close
క్యాన్సర్‌... ఏమిటీ మహమ్మారి?

క్యాన్సర్‌... మూడక్షరాలే. కానీ జీవితంలో అది రేపే కలకలం ఎంతో. నిండుప్రాణాన్ని బలితీసుకునే ఆ ప్రాణాంతక వ్యాధి పేరు వింటేనే మనిషి నిట్టనిలువునా వణికిపోతున్నాడు. ఎప్పుడు, ఎవరికి, ఎందుకు, ఎలా వస్తుందో తెలియక హడలి చస్తున్నాడు. ‘మా తాతయ్యకి క్యాన్సర్‌’ అని ఒకరంటే, ‘మా అమ్మకి క్యాన్సర్‌’ అని మరొకరు, ‘మా తమ్ముడికీ క్యాన్సర్‌’ అని ఇంకొకరు. వయసు తేడా లేదు. లింగభేదమూ ఉండదు. ఎవరినైనా ముంచేయగల మహా బలశాలి. దాన్ని ఢీకొనాలంటే ఆనుపానులేంటో తెలుసుకోవాల్సిందే.

క్యాన్సర్‌ భూతాన్ని తలచుకుంటేనే కళ్లల్లో భయం, మాటల్లో వణుకు, గుండెల్లో దడ... మృత్యువు వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. కారణం అవగాహనారాహిత్యమే. ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో తెలిస్తే ఆ బూచిని తరిమికొట్టడం తేలికే. కానీ దురదృష్టవశాత్తూ జీవితంపట్ల అలక్ష్యం, దురలవాట్లతో వ్యాధిని కొని తెచ్చుకుని, వ్యాధి వచ్చాక అతిగా భయపడటంవల్ల మనదేశంలో క్యాన్సర్‌ మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గతేడాది 11,57,294 కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదయితే, వాటిల్లో 7,84,821 మంది మరణించగా, 22,58,208 మంది క్యాన్సర్‌తో పోరాడుతున్నట్టు గ్లోబోకాన్‌ సంస్థ అంచనా. ఇందులోనూ యాభైశాతానికి పైగా మహిళలే క్యాన్సర్‌ బారిన పడుతుండటం గమనార్హం. ఈ మొత్తం కేసుల్లో రొమ్ము, నోరు, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, పొట్ట(జీర్ణాశయ)క్యాన్సర్లే అత్యధిక మందిని బలితీసుకుంటున్నాయి. అందుకే అసలీ క్యాన్సర్‌ కథేంటో తెలుసుకుందాం..!

