close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విద్యార్థులకీ.. పెద్దలకీ.. అందరికీ...

కంపెనీ పెట్టాలంటే పెద్ద ప్రణాళిక అక్కర్లేదు, చిన్న ఆలోచన చాలు... ఇక్కడున్న సంస్థల గురించి తెలుసుకుంటే ఆ విషయం మీకూ అర్థమవుతుంది. విద్యార్థులూ, పెద్దలూ, పాప్‌కార్న్‌ ప్రేమికులే లక్ష్యంగా వచ్చిన ఈ కంపెనీలు ఎలా దూసుకెళ్తున్నాయో చూడండి!

విద్యార్థులకు మాత్రమే...

విద్యార్థులకు నైపుణ్యాలు కావాలీ, పాకెట్‌ మనీ కావాలీ... ఈ రెంటినీ అందించే ఆప్‌ ఒకటి వచ్చింది అదే frapp. ముంబయి కేంద్రంగా పనిచేసే ఈ సంస్థని నిరంజన్‌, ఆర్మాన్‌ స్థాపించారు. డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే అక్కడ వేర్వేరు కంపెనీలు అందిస్తున్న ఇంటర్న్‌షిప్‌ల సమాచారం ఉంటుంది. ఇంజినీరింగ్‌- టెక్నాలజీ, మార్కెటింగ్‌, సైన్సెస్‌, ఫైనాన్స్‌... ఇలా నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఇల్లు, ఆఫీసు, క్యాంపస్‌లలో ఎక్కడనుంచి పనిచేయాలనుకుంటున్నారో చెబితే అందుకు అనుగుణంగా ఉండే ఇంటర్న్‌షిప్‌లను ఇందులో చూపిస్తారు. స్టార్‌బక్స్‌, ఓలా, ప్యూమా, సోనీ, రిలయన్స్‌ డిజిటల్‌... లాంటి సంస్థలు ఇక్కడ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాల్ని ఇస్తాయి. ఇంటర్న్‌షిప్‌ కాదు, పాకెట్‌ మనీ కావాలి అంటే, అందుకూ ఓ మార్గాన్ని చూపిస్తోంది ఫ్రాప్‌. దీన్లో ‘మిషన్స్‌’ విభాగం ఉంటుంది. వివిధ సంస్థలు తమ ఉత్పత్తులకి సోషల్‌ మీడియాలో ప్రచారం కల్పించేందుకు దీన్ని ప్రధానంగా వాడుకుంటాయి. ఫలితంగా డబ్బు లేదంటే, రివార్డు పాయింట్లు ఇస్తాయి. అపోలో టైర్స్‌ సంస్థ ఎవరైనా విద్యార్థులు తమ ఫుట్‌బాల్‌ నైపుణ్యాలని చూపిస్తూ వీడియో తీసి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో పెడితే రూ.300 ఇస్తామంది. ఆ వీడియోలో కంపెనీ లోగో కనిపిస్తుంది. అలా వారికి ప్రచారం దొరుకుతుంది. అలాగే ‘గల్లీ బాయ్‌’ సినిమాకి సోషల్‌ మీడియాలో పోస్టులతో ప్రచారం చేస్తే కొంత మొత్తం ఇస్తారు. ఇంటర్న్‌షిప్‌, పాకెట్‌ మనీ ఇలా రెంటికీ ఉపయోగపడే ఈ ఆప్‌ని ఇప్పటివరకూ ఆరు లక్షల మందికిపైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

సీనియర్ల కోసం...

