close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మలి సంజె వేళలో...

-గోగినేని మణి

ఆలస్యం అయిపోయిందనుకుంటూ హడావుడిగా వంటగదిలోకి వెళ్ళబోతున్న రుక్మిణితో గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న ముకుందరావు ‘‘ముందు అటు పద...’’ అంటూ వీధి వరండా వైపు చేయి చూపించారు. ‘‘ఎందుకూ?’’ అని అడుగుతూనే ఆయన వెనుకే అడుగులు వేసింది.

అక్కడ టీపాయ్‌ మీద ఉన్న కాఫీ కప్పులను చూడగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కుర్చీలో కూర్చుని, ఆయన అందించిన కాఫీ కప్పునూ న్యూస్‌పేపర్‌నూ తీసుకుని, ఎదురుగా కూర్చున్న ఆయనతో ‘‘ఇదేమిటీ ఈరోజు ఇంత అద్భుతం జరిగిందీ..!’’ అంది. మళ్ళీ వెంటనే ‘‘మీరే పెట్టారా..? ఇందుకేనా... సాల్ట్‌కీ షుగర్‌కీ తేడా ఎలా తెలుస్తుందంటూ, నాకవసరంలేదని అంటున్నా, డబ్బాలన్నిటి మీదా స్టిక్కర్లు అంటించారూ?’’ అంది.
‘‘ముందు కాఫీ రుచి చూసి ఎలా ఉందో చెప్పు’’ చిరునవ్వుతో అన్నారు.
రుక్మిణి సరదాగా నవ్వింది. ‘‘రుచి చూడనక్కర్లేదు. ముందే చెప్పేస్తున్నా... బ్రహ్మాండమే! ఏది ఎక్కువ తక్కువైనా నాకేం ఫరవాలేదు. ఇలా మీ చేతినుండి కాఫీ అందుకోవటమే ఆనందం. ఈ కాఫీ రుచే ప్రత్యేకం’’ అంటూ భుజాలెగురవేసింది. ‘‘అవునూ, ఈ రోజు కొంచెం బద్ధకంగా ఉండి లేవలేకపోయాను. మునుపటిలా ఎదురు చూడకుండా మీరే కాఫీ పెట్టేశారు. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందీ?’’ ఆయనవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది.
చిరునవ్వే సమాధానం అయింది తప్ప ఆయనేం బదులు చెప్పలేదు. ఆయనకు మాత్రం మనసులో నుండి కూతురు మాటలు వినిపించాయి... ‘ఒంట్లో బాగాలేని రోజునో, బద్దకంగా ఉండి తొందరగా లేవలేకపోయిన రోజునయినా కాఫీ కలిపి భార్యకిద్దామన్న ఆలోచన మగవాళ్ళకెందుకు రాదూ... అలాంటి ప్రయత్నం చేయాలని అనుకోకపోవటమేగానీ, చేతకాకపోవటానికి అదేం బ్రహ్మవిద్య కాదుగా..!’
వార్తా విశేషాలు చెప్పుకుంటూ పేపరు చదువుతూ కాఫీ తాగటమూ పూర్తయ్యాక, తన వెనుకే వంటగదిలోకి వస్తున్న ముకుందరావుని రుక్మిణి ‘‘మీరెక్కడికీ?’’ అనడిగింది.

