close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నాన్న మారిపోయాడు!

నాన్న మారిపోయాడు!

నువ్వు చూస్తున్న మీ నాన్న ఒకప్పుడు ఇలా లేడు. నిన్ను చూడగానే నవ్వుల జల్లులు కురిపించే ఆ మనిషి గతంలో మహా కోపిష్టి. నువ్వు బైకు తీస్తే వంద జాగ్రత్తలు చెప్పే ఆ పెద్దాయన అప్పట్లో దుందుడుకు డ్రైవింగ్‌కి మారు పేరు. నిన్నొదిలి నిమిషమైనా ఉండలేననే ఆ వ్యక్తి, ఒకప్పుడు ఒంటరితనానికి బానిస. కోపం, బద్ధకం, దురుసుతనం, నిర్లక్ష్యం... లోగడ ఇలాంటి ఎన్నో బలహీనతలతో నిండిన మీ నాన్న ఇన్నేళ్లలో చాలా మారిపోయాడు. నీ కోసం... ఒక మంచి వ్యక్తిలా, ఒక మంచి తండ్రిలా మారిపోయాడు. అవును అమ్మలూ, ఈరోజు - ఈ ‘నాన్నల పండగ’నాడు- ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... ఎన్ని అనుభవాలు, ఎన్ని ఆనందాలు..!

బ్బాయి పుడితే అదృష్టవంతులంటారు. తండ్రిగా మారిన పాతికేళ్ల తరవాత, నాక్కూడా ఆ మాట నిజమేనేమో అనిపిస్తోంది. లేకపోతే ఏమిటి... నేనెంత దురదృష్టవంతుడిని కాకపోతే నాన్నతనంలోని మాధుర్యాన్ని పాతికేళ్లపాటు నాకు పంచిన బంగారు తల్లి, ఇప్పుడు పెళ్లిచేసుకొని నన్ను వదిలి వెళ్లిపోతుంది. పెళ్లయ్యాక ఆడపిల్ల తల్లిదండ్రుల్ని విడిచి వెళ్లాలని ఎవరు ఏ శాస్త్రంలో రాశారో కానీ, కచ్చితంగా ఆ రాసిన వాడికి కూతురు ఉండి ఉండదు. అలా ఉండుంటే ఆ మాట రాయగలిగేవాడు కాదు. అయినా, అన్నీ మన మంచికే అంటారు కదా. నీ ఎడబాటులోనూ నాకా మంచి కనిపిస్తోంది. నీ పుట్టుక నా జీవితాన్ని ఎంత అందంగా మార్చిందో, నీ ఎదుగుదల నాకెంత ఆనందాన్ని పంచిందో, నీతో ఉన్న ప్రతి క్షణం ఎంత అద్భుతంగా గడిచిందో, నీ పెంపకం... కాదు కాదు, నీతో కలిసి నేనూ కొత్తగా ఎదగడం నాకెన్ని జ్ఞాపకాల్ని మిగిల్చిందో ఎంత ఆనందాన్ని పంచిందో ఎలా చెప్పగలను!
