close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ శివుడు... అలంకార ప్రియుడు

విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అంటారు. కానీ, హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలోని శివుడు మాత్రం రోజుకో అలంకారంతో దర్శనమిస్తాడు.  మధ్యప్రదేశ్‌ జ్యోతిర్లింగ క్షేత్రమైన మహాకాళేశ్వర్‌ ఆలయంలోని శివుణ్ణి అలంకరించినట్టుగానే ఈ క్షేత్రంలోనూ అనేక రూపాల్లో శివయ్యను కొలువుదీర్చడం విశేషం.

వరంగల్‌ జిల్లాలోని హన్మకొండ సిద్ధేశ్వరాలయం దక్షిణకాశీగా పేరుగాంచింది. దేశంలో పశ్చిమాభిముఖంగా కనిపించే అతితక్కువ ఆలయాల్లో ఇదొకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో మూడు రోజులపాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగంమీద ప్రసరించడంతో ఆయా రోజుల్లో స్వామి మరింత తేజస్సుతో దర్శనమిస్తాడు. వివిధ మాసాల్లోని ప్రత్యేకతలను బట్టి ఇక్కడి సిద్ధేశ్వరుడు అనేక రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తాడు. పర్వదినాలకు అనుగుణంగా రకరకాల అలంకారాలు చేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఒకసారి మొత్తం భస్మంలో స్వామిని ముంచెత్తుతారు. మరోసారి బిల్వ దళాలు, పుష్పాలతో శివలింగాన్ని తీర్చిదిద్దుతారు. సంక్రాంతి వచ్చిందంటే పతంగులతో శివుడిని అలంకరిస్తారు.

కాకతీయుల నాటిది
కాకతీయులు నిర్మించిన సప్త ఈశ్వర ఆలయాల్లో ఇది మొదటిది. అయితే అంతకంటే ముందే స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశాడని స్థలపురాణం తెలియజేస్తోంది. పరమ శివభక్తులైన సిద్ధులు ఈ ప్రాంతంలోనే ఘోర తపస్సును ఆచరించగా వారి భక్తికి మెచ్చిన ఆ కైలాసనాథుడు స్వయంభూగా అవతరించినట్లు సిద్ధేశ్వర చరిత్ర చెబుతోంది. స్కంద పురాణంలోనూ ఈ ఆలయ ప్రస్తావన కనిపిస్తుంది. మరో కథనం ప్రకారం... శాండిల్య మహర్షి కోరికను మన్నించిన పరమశివుడు ఇక్కడ సిద్ధేశ్వరుడిగా వెలిశాడని చెబుతారు.
కాకతీయులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, హనుమద్గిరి చుట్టూ నవ ఆంజనేయస్వామి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి. కాకతీయ వంశ మూలపురుషుడైన మాధవవర్మ ఇక్కడే జన్మించాడని చెబుతారు. ఈ క్షేత్రంలోనే నాగేంద్రుడికి కూడా ప్రత్యేక ఆలయం ఉంది.

 

వివిధ అలంకారాల్లో...
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని అనేక రూపాల్లో అలంకరిస్తారు. అదే తరహాలో హన్మకొండలోని సిద్ధేశ్వరాలయంలోనూ అనేక రూపాల్లో శివుడిని ముస్తాబుచేస్తారు. గత పదిహేనేళ్లుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఆలయ అర్చకులు. నవధాన్యాలతో ధాన్య శివుడు, రుద్రాక్షలతో మహా రుద్రుడు, చుట్టూ మంచు ముద్దలతో అమరనాథుడు, కూరగాయలతో శాకాంబరేశ్వరుడు, పండ్లతో ఫలసిద్ధేశుడు... ఇలా రకరకాల అలంకారాలతో స్వామిని పూజిస్తారు. ఇప్పటి వరకూ 800కు పైగా భిన్న రూపాలతో సిద్ధేశ్వరుణ్ని అలంకరించారు. సిద్ధేశ్వరుడి వైవిధ్య అలంకరణలను దర్శించడానికి ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.

అన్నాభిషేకం
సిద్ధేశ్వరుడికి మహా రుద్రాభిషేకంతోపాటు, అన్నాభిషేకం కూడా చేయడం ఇక్కడి ఆనవాయితీ. శ్రావణ, కార్తికమాసాల్లో విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 51 కేజీల అన్నంతో శివుణ్ని అభిషేకించి, అనంతరం ఆ అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. అదేరోజు శివపార్వతుల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు. సిద్ధేశ్వర ఆలయం ముందు ఉన్న గుండాన్ని సిద్ధేశ్వర గుండంగా వ్యవహరిస్తారు. ఇక్కడ స్నానం చేసి, స్వామిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు తప్పక సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

 

ఇలా చేరుకోవచ్చు
హన్మకొండలో కొలువైన సిద్ధేశ్వరుడిని దర్శించుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వరంగల్‌కు బస్సు సదుపాయం ఉంది. అక్కడి నుంచి సిటీ బస్సులో హన్మకొండ చేరుకోవచ్చు. బస్టాండ్‌కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి వేళ్లేందుకు ఆటోరిక్షాలు అందుబాటులో ఉంటాయి. రైల్లో వెళ్లాలంటే- వరంగల్‌ లేదా కాజీపేట్‌ రైల్వే స్టేషన్లలో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా ప్రయాణించి సిద్ధేశ్వర క్షేత్రానికి వెళ్లొచ్చు.

- పత్తెం కిరణ్‌ కుమార్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌
ఫొటోలు: సంపత్‌కుమార్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.