close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇద్దరు మిత్రుల సేవాయాత్ర!

‘మాకు సొంత ఇల్లంటూ లేదు కానీ దేశంలో ఏ మూలకు వెళ్లినా ఉండటానికి చాలా ఇళ్లున్నాయి...’ అంటాడు పీయూష్‌. ‘ఏ ఊరు వదిలివస్తున్నా అమ్మాయిని అత్తగారింటికి పంపుతున్న అమ్మానాన్నల్లా బాధగా వీడ్కోలు చెప్పేవారినీ, మీరు వెళ్లొద్దు, ఇక్కడే ఉండండి అంటూ బతిమాలేవారినీ చూస్తుంటే నాకు కళ్లలో నీళ్లు తిరిగేవి...’ అంటుంది అక్షత.  వాళ్లిద్దరూ వెళ్లింది బంధువుల ఇళ్లకో స్నేహితుల దగ్గరకో కాదు, ఏమాత్రం పరిచయం లేని మారుమూల పల్లెలకూ, గిరిజన గూడేలకూ. ఇంతగా అక్కడివాళ్ల ప్రేమను పొందడానికి ఈ ఇద్దరు మిత్రులూ ఏం చేశారో వారి మాటల్లోనే...

హాయ్‌... నా పేరు అక్షతా శెట్టి. నా ఫ్రెండ్‌ పీయూష్‌ గోస్వామి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మేం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ‘డ్రైవ్‌ ఫర్‌ ఛేంజ్‌’ అంటున్నాం. దీనికి కారణం తెలియాలంటే పదేళ్లు వెనక్కి వెళ్లాలి. మాది కర్ణాటకే కానీ అమ్మానాన్నా బహ్రెయిన్‌లో స్థిరపడడంతో నేనక్కడే పుట్టి పెరిగాను. పీయూష్‌ది ఉత్తరప్రదేశ్‌. మేమిద్దరం సురత్కల్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ చదివేటప్పటినుంచీ స్నేహితులం. చదువైపోగానే నేను ఇన్ఫోసిస్‌లో, పీయూష్‌ ఒరాకిల్‌లో చేరాం. కార్పొరేట్‌ ప్రపంచం మా వ్యక్తిత్వాలకు సరిపడదని రెండేళ్లలోనే అర్థమైంది. చేసే పనికి సమాజంతో నేరుగా సంబంధం ఉండాలని నమ్మేవాళ్లం. అందుకే ఆ ఉద్యోగాలు మానేసి నేను జర్నలిస్టు అవతారమెత్తితే, పీయూష్‌ ఫొటోగ్రాఫర్‌గా, ఫిల్మ్‌మేకర్‌గా పనిచేశాడు. ఇద్దరికీ ప్రయాణాలంటే ఇష్టం. కొత్త కొత్త ప్రదేశాలు చూడటం అక్కడి ప్రజల జీవనవిధానాలను అర్థంచేసుకోవడం అంటే ఆసక్తి. అదే మా జీవితాలను కొత్తదారిలో నడిపించింది. మా వృత్తులు కూడా అవే కాబట్టి ఎక్కడికెళ్లినా అక్కడి విశేషాలను నేను వార్తలుగా రాస్తే పీయూష్‌ ఫొటోలూ వీడియోలూ తీసేవాడు. అలా మొదలైన మా ప్రయాణం అడుగులు ముందుకు సాగే కొద్దీ మేము ఊహించని మలుపులు తిరిగింది.

