close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రక్తాన్నీ వదలని మహమ్మారి

శరీరంలోని ప్రతి కణానికీ అనుక్షణం ప్రాణవాయువును అందిస్తూ మనిషిని జవజీవాలతో ఉంచే రక్తం కూడా క్యాన్సర్‌ బారిన పడుతుంది. దాన్నే బ్లడ్‌క్యాన్సరనీ, లుకేమియా అనీ అంటారు. పిల్లలకు వచ్చే క్యాన్సర్లలో లుకేమియా ఎక్కువ. దాన్ని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందిస్తే ఆ తర్వాత వారు ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపడం సాధ్యమే.

మన శరీరంలోని ఎముక మూలుగ (బోన్‌మారో)లో రక్తకణాలు తయారవుతాయి. ఆరోగ్యకరమైన రక్తకణాలకి నిర్ణీతమైన ఆయుష్షు ఉంటుంది. ఆ తర్వాత అవి చనిపోతాయి. కొత్తగా తయారవుతున్న కణాలు వాటి స్థానాన్ని భర్తీచేస్తాయి. శరీరంలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా రక్తకణాలు తయారయ్యే ఒక్కోసారి ఏదో ఒక కణం అసహజంగా తయారవుతుంది. అలాంటి కణాలు చచ్చిపోవు. దాంతో వాటి సంఖ్య పెరుగుతూపోతుంది. సంఖ్య పెరిగేకొద్దీ అవి ఆరోగ్యకరమైన తెల్ల రక్తకణాలను పెరగనీయకుండా ఆపడమే కాక వాటి పనిని అవి చేసుకోనీయకుండా అడ్డుపడతాయి. ఆ పరిస్థితే లుకేమియాకి దారితీస్తుంది. రక్తంలో ప్రధానంగా మూడు రకాల కణాలుంటాయి. తెల్ల రక్తకణాలు వ్యాధినిరోధక శక్తినిస్తాయి. ఎర్రరక్తకణాలు శరీరంలోని కణజాలానికంతటికీ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. ఇక గాయపడినప్పుడు రక్తం గడ్డ కట్టటానికి తోడ్పడేవి ప్లేట్‌లెట్స్‌. క్యాన్సర్‌ వచ్చినప్పుడు వీటన్నిటి విధినిర్వహణ మీదా ప్రభావం పడుతుంది.
లుకేమియా, లింఫోమా, మైలోమా... ఈ మూడూ రక్తానికి వచ్చే ప్రధాన క్యాన్సర్లు. వాటిలో ల్యూకోసైట్‌స లేదా తెల్లరక్తకణాలకు వచ్చేదాన్ని లుకేమియా అంటారు. ఎముక మూలుగ మీద ప్రభావం చూపేదాన్ని మైలోమా అనీ, లింఫ్‌ గ్రంథులకు వచ్చేదాన్ని లింఫోమా అనీ అంటారు. లుకేమియా ఎక్కువగా పిల్లల్లోనూ, 50 ఏళ్లు దాటిన పెద్దల్లోనూ వస్తుంది. ఏటా ప్రతి లక్ష మంది పిల్లల్లో 14 నుంచి 16 మంది క్యాన్సర్ల బారిన పడుతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఏటా వెయ్యి నుంచి 1200 కేసుల దాకా లుకేమియా కేసులు వస్తున్నాయి.

