close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పేగుబంధం

- ఆకురాతి భాస్కర్‌ చంద్ర

నిశ్శబ్దం ముసురులా పట్టింది. నెలరోజులయింది ఆ ఇంట్లో మాటలు వినబడి. నడుస్తున్నప్పుడు కాలి అడుగులు చేసే సన్నని గుసగుసలాంటి శబ్దాలు తప్ప మరో చప్పుడు లేదు. పంపు విప్పినపుడు వచ్చే నీళ్ళ చప్పుడు, పనిమనిషి చేతిలోంచి ఏదైనా పాత్ర చేజారినప్పుడు వచ్చే చప్పుడు కూడా సునామీ ప్రభంజనంలా అనిపిస్తోంది వసుమతికి. నలభై ఏళ్ళు సహవాసం చేసిన మనిషి ఇప్పుడు లేడు. ఏ కష్టం వచ్చినా అతని ముఖాన చిరునవ్వు చెదరకుండా ఉండేది. ఇప్పుడూ అదే చిరునవ్వు- కాకపోతే ఫొటోలో. ఫొటోకి దండ వేయొద్దని తనే చెప్పింది. కోడలైతే విచిత్రంగా చూసింది. ఫొటోకి దండ వేస్తే అది పోయిన మనిషికి మనమిచ్చే గౌరవం కావచ్చుగానీ ఆ మనిషి మన మధ్యలో లేడని పూలదండ గుర్తుకుతెస్తుంది. అది వసుమతికి ఇష్టంలేదు. మనిషి ఇంట్లో ఉన్నట్టే ఉంది. బజారుకో ఆయనకు ఇష్టమైన సినిమాకో వెళ్ళినట్టుగానే అనిపిస్తోంది. తనకి ఎప్పుడూ అలాగే అనిపించాలి. అందుకే ఎవరేమనుకున్నా కర్మకాండల కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఫొటోకి ఉన్న దండ తీసేసింది. తనను చూసేందుకు వచ్చిన వాళ్ళెవరో తెచ్చిన పూతరేకులు ఆయన ఫొటో ముందు పెట్టి ఉంచింది. పూతరేకులంటే చాలా ఇష్టంగా తినేవాడు.
అంతా ఒక కలలాగా జరిగిపోయింది. అప్పటివరకూ మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు. మళ్ళీ లేవలేదు. అమెరికాలో ఉన్న కొడుకూ కోడలూ రావటానికి రెండు రోజులు పట్టింది. వాళ్ళు వచ్చిన రెండు మూడు గంటల్లోనే అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసేశారు. చెట్టంత మనిషి చెంబులో భస్మంలా మిగిలిపోయాడు. ఆ తర్వాత గోదావరిలో కలిసిపోయాడు. పుట్టిన ప్రతి మనిషికీ ఆఖరి ప్రయాణం తప్పదు. కాకపోతే వెనకా ముందూ... అంతే! సృష్టి రహస్యం అర్థంచేసుకున్న వసుమతికి ఇదంతా కాస్త బాధనిపించినా భరించక తప్పదని తెలుసుకుని మనసు గట్టిపరచుకుంది. పది రోజుల తర్వాత అర్జెంటు పనులంటూ అమెరికా కంపెనీనుంచి ఒకటే ఫోన్లు. వరదలా వచ్చేవి. కొన్ని రోజులు తప్పించుకున్నాడుగానీ చివరకు వెళ్ళకతప్పలేదు కొడుకు విశ్వమూర్తికి. భార్యనూ పిల్లవాణ్ణీ వదిలి తను మాత్రం తప్పదన్నట్లు తల్లిని వదల్లేక వదల్లేక ఎంతో దిగులుగా వెళ్ళాడు. అమ్మకు బెంగ తీరేవరకూ ఉండమని భార్య కిరణ్మయికి చెప్పి వెళ్ళాడు. విశ్వమూర్తి అమెరికా వెళ్ళిన అయిదో రోజునే కన్నవాళ్ళని చూసొస్తానని వెళ్ళిపోయింది కిరణ్మయి. మళ్ళీ ఒంటరిగా మిగిలింది వసుమతి. మనసులో ఎంత బాధ ఉన్నా- కొడుకు కోసమైనా తను మామూలుగా ఉండాలని నిశ్చయించుకుంది. మామూలు మనిషయ్యేందుకు పనిభారం పెంచుకుంది. ముఖ్యంగా వంటపని. అది కూడా మనవడి కోసం పిండివంటలు చేయటం. అమెరికా నుంచి వచ్చిన కొత్తలో వాడసలు తినేవాడు కాదు. ఇప్పుడు ఇక్కడి రుచులకు అలవాటుపడి వసుమతిని రకరకాల వంటలు చేసి పెట్టమని వెంటవెంట తిరుగుతున్నాడు.

