close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మేమున్నాం రండి..!

యమధర్మరాజు తన భర్త ప్రాణాన్ని తీసుకెళ్లిపోతుంటే వెనక్కి తెచ్చుకోవడానికి సతీ సావిత్రి ఎన్నో కష్టాలు పడిందని చెప్పుకుంటాం. కానీ ఈరోజుల్లో క్యాన్సర్‌ బారిన పడిన ఆత్మీయులను బతికించుకోవడానికి వారి కుటుంబ సభ్యులు అంతకన్నా ఎక్కువ బాధలు పడుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే భయం కంటి మీద కునుకు రానివ్వదు. ‘ఆ ఆసుపత్రిలో బాగా చూస్తారట. ఈ డాక్టర్‌ హస్తవాసి మంచిదట... నాటు వైద్యం పనిచేస్తుందట...’ అని పరుగులు తీయని చోటు ఉండదు. ఆయువునివ్వమని మొక్కని దేవుడూ ఉండడు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రం అయిన వారి కష్టాలైతే చెప్పే పనేలేదు. ఇలా... క్యాన్సర్‌ బాధితులకు భూమ్మీదే నరకం కనిపించేస్తోంది. ఆ కష్ట సమయంలో అండగా నిలబడి, గండం నుంచి గట్టెక్కించేందుకు ‘మేమున్నాం’ అంటున్నాయి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులూ సంస్థలు...

పదేళ్ల తర్వాత పిల్లలు పైచదువులకొస్తారని ఇప్పట్నుంచే పొదుపు చెయ్యడం మొదలుపెడతాడు మధ్యతరగతి తండ్రి. పేదల విషయానికొస్తే కడుపు నిండా తిండీ సరైన బట్టలూ దొరకడమే మహద్భాగ్యం. కానీ క్యాన్సర్‌కి పేదా గొప్పా తేడా లేదు. దాని బారినపడితే వైద్యానికి లక్షల రూపాయలు కరిగిపోవడం ఖాయం. దాంతో ఆర్థికంగా చితికిపోతున్నవారూ చికిత్స తీసుకునే స్తోమత లేక ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారూ ఎంతోమంది. అలాంటివారిని ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రులు కొన్ని ఉచితంగానూ మరికొన్ని నామమాత్రపు రుసుము తీసుకునీ వైద్యం చేస్తున్నాయి.

ఎం.ఎన్‌.జె హాస్పిటల్‌
హైదరాబాద్‌లోని ‘మెహదీ నవాజ్‌ జంగ్‌’ ప్రభుత్వ ఆసుపత్రిలో తెల్ల రేషన్‌ కార్డు ఉన్న రోగులకు పూర్తిగా ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. మిగిలిన వారికి నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్‌ చికిత్స కోసం ఏర్పాటైన మొదటి ఆసుపత్రి ఇదే. రేడియోథెరపీ కీమోథెరపీలతో పాటు క్యాన్సర్‌కి సంబంధించి పిల్లలకూ పెద్దలకూ అన్ని రకాల చికిత్సలూ శస్త్ర చికిత్సలూ ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. అందుకే, ఏటా లక్షకు పైగా రోగులు పైసా ఖర్చు లేకుండా వైద్యాన్ని పొందుతున్నారిక్కడ. క్యాన్సర్‌ ఉందో లేదో నిర్ధారించుకునే పరీక్షలకోసం వచ్చేవాళ్లు మరో లక్షమంది ఉంటారు. ఇక, చికిత్సలో భాగంగా కొందరు రోగులకు అవయవాల్లో కొంత భాగాన్ని తీసేయాల్సి రావొచ్చు. ఉదాహరణకు దవడలో క్యాన్సర్‌ సోకిన భాగాన్ని తీసి, దాన్ని అలాగే వదిలేస్తే మాట్లాడ్డం కష్టం అవుతుంది. ఇలాంటి వైకల్యాల్ని సరిచేయడానికి అవయవ పునర్నిర్మాణ ఆపరేషన్‌లనూ ఉచితంగా చేస్తారిక్కడ. ఇక నాట్కో, ఇంపాక్ట్‌ స్వచ్ఛంద సంస్థల సాయంతో ఈ ఆసుపత్రిలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 75 పడకల వార్డు దేశంలోనే మూడో అతి పెద్దది. కాబట్టే, ఎమ్‌ఎన్‌జే ఆసుపత్రికి ఇతర రాష్ట్రాలూ నైజీరియాలాంటి దేశాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. కరీంనగర్‌లో ఉన్న శుశ్రుత క్యాన్సర్‌ ఆసుపత్రిలో కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయాలు కల్పిస్తూ నామమాత్రపు రుసుము తీసుకుని వైద్యం చేస్తున్నారు.