‘‘ఏం... వంటగది నీ ఒక్కదాని సామ్రాజ్యమేనా... నాకూ ప్రవేశం ఉంది. ఉద్యోగం పురుష లక్షణం అనే మాటని మీ ఆడవాళ్ళు చెరిపేసినప్పటి నుంచీ మగవాళ్ళకీ వంటగదిలోకి ప్రవేశించే హక్కు వచ్చేసిందిగా’’ నవ్వుతూ సరదాగా అన్నారు.‘‘మీకీ జ్ఞానోదయం ఎలా...ఎప్పుడు కలిగిందనేది నా ధర్మసందేహం?’’ ‘‘నేనొక్కడినే ముందుగదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తూనో, టీవీ చూస్తూనో ఒంటరిగా కాలక్షేపం చేసే బదులు ఇద్దరం కలిసి వంటగదిలో పని చూసుకుంటే తొందరగా అయిపోతుందిగా’’ అన్నారాయన.
‘‘అవునా, నిజమా?’’ అంటూ ఆవిడ ఆశ్చర్యం నటించింది.‘‘అది మాత్రమే కాదులే’’ అంటూ ఆయనా నవ్వేశారు.‘‘ఇంకా చెప్పాలంటే, ఆమధ్య ఒంట్లో బాగాలేక నువ్వు రెండు రోజులు లేవలేకపోతే హోటల్‌ భోజనమెందుకంటూ పక్కింటివాళ్ళు వంటచేసి పంపించారా... అలా కాకుండా నాకే కొంచెం వంట తెలిస్తే నేను చేసేవాడినే కదా! అలాగే నువ్వెక్కడికైనా వెళ్ళాల్సిన పనిబడినా వాళ్ళనీ వీళ్ళనీ సహాయమడగక్కర్లేకుండా కూరా చారూ అయినా చేసేట్లుగా నేర్చుకుందామనిపించింది.’’

‘‘అబ్బో’’ అంటూ కళ్ళెగరేస్తూ నవ్విందామె. ‘‘రిటైరై అప్పుడే ఆర్నెల్లు దాటింది కదా. ఇప్పుడు... ఇన్నాళ్ళకి ఇలా ఎందుకనిపించిందో నాకర్థం కావడంలేదు మరి’’ ఆయనవైపు ప్రశ్నార్థకంగా చూసింది.
బదులేం చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ఆయన చెవుల్లో మాత్రం మళ్ళీ కూతురి మాటలు గింగురుమన్నాయి... ‘వంట గది మగవాళ్ళకి నిషిద్ధ ప్రదేశమన్నట్లుగా గుమ్మం దగ్గరే నిలబడి ‘ఇంకా వంట కాలేదా?’ అని తొందరబెట్టే బదులు లోపలకు వచ్చి సాయంగా చేయి కలపొచ్చనే ఆలోచన మగవాళ్ళకి ఎందుకు రాదో నాకర్థం కాదు నాన్నా...’రుక్మిణి వంట చేస్తుంటే ముకుందరావు గమనిస్తూనే ఆవిడకి అన్నీ అందిస్తూ అన్ని పనులూ పూర్తయ్యేవరకూ సాయంగా ఉన్నారు.పనంతా పూర్తిచేసుకుని ముందు గదిలో ఇద్దరూ ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆయనో ప్రతిపాదన తీసుకువచ్చారు.

‘‘మునుపటిలా సాయంకాలాలు మన కాలక్షేపాలు విడివిడిగా కాకుండా కనీసం వారానికి మూడు నాలుగుసార్లయినా కలిసి సినిమాకో షికారుకో షాపింగ్‌కో వెళ్ళేలా ప్లాను చేసుకుందాం... ఏమంటావ్‌?’’ఆవిడ ముందుగా విస్తుపోయి, ఆ తర్వాత ఆనందంగా నవ్వుతూ ‘‘మీరింత మంచి నిర్ణయం తీసుకుంటే, అంతకన్నా నాకు కావాల్సిందేం ఉందీ’’ అని, ఒక్క క్షణం ఆగి మళ్ళీ అంది- ‘‘మీరు చెప్పటంలేదుగానీ, ఈ మార్పు వెనుక ఏదో కారణం ఉందనిపిస్తోంది.’’‘అవును, ఉంది. ఇదంతా మనమ్మాయి మాటల మహత్యం! అవే నన్ను నేను తరిచి చూసుకునేలాచేసి ఈ మార్పును తెచ్చిపెట్టాయి’ అని మనసులోనే అనుకున్నారాయన. ‘ఇంటి దగ్గర తన రాకకోసం ఎదురుచూసే భార్య గురించి ఆలోచించకుండా కొందరు మగవాళ్ళు బయటనే ఎక్కువసేపు కాలక్షేపం చేస్తారెందుకు నాన్నా..?’ కూతురి ప్రశ్న మళ్ళీ మనసుకు సూటిగా గుచ్చుకోగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయారు.