వేగం మాయం
అప్పటికి నా వయసు పాతికేళ్లు. చదువైపోయిన వెంటనే ఇంట్లో వాళ్లు పెళ్లి చేశారు. ఇక అప్పట్నుంచీ మా చేతిలో ఓ బుజ్జాయిని ఎప్పుడు పెడతావని అమ్మావాళ్లు అదేపనిగా అడిగేవారు. నాకేమో అప్పటికి కుర్రతనం పోలేదు. పెళ్లయిందన్న మాటేగానీ, స్నేహితులతో బైకు తిరుగుళ్లూ, అర్ధరాత్రి సినిమాలూ అస్సలు తగ్గలేదు. నాన్న నన్ను మందలించే ప్రయత్నం చేసినా ‘వూరుకోండి, రేప్పొద్దున్న పిల్లో పిల్లాడో పుడితే వాడే మారతాడులే’ అని అమ్మ సముదాయిస్తుండేది. బిడ్డ పుట్టడానికీ, నేను మారడానికీ సంబంధమేంటో అర్థమయ్యేది కాదు. పెళ్లయిన రెండున్నరేళ్ల తరవాత అనుకుంటా, ఓ అర్ధరాత్రి నేను సెకండ్‌ షో చూసి ఇంటికొచ్చేసరికి లోపలెవరూ లేరు. పక్కింటి వాళ్లనడిగితే మీ అమ్మకి నొప్పులొస్తుంటే ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పారు. ఆ వారంలో ప్రసవమయ్యే అవకాశం ఉందని డాక్టర్‌గారు ముందే చెప్పినా, నానమ్మావాళ్లు ఇంట్లోనే ఉంటారుగా అన్న ధైర్యమూ, నిర్లక్ష్యంతో ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎందుకో ఆ క్షణంలో నాపైన నాకే కాస్త కోపమొచ్చింది. బైకు ఎప్పుడు స్టార్ట్‌ చేశానో, ఎంత వేగంగా నడిపానో అస్సలు గుర్తులేదు. పది నిమిషాల్లో ఆస్పత్రిలో ఉన్నా. అప్పుడే గదిలో నుంచి నీ ఏడుపు వినిపించింది. నర్సు దగరకొచ్చి ‘ఇదిగోండి మీ అమ్మాయి’ అంటూ నిన్ను నా చేతిలో పెట్టింది. తొలిసారి నిన్ను ఎత్తుకున్న క్షణం తలచుకుంటే ఇప్పటికీ నా చేతులు వణుకుతాయి. అప్పటిదాకా ఎన్నోసార్లు తెలిసినవాళ్ల పిల్లల్ని ఎత్తుకున్నాను. కానీ నిన్ను తాకిన క్షణంలో కలిగిన పరవశం అంతకుముందెప్పుడూ లేదు. ఆ చిట్టి చేతులూ, బుజ్జి పాదాలూ, అరవిరిసిన కళ్లతో ఉన్న ఆ బంగారు బొమ్మ నా రక్తమే కదా అన్న తలపుతో పులకరించిపోయా. అప్పటికి మీ అమ్మ స్పృహలోకి రాలేదు. తను ఇంకా నిన్ను చూడలేదు. అంటే... తొమ్మిది నెలలు మోసింది తనైనా, మొదట నిన్ను చూసే అదృష్టం నాకే దక్కింది. ‘ఇప్పటిదాకా నేను మోశాను, ఇకపైన ఆ చిన్నారి బరువు బాధ్యతలు నీవే’ అని చెప్పడానికే మీ అమ్మకి మెలకువ రాలేదేమో అనిపించింది. అదీ నిజమేనన్నట్లు నువ్వు కూడా నా వేలిని గట్టిగా పట్టేసుకున్నావు. అంతే... ఓ తండ్రిగా తొలిచూపులోనే నీతో పీకల్లోతు ప్రేమలో పడిపోయా. ఇది ఆత్మబంధం, జన్మజన్మల అనుబంధం అనిపించింది. కాసేపటికి నిన్ను నానమ్మ చేతిలో పెట్టి ఇంటికి బయల్దేరా. ఏమైందో తెలీదు కానీ, ఆస్పత్రికి వచ్చేప్పుడు పది నిమిషాలు పడితే, ఇంటికి తిరిగి వెళ్లడానికి నలభై నిమిషాలు పట్టింది. వచ్చినప్పుడు ఉన్న వేగం వెళ్లేప్పుడు లేదు. అప్రయత్నంగానే నా చేతులు బండిని నెమ్మదిగా నడిపించాయి. ఇకపైన నేను రిస్కు తీసుకొని వేగంగా బండి నడపకూడదు, నాకోసం ఓ చిట్టి తల్లి ఎదురుచూస్తుంటుంది అని పదే పదే గుర్తొచ్చింది. ‘అంకుల్స్‌ బండిని ఎందుకు అంత నెమ్మదిగా నడిపిస్తారు’ అని అప్పుడప్పుడూ స్నేహితులం మాట్లాడుకునేవాళ్లం. దానికి కారణమేంటో నీ వల్లే నాకు తెలిసింది. ఆ రోజు తగ్గిన బండి వేగం ఈ రోజు దాకా ఎప్పుడూ పెరగలేదు. నీ రాకతో నా జీవితంలో మొదలైన తొలి మార్పు అది.కుటుంబానికి దగ్గరగా...