హోమీభాభా క్యాన్సర్‌ ఆసుపత్రి
విశాఖపట్టణానికి దగ్గరలోని అగనంపూడి గ్రామంలో ఉన్న హోమీభాభా క్యాన్సర్‌ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్‌లోని క్యాన్సర్‌ బాధితులకు కల్పతరువే అని చెప్పాలి. ఈ ఆసుపత్రిలో ఎవరైనా ఒక్కసారి రూ.100 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే చాలు జీవితాంతం వైద్యాన్ని చేయించుకోవచ్చు. అంటే వెళ్లిన ప్రతిసారీ డాక్టరు ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నమాట. రూ.400 కోట్ల వ్యయంతో ప్రారంభమైన భవన నిర్మాణ పనులు ఇంకా జరుగుతుండడంతో నాలుగేళ్లుగా కంటెయినర్లనే ఆసుపత్రిగా మార్చి వైద్యం అందిస్తున్నారు. రూ.మూడు లక్షలు ఖర్చయ్యే వైద్యాన్ని ఇక్కడ రూ.30 వేలకే చెయ్యడం, రూ.30వేల విలువైన మందుల్ని రూ.1200లోపు ధరలకే ఇవ్వడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. అంటే అంత నామమాత్రపు రుసుములుంటాయన్నమాట. అది కూడా కట్టలేమనే పేదలకు దాతల విరాళాలతో పూర్తి ఉచితంగా వైద్యాన్ని చేస్తారు. క్యాన్సర్‌కి సంబంధించి అన్నిరకాల చికిత్సలూ శస్త్రచికిత్సల్నీ చేసేందుకు హోమీభాభా ఆసుపత్రిలో నిపుణులైన వైద్యులున్నారు. విశాఖ బస్టాండూ రైల్వేస్టేషన్ల నుంచి రోగులు ఆసుపత్రికి వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉంది. మహిళలు ఇక్కడ మామోగ్రామ్‌, పాప్‌స్మియర్‌, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌... తదితర క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్ని రూ.650కే చేయించుకోవచ్చు.

టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌(ముంబై)
మెరుగైన క్యాన్సర్‌ వైద్యాన్ని అతి తక్కువ ధరకూ ఉచితంగానూ అందించే సంస్థల్లో ముంబైలోని టాటా మెమోరియల్‌ ఆసుపత్రి దేశంలోనే అత్యుత్తమమైందిగా పేరుపొందింది. అత్యాధునిక వసతులు కలిగిన టాటా మెమోరియల్‌కు ఏటా దేశ విదేశాల నుంచి 30వేల మందికి పైగా రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వీరిలో దాదాపు 70శాతం మందికి ఉచిత వైద్యం అందుతోంది. పేదలు డబ్బుతో పనిలేకుండానే ఇక్కడ చికిత్స పొందొచ్చు మరి. క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలూ రేడియోథెరపీ కీమోథెరపీలతో పాటు అన్ని రకాల చికిత్సల్నీ అందించేందుకు కావాల్సిన అత్యాధునిక వసతులన్నీ టాటా మెమోరియల్‌లో ఉన్నాయి. వ్యాధిని నయంచేసే క్షిష్టమైన శస్త్ర చికిత్సలను ఏటా వేల సంఖ్యలో చేస్తుంటారిక్కడ.

అడయార్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(చెన్నై)
సాధారణ క్యాన్సర్‌ చికిత్సలతో పాటు బ్లడ్‌ కాంపొనెంట్‌ థెరపీ, పీడియాట్రిక్‌ ఆంకాలజీ, న్యూక్లియర్‌ మెడికల్‌ ఆంకాలజీ... లాంటి చికిత్సలనూ అందించే ఈ ఆసుపత్రిలో 535 పడకలుంటాయి. అందులో 40శాతం వరకూ రోగులకు పూర్తిగా ఉచితంగానూ మరో ఇరవై శాతం మందికి నామమాత్రపు రుసుమునూ వసూలు చేస్తారు.