*              *            *

వారంరోజుల క్రితం ముకుందరావు ఒక స్నేహితుడి గృహప్రవేశానికి వెళ్ళి వస్తూ, దారి మధ్యలో కూతురువాళ్ళుండే ఊళ్ళో ఒకరోజు ఆగారు. కూతురు నందినికి సంవత్సరంన్నర క్రితం పెళ్ళయింది. నాలుగు నెలల క్రితమే బాబు పుట్టాడు. అల్లుడు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఊరికి చంటిపిల్లాడితో నెలరోజుల క్రితమే అమ్మాయి వేరు కాపురానికి వెళ్ళింది. కూతురింట్లో ఒకరోజు గడిపి వచ్చిన ముకుందరావు భార్య రుక్మిణితో ‘అంతా బాగానే ఉన్నారు’ అని క్లుప్తంగా చెప్పి ఊరుకున్నారుగానీ కూతురు మాటలూ అక్కడి సంగతులూ ఏవీ చెప్పలేదు. చిన్న విషయాలైనా ఎక్కువగా ఆలోచించి మనసు కష్టపెట్టుకుంటుందనే ఉద్దేశ్యంతోనే భార్యకు చెప్పటం అనవసరమనిపించిందాయనకు. అయితే ఆవిడకు తెలియజేయాల్సిన పరిస్థితి తొందరలోనే వచ్చింది. బంధువులింట్లో శుభకార్యానికి ఇద్దరూ వెళ్ళాల్సి వచ్చింది. ముందుగా కూతురింటికి వెళ్ళి అక్కడ రెండు రోజులుండి ఆ తర్వాత బంధువుల శుభకార్యానికి హాజరై, ఆ ఊరు నుంచే తమ ఊరికి తిరుగు ప్రయాణమవుదామని రుక్మిణి అంటే, ఆయనా సరేనన్నారు. కూతురు వాళ్ళుండే ఊరు నాలుగైదు గంటల రైలు ప్రయాణంలోనే ఉంది.

రైల్లో కూర్చున్న కాసేపటి తర్వాత ఆయన మాటల మధ్యలో ‘‘నేను కిందటిసారి అమ్మాయీ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు... గమనించిన ‘అల్లుడి వైఖరి’ గురించి నీకు చెప్పలేదు’’ అన్నారు.‘‘అంటే?’’ ఆవిడ ఆతృతగా అడిగింది.‘‘చిన్న విషయాలే. కంగారేం లేదు. అల్లుడు అంతా నా మాదిరే’’ అంటూ నిట్టూర్చారు.‘‘అబ్బా, వివరంగా చెబుదురూ...’’ చిరాకుపడింది.‘‘అదే... ఆఫీసు నుండి ఇంటికి వచ్చాక ఏ పనిలోనూ వేలు పెట్టకూడదనుకునే రకం అన్నమాట. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా తెలియదు. తనకి కావాల్సినవీ తను తీసుకోడు. అమ్మాయే ఎంత పని తొందరలో ఉన్నా అందివ్వాలి. కొంచెం ఆలస్యమైతే చిరాకు. చంటిపిల్లాడి పనులేవీ తన బాధ్యత కాదన్నట్లుగా ఉంటాడు. ముస్తాబు చేసి ఇస్తే కాసేపు ముచ్చట్లాడతాడు... అంతవరకే! పిల్లాడి పనులు చూసుకుంటూనే, అతనికి ఆఫీసు టైముకి క్యారియర్‌ సర్దాలని హడావుడి పడుతున్నప్పుడైనా, కొంచెంగానైనా సాయం చేద్దామనుకోకుండా ఖాళీగా కూర్చుని పేపరు తిరగేస్తుంటాడు. నేనూ అలాగే చేసేవాడిని కదా, అందుకే అల్లుడు నా టైపే అన్నాను.’’‘‘అవునా?’’ అంటూ ఆమె ఆశ్చర్యపోయింది.