అసలేమిటీ క్యాన్సర్‌?
ఒకే ఒక్క కణం... మనిషి పుట్టుకకి మూలం...అదే పిండకణం. అండం, శుక్రకణాల కలయికతో పుట్టిన ఆ కణమే కోటానుకోట్ల కణాల సముదాయంగా, అవయవాలుగా, మానవశరీరంగా వృద్ధి చెందుతుంది. శరీరంలో ఈ కణవిభజన అనేది నిరంతర ప్రక్రియ. అయితే ఇది అన్ని భాగాల్లోనూ జరగదు. కన్ను, మెదడు, గుండె, మూత్రపిండాలు... వంటి ప్రత్యేక పనులకోసం ఏర్పడిన అవయవాల్లో పుట్టినప్పుడు ఎన్ని కణాలయితే ఉంటాయో జీవితాంతం అన్నే ఉంటాయి. వయసొచ్చేకొద్దీ వీటి సంఖ్య తగ్గుతుందే కానీ పెరగదు. మరికొన్ని కణాలు అవసరాన్ని బట్టి పుడుతుంటాయి ఉదాహరణకు చర్మం, పేగు గోడల్లో 15-21 రోజులకోసారి కొత్త కణాలు పుట్టుకొచ్చి, పాతవి చనిపోతుంటాయి. ఎర్ర, తెల్ల రక్త కణాలు నిరంతరం విభజన చెందుతూనే ఉంటాయి. వాటి పనైపోగానే మరణిస్తుంటాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చి చేరుతుంటాయి. ఇలా ఓ పద్ధతి ప్రకారం జరిగిపోతుంటుంది. కానీ ఈ ప్రక్రియలో- కణంలోని జన్యువులో వచ్చే మార్పు వల్ల ఒకటి లేక కొన్ని పనికిరాని కణాలు ఓ పద్ధతి లేకుండా నిరంతరం విభజన చెందుతూ ఆరోగ్యకరమైన కణాలను నాశనం చేస్తూ వాటి స్థలాన్ని ఆక్రమించేస్తూ శరీరం మొత్తం వ్యాపిస్తాయి. వీటికి చావు లేదు. పెరగకుండా ఆగిపొమ్మని చెప్పే సంకేతం ఏదీ వాటిమీద పనిచేయదు. దాంతో అవి తామరతంపరగా పెరిగిపోతూ కణితుల్లా ఏర్పడుతుంటాయి. ఫలితం...శరీర యంత్రాంగంలోని అవయవాలన్నీ వాటి పని నిర్వర్తించలేక నిర్వీర్యమైపోతాయి. క్రమంగా మనిషి నీరసించి, మరణానికి దగ్గరవుతాడు. అదే క్యాన్సర్‌. అందుకే ఏ గుండెజబ్బో మధుమేహంలానో క్యాన్సర్‌ను ఒక వ్యాధిగా చెప్పలేం, వ్యాధుల సముదాయం అనాలి.

ఎలా వ్యాపిస్తాయి?
క్యాన్సర్‌ కణాలు ఒక భాగంలో పుట్టి అక్కడే ఉండొచ్చు లేదా రక్తనాళాలు, శోష నాళాల ద్వారా ఒకచోటు నుంచి మరోచోటుకి వ్యాపించవచ్చు. ఇలా వ్యాపించే గుణం ఉన్న వాటిని హానికర(మ్యాలిగ్నెంట్‌)క్యాన్సర్లుగా పిలుస్తారు. రెండో రకం బినైన్‌, ఇవి పుట్టినచోటే నెమ్మదిగా గడ్డల్లా పెరుగుతాయి. వేరేచోటకి వ్యాపించవు, సర్జరీ చేసి తీసేస్తే మళ్లీ పెరగవు. కాబట్టి వీటితో హాని లేదు.
పైగా క్యాన్సర్‌ కణం పరమ మొండి. సాధారణ కణాలకు ఆక్సిజన్‌ 18 శాతం అవసరమైతే, క్యాన్సర్‌ కణానికి ఒక్క శాతం చాలు, బతికేస్తుంటుంది. అవసరమైతే ఇవి కొత్త రక్తనాళాలను సృష్టించుకుంటూ సాధారణ శరీర వ్యవస్థలన్నింటినీ ధిక్కరించే స్థాయిలో ఉంటాయి. దీన్నే ఆంకోజీన్‌ ఎడిక్షన్‌ అంటారు.