మనవడు గుర్తుకురాగానే వసుమతికి చేయవలసిన పనులు గుర్తుకువచ్చాయి. అప్పటివరకూ ఏవేవో ఆలోచనలతో ఉన్న వసుమతి లేచి మొహం కడుక్కుని బజారు వెళ్ళేందుకు తయారయింది. తలుపు వేస్తుండగా లిఫ్ట్‌ నుంచి మనవడి గొంతు వినబడి ఆగిపోయింది. లిఫ్ట్‌ తెరుచుకోగానే పరుగు అందుకున్నాడు వాడు. వెనకే కోడలి గొంతు ‘‘నో విష్ణూ... డోన్ట్‌ రన్‌’’ అని అరిచింది. కోడలు చేతిలో రెండు బ్యాగులు చూడగానే గబగబా వెళ్ళి బ్యాగులు అందుకుంది వసుమతి.‘‘ఫర్వాలేదు అత్తయ్యా, నేను తెస్తాను’’ అంది కోడలు కిరణ్మయి. మాటైతే అందిగానీ సంచులు అత్తగారి చేతికి అందించింది. లిఫ్ట్‌ నుంచి పది అడుగుల దూరంలో ఫ్లాట్‌. వసుమతి బ్యాగ్స్‌ లోపల పెడుతూండగానే మనవడు విష్ణు మొదలుపెట్టేశాడు. ‘‘గ్రాండ్‌ మా, వేరార్‌ యూ గోయింగ్‌’’ అంటూ చేతులు ఊపేస్తూ అడిగాడు.
‘‘ఎక్కడికీ లేదురా, మీరు వస్తారని నాకు తెలీదుగా? డీమార్ట్‌ వరకూ వెళదామని’’ అంది వసుమతి.
‘‘ఉస్మాన్‌ రాలేదా అత్తయ్యా’’ అంది
కిరణ్మయి. ఉస్మాన్‌ అంటే కారు డ్రైవర్‌.
తల్లికీ భార్యకూ సాయంగా ఉండేందుకు
విశ్వమూర్తి పెట్టి వెళ్ళాడు.

‘‘లేదమ్మా, ఇవాళ ఆదివారం కదా...
పైగా మీరు కూడా లేరు. నాకు పెద్ద పనేమీ ఉండదని రావద్దని చెప్పాను.’’
‘‘ఇప్పుడంత అర్జెంటుగా కావాల్సిన సరుకులేంటి అత్తయ్యా, రేపు ఉస్మాన్‌ తెస్తాడు కదా. లేకపోతే ఫోన్‌ చేసి రమ్మంటాను’’ అంది కిరణ్మయి.
‘‘అక్కర్లేదమ్మా, ఇవాళ ఆదివారం కదా...ఇక్కడ లోకల్‌ మార్కెట్‌ ఉంటుంది. నాకూ కాస్త కాలక్షేపంగా ఉంటుందని బయల్దేరాను... అంతే.’’
‘‘గ్రాండ్‌ మా, ఐ యామ్‌ ఆల్సో కమింగ్‌’’ అని రెండుచేతులూ పట్టుకుని ఊపుతూ అన్నాడు విష్ణు.
‘‘నో విష్ణూ, కమ్‌ అండ్‌ స్లీప్‌’’ అంది కిరణ్మయి విసుగ్గా.

