close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆఖరి దశలో ఆత్మీయ ‘స్పర్శ’

క్యాన్సర్‌తో అలుపెరగని పోరాటంలో ఆఖరి అధ్యాయం... చేయగలిగినదంతా చేశాం. ఇంకేమీ చేయలేం అన్నారు వైద్యులు. అయినా మనసు ఒప్పుకోదు. ఆసుపత్రిలో ఉంచలేక, ఇంటికి తీసుకెళ్లలేక, ఎవరితో చెప్పుకోవాలో తెలీక, ఎటూ పాలుపోక ఒకటే నరకయాతన. ఆ పరిస్థితిలో ‘మేమున్నాం’ అంటూ అక్కున చేర్చుకునే ఆత్మీయ నేస్తమే ‘స్పర్శ్‌ హాస్పీస్‌’.

అసలేమిటీ స్పర్శ్‌ హాస్పీస్‌ అని బంజారాహిల్స్‌లోని పచ్చని చెట్లమధ్య ఉన్న ఆ భవంతిలోకి అడుగుపెడితే-‘రామా కనవేమిరా’ అంటూ కోకిల కంఠంతో పాడుతోన్న వసంతలక్ష్మి, అది ఆలకిస్తూదినపత్రిక తిరగేస్తోన్న సుబ్బారావు,వీల్‌ఛెయిర్‌లో కూర్చునే అందరినీ గమనిస్తోన్న బేబీ, అమ్మ పక్కనే కూర్చుని చిరునవ్వులు చిందిస్తోన్న సన్నీ, భర్త ఇస్తోన్న బిస్కట్లు చప్పరిస్తూ జయలక్ష్మి... ఇలా అందరూ ఒకేచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్లని చూస్తే అంతా ఒకే కుటుంబం కాదని అనుకోలేం. చిరకాలం నుంచీ పరిచయం ఉన్నవాళ్లలా ఒకరి యోగక్షేమాలు ఒకరు కనుక్కుంటూ, నవ్వుతూ నమస్కరిస్తోన్న వాళ్లను చూస్తే- ఎవరిచ్చారు వీళ్లకింతటి మనోధైర్యం, ఎవరు నేర్పారీ సంస్కారం అనిపించడం సహజం. వాళ్లెవరూ ఒకరికొకరు ఏమీకారు. ఒకరిది తణుకు పట్టణమైతే, మరొకరిది అనంతపురం. ఇంకొకరిది పక్కనే ఉన్న బంజారాహిల్సే. చదువుకున్నోళ్లూ, చదువుకోనోళ్లూ ఉన్నోళ్లూ లేనోళ్లూ పెద్దోళ్లూ చిన్నోళ్లూ అంతా ఉన్నారు. అందరికీ అవి చివరిరోజులే. వారం కావచ్చు, నెల కావచ్చు. కానీ ఎవరిలోనూ చనిపోతున్నామన్న భయం లేదు. కుటుంబీకులు దగ్గర లేరన్న బాధ లేదు. వాళ్లలోని ఆ గుండెనిబ్బరానికీ నిశ్చింతకీ కారణం స్పర్శ్‌ హాస్పీస్‌(+91 9963504253) సిబ్బందే.

చరమాంక వైద్యసేవ
ఎనిమిదేళ్ల క్రితం- గొప్ప మానవీయ ఆలోచనతో బంజారాహిల్స్‌ రోటరీక్లబ్‌ సభ్యు లంతా కలిసి రోటరీక్లబ్‌ ఛారిటబుల్‌ట్రస్ట్‌ ఏర్పాటుచేసి చివరిదశ క్యాన్సర్‌ రోగులకు ఆసుపత్రి సంరక్షణనీ కుటుంబీకుల ఆప్యాయతనీ కలిపి అందించే ఆత్మీయ నేస్తాన్ని ప్రారంభించారు అదే...ఈ స్పర్శ్‌ హాస్పీస్‌..! క్యాన్సర్‌తో పోరాటంలో ఎన్నో చికిత్సలు... మరెన్నో మందులు... ఒళ్లంతా ఛిద్రమైపోతుంది. మరణం ఖాయం అని తేలిపోతుంది. నొప్పి తీవ్రంగా బాధిస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు, ఆహారం మింగలేకపోవడం, విసర్జన కష్టంకావడం... దుర్భర పరిస్థితి. చిరాకు, కోపం, కుంగుబాటు, నిరాశ... పట్టి పీడిస్తుంటాయి. ఆ బాధ తట్టుకోలేక చనిపోవడానికి ఇంజెక్షన్‌ చేయమనీ మందులివ్వమనీ వేడుకునేవాళ్లూ ఉంటారు. ఆ దశలో బాధల్ని ఉపశమింపజేసే మందుల్ని ఇవ్వడం ద్వారా చికిత్స చేయడమే ‘సాంత్వన(పాలియేటివ్‌ కేర్‌)’.
అయితే, అవసానదశలో ఎవరైనా కుటుంబసభ్యుల మధ్య బాధలేవీ లేకుండా అనాయాసంగా వెళ్లిపోవాలనుకుంటారు. కానీ కుటుంబాలు చిన్నవై, అనుబంధాలు కరవై, దిక్కుతోచని స్థితిలో కొందరు రోగులుంటే, ఇంటికి తీసుకెళితే రోగిపడే బాధని చూడలేక మరికొందరు కుటుంబీకులు తల్లడిల్లుతుంటారు. వాళ్లందరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకుని సాంత్వన వైద్యంతోపాటు సపర్యలు చేస్తూ ఆశ్రయం కల్పించడమే ‘హాస్పీస్‌’.

