close

ఇందులో ఉంటే పాడవ్వవు

ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా వంటకాలు కొద్ది రోజులకు పాడవుతూనే ఉంటాయి. మనవేమో హడావుడి జీవితాలు...వెంటనే చూసుకోం. దీనికి పరిష్కారంగా పదార్థాలూ పండ్లూ పిండీ పప్పుల్లాంటి వాటిని మరిన్ని రోజులు తాజాగా ఉంచేందుకు మార్కెట్లోకి వచ్చిందే ‘సిలో వ్యాక్యూమ్‌ సీలింగ్‌ కంటెయినర్‌ సిస్టం’. దీన్లో భాగంగా చిన్న మెషీన్‌తోపాటు ట్రిటాన్‌ టీఎమ్‌ ప్లాస్టిక్‌ డబ్బాలు వస్తాయి. ఈ డబ్బాల్లో తినేవాటిని వేసి, మూతపెట్టి డబ్బాను మెషీన్‌ మీద పెట్టి నొక్కితే చాలు. వ్యాక్యూమ్‌ టెక్నాలజీతో డబ్బా కిందున్న అతిసన్నటి రంద్రాల ద్వారా లోపలున్న గాలి మొత్తాన్నీ మెషీన్‌ లాగేసుకుంటుంది. అలా డబ్బా ఎయిర్‌ టైట్‌ అవడం వల్ల అందులో ఉండేవి ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. అన్నట్లూ ఒకవేళ పదార్థాలు పాడయ్యే సమయం వస్తుందంటే డబ్బానే ఆప్‌ద్వారా మన ఫోన్‌కి మెసేజ్‌ పంపేస్తుంది.

చెత్తడబ్బాతో ఎరువు తయారీ!

కూరగాయలూ పండ్ల తొక్కలూ మిగిలి పోయిన అన్నం కూరలూ... ఇలా వంట గదిలో రోజూ పోగయ్యే వ్యర్థాలు చాలానే ఉంటాయి. నిజానికి వాటన్నిటినీ మట్టిలో వేసి, తరచూ కలుపుతుంటే కొన్ని రోజులకు మంచి సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఇది మొక్కలక్కూడా చాలా మంచిది.  కానీ మనకు అంత తీరిక ఉండదు. ఒకవేళ తీరిక దొరికినా అందరికీ సేంద్రియ ఎరువు తయారు చెయ్యడం కుదరదు కూడా. కానీ కరెంటుతో పనిచేసే ఈ ‘జెరా ఫుడ్‌ రీసైక్లర్‌’ చెత్తబుట్ట ఇంట్లో ఉంటే మన ప్రమేయం లేకుండానే బయో వ్యర్థాలు ఒక్క రోజులో ఎరువుగా తయారైపోతాయి. అందుకోసం రోజూ వంటగదిలో పోగయ్యే వ్యర్థాలను దీన్లో వేస్తే చాలు. వారానికి అది నిండాక బటన్‌ ఆన్‌ చేస్తే తెల్లారేసరికి చెత్తంతా ఎరువుగా మారిపోయి కిందున్న డబ్బాలోకి వచ్చేస్తుంది. దాన్ని తీసుకెళ్లి ఎంచక్కా మొక్కలకు వేసేసుకోవచ్చు.

ఈ గాజు అమ్మకోసం!

చూడ్డానికి ఈ గాజులు మామూలు లక్క, మట్టి గాజుల్లానే ఉంటాయి. కానీ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం ఎన్నో సలహాలిస్తుంటాయి. ఇవి స్మార్ట్‌ బ్యాంగిల్స్‌(కోయల్‌) మరి. బంగ్లాదేశ్‌కి చెందిన గ్రామీణ్‌ ట్రస్ట్‌ స్వచ్చంద సంస్థ ఇంటెల్‌ కార్పొరేషన్‌తో కలసి ఈ గాజుల్ని రూపొందించింది. కోయల్‌ గాజులు పది నెలల పాటు ఛార్జింగ్‌ అవసరం లేకుండా పనిచేస్తాయి. గర్భవతులు విపరీతమైన కాలుష్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినపుడు వీటిలోని సెన్సర్లు గుర్తించి ‘బిడ్డకు మంచిది కాదు’ అంటూ వాయిస్‌ మెసేజ్‌ను వినిపిస్తాయి. పల్లెల్లో కట్టెల పొయ్యి వాడకం కూడా ఎక్కువే. దాన్నుంచి వచ్చే పొగలో కార్బన్‌మోనాక్సైడ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలోనూ కోయల్‌ గాజు వాయిస్‌ మెసేజ్‌ ద్వారా వారిస్తుంది. ఇంటర్నెట్‌ లేకుండా పనిచేసే ఈ గాజులు మొదటి నెల నుంచీ పదో నెల వరకూ వరసగా వారానికి రెండుసార్లు ఏమేం ఆహారం తీసుకోవాలి... ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి... డాక్టరు చెకప్‌కీ స్కానింగ్‌కీ ఎప్పుడు వెళ్లాలీ... లాంటి విషయాలను వెల్లడిస్తాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకోసం తయారుచేసిన కోయల్‌ గాజుల్ని బంగ్లాదేశ్‌తో పాటు భారత్‌లోనూ అమ్ముతున్నారు.

హార్లీడేవిడ్సన్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌!

ఎన్ని కొత్త రకాల బైక్‌లు వచ్చినా హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ మీద ఉండే మోజే వేరు. ఆ బండి ఎక్కితే చాలు భలే కిక్‌ వస్తుందంటుంది యూత్‌. నడివయసువాళ్లూ దీన్ని నడపడాన్ని గొప్పగా ఫీలవుతారు. అయితే, రాబోయే రోజుల్లో అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలదే హవా. అందులో భాగంగానే హార్లీడేవిడ్సన్‌ 2019 చివరినాటికి ‘ద లైవ్‌ వైర్‌’ పేరుతో ఎలక్ట్రిక్‌ బైక్‌ని మార్కెట్లోకి తీసుకురాబోతుంది. పర్యావరణ ప్రియమైన ఈ బైక్‌ను క్లచ్‌లూ గేర్లతో పనిలేకుండా యాక్సెలరేటర్‌తోనే సులభంగా స్టార్ట్‌ చేసుకోవచ్చు. అందుకే, దీన్ని నడపడం మరింత సులభం అట. ఇక, ఇప్పుడున్న బైక్‌ల కన్నా చాలా అల్ట్రామోడ్రన్‌గా ఉండే ఈ హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ని చూస్తే అబ్బాయిలు మనసు పారేసుకోవడం ఖాయం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.