రాత్రులు త్వరగా ఇంటికి వచ్చేయమని పెళ్లికి ముందు మా అమ్మ ఒకటే పోరు. పాపం మీ అమ్మ కూడా పెళ్లయిన కొత్తలో ఏ రోజైనా త్వరగా ఇంటికొస్తానేమోనని గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుండేది. కానీ వాళ్ల కోరిక ఎప్పుడూ తీరనేలేదు. అలాంటిది నువ్వు పుట్టాక ఎప్పుడెప్పుడు ఇంట్లో వాలిపోవాలా, నిన్ను నా గుండెలపైకి తీసుకోవాలా అన్న ఆరాటం రోజురోజుకీ పెరిగిపోయింది. ఇద్దరు ఆడవాళ్లు చేయలేని పని ఈ చిన్నారి చేసిందని మా నాన్న తరచూ అంటుండేవారు. అప్పట్లో సినిమాల ప్రభావం వల్లో ఏమో, కుటుంబం కంటే మన వ్యక్తిగత సమయం ముఖ్యమన్న భావనతో ఉండేవాణ్ణి. కానీ నువ్వు భూమ్మీదకి వచ్చాక క్షణమైనా నిన్నొదిలి ఉండడం నా వల్ల కాలేదు. ఒక్కోసారి మీ అమ్మ కూడా, ‘ఎప్పుడూ దానితో ఆటలేనా? వేరే లోకమంటూ లేదా’ అంటుండేది. తన పిచ్చి కానీ, నా జీవితమే నీది అనుకున్నప్పుడు నిన్ను మించిన లోకం నాకేముంటుంది! చాలామంది మగాళ్లలా కుటుంబమంటే పెద్దగా పట్టనట్టు తిరిగే నాకు, ఇప్పుడీ ‘ఫ్యామిలీ మ్యాన్‌’ అన్న ముద్ర పడింది నీ వల్లే కదా. నేనేకాదు, నాలా తండ్రులైన నా స్నేహితులు చాలామంది అలానే మారిపోయారు. బిడ్డల చిరునవ్వే వరంగా, వాళ్ల సంతోషమే స్వర్గంగా, వాళ్ల కన్నీళ్లే సుడిగుండాలుగా భావిస్తూ బతుకుతున్నారు. మగవాళ్లను కుటుంబ జీవితానికి అంత దగ్గర చేసే శక్తి తండ్రీ బిడ్డల బంధానికి ఉందని నువ్వు పుట్టేదాకా అస్సలూహించలేదు.
అన్నీ నీ వల్లే...
‘నీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరూ’ అని ఓసారి స్కూల్లో అడిగితే ‘మా నాన్న’ అని చెప్పావు గుర్తుందా. అదే నేనైతే నీ వయసులో ‘నాన్న నా బెస్ట్‌ ఎనిమీ’ అని చెప్పేవాడిని. అవును, మా నాన్న నాతో కాస్త ప్రేమగా మాట్లాడిన రోజే గుర్తులేదు. ఎప్పుడూ గంభీరంగా, కోపంగా ఉండేవారు. ఏదో ఒక పని చెబుతూనే ఉండేవారు. అయితే అమ్మ ముద్దులోనే కాదు, నాన్న దెబ్బలోనూ ప్రేమే ఉంటుందని నాకు పెద్దయ్యాకే తెలిసింది. నేనూ ఆయనలా ఉంటే, నా ప్రేమని అర్థం చేసుకోలేక నువ్వు కూడా నన్నలా విలన్‌గానే చూస్తావని భయమేసింది. అందుకే నువ్వెంత అల్లరి చేసినా, ఎన్ని ఆకతాయి వేషాలేసినా నేనెప్పుడూ నీపైన కోప్పడలేదు. ఆ ప్రభావం క్రమంగా నా ఆలోచనా సరళినే మార్చేసింది. కోపమనే శత్రువు నా నుంచి పూర్తిగా దూరమైంది.