మొదటి అడుగు: ఆలోచన
2013లో... ఓరోజు మేం రాజస్థాన్‌లోని ఒక పల్లెలో రాత్రిపూట స్థానికులతో కలిసి చలి కాచుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాలతో మొదలై కొన్నితరాలకు ఇంత పెద్ద పల్లె తయారైందనీ తమ పెద్దలు ఆ కథలెన్నో చెప్పేవారనీ అక్కడి వాళ్లు చెప్పారు. అది మమ్మల్ని ఆలోచింపజేసింది. నిజమే కదా, అందరమూ ‘నేను, నావాళ్లు, నా కుటుంబం’ అంటూ గిరిగీసుకుని బతుకుతున్నాం. మూలాలను మర్చిపోతున్నాం. మనం కల్పించుకున్న తేడాలే సమాజాలను విడదీస్తున్నాయి కానీ మనుషులూ వారి అవసరాలూ సమస్యలూ ఎక్కడికెళ్లినా ఒకటే. పెద్దలు చెప్పినట్టు ‘వసుధైక కుటుంబం’ అన్న భావన పెరిగితే ఎంత బాగుంటుందీ  అనిపించింది. అందుకే మా కార్యక్రమానికి ‘రెస్ట్‌ ఆఫ్‌ మై ఫ్యామిలీ’ అని పేరు పెట్టాం. మేం తెలుసుకున్న విషయాలను అక్షరబద్ధం చేసే ఉద్దేశంతో మరింత ఎక్కువగా వారితో గడపటానికి ప్రయత్నించాం. ఆ క్రమంలో వారి జీవనపోరాటాలూ అర్థమయ్యాయి. వాటిని వార్తలుగా రాస్తూ ప్రయాణం కొనసాగిస్తూ సమాజానికి మా వంతు సేవ చేస్తున్నామని ఆనందపడ్డాం. కొన్నాళ్లకు వెనక్కి తిరిగి చూసుకుంటే మేం చేసిన పొరపాటేమిటో తెలిసింది. వార్తలు రాసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావనీ, ఆ వార్తలు చదివి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకోవడం ఉత్త భ్రమేననీ అర్థమైంది. ఆ బాధ్యతను మేమే తీసుకోవాలనుకున్నాం. గత ప్రయాణాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆ ధైర్యాన్నిచ్చాయి. తమిళనాడులోని బోదినాయకనూర్‌లో 14 ఏళ్ల కుర్రాడు మెకానిక్‌గా పనిచేసేవాడు. అతని రోజుకూలీ 100 రూపాయలే ఆరుగురున్న కుటుంబానికి ఆధారం. అద్భుతమైన తెలివితేటలున్న ఆ అబ్బాయిని వొకేషనల్‌ ట్రైనింగ్‌లో చేర్పించాం. శిక్షణ అయ్యాక సొంతంగా షాపు పెట్టుకున్నాడు. అలాగే రాజస్థాన్‌లోని రాన్సిసర్‌ జోధాలో ఓ వ్యక్తి సేవాభావంతో పేదలకోసం స్కూలు నడుపుతున్నాడు. మరో టీచర్ని పెట్టుకోడానికి డబ్బు లేక గదులు ఊడవటం దగ్గర్నుంచీ పాఠాలు చెప్పడం దాకా అన్ని పనులూ స్వయంగా చేసేవాడు. అప్పుడు పీయూష్‌ తీసిన ఫొటోల్ని అమ్మి ఆ డబ్బుతో ఆ స్కూలుకు అవసరమైన కనీస ఏర్పాట్లు చేశాం. ఆ మాస్టారికి ఓ సహాయకుడినీ పెట్టాం. అలాంటి సంఘటనల స్ఫూర్తితో మా నైపుణ్యాలనూ, పరిచయాలనూ ఉపయోగించుకుని స్వచ్ఛంద సంస్థల ఆసరా, క్రౌడ్‌ ఫండింగ్‌ సాయమూ తీసుకుని ఏడాది పాటు సీరియస్‌గా పనిచేద్దామనుకున్నాం.