కిద్వాయి మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ
బెంగళూరులోని ఈ ఆసుపత్రిలో క్యాన్సర్‌ మందులు బయటి మార్కెట్‌తో పోల్చితే 40 నుంచి 60శాతం తక్కువ ధరకు లభిస్తాయి. ప్రభుత్వ పథకాల ద్వారా ఉచితంగానూ మిగిలిన వారికి నామమాత్రపు రుసుము తీసుకునీ వైద్యం చేస్తారిక్కడ. ఏ చికిత్సకు ఎంత రుసుము తీసుకుంటారో తెలిపే వివరాలన్నీ ఆ సంస్థ వెబ్‌సైట్లో వివరంగా ఉన్నాయి. బెంగళూరులోనే ఉన్న శ్రీ శంకర క్యాన్సర్‌ హాస్పిటల్‌లోనూ 150 పడకల్లో 31 పడకల్ని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించేందుకు కేటాయించారు. దీన్లో మందులను పేదవారికి 30శాతం వరకూ రాయితీ మీద ఇస్తారు. ఇవి కాకుండా కేరళలోని రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌ ఆఫ్‌ తిరువనంతపురం, దిల్లీ స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌(దిల్లీ), ధర్మశిల హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌(దిల్లీ)... లాంటివి కూడా పేదలకు ఉచితంగానూ నామమాత్రపు రుసుములు తీసుకుని వైద్యాన్ని అందిస్తున్నాయి.

*         *           *

భయం, బాధ, నొప్పి, నిస్సహాయత... బహుశా ఏ రోగమూ క్యాన్సర్‌ పెట్టినన్ని కష్టాలు పెట్టదేమో. ఆ కష్టసమయంలో తోటివారికి తోడుగా ఉండాలనుకున్నాయి కొన్ని మంచి మనసులు. స్వచ్ఛంద సంస్థల ద్వారా క్యాన్సర్‌ బాధితులకు అన్నిరకాలుగానూ సాయం అందిస్తున్నాయి.

 

ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీ...
మనదేశంలో క్యాన్సర్‌ మరణాలకు చాలావరకూ కారణం ఆలస్యంగా గుర్తించడం, ఆర్థికపరిస్థితుల కారణంగా సరైన చికిత్స అందకపోవడమే. ఈ సమస్యల్ని అధిగమించేందుకు ముంబై కేంద్రంగా కృషి చేస్తోంది ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీ(ఐసీఎస్‌). ఈ సంస్థ(వెబ్‌సైట్‌: indiancancersociety.org) వైద్యులు మొబైల్‌ డిటెక్షన్‌ వ్యాన్లలో దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల పల్లెల్లో తిరుగుతారు. అక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా ముందస్తు క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. అలా ఇప్పటివరకూ 25వేల క్యాంపుల ద్వారా 30 లక్షల మందికి క్యాన్సర్‌ పరీక్షలు చేశారు. వీటిద్వారా ఎంతోమంది తమకు క్యాన్సర్‌ ఉన్నట్లు ప్రాథమిక దశలోనే తెలుసుకుని ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఐసీఎస్‌ చేసే మరో గొప్ప పని పేదలైన క్యాన్సర్‌ రోగులకు వైద్య ఖర్చుల్ని అందించడం. ఏడాదికి రూ.2 లక్షలకన్నా తక్కువ ఆదాయం ఉన్న క్యాన్సర్‌ రోగులు ఆదాయ ధృవీకరణ పత్రాన్నీ తమకొచ్చిన వ్యాధి వివరాల తాలూకు పత్రాలనూ జత చేసి ఆర్థిక సాయం కోసం ఈ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించాక అర్హులైన కొందరి వైద్యానికి ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఐసీఎస్‌.
ఆ డబ్బుని నేరుగా ఆసుపత్రి యాజమాన్యం అకౌంట్‌లోకే వేస్తారు. అలా ఇప్పటివరకూ నాలుగువేల మందికి పైగా రోగులకు సుమారు రూ.100 కోట్లను పంచింది ఐసీఎస్‌. వీరిలో కొన్ని వందలమంది తెలుగువారూ ఉన్నారు. ఈ సంస్థ సాయం చేసిన వారిలో 80శాతం మంది ముప్ఫైఏళ్లలోపు వయసు వారే కావడం మరో విశేషం. వీటితోపాటు క్యాన్సర్‌ చికిత్స అనంతరం వైకల్యం ఏర్పడిన వారికి సంబంధిత కృత్రిమ అవయవాలను కూడా తక్కువ ధరకు అందిస్తోంది ఇండియన్‌ క్యాన్సర్‌ సొసైటీ.