తల్లిదండ్రులు పిల్లలకు తొలి గురువులంటారు. కానీ నాకు మాత్రం నువ్వే పెద్ద గురువు. చిన్నప్పుడు సముద్రం దగ్గర ఇసుకలో ఇల్లు కట్టినా, పేపర్‌మీద ఓ బొమ్మ గీసినా, మట్టితో ఆడుకున్నా నీ దృష్టంతా వాటిపైనే ఉండేది. ఎన్నిసార్లు పిలిచినా తల పక్కకు తిప్పేదానివి కాదు. ఎప్పుడూ హాయిగా నవ్వుతుండేదానివి. కొత్తవాళ్లు ఉన్నారన్న బెరుకు లేకుండా ఆడుతూ పాడుతూ కనిపించేదానివి. అర్ధరాత్రి మెలకువ వచ్చినా ఉల్లాసంగా ఆడుకునేదానివి. నీ తోటివాళ్లకు క్షణం ఆలోచించకుండా సాయం చేసేదానివి. నిన్ను మీ అమ్మ కోపంలో ఓ దెబ్బ కొట్టినా, ఓ చాక్లెట్‌ ఇవ్వగానే తనను మనస్ఫూర్తిగా క్షమించేసి మళ్లీ అమ్మ దగ్గరికి పరుగెత్తుతావు. ఏకాగ్రత, ఉత్సాహం, క్షమ, సాయం, భయం లేకుండా మాట్లాడటం, కొత్తవాళ్లతో కలిసిపోవడం... నీ నుంచి నేనెన్ని విషయాలు నేర్చుకున్నానో నీకు తెలీదు. నువ్వు నవ్వితే నవ్వడం, ఏడిస్తే బాధపడటం, కలిసి ఆడుకోవడం, తినడం, నిద్రపోవడం... నీలా ఉండటానికి అనుక్షణం తపించేవాణ్ణి. ఆ క్రమంలో అనవసరమైన భావోద్వేగాలను వదిలించేసుకున్నా. ‘మీరెప్పుడూ అలా ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలుగుతారు’ అని ఎవరైనా అడిగినప్పుడల్లా నీ రూపమే కళ్లముందు మెదుల్తుంది. ‘నా బిడ్డ ప్రభావమే నన్నిలా మార్చింది’ అని చెప్పాలనిపిస్తుంది.
వ్యసనాలు మాయం
మీ బాబాయి ఒకసారి అమెరికా నుంచి ఫారిన్‌ స్కాచ్‌ తెచ్చినప్పుడు ‘మా నాన్నకు అలాంటి బ్యాడ్‌ హ్యాబిట్స్‌ లేవు’ అన్నావు గుర్తుందా. నిజమే, నీకు తెలిసిన మీ నాన్నకు ఆ అలవాటు లేదు. కానీ ఒకప్పుడు వారానికి కనీసం రెండు సార్లయినా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకునేవాణ్ణి. దానికి తోడు సిగరెట్‌ కూడా. రోజూ నా పక్కనే పడుకునే నువ్వు, ఓసారి అలా తాగి ఇంటికొచ్చాక, ‘నీ దగ్గర బ్యాడ్‌ స్మెల్‌ వస్తుంది డాడీ, ఆ గదిలో నేను పడుకోను’ అన్నావు. నువ్వు నాకు దూరంగా వెళ్లడం అదే మొదటిసారి. అస్సలు తట్టుకోలేకపోయాను. నిన్ను నా నుంచి దూరం చేసే ఆ అలవాట్లపైన చాలా కోపమొచ్చింది. అదే నా జీవితంలో ఆఖరిసారి మందు గ్లాసూ, సిగరెట్టూ ముట్టుకోవడం. ఆ తరవాత చాలాసార్లు స్నేహితులు బలవంతం చేసినా, నీ మాటలు గుర్తొచ్చి ఆగిపోయేవాణ్ణి. అన్నేళ్లలో తన పూజలూ, వ్రతాలూ చేయలేని పని, నువ్వు చేసినందుకు మీ అమ్మకు కాస్త అసూయా, బోలెడంత ఆనందం.