‘‘అవును’’ అంటూ ఆయన తలూపారు. ‘‘నేనక్కడున్న రోజులో నేనూ అతని తీరును కొంత గమనించాను. అమ్మాయే అతని ధోరణిని తప్పుబడుతూ ఫిర్యాదు చేస్తుంటే, మనసులో బాధపడటంకంటే ఏం చేయగలనూ...’’ నిట్టూరుస్తూ అన్నారు.
రుక్మిణికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ‘‘మనింట్లో ఉన్నప్పుడు చంటిపిల్లాడి పనులన్నీ నేనే చేసేదాన్ని. ఇంకో రెండుమూడు నెలలు ఉండవే, నీకు కొంచెం తేలిగ్గా ఉంటుందని ఎంత చెప్పినా వినకుండా అతను రమ్మంటున్నాడంటూ వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళ ఆసరాలేని ఒంటరి కాపురాల్లో ఒకరికొకరు ఆసరాగా ఉండొద్దూ. పెళ్ళవక ముందు చిన్నపని అయినా చేసిన అలవాటు లేదు. చదువుకోవటం మాత్రమే తన పని అన్నట్లుగా పెరిగిందాయె.’’ ‘‘సర్లే, పిల్లలందరూ తల్లిదండ్రుల దగ్గర గారాబంగానే పెరుగుతారు. బాధ్యతలు మీద పడ్డాక పనులు చేసుకోవటం దానంతట
అదే అలవాటవుతుంది. నువ్వు కూడా అంతేకదా, ఒంటరిగానే ఇంటిపనులన్నీ చక్కబెట్టుకునేదానివిగా...’’

‘‘బావుంది. అప్పటి రోజుల్లో ఏ కొద్దిమందో ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఇక మాలాంటి వాళ్ళకి ఇంట్లో పనులు చేసుకోవటమే తప్ప వేరేగా పని ఏం ఉండేదీ? అందుకే మగవాళ్ళ సాయం అవసరమే అనిపించేది కాదు. ఈ రోజుల్లో అలా కాదుగా, అమ్మాయిలందరూ చక్కగా చదువుకుంటున్నారు. ఏ కొద్దిమందో తప్ప అందరూ ఉద్యోగాలూ వ్యాపారాలూ అంటూ తమకి నచ్చిన అన్ని రంగాల్లోనూ అడుగుపెడుతున్నారా... అలా ఇంటా బయటా సమర్థించుకుంటున్నవాళ్ళకి ఇంట్లోవాళ్ళ అండదండలుంటేనే సౌకర్యంగా ఉంటుంది. అలా కాకపోతే ఏం ఉందీ... ఇంట్లో నీడపట్టున ఉండి ఇంటిపని చేసుకోవటమే మంచిదనుకునే స్థితికి వచ్చేయరూ? అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుకు దూసుకెళ్ళిపోతున్నారని ముచ్చటపడుతుంటే, అల్లుడిలాంటివాళ్ళు వాళ్ళని మళ్ళీ వెనక్కిలాగుతున్నారు కాబోలు!

పిల్లాడికి రెండుమూడేళ్ళు నిండాక మనమ్మాయీ ఉద్యోగం చేయాలనుకుంటోంది... అల్లుడు ఇలా ఉంటే దానికి ఎంత ఇబ్బందీ! పనుల కోసం మనుషుల్ని పెట్టుకున్నా, సొంతంగా చేసుకోవాల్సిన పనులెన్ని ఉండవూ!’’ ఆవేశంతో ఏకధాటిగా మాట్లాడిన రుక్మిణి అక్కడితో ఆగి నిదానంగా ఊపిరి తీసుకుని నిట్టూర్చింది.

