close

నారసింహుడి చెంత ఆంజనేయుడు!

రుద్రాంశ సంభూతుడిగా శైవులూ... రామకార్య దురంధరుడిగా వైష్ణవులూ కొలిచే విశిష్ట దైవం ఆంజనేయుడు. అవ్యక్త అప్రమేయ పరతత్వం ఇతడే అంటూ వాల్మీకి సైతం కీర్తించిన యుగపురుషుడు హనుమంతుడు. అంతటి జ్ఞానీ బలశాలీ బుద్ధిశాలీ అయిన వాయునందనుడు స్వయంభూగా వెలసిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని సింగరకొండ. కొండమీద లక్ష్మీనరసింహస్వామి, దిగువన ప్రసన్నాంజనేయస్వామి ఆలయాలు ఉండటంతో ఇది ఉభయదేవతా క్షేత్రంగా విరాజిల్లుతోంది.

దక్షిణాభిముఖంగా వెలుగొందుతున్న పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అద్దంకిలోని సింగరకొండలో కొలువైన ప్రసన్నాంజనేయ స్వామి దివ్యక్షేత్రం ఖ్యాతిపొందింది. ఇక్కడ వెలసిన అంజన్న భక్తులపాలిట కొంగుబంగారంగా, పిలిచిన పలికే దైవంగా పూజలందుకుంటున్నాడు. కొండమీది క్షేత్రాధిపతిగా లక్ష్మీనరసింహ స్వామీ, ఆలయానికి క్షేత్రపాలకుడిగా ప్రసన్నాంజనేయస్వామీ ఉన్న ఈ ఆలయానికి సుమారు ఆరువందల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు.
ఇదీ కథ పూర్వం ఈ ప్రాంతాన్ని దేవరాయల ప్రభువు పరిపాలించాడు. ఆ కాలంలోనే అద్దంకికి చెందిన తాతాచార్యుడనే నృసింహోపాసకుడు లక్ష్మీనరసింహ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు. సాలగ్రామ శిలతో మలిచిన స్వామి రూపానికి ఎడమ భాగాన లక్ష్మీదేవి ఆసీనురాలై దర్శనమిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే... ఒకరోజు ఆలయానికి ధ్వజారోహణ చేస్తున్నప్పుడు కొండ కింద సిందూర వర్ణంలో మెరిసిపోతున్న ఆంజనేయస్వామి విగ్రహానికి ఒక మహాపురుషుడు హారతి ఇస్తున్న దృశ్యం తాతాచార్యుడికి కనిపించిందట. దాంతో తాతాచార్యుడు కిందికి వెళ్లి చూడగా కేవలం విగ్రహం మాత్రమే ఉంది. దాంతో ఆ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామే తరలివచ్చాడని భావించి ఆ ప్రాంతంలోనే దక్షిణాభిముఖంగా ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని నిర్మించాడని ఆలయ స్థలపురాణం తెలియజేస్తోంది.

క్షేత్రపాలకుడు ఆంజనేయుడు
కొండమీద కొలువైన నారసింహుడికి రక్షణ కోసం స్వయంగా ఆంజనేయుడే ఇక్కడ స్వయంభూగా వెలిశాడని ప్రతీతి. ఈ క్షేత్రంలో పూజలందుకుంటున్న ఆంజనేయుడు సిందూర వర్ణంలో దర్శనమిస్తాడు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. సీతమ్మతల్లి ఎప్పుడూ నుదుటిమీద సిందూరాన్ని ధరించేదట. దీన్ని గమనించిన హనుమ అలా ఎందుకు చేస్తున్నావమ్మా అని అడగగా... శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడూ బాగుండాలని నుదుట సిందూరాన్ని పెట్టుకుంటున్నానని చెబుతుంది. దీంతో రాముడంటే అమితమైన భక్తిభావం ఉన్న అంజన్న వెంటనే ఒళ్లంతా సిందూరాన్ని పూసుకున్నాడట. అందుకే సిందూర వర్ణంలో ఉన్న స్వామి రూపాన్ని పూజిస్తే సకల శుభాలూ వెంటనే ఒనగూరుతాయని చెబుతారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లేదా నూతనంగా వస్తువాహనాలు కొనుగోలుచేసినా ముందుగా అంజన్నను దర్శించుకుని పూజలు చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఇక్కడి ఆంజనేయస్వామికి ఉదయం అభిషేకం, మధ్యాహ్నం నైవేద్యం, పంచహారతులూ, సాయంత్రం ప్రదోషకాలార్చనా జరుగుతాయి. ప్రతి మంగళ, శనివారాల్లో సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే పరివార దేవతలైన వినాయకుడూ, అమ్మవారూ, మహాశివుడూ కొలువై ఉన్నారు.

 


నారసింహుడి బ్రహ్మోత్సవాలు
లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో ఏటా పాల్గుణ శుద్ధ పూర్ణిమ రోజున స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. త్రయాహ్నిక దీక్షతో మూడురోజుల పాటు తిరునాళ్లు నిర్వహిస్తారు. తిరునాళ్ల చివరి రోజున లక్షల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవిస్తారు. ఇందులో భాగంగానే స్వామి వారికి తెప్పోత్సవాన్ని అంగరంగవైభవంగా జరుపుతారు. దూర ప్రాంతం నుంచి స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇలా చేరుకోవచ్చు...
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచీ నరసరావుపేట, ఒంగోలు పట్టణాలకు బస్సు సదుపాయం ఉంది. ఒంగోలు నుంచి అద్దంకి మీదుగా సింగరకొండకు బస్సులో వెళ్లొచ్చు. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు మార్గం మీదుగా సింగరకొండకు చేరుకోవచ్చు. రైలు మార్గంలో వెళ్లాలంటే... ఒంగోలు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చు.

- చీర్లవంచ హరీశ్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌
ఫొటోలు: ఎన్‌.చంద్రమౌళి

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.