నిపుణుల దగ్గరికి రావాలి
సరైన అవగాహన లేకపోవడమూ, వైద్య సౌకర్యాలకు దూరంగా ఉండడమూ, ఆర్థిక స్థితిగతులూ తదితర పలు కారణాలవల్ల 60 శాతం కేసులు క్యాన్సర్‌ నిపుణులదాకా రావడంలేదు. నగరాల్లో పిల్లలవైద్యుల దగ్గరికి వచ్చిన కేసులు మాత్రం వెంటనే స్పెషలిస్టులకి రిఫర్‌ చేయడంతో వారికి సకాలంలో చికిత్స అంది కోలుకుంటున్నారు.
లుకేమియా రెండు రకాలుగా కన్పిస్తుంది. అకస్మాత్తుగా వచ్చి వేగంగా వ్యాపించేదాన్ని ఎక్యూట్‌ అనీ, నెమ్మదిగా పెరిగేదాన్ని క్రానిక్‌ అనీ అంటారు. ఎక్యూట్‌ లుకేమియాలో మళ్లీ రెండు రకాలున్నాయి. లింఫోసైట్‌్్సతో మొదలై తెల్ల రక్తకణాలపై ప్రభావం చూపేదాన్ని ఎక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా(ఏఎల్‌ఎల్‌) అనీ, మైలాయిడ్‌ కణాల్లో మొదలై అన్ని రక్తకణాల్నీ ప్రభావితం చేసేదాన్ని ఎక్యూట్‌ మైలాయిడ్‌ లుకేమియా(ఏఎంఎల్‌) అనీ అంటారు. పిల్లల్లో వచ్చేది మూడింట రెండువంతులు ఏఎల్‌ఎల్‌ కేసులే. సరైన సమయంలో గుర్తించి
చికిత్స చేస్తే ఇది త్వరగా నయమైపోతుంది. మరో 20 శాతం కేసులు ఏఎంఎల్‌వి ఉంటాయి. వీటికి చికిత్స కొంచెం క్లిష్టమే అయినా 60 శాతం వరకూ పూర్తిగా కోలుకుంటారు. పెద్దలకు ఏఎంఎల్‌ ఎక్కువ వస్తుంది. ఈ రెండిటితో పాటు పెద్దల్లో ఇంకా క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా,
క్రానిక్‌ లింఫాయిడ్‌ లుకేమియా లాంటి అసాధారణ క్యాన్సర్లు కూడా వస్తాయి. పిల్లల్లో అలాంటివి అరుదు.

కారణం చెప్పలేం...
ఇతర క్యాన్సర్లలో లాగా లుకేమియాకి ఫలానా కారణమని చెప్పలేం. పొగ తాగితే లంగ్‌ క్యాన్సర్‌ వస్తుందనీ, పొగాకుతో నోటి, గొంతు క్యాన్సర్లు వస్తాయనీ... మిగతా క్యాన్సర్లకు చెప్పినట్లు దీనికి కచ్చితమైన కారణాన్ని చెప్పలేం. ఎప్పుడో ఒకసారి అరుదుగా తప్ప జన్యుపరమైన కారణం కూడా లుకేమియాకి కన్పించదు. కాబట్టి లుకేమియా రాకుండా జాగ్రత్తపడడం అన్న ప్రసక్తే లేదు.

ఎలా గుర్తించవచ్చు?
రక్తహీనత(అనీమియా), శరీరం పాలిపోయినట్లుండడం, చర్మం మీద ఎర్రటి అతుకుల్లాంటి మచ్చలు ఏర్పడడం, ముక్కునుంచీ చిగుళ్ల నుంచీ రక్తం కారడం, చిన్నపాటి దెబ్బలకే గాయాలవడం... ఇవన్నీ పిల్లల్లో పైకి కన్పించే లక్షణాలు. ఇక లోపల లింఫ్‌ గ్రంథులు, కాలేయం, ప్లీహం లాంటివి ఎన్‌లార్జ్‌(పరిమాణం పెరుగుతాయి) అవుతాయి. వీటన్నిటితో పాటు ఏ కారణం లేకుండా తరచూ జ్వరం వస్తూంటుంది. ఇలాంటి లక్షణాలు కన్పించినప్పుడు వైద్యులు రక్తపరీక్ష చేయిస్తారు. ఆ పరీక్షలో హిమోగ్లోబిన్‌ చాలా తక్కువగా ఉండటమూ, తెల్ల రక్తకణాలు తక్కువగా లేదా చాలా ఎక్కువగా ఉండటమూ, ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవటమూ కన్పిస్తే అప్పుడు మళ్లీ బోన్‌మారో పరీక్ష చేస్తారు. ఆ పరీక్షతో లుకేమియానో కాదో నిర్ధారించవచ్చు. మరీ హైరిస్క్‌ కేసులు తప్ప దాదాపు అన్ని కేసులూ నయమైపోతాయి.

చికిత్స
లుకేమియాకి ప్రధానంగా కీమోథెరపీ చికిత్స చేస్తారు. ట్యాబ్లెట్స్‌తో పాటు మందుల్ని సెలైన్స్‌ ద్వారా ఇస్తారు. హై రిస్క్‌ లుకేమియాలో కీమోథెరపీతో పాటు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌(స్టెమ్‌సెల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌) కూడా చేయాల్సి వస్తుంది. ఎక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా చికిత్సకు దాదాపు రెండేళ్లు పడుతుంది. 6 నుంచి 8 నెలలు ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటుంది. మిగతా సమయం ఇంటి దగ్గరే తీసుకునే మందులు ఇస్తారు. పోషకాహారం ఇస్తూ శుభ్రమైన వాతావరణంలో పిల్లల్ని ఉంచాలి. అలా ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుకుంటే పిల్లలు త్వరగా కోలుకుంటారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.