దేశంలో చాలామంది పెరుగుతున్న యువ జనాభా గురించి మాట్లాడుతుంటారు. మరోవైపు ఆరు పదులు దాటిన సీనియర్‌ సిటిజన్ల సంఖ్యా పెరుగుతోంది. పుణె కేంద్రంగా పనిచేసే ఆర్‌పీజీ గ్రూప్‌ ఆ విషయాన్ని నాలుగేళ్ల కిందటే గుర్తించింది. గుర్తించడమే కాదు వారికి అవసరమైన వస్తువుల్ని అమ్మడానికి ‘సీనియారిటీడాట్‌ఇన్‌’ వెబ్‌ పోర్టల్‌నీ ప్రారంభించింది. ఇక్కడ పెద్దవాళ్ల జీవనశైలిని సులభతరం చేసే వస్తువులూ, వైద్య పరికరాలూ దొరుకుతాయి. భూతద్దం అమర్చి ఉండే నెయిల్‌ కట్టర్‌, బటన్లు పెద్దగా కనిపించే ఫోన్లు, మడమలు పగలకుండా కాపాడే సాక్సులూ, తాళంచెవి అవసరంలేకుండా స్మార్ట్‌కార్డుతో తెరుచుకునే తాళాలూ...  ఇలా చాలా వస్తువులు ఈ వెబ్‌సైట్లో దొరుకుతాయి. ఇంకా పాత పాటలు మాత్రమే లోడ్‌చేసి ఉండే రేడియోలూ, ఆధ్యాత్మిక పుస్తకాలూ, బహుమతులూ, సీనియర్లకు ఉపయోగపడే ఆహార పదార్థాలూ ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దవాళ్లకు అవసరమయ్యేవన్నీ లభిస్తాయి. దాదాపు 5000 రకాల ఉత్పత్తులు ఈ వెబ్‌సైట్లో ఉన్నాయి. దీన్లో రోజుకి 1200 ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి. ఒక్క ఆన్‌లైన్లోనే కాకుండా పుణె, కోయంబత్తూర్‌ నగరాల్లో ఆఫ్‌లైన్‌ దుకాణాలూ ఉన్నాయి. త్వరలో మరిన్ని నగరాలకూ వీటిని విస్తరించనున్నామని చెబుతారు సంస్థ సహ వ్యవస్థాపకులు ఆయుష్‌, తపన్‌. సీనియర్‌ సిటిజన్ల మెరుగైన జీవనానికి అవసరమైన అన్ని రకాల వస్తువుల్నీ వెబ్‌సైట్‌ ద్వారా అందించడమే తమ లక్ష్యమని చెబుతారు.

ఐస్‌క్రీమ్‌లాంటి పాప్‌కార్న్‌...

సినిమా ఎవరిదైనా ప్రేక్షకుల నోట్లో పాప్‌కార్న్‌ ఉండాల్సిందే! ఈ చిన్న విషయాన్ని గమనించి ‘4700 బీసీ పాప్‌కార్న్‌’ బ్రాండ్‌ సృష్టించారు చిరాగ్‌ గుప్తా, అంకుర్‌ గుప్తాలు. ఇప్పుడు చాలా నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో ఈ బ్రాండ్‌ పాప్‌కార్న్‌ దొరుకుతోంది. అంతేకాదు, దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై నగరాల్లో 25 వరకూ సొంత దుకాణాల్నీ తెరిచిందీ సంస్థ. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు మొదలుపెట్టింది. ఐస్‌క్రీమ్‌ మాదిరిగా దీన్లో ఫ్లేవర్లు ఉంటాయి. అమెరికాలో చదువుకుని, అక్కడే కొన్నాళ్లు ఉద్యోగం చేసిన చిరాగ్‌ అక్కడున్నన్ని విభిన్నఫ్లేవర్‌లలో మనదగ్గర పాప్‌కార్న్‌ ఫ్లేవర్లు లేకపోవడం గమనించాడు. దేశీ ఫ్లేవర్లలో పాప్‌కార్న్‌లను అభివృద్ధిచేసి 2013లో ఈ సంస్థను అంకుర్‌తో కలిసి దిల్లీలో మొదలుపెట్టాడు. ఈ కంపెనీ పాప్‌కార్న్‌ తయారీకి మష్రూమ్‌ కార్న్‌ను ఉపయోగిస్తుంది. ఈ గింజలు పెద్దవిగా, గుండ్రంగా ఉంటాయి. క్రీ.పూ. 4700లో తయారుచేసిన పాప్‌కార్న్‌, అందుకు వాడిన పాత్రల శిలాజాలు తవ్వకాల్లో బయటపడ్డట్టు చదివామనీ అందుకే తమ బ్రాండ్‌కి ఆ పేరు పెట్టామనీ చెబుతారు. పీవీఆర్‌ సంస్థ ఈ కంపెనీలో రూ.5కోట్లు పెట్టుబడి పెట్టింది. గతేడాది రూ.10 కోట్ల అమ్మకాల్ని నమోదు చేసిందీ సంస్థ.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.