దుబారాకి దూరం
పెళ్లయ్యాక కూడా కొన్నాళ్లపాటు నన్నూ, అమ్మనీ మీ తాతయ్యే పోషించారు. నేను ఉద్యోగం చేస్తున్నా ఆ జీతం నా ఖర్చులకే సరిపోయేది. నెలాఖరికి అవీ చాలక అప్పులు చేసేవాణ్ణి. నువ్వు పుట్టగానే ఇంట్లోవాళ్లంతా చాలా సంతోషపడ్డారు. మీ తాతయ్య మాత్రం, ‘ఇప్పటిదాకా ఇద్దరిని పోషించా, ఇకనుంచి ముగ్గుర్ని పోషించాలి’ అన్నారు. ఆ మాటల్ని వింటుంటే, ‘కనీసం నన్ను కూడా చూసుకోలేవా నాన్నా’ అని నువ్వే నిలదీసినట్టు అనిపించింది. ఇకపై నీకొచ్చే ప్రతి అవసరాన్నీ నా డబ్బుతోనే తీర్చాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నా. నువ్వు పసిగుడ్డుగా ఉన్నప్పుడు పోషకాహారం, డాక్టరు ఖర్చులూ, స్కూల్లో చేరాక పుస్తకాలూ, యూనిఫామ్‌లూ, ట్యూషన్లూ, పిక్‌నిక్‌లూ, ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీలూ, యాన్యువల్‌ డేలూ... ప్రతి పనీ డబ్బుతో ముడిపడిందే. నా జీతం వాటికి సరిపోయేది కాదు. అందుకే ఓవర్‌ టైం పనిచేయడం అలవాటు చేసుకున్నా. ఆ పైన మరో పార్ట్‌టైం ఉద్యోగాన్నీ వెతుక్కున్నా. బండి అమ్మేసి బస్సులో తిరగడం మొదలుపెట్టా. నీ అవసరాల ముందు నా అవసరాలు చాలా చిన్నవనిపించాయి. హోటళ్లలో భోజనాలూ, సినిమాలూ తగ్గిపోయాయి. చాలా ఖర్చులు మాయమయ్యాయి. చాలా అలవాట్లు మారిపోయాయి. దుబారా నా జీవితం నుంచి దూరమైంది. తన మాటల వల్లే నాకా ఆర్థిక బాధ్యత వచ్చిందనుకునేవారు మా నాన్న. కానీ ఆయనకేం తెలుసు, నేనలా మారింది నా చిట్టి తల్లి కోసమని.
అన్ని పనులూ నేనే...
ఒకప్పుడు డబ్బు సంపాదించడం, పిల్లల ఆర్థిక అవసరాలు తీర్చడం మాత్రమే తండ్రి బాధ్యత అనుకునేవాణ్ణి. కానీ నీ చిన్నప్పుడోసారి మీ అమ్మకు విపరీతమైన జ్వరమొచ్చి ఆస్పత్రిలో చేరింది. సమయానికి నానమ్మా తాతయ్య కూడా వూళ్లొ లేరు. నువ్వు దేనికోసం ఏడ్చేదానివో అర్థమయ్యేది కాదు. అప్పుడే తెలిసింది... మా ఇద్దరికీ నువ్వు బిడ్డవే అయినప్పుడు, నీ అన్ని పనులూ పంచుకోవాల్సిన బాధ్యత కూడా మా ఇద్దరికీ ఉంటుందని. అంతకుముందెప్పుడూ నేను వంట గదిలోకి వెళ్లింది లేదు. డైపర్లు మార్చడం, నిద్ర పుచ్చడం లాంటి పనులేవీ తెలీదు. కానీ నీకోసం పాలుపట్టడం, న్యాపీలు మార్చడం, జడ వేయడం... ఇలా అన్ని పనులూ నేర్చుకున్నా. నీ పూర్తి బాధ్యత తీసుకోవడంలో ఎంత ఆనందముందో తెలుసుకున్నా. అందుకే మీ అమ్మకి నయమయ్యాక కూడా నీకు సంబంధించిన అన్ని పనుల్నీ పంచుకుంటూ వచ్చా. పిల్లల విషయంలో ఆడామగా తేడాలుండవనీ, మనకు రాని పనైనా ఇష్టపడి చేస్తే నేర్చుకోవడం పెద్ద కష్టం కాదనీ నీ వల్లే తెలుసుకున్నా.