కడల్స్‌ ఫౌండేషన్‌
మనదేశంలో ఏటా దాదాపు యాభైవేలమంది చిన్నారులు క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. బాధపెట్టే విషయం ఏంటంటే వారిలో 22శాతం మంది మాత్రమే చికిత్స తీసుకోగలుగుతున్నారు. కారణం... పేదరికం. పేదలకు ఉచిత వైద్యం అందించే సంస్థలు కొన్నున్నాయి... కానీ క్యాన్సర్‌ బాధితులకు వైద్యం ఒక్కటే సరిపోదు. సరైన పోషకాహారం కూడా అందాలి. ఇక, పిల్లలకు బాలేదని తల్లిదండ్రులు ఉద్యోగాలూ పనులూ వదులుకుని నెలల తరబడి ఆసుపత్రుల్లో ఉండాలంటే కుటుంబం మొత్తం కూర్చుని తినాల్సిన పరిస్థితి. అలాంటపుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు మూడుపూటలా కడుపు నిండడమే కష్టం. ఇక, పోషకాహారం ఎలా లభిస్తుంది..? నిజానికి క్యాన్సర్‌ లాంటి మహమ్మారితో పోరాడటం పెద్దలకే కష్టం. అలాంటిది పసిపిల్లలు చిగురుటాకుల్లా వణికిపోరూ... ఆ సమయంలో చికిత్సకు వారు తట్టుకునేలా చెయ్యడానికీ శరీరంలో రోగనిరోధకశక్తి పెరగడానికీ పోషకాహారం అవసరం ఎంతో ఉంది. పోషకాహారలోపంతో బాధపడే పిల్లలు కీమోథెరపీకీ తట్టుకోలేరు. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ఈ పరిస్థితిని కళ్లారా చూసి తల్లడిల్లిపోయిన ఓ తల్లి ప్రారంభించిందే కడల్స్‌ ఫౌండేషన్‌ guddiesfoundaion.org) ముంబైకి చెందిన పుర్నోతా దత్‌ బాల్‌ చేతులమీదుగా అయిదేళ్ల కిందట ఆరంభమైన ఈ సంస్థ ముంబైలోని టాటామెమోరియల్‌, దిల్లీలోని ఎయిమ్స్‌, హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌జే... ఇలా దేశంలోని పదమూడు నగరాల్లో ఉన్న 24 ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ బాధిత పిల్లలకు ఉచితంగా పోషకాహారాన్ని సరఫరా చేస్తోంది. గుడ్లు, అరటిపండ్లు, ఎండు ఫలాలు, నెయ్యి, మిల్క్‌షేక్‌, లస్సీ... లాంటి వాటితోపాటు పీడియాష్యూర్‌, పీడియాగోల్డ్‌, త్రెప్టిన్‌ బిస్కట్లలాంటి పోషకాహార సప్లిమెంట్‌లనూ అందిస్తోంది కడల్స్‌. ఈ సంస్థకు చెందిన పోషకాహార నిపుణులు ఆసుపత్రుల్లో పిల్లల్ని పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితికి తగ్గట్లూ ప్రత్యేకంగా మెనూని తయారుచేసి ఆహారాన్ని అందిస్తారు. అంతేకాదు, పేద పిల్లల తల్లిదండ్రులకూ కడుపు నిండా అన్నం పెట్టేందుకు ముగ్గురికి సరిపడా నెలసరి సరకుల్ని సరఫరా చేస్తోంది కడల్స్‌. వాటితో ఆసుపత్రుల్లోని కమ్యూనిటీ కిచెన్‌లలో వండుకుని తినొచ్చు.

సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌కేర్‌ సెంటర్స్‌
ప్రస్తుతం క్యాన్సర్‌కి మంచి వైద్యం అందించే ఆసుపత్రులు చాలావరకూ నగరాల్లోనే ఉన్నాయి. ఒక్కోసారి మనకు దగ్గరలోని నగరాల్లో ఉన్న హాస్పిటల్లో తక్కువ ధరకూ ఉచితంగానూ వైద్యం అందుబాటులో లేకపోతే దూరంగా ఉన్న రాష్ట్రాలక్కూడా వెళ్లాల్సి వస్తుంది. అంత దూరం వెళ్లి కీమోథెరపీలాంటి వాటికోసం మళ్లీ మళ్లీ ఇంటికీ ఆసుపత్రికీ తిరగలేని పరిస్థితి. ఈ కారణంతోనే దేశం నలుమూలల నుంచీ వచ్చిన రోగులు ముంబైలోని టాటామెమోరియల్‌ హాస్పిటల్‌ చుట్టుపక్కలా ఫుట్‌పాత్‌ల మీదా గుడారాలు వేసుకుని ఉంటుంటారు. అసలే క్యాన్సర్‌... అందులోనూ పిల్లలైతే అలాంటి వాతావరణంలో ఉండడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఉంటే వారి ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఆ పిల్లల కష్టాన్ని చూసి కరిగిపోయి ముంబైకి చెందిన నిహాల్‌, శ్యామా కవిరత్నె దంపతులు ఏర్పాటు చేసినవే సెయింట్‌ జ్యూడ్‌ ఇండియా చైల్డ్‌కేర్‌ సెంటర్లు (studchild.org) ముంబై, హైదరాబాద్‌లతో పాటు దేశవ్యాప్తంగా వేరువేరు నగరాల్లో 35కు పైగా ఉన్నాయివి. ఈ సెంటర్లు క్యాన్సర్‌ బాధితులైన చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఉచిత వసతి సౌకర్యాల్ని కల్పిస్తున్నాయి. రోగి కుటుంబం స్వయంగా వండుకుని తినేందుకు అవసరమైన సరకుల్ని కూడా అందిస్తాయివి. కేర్‌సెంటర్లో ఉండే కమ్యూనిటీ కిచెన్‌లో వాళ్లు వండుకుని తినొచ్చు. ఇలా చెయ్యడం వల్ల పిల్లల అభిరుచికి తగ్గట్లూ ఇంటి భోజనాన్నే వండి పెట్టే వీలుంటుంది కూడా. ఎంత బాగున్నా బయటి భోజనాన్ని ఒకటీ రెండు రోజులు మాత్రమే తినగలం. తర్వాత ఇంటి వంటలమీదికే మనసు లాగుతుంది మరి. సెయింట్‌జూడ్‌ సెంటర్లు చాలావరకూ ఆసుపత్రులకు దగ్గర్లోనే ఉంటాయి. అలా కాని చోట సంస్థ నుంచి హాస్పిటల్‌కి ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. చిన్నారులు ధైర్యంగా ఆనందంగా ఉండేందుకు వారికి కౌన్సెలింగ్‌ చికిత్సలూ అందుబాటులో ఉంటాయిక్కడ. చికిత్సకోసం ఇంటికి దూరంగా ఉండే పిల్లలు చదువులోనూ వెనకబడిపోతుంటారు.

ఆ సమస్యను అధిగమించేలా చేసేందుకూ చదువుతో పాటు, ఇతర నైపుణ్యాలనూ నేర్పించేందుకు చైల్డ్‌కేర్‌ సెంటర్లలో కొందరు ఉపాధ్యాయులూ ఉంటారు. సంగీతానికి వ్యాధుల్ని నయం చేసే శక్తి ఉందంటారు. అందుకే, ఇక్కడ ఆర్ట్‌ అండ్‌ మ్యూజిక్‌ థెరపీలూ యోగా
శిక్షణ కూడా ఉంటాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సెంటర్లో క్యాన్సర్‌ బాధిత పిల్లలూ వారి కుటుంబాలకు వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలా ఎక్కువమంది పిల్లలు ఒకేచోట ఉండడం వల్ల బాధను మర్చిపోయి వాళ్లు సరదాగా గడిపే అవకాశం కూడా ఉంటుంది.