రెండో అడుగు: ఆశయం
మా నిర్ణయాన్ని అమ్మానాన్నలతో చెబితే చాలా కంగారుపడ్డారు. నిజానికి చిన్నప్పట్నుంచీ వాళ్లు నన్ను చాలా స్వతంత్రంగా స్వేచ్ఛగానే పెరగనిచ్చారు. అందుకే నా నిర్ణయాల మీద నమ్మకమున్నా సహజంగా తల్లిదండ్రులకుండే భయాల్నే వారూ వ్యక్తంచేశారు. గ్రామాల్లోని సమస్యలు మీకు తెలియవు అనవసరంగా ఇబ్బంది పడతారంటూ హెచ్చరించారు. ఇద్దరమూ కలిసి నచ్చజెప్పినా వాళ్లకు ధైర్యం రావడానికి చాన్నాళ్లు పట్టింది. ఎప్పటికప్పుడు మేం ఎక్కడున్నదీ తెలియజేస్తూ మా అనుభవాలను వివరిస్తూ ఉంటే క్రమంగా వారికీ ఆసక్తి పెరిగింది. సలహాలూ సూచనలూ ఇస్తూ ఇప్పుడు వాళ్లూ మా సపోర్టర్లయ్యారు. 2016 ఫిబ్రవరిలో మా రెండో దశ ప్రయాణం మొదలైంది. ఫ్రీలాన్సింగ్‌ పనితో వచ్చే ఆదాయం మా ఖర్చులకు సరిపోతుందని ప్లాన్‌ చేసుకుని ఓ జీప్‌లో బయల్దేరాం. రూట్‌మ్యాప్‌ లేకుండా బయల్దేరడంతో ఏడాది అనుకున్నది మూడేళ్లూ ఆరు రాష్ట్రాలూ అయింది. ఇంతకుముందు పూర్తిగా మా ఆనందం కోసం ప్రయాణించాం కానీ ఇప్పుడో ఆశయముంది కాబట్టి అనుభవం నేర్పిన పాఠాల్ని గుర్తుచేసుకున్నాం. గతంలో కేరళలో ఒకసారి మమ్మల్ని నక్సలైట్లు అనుకుని పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి విచారించారు. అటువంటి పరిస్థితి మమ్మల్నే కాక మేమున్న ఊరివాళ్లనీ ఇబ్బందిపెడుతుంది. అలా మావల్ల వారికి కొత్త సమస్యలు రాకూడదని జాగ్రత్తపడి స్థానిక ఎన్జీవోల ద్వారా వెళ్లేవాళ్లం. అలాంటివి లేనిచోట కూడా కాస్త చదువుకున్న స్కూలు పిల్లల్నైనా పరిచయం చేసుకుని వారి ద్వారానే ఊళ్లోకి వెళ్లి పెద్దలతో మాట్లాడేవాళ్లం. మేం కోరుకున్నది వారితో కలిసి బతుకుతూ అనుబంధాల్ని పెంచుకోవడమూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ప్రయత్నించడమూ. ఊళ్లోనే ఉంటామని చెబితే ఎవరో ఒకరు తమ గుడిసెలో మాకూ చోటిచ్చేవారు. నగరం నుంచి వచ్చామని కానీ చదువుకున్నవాళ్లమని కానీ ఎవరూ మమ్మల్ని వేరుగా చూడలేదు. మా నిజాయతీని అర్థం చేసుకున్నారు, అప్పటికప్పుడు తమలో కలుపుకున్నారు. వాళ్లు వండుకున్నదే మాకూ పెట్టారు. ఈ ప్రయాణాల్లో మేం నేర్చుకున్న మొదటి పాఠం- మంచితనమూ మానవీయతా బతికే ఉన్నాయనీ, స్పందించే హృదయాలకు నోటి భాషతో పనిలేదనీ. హిందీ ఇంగ్లీషు తప్ప స్థానిక భాషలేవీ మాకు రాకపోయినా గంటల తరబడి కూర్చుని మాట్లాడుకునేవాళ్లం. వాళ్ల భాషలో వాళ్లు మాట్లాడితే మా భాషలో మేము మాట్లాడేవాళ్లం. అయినా అర్థమైపోయేది. దూరం నుంచి నీళ్లు తీసుకురావడమైనా, అడవికెళ్లి వంటచెరకు తేవడమైనా... లేచినప్పటినుంచీ వాళ్ల వెంటే తిరుగుతూ సాయం చేసేవాళ్లం. దాంతో వాళ్లూ మమ్మల్ని తమలో ఒకరిగా చూసుకుంటూ మనసు విప్పి కష్టసుఖాలు చెప్పుకునేవారు. అలా కలిసిపోబట్టే ఆ కష్టాలకు మూలాలెక్కడున్నాయో ఎలా పరిష్కరచవచ్చో తెలిసేది. అప్పుడు మళ్లీ వివరంగా అన్నీ వారితో  చర్చించి వారినీ కలుపుకుని పని మొదలుపెట్టేవాళ్లం.