జీవితమే మారింది
నీకు నాలుగేళ్లప్పుడనుకుంటా, ఓసారి ఆటలో దెబ్బతగిలి నువ్వు ఏడుస్తుంటే వూరడించడానికి సకల ప్రయత్నాలూ చేశా. విచిత్రమైన హావభావాలతో నిన్ను వెక్కిరిస్తూ నవ్వించాలనుకున్నా. ఒక్కసారిగా నువ్వు ఏడుపు ఆపేసి నాలాగే వెక్కిరించడానికి ప్రయత్నించావు. నేనేది చేస్తే అది చేయాలని చూశావు. నాకప్పుడు అర్థమైంది... నన్ను అనుకరించడమంటే నీకు ఇష్టం. నాలా ప్రవర్తించడమంటే నీకు ఇష్టం. నేను ఎలా మాట్లాడితే అలా మాట్లాడతావు. నేనెలా ఆలోచిస్తే అలా ఆలోచిస్తావు. అంటే నువ్వు భవిష్యత్తులో నిజాయతీగా ఉండాలో, అబద్దాల కోరులా మారాలో, అందరూ మెచ్చుకునేలా ఉండాలో, వేలెత్తి చూపేలా మిగలాలో నిర్ణయించేది నా ప్రవర్తనే. ఆ ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనివ్వలేదు. నీ ఎదుగుదలకు సంబంధించిన బ్రహ్మ రహస్యమేదో నాకు తెలిసిపోయినట్టు అనిపించింది. ఆ క్షణం నుంచీ నీ సమక్షంలో మరింత జాగ్రత్తగా ఉంటూ వచ్చా. నీ ముందు అమ్మతో గొడవపడటం మానేశా. ఫోన్లో నా కింది ఉద్యోగులపైన అరవడం ఆపేశా. అర్ధరాత్రి దాకా టీవీ చూడటం, కంప్యూటర్‌ ముందు కూర్చోవడం తగ్గించా. జంక్‌ ఫుడ్‌ని వదిలేసి పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మొదలుపెట్టా. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పట్నుంచి అన్నీ సానుకూల ఆలోచనలూ, అలవాట్లే. నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే, ముందు నేను ఉన్నతంగా ఉండాలని నమ్మి, ఓ కొత్త జీవనశైలిని అలవాటు చేసుకున్నా. మారింది నేనైనా, దానికి కారణం మాత్రం నువ్వే.
పెద్ద చెట్టు నీడలో చిన్న మొక్కలు సరిగా పెరగలేవంటారు. అందుకే నిన్ను స్వేచ్ఛగా ఎదగనివ్వడానికి, కాస్త వయసొచ్చాక అన్ని విషయాల్లో నేను కలగజేసుకోకపోవడం మంచిదనీ, చీటికీ మాటికీ జాగ్రత్తలు చెప్పడం మంచిది కాదనీ అర్థం చేసుకున్నా. నీకు తెలీకుండానే నా అలవాట్లనీ, వ్యక్తిత్వాన్నీ, జీవితాన్నీ నువ్వు మెరుగ్గా తీర్చిదిద్దావు. జీరోని హీరోగా చేశావు. పాతికేళ్లలో ఓ ఆకతాయి కుర్రాడిని సమాజంలో ఓ ఆదర్శవంతమైన తండ్రిగా నిలబెట్టావు. ఇన్ని నేర్పిన నువ్వు, పెళ్లి చేసుకొని వెళ్లిపోయి, నీకు దూరంగా బతకడం ఎలాగో నేర్పడం మాత్రం మరచిపోయావు. అలవాటు ప్రకారం అది కూడా నాకు దూరమైన నిన్ను చూస్తూ నేనే నేర్చుకోవాలనేమో!