ఎందుకు వస్తుంది?
ఆనువంశికంగా వచ్చే జన్యువులు 10 శాతం క్యాన్సర్లకు కారణమైతే, మిగిలిన 90 శాతానికి జీవనశైలే కారణం. ఆహారపుటలవాట్లతోపాటూ వాతావరణ కాలుష్యానికీ అతినీలలోహిత కిరణాలకీ క్రిమికీటక సంహారిణులకీ హానికర రసాయనాలకీ విషపదార్థాలకీ గురవడం, వైరస్‌లు సోకడం, ప్లాస్టిక్‌ వాడకం, రేడియేషన్‌, ధూమపానం, మనోవ్యాకులత... ఇవన్నీ క్యాన్సర్‌కు కారకాలే. కణవిభజన క్రమాన్ని దెబ్బతీసేవే. బరువు ఎక్కువగా ఉండటం, వ్యాయామం లేకపోవడం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా తినడం, మానసిక ఒత్తిడి వంటివీ క్యాన్సర్‌కి దారితీయవచ్చు. పొగాకు వాడకం క్యాన్సర్‌కు దారితీసే ప్రధాన కారణాల్లో ఒకటి. ప్రపంచ క్యాన్సర్‌ మరణాల్లో ప్రతి ఐదింటిలో ఒకదానికి కారణం ఇదే.అంటే ఆనువంశికంగా వచ్చే జన్యుక్రమంలో ఎలాంటి మార్పుల్లేకున్నా, ఇవన్నీ జన్యు వ్యక్తీకరణని- అంటే వాటి పనితీరుని దెబ్బతీస్తాయన్నమాట. ఈ రకమైన ప్రక్రియనే ‘కార్సినోజెనిసిస్‌’ అంటారు.

నిజానికి సృష్టిలోని మంచీచెడూల్లానే ప్రతీకణంలోని డీఎన్‌ఏలోనూ రెండు రకాల జన్యువులు ఉంటాయి. ఒకటి- క్యాన్సర్‌ రాకుండా కాపాడే జన్యువులు(క్యాన్సర్‌ సప్రెసర్స్‌), రెండు- క్యాన్సర్‌ని కలిగించే జన్యువులు(ఆంకోజీన్స్‌). మొదటి రకం జన్యువులు బలంగా ఉంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. పరిసరాలూ అలవాట్లూ వీటిని ప్రభావితం చేయలేవు. పైగా ఇవి ఎక్కడైనా ఒక కణం అసహజంగా ప్రవర్తిస్తుంటే దాన్ని గుర్తించి దానంతటదే చనిపోయేలా చేస్తాయి. ఈ ప్రక్రియనే ‘అపాప్టోసిస్‌’ అంటారు. క్యాన్సర్లు తలెత్తకుండా చూసే ఈ కీలక ప్రక్రియ, ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు క్యాన్సర్‌కి బీజం పడినట్లే. కొందరు చుట్టలూ సిగరెట్లూ కాల్చేస్తూ క్యాన్సర్‌ రాకుండా గుండ్రాయిలా వందేళ్లు బతకడానికీ, ఏ అలవాట్లూ కారణాలూ లేకుండానే మరికొందరు క్యాన్సర్‌ బారినపడటానికీ ఈ రెండు రకాల జన్యువుల పనితీరే కారణం.
అయితే, నూటికి 90 శాతం క్యాన్సర్లకి ఆనువంశికతతో సంబంధం లేదు. కానీ కొన్ని కుటుంబాల్లో ఎక్కువమంది క్యాన్సర్‌ బారినపడటం చూస్తుంటాం. అలాగని వాళ్లలో క్యాన్సర్‌ కారక జన్యువులు ఉన్నాయని కాదు. వాళ్లు ఉండే వాతావరణం, తినే తిండి... వంటివాటివల్ల ఆ కుటుంబీకుల జన్యు నిర్మాణం మార్పుకి లోనవుతుంది. ఈ రకమైన వాటినే ‘ఫెమిలియల్‌ క్యాన్సర్లు’ అంటాం. స్థూలంగా చెప్పాలంటే- రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండేవాళ్లకి క్యాన్సర్‌ వచ్చే అవకాశం తక్కువ. పుట్టుకతోగానీ ఇతరత్రా కారణాలవల్లగానీ జన్యువులు బలహీనంగా ఉన్నవాళ్లకి క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.