‘‘పోనీయమ్మా, తోడుగా ఉంటాడు. వాడికీ సరదాగా ఉంటుంది. నువ్వు కాస్త రెస్ట్‌ తీసుకో, పావుగంటలో వచ్చేస్తాం’’ అని మనవడిని తీసుకుని బయల్దేరింది వసుమతి. కిరణ్మయి అయిష్టంగానే మౌనంగా ఉండిపోయింది. మనవణ్ణి తీసుకుని వెళ్ళింది వసుమతి.
కిరణ్మయి బద్దకంగా సోఫాలో వాలింది. ఇంకా వారం గడవాలి. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అన్నట్టుగా ఉంది కిరణ్మయికి. నిజానికి అత్తగారింట్లో ఇన్నిరోజులు ఎప్పుడూ లేదు. అమెరికా నుంచి ఎప్పుడొచ్చినా రెండుమూడు రోజులుంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నగారికో అమ్మగారికో ఆరోగ్యం దెబ్బతింటుంది. అమ్మనో నాన్ననో చూసుకునేందుకు కిరణ్మయి వెళ్ళి ఇంకా నాలుగైదు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతారనగా అత్తగారింటికొస్తుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. అన్ని రోజులూ అమ్మతోనే ఉంటాడు విశ్వమూర్తి. అత్తగారింటికి వెళ్ళను కూడా వెళ్ళడు. మిత్రులతో తిరగటం అమ్మతో కబుర్లు చెప్పుకోవటమే సరిపోతుంది విశ్వమూర్తికి. అందువల్ల కూడా అత్తగారంటే ఎక్కడో కొంచెం దుగ్ధగా ఉంటుంది కిరణ్మయికి. మావగారు పోవటంతో ఇన్ని రోజులు ఉండక తప్పలేదు. నిజానికి విశ్వమూర్తి కూడా ఉండేవాడే... కంపెనీ ప్రాజెక్టులో ఏదో కీలకమైన పని కోసం వెళ్ళాల్సి వచ్చింది. తల్లిని కూడా అమెరికా వచ్చేయమని చాలా బలవంతం చేశాడు కూడా. అత్తగారు వినలేదు. తను ఇక్కడే ఉంటానని మొండిగా చెప్పింది. కిరణ్మయి రమ్మనిగానీ వద్దనిగానీ సూటిగా ఏ విషయమూ చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. ‘నువ్వు కూడా మా అమ్మకు చెప్పు’ అని విశ్వమూర్తి అడిగినప్పుడు ‘పెద్దవారు... ఆవిడకు ఏది అనుకూలంగా ఉంటే అదే చెయ్యనివ్వండి’ అని సున్నితంగా తప్పుకుంది.

వీడియోకాల్‌ ధ్వనికి ఉలిక్కిపడి ఛార్జింగ్‌ పెట్టిన మొబైల్‌ దగ్గరికి పరుగు తీసింది కిరణ్మయి. ఆన్‌ చేయగానే అవతల విశ్వమూర్తి. ఆఫీసు నుంచి అప్పుడే వచ్చినట్టుగా ఉన్నాడు. ముఖం నిండా అలసట. ‘‘హాయ్‌’’ అని, ‘‘ఇవాళ కూడా ఆఫీసుకు వెళ్ళారా?’’ అంది కిరణ్మయి.
విశ్వమూర్తి సన్నగా నవ్వాడు ‘‘విష్ణు ఏడీ?’’ అన్నాడు.‘‘మీ అమ్మగారితో కలిసి డీమార్ట్‌కు వెళ్ళాడు.’’‘‘అమ్మ వెళ్ళటం ఏమిటీ?’’ అన్నాడు విశ్వమూర్తి.
‘‘మీ అమ్మగారు ఉస్మాన్‌ని ఈరోజు రావద్దన్నారు. విష్ణుకి లోకల్‌ మార్కెట్‌ తనే దగ్గరుండి చూపిస్తానని తీసుకెళ్ళారు’’ అని తెలివిగా చెప్పింది.