నీకెప్పుడూ చెప్పలేదు కానీ, నీ నోటివెంట ‘నాన్నా’ అన్న పిలుపు వింటే నా జన్మధన్యమై పోయినట్లూ, నా మనుగడకి ఓ అర్థం దొరికినట్లూ అనిపిస్తుంది. నా చిన్నప్పుడు జేబులో డబ్బులు దాచుకునేవాణ్ణి. ఇప్పుడు నీ ఫొటో దాచుకుంటున్నా. అప్పుడు నిద్రలేవగానే దేవుడి పటం చూసేవాణ్ణి. ఇప్పుడు నీ మొహం చూస్తున్నా. అప్పుడు ఏ లక్ష్యం లేకుండా నిస్సారంగా రోజులు గడిపేవాణ్ణి. ఇప్పుడు నీవల్ల నిత్యం ఓ కొత్త అనుభూతిని మనసులో నింపుకుంటున్నా. చిట్టితల్లీ, నువ్వు పుట్టక ముందు నేను బతికాను. ఇప్పుడు... జీవిస్తున్నాను!

భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు ఇరవై శాతం వరకూ బరువు పెరిగే అవకాశం ఉందని ‘బయాలజీ లెటర్‌’ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. ‘తండ్రి కాబోయే ముందు ఆడవాళ్లకు మాదిరిగానే అరవై శాతం మంది మగవాళ్ల బరువులోనూ తేడా కనిపిస్తుంది. దీన్ని సింపథటిక్‌ ప్రెగ్నెన్సీ సింప్టమ్‌ అంటారు. అలసట, తలనొప్పి, గాభరా, వెన్నునొప్పి లాంటి కొన్ని లక్షణాలు దీనికి తోడవ్వొచ్చు. తండ్రి కావడానికి తనను తాను మానసికంగా సన్నద్ధం చేసుకునే సమయంలో చోటుచేసుకునే హార్మోన్ల సర్దుబాట్ల వల్ల ఈ లక్షణాలు కనిపిస్తాయి’ అన్నది ఆ అధ్యయన సారాంశం. అంటే... అమ్మకొచ్చే ఆరోగ్య సమస్యల్లో కొన్ని నాన్నకూ తప్పవన్నమాట.
పిల్ల్లల్ని పెంచడం మొదలుపెట్టాక తండ్రుల మెదడు కూడా తల్లిలానే ఆలోచించడం మొదలుపెడుతుందని ‘నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ పరిశోధనలో తేలింది. పిల్లలతో అనుబంధం పెరిగేకొద్దీ పురుషుల్లో టెస్టొస్టెరాన్‌ హార్మోన్లు తగ్గి, ‘లవ్‌ హార్మోన్‌’గా పిలిచే ఆక్సిటోసిన్‌ స్థాయులు పెరుగుతాయి. దాని వల్ల పిల్లలతో ఎక్కువ ప్రేమగా ఉండటానికి తండ్రులు ప్రయత్నిస్తారు. పిల్లలు కూడా ఆ హార్మోన్‌ ప్రభావంతోనే తండ్రులకు దగ్గరవుతారని తేలింది.
పిల్లల గొంతును గుర్తుపట్టే శక్తి తల్లులతో సమానంగా తండ్రులకూ ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. కొంతమంది పసి పిల్లల ఏడుపుని రికార్డు చేసి వినిపించినప్పుడు, వాటిలో తమ బిడ్డల ఏడుపుని తొంభై ఐదు శాతం మంది తండ్రులు గుర్తించగలిగారు. కొత్తగా తండ్రయిన వాళ్ల మెదడులో కొత్త నాడీ కణాలు వృద్ధి చెందుతాయట. అది మగవాళ్ల జ్ఞాపకశక్తిపైన సానుకూల ప్రభావం చూపుతుందన్నది పరిశోధకుల ఉవాచ.