ఎన్ని రకాలు?
ఒకటా రెండా... క్యాన్సర్‌ సోకిన భాగాన్ని బట్టి వందకి పైగా రకాలున్నాయి. కానీ వైద్యపరిభాషలో చెప్పాలంటే క్యాన్సర్లు ప్రధానంగా మూడు రకాలు. కార్సినోమా: శరీరమ్మీదా లేదా లోపలి భాగాల్లోని ఉపరితల కణాల నుంచి వచ్చే క్యాన్సర్లు అంటే- చర్మం, రొమ్ము, నోరు, ఊపిరితిత్తులు, పేగు, జీర్ణాశయం, గర్భాశయ ముఖద్వారం, పొట్టలోని పొరలు, మూత్రపిండాలు, ప్రొస్టేట్‌ క్యాన్సర్లన్నీ ఈ కోవకే చెందుతాయి. వీటిల్లోనూ ఉపరితల కణాల్లో ఏర్పడితే ఎపిథీలియల్‌ సెల్‌ కార్సినోమా; వివిధ గ్రంథుల్లో ఏర్పడితే ఎడినో కార్సినోమా; చర్మంలోపలి పొరల్లోని కణజాలాల్లోనుంచి ఏర్పడితే స్క్వామస్‌, బేసల్‌ సెల్‌ కార్సినోమాలనీ, గ్రంథుల నాళాల నుంచి వస్తే డక్టల్‌ కార్సినోమా అనీ అంటారు. వీటితోబాటు, చర్మరంగుకి కారణమైన కణజాలంలో వచ్చే మెలనోమా కూడా ఈ కోవకే చెందుతుంది.సార్కోమా: ఎముకలు, మృదులాస్థి, కండరాలు, రక్తనాళాలు, శోషనాళాలు, నరాలు, కొవ్వు కణజాలం... వంటి వాటినుంచి ఏర్పడేవన్నీ సార్కోమా రకాలే.
రక్తక్యాన్సర్లు: లుకేమియా, లింఫోమా, మైలోమా... వంటివన్నీ ఈ కోవకి చెందుతాయి. వీటినే ద్రవరూప క్యాన్సర్లు అనీ అంటారు. తెలుపు రక్తకణాల్లో వస్తే- లుకేమియా అనీ, రోగనిరోధకశక్తిలో కీలకమైన తెల్లరక్తకణాల్లోని లింఫోసైట్స్‌, లింఫ్‌నోడ్స్‌, లింఫ్‌ నాళాల్లో వస్తే లింఫోమా అనీ, ప్లాస్మాకణా(ఎముక మజ్జలో తయారయ్యే ఒకరకమైన తెల్లరక్తకణాలు)ల్లో వస్తే మైలోమా అనీ అంటారు. మొదటి రెండూ చిన్నపిల్లల్లోనే ఎక్కువ. అయితే కొందరిలో యుక్తవయసులోనూ వస్తాయి. ఇవే కాకుండా మెదడు, వెన్నెముకల్లో వచ్చేవాటిని కేంద్ర నాడీవ్యవస్థ క్యాన్సర్లు అంటారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడు అవయవాలుగా తయారయ్యే కొన్ని కణాలు పుట్టాక కూడా శరీరంలో ఉండి క్యాన్సర్లుగా పరిణమిస్తాయి. వీటినే ఎంబ్రియోనల్‌ ట్యూమర్లు అంటారు. చిన్నపిల్లల్లో వచ్చే
రెటీనోబ్లాస్టోమా ఈ రకానికే చెందుతుంది.