విశ్వమూర్తి మౌనంగా ఉండిపోయాడు. అమ్మ ఎప్పుడూ అంతే, అన్నీ తనే చూసుకుంటుంది. నాన్న బతికున్నప్పుడు కూడా ఇంటి పనులన్నీ తనే చూసుకునేది. కరెంటు బిల్లూ, నెట్‌ బిల్లూ కట్టడానికి మాత్రమే నాన్న బయటికి వెళ్ళేవారు. ‘నలభైయేళ్ళు గవర్నమెంట్‌ సర్వీసు చేశాను. ఇక నేను విశ్రాంతి తీసుకోవాలి’ అని ఎప్పుడైనా నాన్న అంటే, ‘నాకూ వంట చేసీ చేసీ విసుగొచ్చింది. నేనూ విశ్రాంతి తీసుకుంటాను. హోటల్లో భోజనం చేయండి’ అని నవ్వేది. అమ్మకు భయమనేదే లేదు. ఎక్కడ ఎలాంటి పనైనా తనే ముందుండి చేసుకునేది. చిన్న వయసులోనే పెళ్ళికావటం, పెళ్ళయిన రెండో సంవత్సరంలోనే తను పుట్టటం వల్ల అమ్మ తనతో స్నేహితుడితో ఉన్నట్టుగా ఉంటుంది. పెత్తనం చేయటం, భయపెట్టటం అసలే చేసేది కాదు. స్కూలు నుంచి రాగానే హోమ్‌వర్క్‌ చేయించటం, తర్వాత తండ్రి వచ్చేంతవరకూ ఒళ్ళో పడుకోబెట్టుకుని రాముడి గురించో, కృష్ణుడి గురించో కథలు చెబుతూ నిద్రపుచ్చేది. స్కూలు పిల్లలకు చాక్లెట్లు పంచటం అంటే సరదా. ఏదో ఒక కారణంతో ప్రతినెలా పిల్లలకు చాక్లెట్లు పంచుతూ ఉండేది. తన స్కూల్లో అమ్మ తెలియని వాళ్ళెవరూ ఉండరు. మంచినీళ్ళు పోసే ఆయా నుంచి ప్రిన్సిపాల్‌ వరకూ అందర్నీ అమ్మ ఆప్యాయంగా పలకరించేది.‘‘అత్తయ్యగారు రాగానే ఫోన్‌ చేయిస్తాను’’ అంది కిరణ్మయి. ‘‘ఓకే. నేను డిన్నరయిన తర్వాత చేస్తాను’’ అని కట్‌ చేశాడు విశ్వమూర్తి.

*      *     *

‘‘శ్రీరాముని దయచేతను... నారూఢిగ సకల జనులు...’’ పద్యం హృద్యంగా పాడుతోంది వసుమతి. నాయనమ్మ ఒళ్ళో కూర్చుని ముద్దుముద్దుగా పలుకుతున్నాడు విష్ణు. అప్పుడే నిద్రలేచిన కిరణ్మయికి విసుగ్గా అనిపించింది.
‘‘విష్ణూ, బ్రష్‌ చేశావా?’’ అంది. ‘‘ఉహూ’’ అన్నాడు విష్ణు మారాం చేస్తూ.‘‘ఫస్ట్‌... బ్రష్‌ ది టీత్‌’’ అని వసుమతి ఒళ్ళో ఉన్న విష్ణుని భుజం పట్టుకుని లేపింది.‘‘నేను చేయిస్తానమ్మా’’ అంది వసుమతి. ‘‘వద్దత్తయ్యా, వీడు మీ మాట వినడు... మొండి.’’
‘‘పద్యం నేర్చుకుంటున్నాడుగా... చేస్తాడులే’’ అంది వసుమతి.