ఆత్మీయ సాంత్వన చికిత్స!
మృత్యుముఖంలోని క్యాన్సర్‌ రోగుల్ని చేర్చుకుని నొప్పి తగ్గడానికి మందుల ద్వారా సాంత్వననీ; జీవించడానికి ధైర్యాన్నీ ఆత్మీయతనీ అందించడమే ఈ స్పర్శ్‌ హాస్పీస్‌ ప్రధాన లక్ష్యం. అందుకోసం అక్కడ కొందరు వైద్యులూ, నర్సులూ, కౌన్సిలర్లూ 24 గంటలూ అందుబాటులో ఉంటారు. రోగుల దగ్గరే కూర్చుని వారి గతకాలపు స్మృతుల్ని వినడం, కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పడం, మాట్లాడలేనివాళ్లకి చేయిపట్టుకుని పక్కనే కూర్చోవడం... ఇలా ఎవరికి ఏది అవసరమైతే అది చేస్తారు. అందుకే అక్కడికొచ్చిన రోగులంతా ‘సొంత బిడ్డలు కూడా చేయరమ్మా’ అంటూ సిబ్బందిని హత్తుకుపోతారు.
‘కొందరు రోగులు క్యాన్సర్‌ తమకే ఎందుకొచ్చిందంటూ కుమిలిపోతుంటారు. వాళ్లకి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ, అడాప్టివ్‌ మెకానిజం వంటివి నేర్పించడం ద్వారా ఆ బాధ తగ్గిస్తాం. అన్నీ తెలిసిన ఆ భీష్మాచార్యుడే ఉత్తరాయణంకోసం ఎదురుచూస్తూ అంపశయ్యమీద ఉన్న ఆ యాభై ఎనిమిదిరోజులూ వేల సంవత్సరాల్లా గడుస్తున్నాయి అనుకుంటే మామూలు మనిషి- అదీ క్యాన్సర్‌ రోగి నొప్పి అనే నరకాన్ని అనుభవిస్తూ మరణం కోసం ఎదురుచూడటం అంటే మాటలా? పైగా జబ్బు నయంకాదన్న విషయాన్ని రోగి ఓ పట్టాన ఒప్పుకోలేడు. అలాంటివాళ్లకి నెమ్మదిగా జబ్బు గురించీ దాని పరిణామాల గురించీ కౌన్సిలింగ్‌తో నచ్చజెప్పాలి. దాపరికం లేకుండా చెప్పడంవల్ల చివరికోరికలు తీర్చుకోవడం, ఆర్థిక సర్దుబాట్లు చేసుకునే వీలుంటుంది’ అంటారు స్పర్శ్‌ కుటుంబంలో ఒకరైన డా.రోహిణి.

‘ఆధ్యాత్మికతవైపు మనసు మళ్లినవాళ్లకి యోగా, ధ్యానం చేయిస్తాం. ఇక్కడ చేసే సేవలతో పరిస్థితి మెరుగై, ఇంట్లో చేసేవాళ్లున్నారని అనుకున్నప్పుడు ఇంటికి పంపిస్తాం. వీలుకానివాళ్లను హాస్పీస్‌లోనే ఉంచేస్తాం. మరణానికి చేరువైనప్పుడు సొంతవాళ్లను కలుసుకోవాలనుకున్నవాళ్లనీ ఇంటికి పంపిస్తాం’ అని వివరిస్తారు డా. ఆంజనేయులు. ‘హాస్పీస్‌లో చేరాల్సిన అవసరం లేనివాళ్లకి నొప్పికి మందులు ఇచ్చి పంపించే అవుట్‌పేషెంట్‌ సేవలూ ఉన్నాయి. దగ్గరలో ఉన్నవాళ్లకి ఇంటికి వెళ్లి చికిత్స చేయడం, ఫోన్‌ ద్వారా సూచనలివ్వడం... వంటి సేవలతో ఎంతోమంది ఆఖరి మజిలీని ఆనందమయం చేసింది స్పర్శ్‌’ అంటారు వ్యవస్థాపక సభ్యుల్లో ముఖ్యులైన డా. ఎం.సుబ్రహ్మణ్యం. కుటుంబసభ్యులు కూడా ఇక్కడే ఉండి రోగుల్ని చూసుకునే సదుపాయాన్నీకల్పిస్తుంది స్పర్శ్‌. ఈ సేవలన్నీ ఉచితమే. స్తోమత ఉన్నవాళ్లు తమ విరాళాలను హుండీలో వేస్తారు. ఈ కేంద్రం పనితీరుకి ముగ్ధులై ఎందరో దాతలు ముందుకొచ్చి నగదుతోబాటు టీవీలూ వాషింగ్‌మెషీన్లూ వంటివీ ఇస్తున్నారు. ‘ప్రస్తుతం ఉన్ననిధులతో పన్నెండు బెడ్‌లు ఇన్‌ పేషెంట్ల కోసమూ మరో మూడు అవుట్‌ పేషెంట్లకోసం ఏర్పాటుచేశాం. తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో త్వరలోనే 70 పడకల సాంత్వన కేంద్రాన్ని ఏర్పాటుచేసే పనిలో ఉన్నాం. అప్పుడు క్యాన్సర్‌ అనేకాదు, చివరిదశలో ఏ జబ్బుతో బాధపడేవాళ్లనైనా చేర్చుకుంటాం’ అంటున్న స్పర్శ్‌ బృందం సేవలు కొనియాడతరమా..!

- శాంతిశ్రీ చెరుకూరి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.