లక్షణాలు
ఆకలి తగ్గడం, అకారణంగా మూడు నెలల్లో పది కిలోల బరువు తగ్గడం, తరచూ జ్వరం రావడం, నిస్సత్తువగా అనిపించడం, తలనొప్పి, వెన్నునొప్పి రావడం, దీర్ఘకాలిక మలబద్ధకం లేదా డయేరియా, అజీర్తి, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, పుట్టుమచ్చల్లో పులిపిర్లలో అసహజ మార్పులు, వీడకుండా వేధించే దగ్గు, బొంగురు గొంతు, మానని పుండ్లు, అసహజ రక్తస్రావం, చంకలు, గజ్జల్లో గ్రంథులు పెరగడం, ఎముకలమీద గడ్డలు రావడం, ఏదైనా ఒక అవయవం పదేపదే వాయడం లేదా నొప్పి రావడం... ఇవన్నీ క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణాలుగానే గుర్తించాలి.
అలాగే కొన్ని రకాల క్యాన్సర్లకి ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. నోట్లో పుండ్లు, తెల్ల మచ్చలు వచ్చి చాలాకాలంపాటు తగ్గకపోతే(నోరు), రొమ్ముల్లో గడ్డలు ఏర్పడటం, చనుమొలల నుంచి రక్తంతో కూడిన స్రావం(రొమ్ము), ఆహారం మింగడంలో ఇబ్బంది, అజీర్తిగా అనిపించడం(అన్నవాహిక, జీర్ణాశయ, గొంతు క్యాన్సర్లలో), విడవకుండా దగ్గు రావడం(ఊపిరితిత్తులు), గొంతు బొంగురుపోవడం(గొంతు, స్వరపేటిక), ముఖంమీద నల్లమచ్చలు, పుండ్లు రావడం(చర్మం), పిల్లలకు యాంటీబయోటిక్స్‌ వాడుతున్నా ఓ పట్టాన జ్వరం తగ్గకున్నా(లుకేమియా), పెద్దవయసు స్త్రీలలో కడుపు ఉబ్బడం(అండాశయం)... వంటివన్నీ ఆయా క్యాన్సర్లుగా అనుమానించాలి.

ఎలా గుర్తిస్తారు?
కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే వాళ్ల సంతానం, బంధువులు క్యాన్సర్‌ పరీక్షలు చేయించుకోవడం విధిగా పెట్టుకోవాలి. అయితే తొలి దశలో క్యాన్సర్‌ని గుర్తించడం కష్టం. అందుకే నిపుణులు ప్రశ్నలు అడగడం ద్వారా కొందరికి కొన్ని పరీక్షల్ని సూచిస్తుంటారు. 35 దాటిన స్త్రీలకి గర్భాశయముఖ ద్వారానికి పాప్‌స్మియర్‌; రొమ్ములకి మమోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌; ధూమపానం అలవాటు ఉన్నవాళ్లకి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కోసం ఛాతీ ఎక్స్‌రే తీయడం, తరచూ జీర్ణకోశ ఇబ్బందులు తలెత్తుతుంటే ఎండోస్కోపీ, అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ చేయడం, మలమూత్ర విసర్జనలో వచ్చే మార్పుల్ని నేరుగా వైద్యులు చూడటం లేదా ప్రాక్టోస్కోపీ చేయడం, పెద్దపేగుకి కొలనోస్కోపీ, ఊపిరితిత్తులకోసం బ్రాంకోస్కోపీ, గర్భాశయానికి హిస్టరోస్కోపీ... ఇలా రకరకాల పరీక్షలు సూచిస్తారు. ఏ ఒక్క పరీక్షతోనో శరీరంలో వచ్చే క్యాన్సర్లన్నింటినీ కనిపెట్టడం అనేది అసాధ్యం.