‘‘ఇప్పుడా నీతి పద్యాలు నేర్చుకుని ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి. వీడు స్కూలుకి వెళితే ఇంగ్లిష్‌ రైమ్స్‌ చదవాలి. సెలవుల్లో అవి చదువుకోరా అంటే...’’ రెక్క పుచ్చుకుని లాక్కువెళ్ళింది కిరణ్మయి.‘‘నేను పద్యం నేర్చుకుంటా’’ అని ఏడవటం మొదలుపెట్టాడు విష్ణు.
‘‘తెలుగు పద్యాలు నేర్చుకుని అడుక్కు తిందువుగాని’’ అని వీపు మీద ఒక్కటి వేసింది కిరణ్మయి కొడుకుని. వసుమతి మనసు చివుక్కుమంది. తెలుగు పద్యం నేర్చుకుంటే అడుక్కుతినవలసి వస్తుందని ఒక తెలుగుతల్లి తన కొడుక్కి చెబుతోంది. ‘పాలు తాగి రొమ్ము గుద్దటం అంటే ఇదేనేమో’ అనుకుంది వసుమతి. విష్ణు బాత్‌రూమ్‌లో ఏడుస్తూనే మొహం కడుగుతున్నాడు. అప్పుడప్పుడు కేకలు పెడుతున్నాడు. వసుమతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అదేరోజు సాయంత్రం విష్ణుని మళ్ళీ దెబ్బలు వేసింది కిరణ్మయి. ఈసారి విష్ణు బయటి
పిల్లలతో ఆటలాడుకుని మట్టికొట్టుకుపోయాడనే కారణం. ‘‘పిల్లలు ఆడుకోవాలమ్మా... అప్పుడే వాళ్ళు శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారు’’ అంది వసుమతి విష్ణుని తన దగ్గరగా లాక్కుంటూ. ‘‘ఇదిగోండి... వీడికోసం ఎన్ని గాడ్జెట్లు కొన్నానో చూశారా?’’ అని కుప్పగా పోసిన ఎలాక్ట్రానిక్‌ వస్తువులు చూపించింది కిరణ్మయి.

‘‘ఒంటరిగా ఉన్నపుడు వాటితో ఆడుకుంటారేమోకానీ ఎదురుగా పిల్లలు కనిపిస్తూ ఉంటే వాటితో ఆడుకోరు కిరణ్మయీ’’ అంది వసుమతి.‘‘మీకు తెలీదులెండి అత్తయ్యా, వీడు దుమ్ములో ఆడితే ఎలర్జీ వస్తోంది. బయటి పిల్లలకేం... వాళ్ళెలాగూ మట్టిలోనే పెరుగుతారు కాబట్టి వాళ్ళకేం కాదు. వీడి బాగోగులు చూసుకోవలసింది నేను’’ అంది విసుగ్గా. కిరణ్మయితో అంతకుమించి ఏమీ మాట్లాడాలనిపించలేదు. విష్ణుని భుజం మీద వేసుకుని కాసేపు ఆడించింది. చివరకు వసుమతి పొట్టమీద చేరి విష్ణు నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోయేముందు నాయనమ్మతో అన్నాడు విష్ణు ‘‘గ్రాండ్‌ మా, మమ్మీ ఈజ్‌ బ్యాడ్‌.’’
 