‘‘ఇదిగో నువ్విలా ఆవేశపడతావనే అప్పుడు నీతో అనలేదు. ఇప్పుడిక నీకెలాగూ తెలుస్తుంది కదాని చెప్పాను. అవునుగానీ, నువ్వు అక్కడ అల్లుడి ముందేమీ ఇలా మాట్లాడకు సుమా, బావుండదు. ఏవైనా పెద్ద సమస్యలైతేనే మనం జోక్యం చేసుకోవచ్చుగానీ, ఇలాంటి చిన్నచిన్న సమస్యల్ని వాళ్ళే చక్కదిద్దుకుంటారు. మన మాటలు ఏవైనా వాళ్ళమధ్య సామరస్యాన్ని పెంచేట్లుగా ఉండాలిగానీ సమస్యల్ని తెచ్చిపెట్టకూడదు కదా’’ అన్నారు. ‘‘బావుంది. అది నాకూ తెలుసులెండి. అమ్మాయికి పని ఒత్తిడి ఉందనిపిస్తే, ఏదో మనసుకు కష్టంగా ఉంటుంది. కొడుకునైతే చనువుకొద్దీ మందలించినట్లుగా ఏమైనా చెబుతానేమోగానీ, అల్లుడితో ఎందుకంటానూ’’ నిట్టూరుస్తూ అంది. ఒక క్షణం ఆగి ముకుందరావు ఆమెవైపు చూస్తూ ‘‘ఎంత ఉద్యోగం చేస్తుంటే మాత్రం- సెలవు రోజుల్లోనో, బంధువులు వచ్చినప్పుడో నీకు పని ఎక్కువగా ఉన్నప్పుడు నేనేమీ సాయం చేసేవాడిని కాదని నీకు అసంతృప్తిగా బాధగా ఉండేదా?’’ అనడిగారు. రుక్మిణి చిన్నగా నవ్వింది.

‘‘నచ్చిన విషయాలే ఎక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి చిన్నచిన్న విషయాలు లెక్కలోకి రావు. అప్పటికప్పుడు ఏదేదో అనుకుంటాం, వెంటనే మర్చిపోతాం... అంతే. ఎవరిలోనైనా అన్నీ మనకి నచ్చిన సుగుణాలే ఉండాలనుకోవటం అత్యాశే. మీకైనా అంతేగా. ఏవైనా పెద్ద విషయాలకి అయితే గొడవలు రావచ్చుగానీ చిన్నచిన్న పొరపాట్లకీ అలవాట్లకీ రాజీపడిపోతేనే సంసారాలు సవ్యంగా ఆనందంగా సాగుతాయి. అమ్మాయి విషయంలో అయినా అంతే. అల్లుడు తనని ప్రేమగా చూసుకుంటే చాలు, ఇలాంటి చిన్న విషయాల్ని వాళ్ళే సర్దుబాటు చేసుకుంటార్లెండి.’’
ఆ మాటలకు అతనూ స్థిమితపడి నిశ్చింతగా నిట్టూర్చారు.