ఏ దశలో ఉంది?
పరీక్షల్లో క్యాన్సర్‌ నిర్ధారణ చేసి అది ఏ దశలో ఉందీ, ఏ రకం తల్లికణం నుంచి వచ్చిందీ అన్నదానికోసం బయాప్సీ, అల్ట్రాసౌండ్‌, సీటీ, ఎమ్మారై, బోన్‌స్కాన్‌, అవసరాన్ని బట్టి శరీరం మొత్తం పెట్‌స్కాన్‌ చేస్తారు. ఈ పరీక్షల ద్వారా రోగనిర్ధారణతోబాటు దశను నిర్ధరించి, చికిత్స చేస్తారు.
సాధారణంగా క్యాన్సర్‌ కణాలు పుట్టినచోటే ఉండకుండా శరీరమంతా వ్యాపిస్తాయి. ఈ స్థితినే ‘మెటాస్టాటిక్‌’ అంటారు. ఉదాహరణకు రొమ్ములో పుట్టిన క్యాన్సర్‌ కణాలు ఎముకకి వ్యాపిస్తే దాన్ని బోన్‌ క్యాన్సర్‌గా చెప్పకూడదు. దాన్ని మెటాస్టాటిక్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనే చెప్పాలి. ఎముకలో పుట్టిన దాన్నే బోన్‌ క్యాన్సర్‌గా అంటారు. ఎందుకూ అంటే క్యాన్సర్‌ పుట్టిన అవయవాన్ని బట్టి చికిత్స కూడా మారుతుంది.
అందుకే బయటపడ్డ క్యాన్సర్‌ విస్తరించే వేగం, వ్యాపించిన భాగాలను బట్టి క్యాన్సర్‌ను నాలుగు దశలుగా చెబుతారు. అంటే- కణితి పరిమాణం(ట్యూమర్‌-టి), అది ఆ భాగానికే పరిమితమైందా లేదా లింఫ్‌గ్రంథులు (నోడ్స్‌-ఎన్‌)కి వెళ్లిందా, అక్కడి నుంచి ఇతర భాగాలకూ వ్యాపించిందా(మెటాస్టాటిస్‌- ఎమ్‌) అనే ఈ మూడు స్థితులను బట్టి అది ఏ దశలో ఉందో నిర్ణయిస్తారు. దీన్నే‘టిఎన్‌ఎమ్‌ స్టేజింగ్‌ సిస్టమ్‌’ అనీ అంటారు. ఈ విధానం ఆధారంగా- క్యాన్సర్‌ రావడానికి ముందు దశని జీరో(ప్రీక్యాన్సర్‌)అనీ, క్యాన్సర్‌ సోకిన అవయవానికి పరిమితమై ఉండటంతోబాటు ట్యూమర్‌ సైజు చిన్నగా ఉంటే తొలిదశగానూ; పుట్టిన అవయవానికి పరిమితమవడంతోబాటు పక్కనుండే లింఫ్‌ గ్రంథులకి వ్యాపించడాన్ని రెండోదశగానూ; క్యాన్సర్‌ సోకిన అవయవం నుంచి పక్క అవయవాలకీ, లింఫ్‌ గ్రంథులన్నింటికీ చేరడాన్ని మూడోదశగానూ; క్యాన్సర్‌ సోకిన అవయవం నుంచి దూరంగా అంటే- ఊపిరితిత్తుల నుంచి మెదడుకీ రొమ్ము నుంచి కాలేయానికీ వ్యాధి సోకడాన్ని నాలుగోదశగానూ చెబుతారు. ఈ విధమైన విభజనవల్ల రోగికి ఏ చికిత్స చేయాలీ అనేది నిర్ణయిస్తారు. దశని అంచనా వేయలేని కేసులూ ఉంటాయి.