*      *     *

మరుసటిరోజే ప్రయాణం. వసుమతికి కంగారుగా ఉంది. ఇంకా చాలా పనులు మిగిలిపోయినట్లుగా అనిపిస్తోంది. అమెరికా నుంచి వీడియో కాల్‌ చేశాడు విశ్వమూర్తి. ఒంటరిగా ఉండకుండా తరచూ బంధువుల ఇళ్ళకు వెళ్ళమనీ లేదా వాళ్ళని ఇంటికి పిలవమనీ సలహా ఇచ్చాడు. సరేనంది వసుమతి. ప్రయాణం రోజుకి కొడుక్కి పంపవలసిన పిండివంటలు చేసేస్తే తను మళ్ళీ మామూలుగా పనులు చేసుకుంటున్నందుకు పిల్లాడు సంతోషిస్తాడు. విశ్వమూర్తికి ఏమేం పిండివంటలు చేయాలో చిన్న నోటు పుస్తకంలో రాసుకుని మరీ చేస్తోంది వసుమతి. విష్ణు ఒక్క క్షణం కూడా వసుమతిని విడవకుండా ఉంటున్నాడు. ప్రతి పిండివంటనూ వాడే ముందుగా రుచి చూసి బావుందో లేదో చెబుతున్నాడు. మనవడి ఉత్సాహానికి వసుమతి మురిసిపోతుంటే చిరాకుతో కుతకుతలాడిపోతోంది కిరణ్మయి.
ప్రయాణంరోజు రానే వచ్చింది. సామానులో పిండి వంటలన్నీ దగ్గరుండి మరీ సర్దించుకున్నాడు విష్ణు. ‘‘నీకంతగా నచ్చినయ్యా పిండివంటలు?’’ అని వసుమతి అడిగితే, ‘‘అవును. నేను డాడీకి ఒక్కటి కూడా ఇవ్వకుండా తినేస్తాను’’ అని నాయనమ్మను ఉడికించాడు విష్ణు.
వసుమతి నవ్వుకుంది. కారు బయల్దేరుతుంటే శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. ఆత్మ వదిలివెళ్ళిన శరీరం చల్లబడుతుంది. ఆత్మీయులు వదిలివెళ్ళిన శరీరం కుంగిపోతుంది.

*      *     *

ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నాక వసుమతికి ఫోన్‌చేసి చెప్పింది కిరణ్మయి. ‘‘ఇంటికి చేరుకున్నాక ఒక్కసారి చేయమ్మా’’ అంది వసుమతి. చెక్‌ఇన్‌లో లగేజ్‌ పెరిగిందని చెప్పాడు అధికారి. లగేజ్‌ తగ్గించుకోమని సలహా ఇచ్చాడు. లేకపోతే 120 డాలర్లు కట్టమని చెప్పాడు. అంటే దాదాపు ఎనిమిదివేల రూపాయలు. ఒక్కసారిగా నిట్టూర్చింది కిరణ్మయి. తను అప్పటికీ జాగ్రత్తగానే చూసుకుంది. సూట్‌కేసులు పక్కన పెట్టుకుని లగేజ్‌ తగ్గించే మార్గం ఏమిటా అని ఆలోచిస్తోంది. ఒక్కొక్కటీ తీసి పక్కన పెడుతోంది. అన్నీ తనకు కావలసినవే అనిపిస్తోంది. ఇంతలో సూట్‌కేసులో కనిపించాయి. అవన్నీ అత్తగారు తయారుచేసిన పిండివంటలు. అరిసెలూ కజ్జికాయలూ చలిమిడీ...ఏంటో చాదస్తపు మనిషి... ఇవన్నీ కొడుక్కి ఇష్టమట. ఇప్పుడు అమెరికాలో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయి. మోతబరువు తప్ప ఇంకే రకంగానూ లాభంలేదు. ఆ ప్యాకెట్లన్నీ తీసి పక్కనపెట్టింది కిరణ్మయి. అవన్నీ తీసి పక్కన పెడుతుంటే విష్ణు గొడవ చేశాడు. విష్ణు వీపుమీద ఒక్కటి చరిచి ఆ ప్యాకెట్లన్నీ డస్ట్‌బిన్‌లో వేసేసి సూట్‌కేసులు మూసేసింది. చెక్‌ఇన్‌ పూర్తిచేసుకుని బోర్డింగ్‌ పాస్‌ తీసుకుని ఊపిరి పీల్చుకుంది కిరణ్మయి. మరో గంటలో అమెరికా విమానం గాల్లోకి లేచింది.

