close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ శక్తిపీఠం కాశీక్షేత్రంతో సమానం

కొన్ని కోటలు రాజుల ఆడంబరానికీ దర్పానికీ అద్దం పడతాయి. మరికొన్ని కోటలు మాత్రం ఆ రాజుల ధైర్యసాహసాలకీ ముందు జాగ్రత్త చర్యలకీ ప్రతీకలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని పన్హాలకోట అచ్చంగా అలాంటిదే అంటూ అక్కడి కోట చరిత్రతోబాటు ఆ చుట్టుపక్కలి శక్తిపీఠాల గురించీ చెప్పుకొస్తున్నారు తూ.గో.జిల్లాలోని కొత్తపేటకు చెందిన ఎస్‌.భానుమతి.

ముంబై నుంచి ఉదయాన్నే బయలుదేరి పుణె, సతారాల మీదుగా 320 కి.మీ. దూరంలోని కొల్హాపురికి చేరుకుని పన్హాలాకోట సందర్శించడానికి బయలుదేరాం. మహారాష్ట్రలో చూడాల్సిన కోటల్లో ముఖ్యమైనది ఇదే. కొల్హాపురి జిల్లాలోని సహ్యాద్రి పర్వతశ్రేణులలోని కోట ప్రాంతాన్ని పర్యటక శాఖ హిల్‌స్టేషన్‌గా అభివృద్ధి చేసింది. శత్రుసేనల వ్యూహాలను తెలుసుకుని వారిపై ఎదురుదాడి చేసే విధంగా పకడ్బందీగా కట్టిన ఈ కోట, ఎన్నో యుద్ధాలకి మౌనసాక్ష్యం. మిగిలినవాటితో పోలిస్తే శివాజీకీ బీజాపూర్‌ సుల్తాన్‌ రెండో ఆదిల్‌షాకీ జరిగిన పవన్‌ఖిండ్‌ యుద్ధంతో ఈ కోట ప్రాచుర్యం చెందింది. కొండపై నుంచి చూస్తే చుట్టూ అందమైన ప్రకృతి మనల్ని పరవశింపజేస్తుంది.

శివాజీ వేషంలో!
ఈ కోటను ముందుగా షిల్హారా ప్రాంతాన్ని పాలించిన రెండో భోజ రాజు 1178-1209 మధ్యకాలంలో నిర్మించగా- ఆ తరవాతి కాలంలో మహారాష్ట్రులకూ మొఘల్‌ చక్రవర్తులకూ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారికీ ఇది సైనిక స్థావరంగా ఉండటం విశేషం. 1659లో బీజాపూర్‌ సైన్యాధికారి అఫ్జల్‌ఖాన్‌ను ఓడించి, ఛత్రపతి శివాజీ ఈ కోటను ఆక్రమించగా, తరవాత పవన్‌ఖిండ్‌ యుద్ధంలో ఛత్రపతి శివాజీ నుంచి తిరిగి ఆదిల్‌ షా దీన్ని సొంతం చేసుకున్నాడు. దాదాపు ఐదు నెలలపాటు సాగిన ఆ యుద్ధంలో చివరికి శివాజీ ఓడిపోక తప్పని పరిస్థితిలో కోట నుంచి పారిపోయాడు. ఆ సమయంలో శివాజీకి బదులుగా ఆయన వేషంలో శివ కాశిద్‌, కమాండర్‌ బాజి ప్రభు దేశపాండే వంటి వీరులు బహమనీ సేనతో పోరాడగా, శివాజీ అక్కడినుంచి విశాల్‌గఢ్‌కు చేరి, తరవాతికాలంలో తిరిగి ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడట.