చికిత్సావిధానాలు
ఒకసారి దశ తెలిశాక శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీల ద్వారా క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చు. శస్త్రచికిత్స: అవయవాలకి అంటే కార్సినోమా, సార్కోమా క్యాన్సర్లన్నింటిలోనూ శస్త్రచికిత్సతోనే కణితిని తొలగిస్తారు. రోగి పరిస్థితి సర్జరీకి ఏమాత్రం అనుకూలంగా
లేనప్పుడే అంటే నాలుగోదశలో ఉంటే కీమో, రేడియోథెరపీలు చేస్తారు. రెండు, మూడు దశల్లో శస్త్రచికిత్స, కీమో, రేడియోథెరపీలను కలిపి చేస్తారు. కొన్ని కేసుల్లో- కణితి పరిమాణం బాగా పెద్దగా ఉండటంతో ముందే సర్జరీ చేయలేక రేడియోథెరపీ ద్వారా సైజు తగ్గించి అప్పుడు శస్త్రచికిత్స చేస్తారు.
సాధారణంగా అవయవాలకొచ్చే క్యాన్సర్‌ తొలిదశలో ఉంటే సర్జరీ సరిపోతుంది. ముదిరిన దశలో మాత్రమే శస్త్రచికిత్స చేశాక ఎక్కడైనా చిన్న కణాలు మిగిలిపోతే, అవి భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయన్న కారణంతో కీమో లేదా రేడియోథెరపీలను చేస్తుంటారు.
కీమోథెరపీ: మందుల ద్వారా క్యాన్సర్‌ కణాలను నిర్మూలించే విధానమిది. లుకేమియా, లింఫోమా, మైలోమా క్యాన్సర్లన్నింటికీ కీమోథెరపీ సరైనది. కీమోలో ఇచ్చే మందుల ప్రభావం శరీరంలోని అన్ని కణాలమీదా పడుతుంటుంది. అందుకే దానికి ప్రతిగా గురిచూసి కేవలం క్యాన్సర్‌ కణాలను మాత్రమే నాశనం చేసే టార్గెటెడ్‌ థెరపీ ఇటీవల వాడుకలోకి వచ్చింది.

రేడియోథెరపీ(ఎడ్జువెంట్‌): ఎక్స్‌రే లేదా గామా కిరణాల ద్వారా క్యాన్సర్‌ కణాలను నిర్మూలించడమే రేడియోథెరపీ. వ్యాధి తిరిగిరాకుండా ఉండేందుకు సర్జరీ చేశాక లేదా కీమోతోబాటు రేడియోథెరపీ కూడా చేస్తారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్‌ మోతాదు ఎక్కువగా ఇవ్వడంతో అవయవాల్లో ఎదుగుదల ఉండదు. కాబట్టి పిల్లలకు సాధారణంగా రేడియేషన్‌ ఇవ్వరు. సాధారణ రేడియేషన్‌లో చుట్టుపక్కలి కణాలమీదా ఆ ప్రభావం పడుతుంటుంది. కాబట్టి ఇటీవల దుష్ఫలితాలు చూపించని ప్రోటాన్‌ బీమ్‌ థెరపీ వంటి ఆధునిక విధానం వాడుకలోకి వస్తోంది.
హార్మోనల్‌ చికిత్స: శరీరంలో కొన్ని అవయవాలకి సంబంధించి రొమ్ము, ప్రొస్టేట్‌, గర్భాశయం, థైరాయిడ్‌... వంటి క్యాన్సర్లకు ఇది బాగా పనిచేస్తుంది.
ఇమ్యునోథెరపీ: శరీరం తనకు తానుగా క్యాన్సర్‌తో పోరాడేలా రోగనిరోధక కణాలను ఉత్తేజం చేసే ఆహారం, మందుల్ని ఇవ్వడం ద్వారా రోగనిరోధకశక్తిని పెంచే ఇమ్యునోథెరపీ వంటి ఆధునిక విధానాలతో క్యాన్సర్‌ను నిర్మూలించేందుకూ నేటి వైద్య ప్రపంచం ప్రయత్నిస్తోంది.
ప్రత్యామ్నాయ వైద్యవిధానాలు: నేచురోపతీ, ఆయుర్వేదంలోని కొన్ని మూలికలు క్యాన్సర్‌కు ఉపయోగపడతాయని శాస్త్రపరంగా తేలినప్పటికీ అందరికీ పనిచేస్తాయన్న విషయం కచ్చితంగా తెలియలేదు. వాటిని ఏయే మోతాదులో ఎలా వాడాలనేది ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉంది. కాబట్టి కేవలం వాటిమీదే ఆధారపడకుండా వైద్యులను సంప్రదించడమే మేలు.