*      *     *

విశ్వమూర్తి ఆఫీసు నుంచి వచ్చేసరికి కిరణ్మయి సూట్‌కేసులు విప్పి బట్టలన్నీ బీరువాల్లో సర్దుతోంది.‘‘ఈరోజుకి రెస్ట్‌ తీసుకోకపోయావా, అంత అర్జెంటేముంది?’’ అన్నాడు విశ్వమూర్తి. ‘‘పనైపోతుందని అంతే... పనికి అడ్డం పడిపోతూ ఉంటాయి సూట్‌కేసులు.’’
‘‘విష్ణు ఇంకా లేవలేదూ?’’ ‘‘జెట్‌లాగ్‌... నిద్రపోతూనే ఉన్నాడు.’’‘‘అమ్మ ఎలా ఉంది?’’ ‘‘మీరు రోజూ వీడియోకాల్‌ చేస్తున్నారుగా?’’‘‘కెమెరా చూపించేది అంతా నిజంకాదు.’’‘‘ఫర్వాలేదులెండి. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. తన పనులు తాను
చేసుకుంటున్నారు.’’ ‘‘విష్ణు బాగా అలవాటుపడినట్టున్నాడు.’’ కిరణ్మయి ఏం మాట్లాడలేదు. ‘‘అయినా వాడు అమెరికన్‌ బోర్న్‌. ఇండియాలో ఉండాలంటే ప్రొసీజర్లు ఫాలో అవ్వాలి.’’
‘‘వాడిని అక్కడికి పంపించే ఆలోచన లేదు. కానీ అమ్మ ఇక్కడకు వచ్చేస్తే బావుండేది. అమ్మకూ తోచుబడిగా ఉండేది’’విశ్వమూర్తిలో తల్లి రాలేదనో, తను తీసుకురాలేకపోయాననో బెంగ ఉండిపోయింది.‘‘కొన్నాళ్ళుపోతే వస్తారేమోలెండి.’’
ఇంతలో విష్ణు లేచి వచ్చి విశ్వమూర్తి మెడను కౌగిలించుకున్నాడు ‘‘డాడీ’’ అంటూ. ‘‘హాయ్‌ విష్ణూ, హౌ ఈజ్‌ ఇండియా?’’ ‘‘నైస్‌. నాకైతే గ్రాండ్‌ మా చాలా నచ్చింది.’’
‘‘మరి, గ్రాండ్‌ మాని నీతో రమ్మని చెప్పకపోయావా?’’

