుమేహం, మద్యపానం, కూర్చునే ఉండటం, మాంసాహారం ఎక్కువగా తినడం, గతంలో వచ్చిన క్యాన్సర్లకి రేడి యేషన్‌ థెరపీ తీసుకోవడం... వంటివన్నీ కొలొరెక్టల్‌ క్యాన్సర్‌కి కారకాలే కావచ్చు.

లక్షణాలు
కడుపులో తీవ్రమైన నొప్పి, జిగట విరేచనాలు, ఆకలి తగ్గిపోవడం, విపరీతమైన అలసట, నీరసం, తేన్పులు, తింటున్నా బరువు తగ్గిపోవడం, మలంలో రక్తం పడటం, దీర్ఘకాలిక మలబద్ధకం... వంటివి కనిపించి, చికిత్స తీసుకుంటున్నా అవి వారం, పదిరోజులైనా తగ్గకపోతే క్యాన్సరేమోనని అనుమానించాలి. కుటుంబీకుల్లో ఈ క్యాన్సర్‌ ఉన్నా లేదా తీవ్రమైన మొలల వ్యాధితో బాధపడుతున్నా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. చాలాకేసుల్లో తొలిదశలో ఈ లక్షణాలేవీ కనిపించవు. కనిపించేసరికే కొందరిలో ఈ క్యాన్సర్‌ వ్రణం పెద్దదై ఉండొచ్చు.

ఇలా పరీక్షిస్తారు!
ఫీకల్‌ అకల్ట్‌ బ్లడ్‌ టెస్ట్‌(ఎఫ్‌ఓబీటీ):  రసాయనాలు పూసిన కాగితమ్మీద మలాన్ని వేసి పరీక్షిస్తారు. మలంలో క్యాన్సర్‌ కణాలు ఉంటే అవి రంగు మారతాయి. దాంతో పేగులో క్యాన్సర్‌ ఉందని అనుమానిస్తారు. బేరియం ఎనిమా: ఈ పద్ధతిలో లోపలకు పేస్టులాంటి పదార్థాన్ని పంపించి ఎక్స్‌రే ద్వారా లోపల గడ్డలేమయినా ఉన్నాయేమోనని చూస్తారు. కొలనోస్కోపీ: దీన్నే గోల్డ్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌గా చెబుతారు. కెమెరా ఉన్న ఓ ట్యూబు లాంటిదాన్ని పేగు లోపలికి పంపించి చూస్తారు. అనుమానంగా అనిపించినచోట చిన్నముక్కను తీసి బయాప్సీ చేస్తారు.
సీటీ కొలనోగ్రఫీ: బేరియం ఎనిమా, కొలనోస్కోపీల సమ్మేళన పరీక్షగా చెప్పొచ్చు. ఇదో ప్రత్యేకమైన సీటీ స్కాన్‌. ఇందులో క్యాన్సర్‌ ఉందా లేదా అనేది కనుక్కుంటారు.

ఏ దశలో ఉంది?
సాధారణంగా కొలొరెక్టల్‌ ముదిరాకే బయటపడుతుంటుంది. కానీ క్యాన్సర్‌ అని నిర్ధరించుకున్నాక, రక్తపరీక్ష, కార్సినో ఎంబ్రియానిక్‌ యాంటిజెన్‌ (సీఈఏ), పొట్ట మొత్తానికీ సీటీ స్కాన్‌ చేస్తే, అవసరాన్నిబట్టి మొత్తం శరీరానికి పెట్‌ స్కాన్‌ చేయడం ద్వారా ఏ దశలో ఉందో తెలుసుకుంటారు.

చికిత్సా విధానం
క్యాన్సర్‌ కణాలు పేగు, మలద్వార గోడల కణజాలపొరల్లోనే ఉండి, లింఫ్‌ నోడ్స్‌ వరకూ విస్తరించకపోతే ఒకటి, రెండు దశల్లో ఉన్నట్లే. పెద్దపేగు కణజాలాల్లోకీ, లింఫ్‌ నోడ్స్‌కీ విస్తరిస్తే మూడో దశకి చేరిందనీ, కాలేయం, ఊపిరితిత్తుల వరకూ వ్యాపిస్తే నాలుగో దశకి వెళ్లిందనీ చెబుతారు. అయితే మొదటి మూడు దశల్లో క్యాన్సర్‌ను గుర్తించగలిగితే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్‌ పుండు ఉన్న పేగు భాగాన్ని కత్తిరించి తిరిగి అతికిస్తారు. గతంలో ఓపెన్‌ కొలెక్టమీ ద్వారా ఈ ఆపరేషన్‌ చేసేవారు. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ, రొబోటిక్‌ టెక్నాలజీతో ఈ ఆపరేషన్‌ చేయడంతో రోగి పొట్టమీద కోత అన్నది లేకుండా త్వరగా కోలుకుంటారు. ఒకవేళ క్యాన్సర్‌ నాలుగో దశకు చేరుకుంటే శస్త్రచికిత్స దాదాపుగా వీలుకాదు. మందులతో ఉపశమనం కలిగించడం తప్ప. మలద్వారంలో వచ్చిన క్యాన్సర్‌కు ప్రత్యేక చికిత్సా విధానం ఉంటుంది. దీనికి ఎమ్మారై స్కాన్‌ తప్పనిసరి. దీనివల్ల క్యాన్సర్‌ పేగులోనే ఉందా లేదా శరీరంలోని ఇతర భాగాలకు వెళ్లిందా అనేది తెలుస్తుంది. ఒకవేళ పెద్ద పేగు పొరలు దాటి బయటకు వెళితే మొట్టమొదట్లోనే ఆపరేషన్‌ చేయకూడదు. కీమో, రేడియేషన్‌ చికిత్సను నాలుగు నుంచి ఆరు వారాలపాటు చేసిన తరవాత మళ్లీ రీ స్టేజింగ్‌ చేస్తారు. ఆ తరవాతే శస్త్రచికిత్స చేస్తారు. అందులో వచ్చిన స్పందన బట్టి తరవాతి చికిత్స ఏమిటనేది ఉంటుంది. దీన్ని కూడా ల్యాప్రోస్కోపీ, రొబొటిక్‌ టెక్నాలజీ ద్వారానే చేస్తున్నారు. క్యాన్సర్‌ సోకిన మలద్వార భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. ప్రతిగా విసర్జనకోసం చర్మం బయటకు వచ్చేలా తాత్కాలికంగా ఓ సంచిని ఏర్పాటుచేసి, ఆ తరవాత దాన్ని లోపలకు పంపించేస్తారు. దాంతో మలద్వారం మళ్లీ యథావిధిగా పనిచేస్తుంది. అయితే ఇది ఏ దశలో బయటపడినా రోగి మనోధైర్యమే రోగానికి సగం మందు అన్నది మరువకూడదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.