క్యాన్సర్‌ని నివారించగలమా?
చాలామందిలో క్యాన్సర్‌ వస్తే తగ్గదు, చికిత్స వల్ల బాధేగానీ ఫలితం ఉండదు అన్న అపోహలు ఉంటాయి. కానీ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి, సరైన చికిత్స చేయడం వల్ల 90 శాతం వరకూ హాయిగా జీవించేలా చేయవచ్చు. అదే రెండోదశలో ఇచ్చే చికిత్స వల్ల 60 -70 శాతం, మూడో దశలో 30-40 శాతం వరకూ ఆయుష్షును పొడిగించవచ్చు. నాలుగోదశలో ఇచ్చే చికిత్సకి ఆయుఃప్రమాణం పెరిగే అవకాశం ఉందని కచ్చితంగా చెప్పలేం. ఈ దశలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. కాబట్టి, క్యాన్సర్‌ రాకముందే జీరో దశలోగానీ తొలిదశలోగానీ గుర్తించి మంచి చికిత్స అందించగలిగితే మామూలు జీవితాన్ని హాయిగా గడిపేలా చేయవచ్చు. అయితే క్యాన్సర్‌ పూర్తిగా తగ్గడం తగ్గకపోవడం అనేది ఆయా క్యాన్సర్‌ రకం, అది వ్యాపించే వేగం, వాళ్ల శరీరతత్త్వం మీదా ఆధారపడి ఉంటుంది.

దుష్ఫలితాల్ని ఎదుర్కొనేదెలా?
చికిత్సానంతరం క్యాన్సర్‌ రోగుల్లో ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, జుట్టు ఊడిపోవడం, వికారంతోబాటు రక్తహీనత కారణంగా అలసటగా అనిపించడం, కండరాల నొప్పి, రోగనిరోధకశక్తి తగ్గిపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణం. కాబట్టి అవన్నీ చూసి బెంబేలెత్తిపోకుండా రోగికి కౌన్సెలింగ్‌ ఇవ్వడం తప్పనిసరి. కొన్ని రకాల మందులు, పోషకాహారం ద్వారా త్వరగా కోలుకునేలా చేయాలి. ఇందుకు కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరం. ఆ స్థితిలో అండగా ఉంటే క్యాన్సర్‌ రోగి త్వరగా సాధారణ జీవితంలోకి రాగలడు.

రాకుండా చూసుకోగలమా?
మూడింట ఒక వంతు క్యాన్సర్లను రాకుండా నిరోధించవచ్చు. చిన్నతనం నుంచే తల్లితండ్రులు పిల్లలకు చక్కని జీవనశైలిని అలవాటు చేయాలి. బరువు పెరగకుండా చూసుకోవడం, రోజుకో గంట నడక లేదా వ్యాయామం చేయడం, తియ్యటి పానీయాలు తీసుకోకపోవడం, పీచు ఎక్కువా, కొవ్వు తక్కువా ఉండే పదార్థాలు తినడం, ఒకసారి వాడిన నూనెను మళ్లీమళ్లీ వాడకపోవడం,  తాజా పండ్లూ కూరగాయలూ, పొట్టుతీయని ధాన్యాలూ పప్పుధాన్యాలూ ఎక్కువగా తినడం, మిత మాంసాహారం, మద్యానికీ పొగాకుకీ దూరంగా ఉండటం, ప్లాస్టిక్‌ని బహిష్కరించడం, నీళ్లు ఎక్కువగా తాగడం, ఒంటినీ ఇంటినీ శుభ్రంగా ఉంచుకోవడం, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే ప్రాణాయామం చేయడం, రక్షిత శృంగారం, ఒత్తిడి లేని వృత్తి జీవితం, ఉల్లాసంగా ఉండటం, మనసుకు హాయినిచ్చే అభిరుచుల్ని పెంచుకోవడం... వంటి అలవాట్లను పాటించే వాళ్లంటే క్యాన్సర్‌కి చచ్చేంత భయం. లక్ష్మణరేఖ దాటి రాలేని రావణాసురుడిలా ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవాళ్లకి క్యాన్సర్‌ బహు దూరం!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.