close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్లీజ్‌... తిట్టకండి!

 

స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు... ఎవరయినా గానీ కౌమారదశలో ఉన్న పిల్లల్ని పదే పదే తిట్టడం, అవమానించడం, హేళన చేయడం చేస్తే వాళ్లు భవిష్యత్తులో అనేక మానసిక సమస్యల్ని ఎదుర్కోవలసి వస్తుందని చెబుతున్నారు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌కి చెందిన పరిశోధకులు. ముఖ్యంగా ఇటీవల కొంతమంది పిల్లలు సోషల్‌ మీడియా కారణంగా అనేక అవమానాల బారిన పడటం బాగా పెరిగింది. అంతేకాదు, పోటీ ప్రపంచంలో భాగంగా చదువులో ఇతరత్రా కార్యక్రమాల్లో వెనకబడిన పిల్లలు ఇంటా బయటా కూడా అనేక అవమానాలను ఎదుర్కొంటున్నారు. అలా హేళనకు గురవుతూ అవమానాల పాలయిన కొందరు పిల్లల మెదడు స్కాన్‌ చేసి పరిశీలించగా వాళ్లకీ, మామూలుగా ఉండే పిల్లల మెదడు కణజాలానికీ ఎంతో వ్యత్యాసం కనిపించిందట. పైగా వీళ్ల మెదడులో ఒత్తిడిని కలిగించే హార్మోన్లు ఎక్కువగా ఉన్నట్లు తేలిందట. దాంతో వాళ్లలో అధ్యయన శక్తి తగ్గిపోవడంతోబాటు శారీరకంగా కూడా తరచూ అనారోగ్యానికి గురవుతుంటారని తేలింది. కాబట్టి టీనేజీలోని పిల్లల్ని లాలనతోనూ ప్రేమతోనూ దారికి తెచ్చుకోవాలేకానీ తిట్టడం, హేళన చేయడం కూడదు అంటున్నారు విశ్లేషకులు.

టొమాటో రసం తాగుతున్నారా?

కూరల్లో చారుల్లో వేసుకునే టొమాటోల్లోని పోషకాలూ ఔషధాల గురించి తెలిసిందే. అయితే ఇది ఆరోగ్యానికే కాదు, అందానికీ తోడ్పడుతుంది. దీన్ని జ్యూస్‌ రూపంలో తీసుకుంటే అందులోని ఎ, సి విటమిన్లు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. దంతాల, ఎముకల ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయి. ఇందులోని నియాసిన్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 
* ఇందులో అధికంగా ఉండే పీచు ఆకలినీ తద్వారా బరువునీ తగ్గించేందుకు తోడ్పడుతుంది. మలబద్ధకాన్ని తగ్గించడంతోబాటు కాలేయ ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తుంది. టొమాటోల్లో సమృద్ధిగా ఉండే బి6 హృద్రోగాలకు కారణమైన హోమోసిస్టీన్‌ అనే పదార్థాన్ని  విచ్ఛిన్నమయ్యేలా చేస్తుంది. 
*  టొమాటోల్లో పుష్కలంగా ఉండే క్లోరిన్‌ శరీరంలోని టాక్సిన్లు తొలగిపోయేలా చూస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా వీటిల్లో అధికంగా ఉండే లైకోపీన్‌ ప్రొస్టేట్‌, రొమ్ము, కొలొరెక్టల్‌, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్లతోబాటు హృద్రోగాలు రాకుండా నిరోధిస్తుంది.
*  టొమాటో జ్యూస్‌ తాగడం వల్ల సూర్యరశ్మి కారణంగా చర్మంమీద ఏర్పడిన ట్యాన్‌ క్రమంగా తగ్గడంతోబాటు మొటిమలు కూడా తగ్గుతాయి. ఇందులోని విటమిన్లు పొడిబారిన జుట్టును మెరిసేలా చేస్తాయి. తలస్నానం తరవాత కాస్త తాజా టొమాటో రసాన్ని తలకి పట్టించి ఐదు నిమిషాల తరవాత కడిగేస్తే జుట్టుకి మంచి కండిషనర్‌లా కూడా పనిచేస్తుంది. 

వయసు వెనక్కి రావాలంటే...

వయసు మీరేకొద్దీ జ్ఞాపకశక్తి లోపించడం, ఆలోచనాశక్తి- క్షీణించడం సహజమే. అయితే కొందరిలో ఆలోచనాశక్తి ముఖ్యంగా హేతుబద్ధత, తర్కం తగ్గిపోతుంటుంది. దాన్నే చాదస్తం ముదిరిపోయింది అంటుంటాం. అయితే అలా ఆలోచనాశక్తి తగ్గిపోతున్న దశలో- అంటే 65 దాటిన తరవాత క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వాళ్లలో అది తిరిగి పెరిగే అవకాశం ఉంది అని గుర్తించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. ఇందుకోసం వీళ్లు దాదాపు 160 మంది వృద్ధుల్ని ఎంపికచేసి వాళ్లతో ఆరునెలలపాటు క్రమం తప్పకుండా వారానికి మూడురోజులు 45 నిమిషాలపాటు వ్యాయామం చేయించారట. నడకతోబాటు జాగింగ్‌, సైక్లింగ్‌ కూడా చేయించారట. అదేసమయంలో పీచు ఎక్కువగానూ సోడియం తక్కువగానూ ఉండే పండ్లూ కూరగాయలూ నట్స్‌ వంటి ఆహారాన్ని ఇచ్చారట. దాంతో వాళ్లలో బీపీ, మధుమేహం వంటివి తగ్గడంతోబాటు, వాళ్ల వయసు మరో తొమ్మిదేళ్లు వెనక్కి వచ్చిందనీ, అంటే ఆలోచనాశక్తి పెరిగిందనీ చెబుతున్నారు. కాబట్టి అరవై దాటాకా వ్యాయామం తప్పనిసరి అన్నమాట.

టూకీగా...

చల్లని ప్రదేశాల్లో నివసించేవారిలో జీవక్రియావేగం నెమ్మదించడంతో ఆయుఃప్రమాణం పెరుగుతుంది అంటున్నారు ఇలినాయిస్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకి చెందిన పరిశోధకులు.
* గుండెపోటు మరణాల్లో చాలావరకూ ఫ్లూ వైరస్‌ తరచూ సోకడం వల్లే సంభవిస్తున్నట్లు చెబుతున్నారు అమెరికాలోని డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సెంటర్‌కు చెందిన నిపుణులు. 
* గుడ్డు తింటే కొలెస్ట్రాల్‌ అనుకుంటారు కానీ రోజుకో గుడ్డు తినేవాళ్లలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్రన్‌ ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు.


 
 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.