కోటలోకి ప్రవేశించడానికీ తిరిగి రావడానికీ వాగ్‌ దర్వాజా, చార్‌ దర్వాజా, తీన్‌ దర్వాజా అనే మూడు ద్వారాలు ఉన్నాయి. మేం ముందుగా వాగ్‌ దర్వాజా ద్వారా కోటలోకి ప్రవేశించాం. కోటకు చుట్టూ త్రికోణాకారంలో రక్షణ కవచంలా ప్రహరీగోడ నిర్మించబడింది. కోట సగ భాగం ఈ గోడ ద్వారానూ మిగిలిన సగభాగం భూమి కోత వల్ల ఏర్పడిన సహజ లోయ ద్వారానూ రక్షించబడేదట. కోటలోకి ప్రవేశిస్తున్నప్పుడే యుద్ధవీరులు బాజీ ప్రభు దేశపాండే, శివ కాశిద్‌ల విగ్రహాలు చూశాం. కొండపైన శివాజీ తల్లి జిజియాబాయి, శివాజీ పెద్ద కుమారుడు శంభాజీల సమాధులు ఉన్నాయి. తరవాత అందర్‌ బావడి దగ్గరకు వెళ్లాం. బావడి అంటే మరాఠీలో నుయ్యి అని అర్థం. కోట లోపల బయటివాళ్లకి కనిపించకుండా రహస్యంగా తవ్విన ఈ బావిలో నీళ్లు కలుషితం, విషపూరితం కాకుండా కొందరు సైనికులు రాత్రీపగలూ కాపలా కాసేవారట. కొండమీద అన్నింటికీ దీని ద్వారానే నీటి వసతి కల్పించబడుతోంది. మహాలక్ష్మి, అంబాబాయి, మహాకాళి, సోమేశ్వరుడు, శంభాజీల ఆలయాలన్నీ దర్శించుకున్నాం. యుద్ధ సమయంలో ధాన్యాన్ని దాచడానికి అంబర్‌ఖానా అనే కట్టడాన్ని నిర్మించారు. అది చూశాక, యుద్ధసమయంలో స్త్రీలూ పిల్లలూ వృద్ధులూ సురక్షితంగా దాగుండే రాజ్‌దిండి సొరంగంలోకి వెళ్లాం. ఛత్రపతి శివాజీ పవన్‌ఖిండ్‌ యుద్ధంలో ఈ సొరంగమార్గం గుండానే తప్పించుకుని విశాల్‌గఢ్‌కు చేరుకున్నాడట. అక్కడినుంచి రాణిగారి తోటకి వెళ్లాం. ఇది ఎంతో విశాలంగా ఎన్నో రకాల చెట్లతో అందంగా ఉంది. ఈ తోటలో కోట నమూనా కూడా ఉంది. తరవాత తారారాణి మహల్‌కి వెళ్లాం. అందులో ఇప్పుడు ఆఫీసులూ, స్కూలూ, హాస్టలూ నిర్వహిస్తున్నారు. ఆపై సజ్జాకోటి అనే భవంతిలోకి వెళ్లాం. బహమనీ శైలిలో ఉన్న ఈ భవంతిని ఇబ్రహీం ఆదిల్‌ షా నిర్మించాడు. అప్పటి పరిస్థితులరీత్యా శివాజీ తన కుమారుడు శంభాజీని ఇక్కడే ఖైదు చేశాడట. అవసరమైన వాళ్లకి ధాన్యాన్ని పంచే ధర్మకోటి భవంతినీ చూశాం. అందర్‌ బావడి, కాళి బురుజ్‌, పరాసర గుహ... వంటి మరికొన్ని ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ చూశాక మహాలక్ష్మి ఆలయానికి బయలుదేరాం.

కొల్హాపురి శక్తిపీఠం!
మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో శక్తిమంతమైనది కొల్హాపురి. సతీదేవి నయనాలు పడిన క్షేత్రమే కొల్హాపురి.  4, 5 శతాబ్దాల మధ్యకాలంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉండొచ్చనీ, 8వ శతాబ్దంలో చాళుక్యరాజులు దీన్ని తిరిగి కట్టించి ఉంటారనేది చరిత్రకారుల ఊహ. కొల్హాపురినే కరవీర మహానగరంగా పిలిచేవారట. ప్రళయకాల సమయంలో శివుడు కాశీక్షేత్రాన్ని నీటిలో మునిగిపోకుండా తన త్రిశూలంతో రక్షించగా, కొల్హాపురి క్షేత్రాన్ని తన హస్తాలతో అమ్మ మహాలక్ష్మీదేవి రక్షించిందనీ దేవీపురాణం పేర్కొంటోంది. అందుకే ఇక్కడ అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అంటారు. కాశీ క్షేత్రంతో సమానమైన క్షేత్రాన్ని ప్రసాదించమని అగస్త్య మహాముని మహాశివుణ్ణి వేడుకోగా ఆయన కొల్హాపురిలో మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠించాడనేది మరో పురాణగాథ. అందుకే కొల్హాపురి అమ్మదర్శనం కాశీక్షేత్రంతో సమానం అంటారు.
ఈ ఆలయంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా మహాశివుడు నీరుగా విష్ణువు రాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా కొలువై ఉన్నారని ప్రతీతి. గర్భగుడిలోపల అమ్మ నాలుగు చేతులతో కొలువై కల్పవల్లిగా సాక్షాత్కరిస్తోంది. ఏడాదిలో రెండు మూడు రోజులు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాలను తాకడం ఈ ఆలయాని కున్న మరో ప్రత్యేకత. గర్భగుడి నుంచి బయటకు రాగానే కుడివైపున సరస్వతీదేవి, ఎడమపక్కన రాక్షససంహారం చేసిన కాళికాదేవి ఉన్నారు. త్రిశక్తి స్వరూపాలు ఒకే గుడిలో ఉన్న ప్రత్యేకత కొల్హాపురికి మాత్రమే ఉంది. అమ్మవారి ఆలయంలోని శ్రీచక్రం దర్శనం చేసుకుంటే త్వరలో వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఆవరణలో గుడికి ఓ పక్కగా ఎత్తైన దీపస్తంభాలు కనిపిస్తాయి. అందులో దీపం వెలిగించిన వారికి పునర్జన్మ ఉండదని చెబుతారు. అమ్మ దర్శనాంతరం, బంగారు నగల డిజైన్లకీ నాణ్యమైన బెల్లానికీ చెప్పులకీ పెట్టింది పేరైన కొల్హాపురిలోని దుకాణాలన్నీ తిరిగాం.