‘‘చెప్పాను. కానీ గ్రాండ్‌ మా తర్వాత వస్తానని చెప్పింది. డాడ్‌... గ్రాండ్‌ మా ఇక్కడికి రాగానే నాకు స్వీట్లు చేసి పెడుతుంది. ఇండియాలో కూడా బోల్డన్ని చేసిపెట్టింది. నీకోసం కూడా...’’ అంటూ టక్కున నోరు మూసుకుని తల్లివైపు చూశాడు.కిరణ్మయి విష్ణువైపే కొరకొరా చూస్తూ ఉంది- వాడు ఏం చెబుతాడోనని. తాను ఎయిర్‌పోర్ట్‌లో పిండివంటలు పారేసిన సంగతి డాడీకి చెప్పకూడదని ఫ్లయిట్లో చాలాసార్లు వార్నింగ్‌ ఇచ్చింది. అయినా, ‘వాడు చెప్పకుండా ఉంటాడనేముంది? చిన్నపిల్లాడు... తనే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి’ అనుకుంది.
విశ్వమూర్తికి అంతా అర్థమైంది. తల్లికి వీడియోకాల్‌ చేశాడు. అవతల వసుమతి కనిపించింది. ‘‘బాబూ, వీళ్ళు క్షేమంగా చేరిపోయారా?’’ అంది. కిరణ్మయి వెంటనే కెమెరా ముందుకొచ్చి చేతులూపింది. ‘‘క్షేమంగానే చేరిపోయాం అత్తయ్యగారూ’’ అంది. తర్వాత విష్ణు
చేతులూపి ‘‘హాయ్‌, గ్రాండ్‌ మా’’ అన్నాడు. వసుమతి కెమెరాలోనే మనవడికి ముద్దుపెట్టింది. ‘‘నువ్వు కూడా వస్తే బాగుండేది కదమ్మా’’ అన్నాడు విశ్వమూర్తి. ‘‘వస్తాలేరా, తొందరేముంది... వస్తాను.’’ ‘‘అమ్మా, నువ్వు పంపిన అరిసెలూ
కజ్జికాయలూ సున్నుండలూ ఇప్పుడే రుచి చూశాను. చాలా బావున్నాయమ్మా. నాకిష్టమని అరిసెల చలిమిడి కూడా పంపావు కదా... చాలా స్వీటుగా ఉంది. అసలు రుచి మారలేదమ్మా. నా చిన్నప్పుడు ఎలా చేశావో ఇప్పటికీ అదే రుచితో చేశావు. సున్నుండలయితే సూపర్‌... నెయ్యి ఇంట్లో నువ్వు తయారుచేసిందే వాడినట్టున్నావ్‌, మాంచి ఘుమాయిస్తుందనుకో. చిన్నప్పుడైతే అరడజను లాగించేవాణ్ణే కానీ, ఇప్పుడు పొట్ట వచ్చేస్తుందని భయం వేసింది. ఒకటే తిన్నాను. కజ్జికాయల్లో కొబ్బరిపొడి అదిరిపోయిందనుకో... యాలకుల వాసన ఇంకా నా చేతికి అలాగే ఉంది. విష్ణుగాడికి కజ్జికాయలు బాగా నచ్చేసినయ్‌. నువ్వు లోపలపెట్టిన కొబ్బరిపొడీ శనగపొడీ లోపలికి ఎలా వెళ్ళాయో చెప్పమంటున్నాడు. నువ్వు అమెరికా రాగానే నీ పక్కనే కూర్చుని ఇవన్నీ మళ్ళీ చేయించుకుంటాడట. నాకు ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టకుండా నువ్వు చేసినవన్నీ తనే తినేస్తాడట’’ అని ఫక్కున నవ్వాడు. వసుమతి కూడా నవ్వింది.

కిచెన్‌లోంచి అంతా వింటున్న కిరణ్మయి మొద్దుబారిపోయి నిలుచుండిపోయింది. అత్తగారు తనకు ఏమేమి తినుబండారాలు ఇచ్చిందో అవన్నీ రుచి చూసినట్టుగానే చెబుతున్నాడు భర్త.విష్ణుకి ఏమీ అర్థంకావటం లేదు. తల్లి ఎయిర్‌పోర్ట్‌లో పారేసిన తినుబండారాల రుచులన్నీ తన తండ్రి నాయనమ్మకు ఎలా చెప్పగలుగుతున్నాడు? అన్నీ తిన్నట్టే చెబుతున్నాడు. విశ్వమూర్తి ఇంకా తల్లితో గలగలా మాట్లాడుతూనే ఉన్నాడు. తన ఇష్టాయిష్టాలు తెలిసిన తల్లి తనకోసం ఏమేం పంపి ఉంటుందో వాటిని భార్య ఏం చేసి ఉంటుందో తను ఊహించగలడు. అయినా ఒక అబద్దం తన తల్లిని సంతోషంతో ఉంచుతుందని అతనికి తెలుసు. తన కంట్లోంచి ఏకధారగా జాలువారుతున్న నీటి బిందువులు కనబడకుండా ఉండేందుకు కెమెరాకు కాస్త దూరంగా జరిగాడు విశ్వమూర్తి. తను దేశానికి నాన్‌ రెసిడెంట్‌ కావచ్చు కానీ తన తల్లి హృదయంలో
ఎప్పటికీ రెసిడెంటే..!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.