*              *            *

వాళ్ళిద్దరూ కూతురు ఇంటికి చేరేసరికి సాయంకాలమయింది. మనవడిని ఎత్తుకుని ముచ్చట్లు చెప్పుకున్నాక, కూతురు నందిని తెచ్చిపెట్టిన ఫలహారాలు తింటూండగానే అల్లుడు రవీంద్ర ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు.కాసేపు అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నాక, నందిని టీ పెట్టి తీసుకువస్తానంటూ లేచింది. ‘‘పిల్లాడిని పట్టుకో, నేను పెడతాలే’’ అంటూ రుక్మిణి తన ఒడిలోని బాబుని నందినికి ఇవ్వబోతుంటే, రవీంద్ర ‘‘మీరుండే ఈ రెండురోజులూ మీ అమ్మాయితో కబుర్లు చెప్పుకుంటూ రెస్టు తీసుకోండి. నేను టీ చేసి తీసుకువస్తా’’ అంటూ వంటగదిలోకి వెళ్ళాడు. తల్లిదండ్రుల విస్మయాన్ని గమనించిన నందిని చిరునవ్వుతో ‘‘రవీంద్రకు టీ చేయటం వచ్చు. ఫరవాలేదు, బాగానే పెడతాడు. భయం లేకుండా తాగొచ్చు’’ అంది సరదాగా. అయిదారు నిమిషాలకే రవీంద్ర ఘుమఘుమలాడే ‘అల్లం టీ’ కప్పులతో వచ్చి, అందరికీ అందించి తనూ ఒకటి తీసుకుని కూర్చుని, టీ రుచి చూసిన అత్తామామల ప్రశంసనూ పొందాడు. అంతేకాకుండా ఆ రాత్రి వంట సమయంలోనూ, పిల్లాడి పనుల్లోనూ నందినికి రవీంద్ర సాయం చేస్తూ చురుగ్గా అటుఇటూ తిరుగుతూంటే, అత్తామామగార్లు కళ్ళప్పగించి చూస్తూ ఆశ్చర్యపోయారు. రాత్రిపూట అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్న సమయంలోనే పిల్లాడు నిద్రలో లేచి రాగం తీసేసరికి, ముందుగా రవీంద్రే చటుక్కున లేచి వెళ్ళి, వాడిని బుజ్జగిస్తూ కూర్చుని, నందిని భోజనం చేశాక వాడిని అప్పగించి అప్పుడు తన భోజనం పూర్తిచేశాడు.

ఆ మరునాడు ఉదయమూ అంతే. రవీంద్ర ఉదయమే లేచి తన పనులన్నీ ముగించుకుని ఆ తర్వాత పిల్లాడిని ఆడిస్తూనో, వంటపనిలో సాయం చేస్తూనో తిరుగుతూ టైమయ్యాక క్యారియర్‌ తీసుకుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.అతను వెళ్ళాక ముకుందరావే ముందుగా తన సందేహాన్ని బయటపెట్టాడు. ‘‘ఆమధ్య నేను ఇక్కడకు వచ్చినప్పటికీ ఇప్పటికీ అల్లుడిలో చాలా మార్పు కన్పిస్తోంది. అత్తగారి దగ్గర మంచి మార్కులు సంపాదించాలని నీకిలా సాయం చేస్తున్నాడా?’’ నందినిని అడిగాడు.‘‘కొత్తగా వచ్చిన మార్పేంకాదు, మొదటినుండీ రవీంద్ర పద్ధతి అంతే!’’ చిరునవ్వుతో చెప్పింది.‘‘నాకూ అయోమయంగా ఆశ్చర్యంగా ఉంది. విన్నదానికీ చూసినదానికీ చాలా తేడా కన్పిస్తోంది మరి’’ అంది రుక్మిణి. ముకుందరావు వెంటనే ‘‘నువ్వూ... అపుడు... అలానే చెప్పావు కదమ్మా’’ కొంచెం నసుగుతూ అన్నాడు.