మంగళం ఫౌండేషన్‌
దేశంలోనే ఉచిత వైద్యానికి పేరుపొందిన ముంబైలోని టాటామెమోరియల్‌ హాస్పిటల్‌కి వెళ్లే రోగులకు ఉచిత వసతి సౌకర్యాలు కల్పించేందుకు స్థానిక మంగళం ఫౌండేషన్‌ ఆ చుట్టుపక్కల 17 అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకుంది. ఈ సంస్థ రూ.10కే భోజనాన్ని అందించడంతో పాటు, అపార్ట్‌మెంట్ల నుంచి ఆసుపత్రికి వెళ్లేందుకు రోజూ బస్సు సౌకర్యాన్నీ కల్పిస్తోంది. హైదరాబాద్‌కి చెందిన గ్రేస్‌ ఫౌండేషన్‌ కూడా బస్సుల్లో తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తోంది.

 


దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా... దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా... అంటాడు ఓ కవి. నిజమే... క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధే. కానీ ధైర్యంగా పోరాడితే దాన్ని ఓడించడం కష్టం కూడా కాదు. పైగా ఈ పోరాటంలో దన్నుగా నిలబడి మనల్ని గెలిపించడానికి చుట్టూ ఎన్నో మంచి మనసులు కూడా ఉన్నాయిగా.

- మధులత బొల్లినేని


 

ప్రభుత్వపరంగా...

‘డాక్టర్‌ ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆరోగ్య బీమా(ఆంధ్రప్రదేశ్‌)’, ఆరోగ్యశ్రీ(తెలంగాణ)... ఈ రెండు పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు తెల్ల రేషన్‌ కార్డు ఉన్నవారికి గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ శస్త్ర చికిత్సలూ మందులూ రేడియేషన్‌ థెరపీలను ఉచితంగా చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇలా ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకం ద్వారా ఏడాదికి రూ.2.5లక్షలు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.రెండు లక్షల వరకూ ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా పొందొచ్చు.
* హెల్త్‌ మినిస్టర్‌ క్యాన్సర్‌ పేషెంట్‌ ఫండ్‌... ఉచిత చికిత్స అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే పేద రోగులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనిద్వారా రూ.2లక్షల వరకూ ఆర్థిక సాయాన్ని పొందే వీలుంది. 
* క్యాన్సర్‌ రోగులు సహాయకులతో కలిసి దేశంలో ఏ నగరంలో ఉన్న ఆసుపత్రులకైనా స్లీపర్‌, థర్డ్‌ ఏసీల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. మొదటి, రెండో తరగతి బోగీ టిక్కెట్‌లో అయితే 75శాతం రాయితీ లభిస్తుంది.
* ఎయిర్‌ ఇండియా విమానాల్లోనూ ఎకానమీ క్లాస్‌లో రోగులు తాముండే ప్రదేశం నుంచి దేశంలోని ఏ మూల ఉన్న క్యాన్సర్‌ ఆసుపత్రికి వెళ్లాలన్నా టిక్కెట్‌లో యాభై శాతం రాయితీ లభిస్తుంది. ఈ సౌకర్యాల కోసం ఆసుపత్రుల నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకుని టిక్కెట్‌ జారీ కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుంది. 
* ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారానూ క్యాన్సర్‌ బాధితులు ఆర్థికసాయాన్ని పొందే వీలుంది. అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే వ్యాధికయ్యే ఖర్చుని బట్టీ రోగుల ఆర్థిక పరిస్థితిని చూసీ డబ్బు సాయం చేస్తారు. 
* ఆయుష్మాన్‌ భారత్‌ జాతీయ ఆరోగ్య సురక్ష పథకం: ఈ కార్డు మీద రోగులు అయిదులక్షల రూపాయల వరకూ ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా చేయించుకోవచ్చు. క్యాన్సర్‌ రోగులు కేవలం ఆసుపత్రిలో చేరిన సమయంలోనే కాక కీమోథెరపీ, మందులు, స్క్రీనింగ్‌ పరీక్షల రుసుము కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఇదే తరహాలో పేద క్యాన్సర్‌ రోగులకు ఉపయోగపడే మరికొన్ని పథకాలూ ఉన్నాయి.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.