కర్ణాటకలో ఉన్నప్పుడు- దావణగెరె రైతుల పరిస్థితి చూసి చలించిపోయాం.నగరాల్లో పుట్టిపెరిగిన మాకు రైతు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అక్కడికి వెళ్లాకే తెలిసింది. పంటలు పండకా గిట్టుబాటు ధర లేకా రైతులు అప్పుల్లో కూరుకుపోయేవారు. దాని పర్యవసానమే పిల్లల చదువులు ఆగిపోవడమూ, సరైన తిండి లేకపోవడమూ, అనారోగ్యాల పాలైనా వైద్యం పొందలేకపోవడమూ. అదో విషవలయంలా అన్నదాతల కుటుంబాల్ని కుంగదీస్తోంది. ఆత్మహత్యలకు పురికొల్పుతోంది. ఇక చించోలిలోని లంబాడాల సమస్యలు మరో రకం. భారమైన మనసులతో బయల్దేరి కొప్పల్‌ చేరుకుంటే అక్కడ దేవదాసీల వ్యవస్థా వారి పిల్లల అవస్థలూ... అదో హృదయవిదారక పరిస్థితి. ఈ సామాజిక పరిస్థితుల్ని అర్థంచేసుకుంటూ నెమ్మదిగా కరవు కోరల్లో ఉన్న మహారాష్ట్రలోని లాటూరు చేరాం. పంటల దాకా కాదు కదా తాగడానికే నీరు లేని పరిస్థితి అక్కడివారిది. పది రోజులకోసారి వచ్చే ట్యాంకరునుంచి ఒక్కో కుటుంబానికి 200లీటర్ల నీళ్లు మాత్రమే లభించేవి. దాంతో ఊళ్లలోని యువత అంతా కూలీ పనులు వెతుక్కుంటూ పట్టణాలకు పోయేవారు. ఏ గుడిసె చూసినా నులక మంచానికి అతుక్కుపోయిన బక్కచిక్కిన దేహాలూ ఎండిపోయిన గొంతులూ... వారికి కాపలాగా ఒకరిద్దరు ఆడవాళ్లు. ఆ పరిస్థితుల్ని చూసి నిజంగా గుండె చెరువయ్యేది. ‘భుజం మీద ఈ కండువా ఎందుకో తెలుసా... కన్నీళ్లు వచ్చినంత కాలం వాటిని తుడుచుకోడానికి. అవి కూడా ఎండిపోయాక పీకకు ఉరి బిగించుకోడానికి...’ అన్న ఓ రైతు మాటలు గుర్తొచ్చినప్పుడల్లా నా గొంతుకు ఏదో అడ్డుపడ్డట్టవుతుంది.