ఏకవీరాదేవి దివ్యధామం
మర్నాడు ఉదయం ఆరుకల్లా బయలుదేరి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఏకవీరాదేవి ఆలయానికి వెళ్లాం. ఇది పుణెకి 100 కి.మీ. దూరంలో ఎత్తైన కొండమీద కార్ల బౌద్ధ గుహలకు ఆనుకుని ఉంది. సతీదేవి శరీర భాగాల్లో కుడి భుజం ఇక్కడే పడి పవిత్ర శక్తిపీఠంగా వెలుగొందుతోన్న పుణ్యక్షేత్రమిది. ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేసేటప్పుడు- అమ్మవారు ప్రత్యక్షమై తనకు ఒక్క రాత్రిలో గుడి కట్టాలని వారిని కోరిందనీ అప్పుడు పాండవులు ఆమె కోరిక మేరకు దేవికి గుడి కట్టగా- అమ్మవారు సంతోషించి అజ్ఞాతవాసంలో పాండవులను ఎవరూ గుర్తుపట్టకుండా వరం ఇచ్చిందనేది ఓ పౌరాణిక కథనం. ఒకే రాత్రిలో వీరులచేత గుడి కట్టబడింది కాబట్టి అమ్మవారు ఏకవీరాదేవిగా అలరారుతోందని ప్రతీతి. ఇక్కడి అమ్మవారిని పరశురాముని తల్లిగానూ చెబుతారు. క్రీ.పూ. రెండో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారనీ, తరవాత క్రీ.శ. 5వ శతాబ్దంలో పునర్నిర్మించారనీ అంటారు. అమ్మ దర్శనార్థమై కార్లాకు చేరుకుని, పుష్కరిణిలో స్నానం చేసి మెట్లమీదుగా బయలుదేరాం. ఆ దారిలో కుడివైపున ఉన్న పాదుకాలయాన్నీ తరవాత మూలవిరాట్‌నూ దర్శించుకోవాలనీ అప్పుడే సంపూర్ణ దర్శనం అవుతుందనీ చెబుతారు.  ప్రాంగణంలో జనార్ధన స్వామి సమాధిని దర్శించుకున్నాం. ఆయన అమ్మవారికి పూజలూ కైంకర్యాలూ చేస్తూ అక్కడే నిర్యాణం పొందారనీ ఆయన సమాధిని దర్శించుకుంటే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తుందనేది విశ్వాసం. తరవాత బౌద్ధగుహల్లోకి వెళ్లాం.

కార్లా బౌద్ధగుహలు
ఈ ప్రాంతంలో క్రీ.శ. 2, 3 శతాబ్దాల్లో బౌద్ధమతం వ్యాప్తి చెందిందనీ, బౌద్ధ బిక్షువులు అక్కడ నివాసముండేవారనీ చెబుతారు. ఆ కొండల్లో బౌద్ధ బిక్షువులు నివాసం ఉండటానికి వీలుగా గుహలను తొలిచారు. వారి వస్తువులు పెట్టుకునేందుకు అల్మరాలూ పడుకునేందుకు ఎత్తైన వేదికలూ ఉన్నాయి. నీటిని నిల్వ చేసే కుండీలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. సభాప్రాంగణంలోని రాజూ, రాణి శిల్పాలు, ఏనుగుపై ఊరేగుతున్న రాజుగారి శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోంది. ప్రాంగణం ముందు నాలుగు సింహాలతో బౌద్ధ స్తూపం ఉంది. దానిపై అశోక చక్రం చెక్కి ఉంది. ఇది సారనాథ్‌ బౌద్ధస్తూపాన్ని పోలి ఉంది. ఇంకా స్తంభాల మీద వామన గుంటలను పోలిన గుంటలు ఉన్నాయి. వాటిలో ఆటలు ఆడుకునేవారని చెబుతున్నారు. సభాప్రాంగణం లోపల అజంతాలో మాదిరిగా వేసిన కుడ్యచిత్రాలు ఇప్పటికీ ఎంతో అందంగా ఉన్నాయి. గదులు చిన్నవైనప్పటికీ గాలీ వెలుతురూ వస్తూ వేసవిలో సైతం చల్లగా ఉన్నాయి. దీనికి దగ్గర్లోనే లోనావ్లా జలపాతాలను చూసి తిరుగుముఖం పట్టాం.

 

 

 

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.