‘‘అదీ...’’ అంటూ నందిని ఫక్కుమని నవ్వింది. ‘‘నాన్నా... మీరు నా చిన్నప్పుడు నాకో కథ చెప్పారు... గుర్తుందా?’’ అంటూ మొదలుపెట్టింది.‘‘ఒక తండ్రి మండుటెండలో పనిచేస్తున్న కొడుకుని ఇక పని చాలించి ఇంట్లోకి రమ్మని పిలిస్తే, అతను ఆ మాట లెక్కచేయకుండా పనిలోనే నిమగ్నమై ఉండిపోతాడు. అపుడా తండ్రి తన మనవడిని తీసుకువచ్చి ఎండలో నిలబెట్టి ‘ఆడుకోరా...’ అని చెప్పగానే ఆ కొడుకు చటుక్కున తన పిల్లాడిని ఎత్తుకుని లోపలకు తీసుకువచ్చి ‘అదేంటి నాన్నా... వాడు ఎండదెబ్బకి మాడిపోడూ..?’ అని చిరాకుపడతాడు. అపుడు తండ్రి ‘నువ్వు ఎండలో పనిచేస్తుంటే నాకెలా బాధగా ఉందో నీకు తెలియచెప్పాలనే ఇలా చేశా’నని చిరునవ్వుతో బదులిస్తాడు. ఇదీ ఆ కథ!’’‘‘ఇప్పుడెందుకు ఆ కథ చెప్పావే?’’ ఇద్దరూ ఒక్కసారే అడిగారు. నందిని చిన్నగా నవ్వింది. ‘‘అవసరం వచ్చినప్పుడైనా ఇంట్లో చిన్నచిన్న పనులు చేయగలిగేలా పని అలవాటు మగవాళ్ళకూ ఉండాలని అప్పుడప్పుడూ అమ్మ అనటం నేను విన్నాను. సీరియస్‌గా కాకుండా మామూలుగా నవ్వుతూ అనటంవల్లనో ఏమో గానీ, ఆ మాటల్ని నాన్న పట్టించుకునేవారు కాదు. ఎందుకనో నాకర్థం అయ్యేదికాదు. నాన్నని ప్రశ్నించే వయసు కాకపోవటం వల్ల మౌనంగా ఉండిపోయేదాన్ని.

మొన్నామధ్య నా ఫ్రెండ్‌ వాట్సాప్‌లో పంపించిన ఓ వీడియో చూశాను. అల్లుడు దర్జాగా ఖాళీగా కూర్చుంటే, కూతురొక్కతే ఇంటిపనితో సతమతమైపోవటాన్ని చూసిన తండ్రి విలవిలలాడిపోయి, తిరిగి తమ ఇంటికి వచ్చాక తన భార్యకీ ఇంటిపనిలో సాయం చేయటం మొదలుపెడతాడు.

అది చూశాక సరిగ్గా నాకప్పుడు నాన్న చెప్పిన కథ గుర్తుకువచ్చింది. దాంతో నాన్న క్రితంసారి మా ఇంటికి వచ్చినపుడు ఆ కథనే అనుసరించానన్నమాట. మునుపటి అమ్మ ఆలోచనలనే నావిగా రవీంద్ర మీద నెపంపెట్టి నాన్నకి చెప్పాను. రవీంద్రనీ అలా ఉండమని నేనే చెప్పాను. సరిగ్గా ఎలా జరుగుతుందని నేనూహించానో అలాగే జరగటం నాకూ ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. అమ్మతో మొన్ననే ఫోనులో మాట్లాడినపుడు ఈ విషయం నాకూ తెలిసింది.’’‘‘అసలు సంగతి నాకిపుడు అర్థం అయింది. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమ అలాగే ఉంటుందిలే. మొత్తానికి నువ్వు చెప్పాలనుకున్న విషయాన్ని మీ నాన్న మనసుకు పట్టేట్లుగా బాగా చెప్పావ్‌. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల విషయంలోనే కాదు, పిల్లల దగ్గర లేకుండా ఒంటరిగా ఉంటున్న పెద్దవాళ్ళూ ఒకరికొకరుగా అన్నింటిలోనూ తోడూ నీడగా ఉంటేనే మలి వయసు రోజులు మరింత ఆనందంగా గడుస్తాయి’’ అంటూ రుక్మిణి కూతురిని చూపులతోనే అభినందించేసింది.

నందిని తండ్రి వైపు కొంచెం బెరుకుగా చూసి ‘‘నాన్నా, మీ మనసు నాకు తెలుసుగా, మీరు మరోలా అనుకోరనే సరదాగా ఇలా చేశాను’’ అంది.అదేం ఫర్వాలేదన్నట్లుగా తలూపిన ముకుందరావు కూతురి వైపు ఆప్యాయంగా చూస్తూ ‘‘నా ఒడిలో కూర్చుని మాటలు నేర్చుకుని, నా వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేస్తూ ఎదిగిన కూతురు, నా పొరపాటును నేను నొచ్చుకోని విధంగా తెలియజెప్పిన తెలివితేటల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నానమ్మా’’ అన్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.