మూడో అడుగు: ఆచరణ
ఆ పల్లెల గుండా ప్రయాణిస్తూ బీస్‌ వాఘోలీ అనే ఓ ఊరు చేరాం. మేమున్న గుడిసె పక్కనే ఉండే రైతు ఇంట్లో జరిగిన ఓ సంఘటనే మా ఆశయాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రేరణ అయింది. ఆ రైతుకి రెండెకరాల పొలమున్నా నీళ్లు లేక సాగుచేయడంలేదు. భార్యాభర్తలిద్దరూ కూలికి వెళ్లేవారు. వాళ్లమ్మాయి మోహినికి ఇంటర్లో 80 శాతం మార్కులొచ్చాయి. పై చదువులు చదివించే స్తోమత లేక పెళ్లి సంబంధం మాట్లాడారు. వాళ్లు రెండులక్షలు కట్నం అడిగారనీ పొలం అమ్మేసి, మిగిలిన డబ్బు అప్పుతెచ్చి పెళ్లిచేయాలనీ అమ్మానాన్నా మాట్లాడుకోవడం ఆ అమ్మాయి వింది. ఆ మర్నాడు ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోయాక ఒక ఉత్తరం రాసిపెట్టి ఉరేసుకుంది. మోహిని రాసిన ఉత్తరాన్ని రోజుకు ఎన్నిసార్లు చదివేవాళ్లమో. చదివిన ప్రతిసారీ కన్నీళ్లు కట్టలు తెంచుకునేవి. ‘నా అంతిమసంస్కారానికి డబ్బు వృథా చేయకుండా తమ్ముడికీ చెల్లెలికీ ఫీజులు కట్టి చదివించు నాన్నా’ అని రాసింది. ఆ మాటల వెనుక ఎంత వేదన ఉందో ఆ అమ్మానాన్నలకీ ఊరివాళ్లకీ తెలుసు. మోహినిలా మరో చిన్నారి మొగ్గగానే రాలిపోకూడదని వెంటనే మా ఆలోచనలకు ఆచరణరూపమివ్వడం మొదలెట్టాం.

* రైతుల కోసం చేపట్టిన క్రౌడ్‌ఫండింగ్‌ ప్రాజెక్టుని తాత్కాలికంగా ఆపి ‘వర్ధన’ అని పిల్లల చదువులకు సాయం చేసే ప్రాజెక్టును ప్రారంభించాం. ఎందుకంటే పిల్లల చదువు ఒకసారి ఆగిపోతే ఆ కుటుంబం కష్టాల్లోంచి గట్టెక్కేందుకు ఉన్న ఏకైక మార్గమూ మూసుకుపోతుంది. ఇప్పుడు వర్ధన పథకం కింద పేదరికం కారణంగా చదువు ఆపేసిన 400మందికి పైగా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన పిల్లలు చదువు కొనసాగిస్తున్నారు. ఈ ప్రాజెక్టు గాడినపడి పిల్లలు బడికి వెళ్లడం చూశాక మాకు మళ్లీ ధైర్యం వచ్చింది. అప్పటివరకూ వరసగా అన్నీ కష్టాలే చూస్తూ రావడంతో అసలు మేము ఏమైనా చేయగలమా అనుకుంటున్న సమయంలో ‘వర్ధన’ మామీద మాకు నమ్మకాన్ని పెంచింది. ఆ ఉత్సాహంతో వరసగా కొన్ని కార్యక్రమాలు చేపట్టాం.


* ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో మలేరియా, టీబీ ఎక్కువ. ఎక్కడో టౌన్‌లో ఉన్న ఆస్పత్రికి వెళ్లటానికి రవాణా సాధనాలు లేక గిరిజనులు జ్వరం ముదిరేవరకూ వెళ్లేవారు కాదు. నాటువైద్యంతో సరిపెట్టుకోవడంతో ప్రాణం మీదికి వచ్చేది. దాని గురించి ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా- సమీపంలోనే సునీత, రామచంద్ర అని ఇద్దరు డాక్టర్లు తమకున్న పరిమిత వనరులతోనే రేయింబగళ్లు సేవలందిస్తున్నట్లు తెలిసింది. వారితో మాట్లాడితే ఎక్కువ మందికి వైద్య పరీక్షలు చేయడానికి అవసరమైన
వనరులు తమ దగ్గర లేవని నిస్సహాయత వ్యక్తంచేశారు. మేము నిధులు సేకరించి వైద్యపరికరాలు కొనివ్వడంతో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్నీ, నలుగురు సహాయకుల్నీ
ఏర్పాటుచేశాం. ఇప్పుడు ప్రతి గిరిజన గ్రామానికీ 15రోజులకోసారి ఆ డాక్టర్లే వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఏడాదిన్నరలోనే అక్కడ మలేరియా మరణాలు తగ్గుముఖం పట్టాయి.
* ఒడిశాలోని బోండా గిరిజనులు ఇప్పటికీ బయట సమాజాలతో కలవరు. అడవుల్లోనే ఉంటూ వంటకు పూర్తిగా కలపే వాడుతుండడంతో అడవుల నరికివేత తీవ్రమవుతోంది. వారి దగ్గర కొన్నాళ్లుండి బయోగ్యాస్‌ గురించి వారికి నేర్పించి ఒక ప్లాంట్‌ ఏర్పాటుచేశాం. మిగతా గ్రామాలకూ ఆ పథకాన్ని విస్తరించాలి.
* బెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాల జిల్లాలో స్వరూప్‌నగర్‌ అనే ఊరికి వెళ్లాం. అక్కడ భూగర్భజలాల్లో ఆర్సెనిక్‌ ఎక్కువగా ఉండడంతో ప్రజల్ని తీవ్ర అనారోగ్యాలు వేధిస్తున్నాయి. స్థానిక ఎన్జీవో ఏర్పాటుచేసిన నీటి శుద్ధి ప్లాంటు సామర్థ్యం సరిపోకపోవడంతో మరో పెద్ద ప్లాంటు ఏర్పాటుచేశాం. అది రోజుకు 16వేల లీటర్ల నీటిని శుద్ధిచేసి నాలుగు వేలమంది తాగునీటి అవసరాలు తీరుస్తోంది.
* కొన్నిచోట్ల పనికన్నా ముఖ్యంగా అక్కడివారిలో చైతన్యం తేవడం అవసరమనిపించింది. మహారాష్ట్రలోని మాస్రుది అనే ఊళ్లో జరిగిన సంఘటన మాకు ఆ అవసరాన్ని గుర్తుచేసింది. సర్పంచూ కాంట్రాక్టరూ బ్యాంకు మేనేజరూ కుమ్మక్కై గ్రామస్థుల్ని మోసం చేసి ఉపాధి హామీపథకం నిధుల్నీ రేషను సామగ్రినీ పక్కదారి పట్టించేవారు. కొద్దిరోజులు అక్కడ ఉండి జరుగుతున్న మోసాల గురించి అర్థమయ్యేలా వివరించడంతో ఊరివారందరూ ఒక్కటయ్యారు. ప్రశ్నించడం నేర్చుకున్నారు. రేషన్‌ కార్డులూ ఆధార్‌ కార్డులూ తీసుకున్నారు. ఇలాంటి సంఘటనే అసోంలోనూ జరిగింది.
దిమాహసావొ జిల్లాలో ఖర్తాంగ్‌ గిరిజనులు అల్లం పండిస్తారు. దాన్ని రైతుల దగ్గర కిలో రూ.8కి కొని దళారులు 50, 60 రూపాయలకు అమ్ముకునేవారు. పదిరోజుల్లోనే మాకు పరిస్థితి అర్థమై రైతులందరినీ ఒక్కచోట చేర్చి సంఘాన్ని ఏర్పాటుచేశాం. పంటని అందరూ ఒకే రేటుకి సంఘం ద్వారానే అమ్మమన్నాం. కిలోకి రూ.40 తగ్గకుండా రావడం చూసి రైతులు చేతులెత్తి దండంపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల రైతుల్లోనూ చైతన్యం తెచ్చారు. 80 మందితో మేం సంఘాన్ని మొదలుపెడితే ఇప్పుడు దానిద్వారా 4వేల మంది లబ్ధిపొందుతున్నారు.