పిల్లలు పుట్టాక తల్లుల హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు రావడం సహజం. కానీ పిల్లలకు దగ్గరయ్యేకొద్దీ తండ్రుల్లోనూ ఆ మార్పులు చోటుచేసుకుంటాయని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈస్ట్రోజెన్‌, ప్రొలాక్టిన్‌, గ్లూకోకార్టికాయిడ్స్‌ లాంటి హార్మోన్లు పెరగడంతో తండ్రులు మునుపటితో పోలిస్తే కాస్త ప్రశాంతంగా కనిపిస్తారట. పిల్లలతో చనువుగా ఉండే తండ్రుల్లోనే ఈ మార్పులు చోటుచేసుకుంటాయి.
కాస్త ముభావంగా ఉండే మగవాళ్లు కూడా తండ్రయ్యాక, తమలానే కొత్తగా తండ్రయిన వాళ్లతో సులువుగా మాటకలుపుతారనీ, ఆస్పత్రులూ క్లినిక్‌ల దగ్గర కొత్త తండ్రుల మధ్య ఏర్పడ్డ పరిచయాలు జీవితకాల స్నేహాలుగా మారే అవకాశం ఎక్కువనీ ‘యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగన్‌’ అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల బాధ్యత చూసుకునేకొద్దీ మగవాళ్ల మెదడు ఆకృతిలో స్వల్ప మార్పులు చోటుచేసుకొని, ఆలోచనా ధోరణి సానుకూలంగా మారడమే దీనికి కారణమట.

అత్యుత్తమ తండ్రులు!

 గ్ర దేశాల్లో ఒకటిగా పేరున్న బ్రిటన్‌, అత్యంత చెత్త తండ్రులున్న దేశాల జాబితాలో తొలిస్థానం దక్కించుకోవడం విశేషం. పిల్లల పెంపకంలో భాగస్వాములయ్యే తండ్రులపైన యూకేకి చెందిన ‘ఫాదర్‌హుడ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అనే సంస్థ సర్వే నిర్వహించింది. అందులో బ్రిటన్‌ మహిళలు పిల్లలతో గడిపే ప్రతి గంటకీ వాళ్ల భర్తలు కేవలం 24 నిమిషాలే గడుపుతారట. అదే పోర్చుగల్‌లో అత్యధికంగా తండ్రులు నలభై నిమిషాలు కేటాయిస్తారు. భారత్‌లో ఆ సమయం అరగంటకి కాస్త అటూఇటుగా ఉంది. దేశాల సంగతి పక్కన పెడితే ఆఫ్రికాలోని పెద్ద తెగల్లో ఒకటైన ‘అకా’ అనే తెగలోని మగవాళ్లు మాత్రం పిల్లల పెంపకం విషయంలో తండ్రులందరికీ ఆదర్శంగా నిలుస్తూ ప్రపంచంలోనే ‘బెస్ట్‌ డాడ్స్‌’ అనిపించుకుంటున్నారు. పుట్టిన తొలి ఏడాదిలో అక్కడి పిల్లలెవరూ నేలమీద పాదం మోపరట. రోజు మొత్తంలో 53శాతం సమయాన్ని తల్లి పొత్తిళ్లలో, 47శాతం సమయాన్ని తండ్రి ఒళ్లొ గడుపుతారట. అక్కడ ఆడామగా ఇద్దరూ ఏదో ఒక పనిచేయాల్సిందే. అందుకే పిల్లల బాధ్యతనీ ఇద్దరూ సమంగా పంచుకుంటారు. పసిపిల్లలను తల్లులతో పాటు తండ్రులూ తాము పనిచేసే చోటుకు తీసుకెళ్తారు. రోజులో కనీసం పద్దెనిమిది గంటలపాటు తండ్రులు పిల్లలకు అందుబాటులో ఉంటారు. తల్లి దగ్గర లేనప్పుడు పిల్లల ఏడుపు మాన్పించడానికి తమ స్తన్యాన్నీ అందిస్తారు. అక్కడ తండ్రీపిల్లలకు మధ్య అంత అనుబంధం ఏర్పడటానికి గల కారణాల గురించి ఇప్పటికీ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.

- శరత్‌ కుమార్‌ బెహరా

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.