ప్రేమను గెలుచుకున్నాం!
ఈ ప్రయాణంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని మేము సమస్యల్లా కాక సహజమైన విషయాలుగానే చూశాం. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే పోలీసులకు తెలియజేయాలనే నియమం చాలా గిరిజనగ్రామాల్లో ఉంది. అందుకని ఒక్కోసారి గుచ్చిగుచ్చి ప్రశ్నించేవారు. సమస్యలను వెలుగులోకి తెస్తామని కొన్నిచోట్ల ప్రభుత్వ అధికారులకూ స్థానిక నాయకులకూ కోపం వచ్చేది. వాళ్లు నేరుగా మాతో మాట్లాడకుండా గ్రామస్థుల్లో మా పట్ల వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నించేవారు. కానీ మేము వాళ్ల ఇళ్లలో వాళ్ల మధ్యే ఉండడానికి ఇష్టపడటంతో గ్రామస్థులు మమ్మల్ని నమ్మి అక్కున చేర్చుకునేవారు. వారి ప్రేమే మమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపించింది. మా ప్రయాణాలూ చేపట్టిన ప్రాజెక్టుల గురించిన అన్ని వివరాలూ ‘రెస్ట్‌ఆఫ్‌మైఫ్యామిలీ.ఆర్గ్‌’లో ఉన్నాయి. ఆసక్తికలవారూ, ఏరకంగానైనా సాయం చేయాలనుకున్నవారూ అందులో చూడవచ్చు. జరుగుతున్న ప్రాజెక్టులన్నిటినీ సమన్వయం చేయడానికి మేం తరచూ ఆయా ఊళ్లకు మళ్లీ మళ్లీ వెళ్లాల్సివస్తుంది. ఆ పని మా ఇద్దరి వల్లా కావడంలేదు. అందుకని ఆఫీసు పెట్టి ఒకరిద్దరు సిబ్బందిని ఏర్పాటుచేద్దామని బెంగళూరు వచ్చాం. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాం. బెంగళూరులో పనులు పూర్తి కాగానే తదుపరి ప్రయాణం మొదలుపెడతాం.

 

*    *    *

మయన్మార్‌ సరిహద్దులోని థింగ్‌డోల్‌ గ్రామంలో ఖుమా అనే యువరైతు ఏ సంగీతవాద్యమైనా అద్భుతంగా వాయిస్తాడు. అలాంటిది  ఓ ప్రమాదంలో అతడి చేతి వేలు తెగిపోయింది. ఇక ఎప్పటికీ సంగీతం వాయించలేనని చాలా బాధపడ్డాడు. పీయూష్‌ అతడి వేలి ఫొటో, కొలతలూ తీసి యూఎస్‌లోని తన స్నేహితుడికి పంపితే కృత్రిమవేలు తయారుచేయించి పంపాడు. ఇప్పుడు అది తీసుకెళ్లి ఇచ్చి అతడి ముఖంలో వెలుగులు చూడాలి.

‘వర్ధన’ పథకం ద్వారా సాయం అందుకున్న తొలి విద్యార్థి గోపాల్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌కి వచ్చాడు. తర్వాత ఏం చేయాలనుకుంటున్నాడో ప్రాజెక్టు రిపోర్టు సిద్ధం చేసుకుని మాకోసం ఎదురుచూస్తున్నాడు.

అసోంలో రికార్డు చేసిన గిరిజనుల సంగీతం ఆల్బమ్‌ తయారైంది. అది తీసుకెళ్లి ఆయా తెగల పెద్దలకి వినిపించాలి.

ఆ తర్వాత మరికొన్ని కొత్త మజిలీలనూ మరికొందరు కొత్త బంధువులనూ వెతుక్కుంటూ వెళ్లబోయే మరో ప్రయాణానికి... ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం ఇద్దరమూ!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.