close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీటిలో సాగు... ఎంతో బాగు!

అజయ్‌ నాయక్‌ది గోవా. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. ఆప్‌లు తయారుచేసే సొంత కంపెనీని లాభాలకు అమ్మేశాడు. కొత్తగా ఏంచేద్దామా అని ఆలోచిస్తూండగా సేంద్రియ వ్యవసాయం గురించి విన్నాడు. వ్యవసాయం గురించి ఓనమాలు తెలియవు. పొలమూ లేదు. అయితేనేం, బిజినెస్‌ అన్నాక రిస్క్‌ తీసుకోవాలి కదా అనుకున్నాడు. ఆర్నెల్లు తిరిగేసరికల్లా డాబా మీద ఉన్న 150 చదరపు మీటర్ల స్థలంలో కూరగాయలు పండించడం మొదలెట్టాడు. కొత్తలో ఇంటికి సరిపోయాయి. కొద్దిరోజులకే అమ్మకాలూ ప్రారంభించి ఇప్పుడు నెలకు మూడు టన్నుల కూరగాయలు పండించి హోటళ్లకు సరఫరాచేస్తున్నాడు.

సచిన్‌, శ్వేత దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. తెలంగాణకి చెందిన ఈ జంట ఉద్యోగరీత్యా పదేళ్లపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఉన్నారు. అక్కడ తాజా కూరగాయలు కొనుక్కోవడానికి నేరుగా పొలాలకు వెళ్లడం అలవాటు. అలా వెళ్లినప్పుడు అక్కడి వ్యవసాయవిధానాలూ నాణ్యమైన తాజా కూరగాయలూ చూశాక వారికీ వ్యవసాయం చేయాలనిపించింది. ఆ సాగు విధానాల గురించి అధ్యయనం చేసి పకడ్బందీ ప్రణాళికతో స్వదేశం తిరిగొచ్చారు. షామీర్‌పేట దగ్గర పొలం కొని నాలుగెకరాల్లో గ్రీన్‌హౌస్‌ కట్టి 40 రకాల మైక్రోగ్రీన్స్‌నీ, 15 రకాల ఆకుకూరల్నీ పండిస్తున్నారు. వాటిని హైదరాబాద్‌, వైజాగ్‌, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోని హోటళ్లకు సరఫరాచేస్తూనే ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు.

శ్రీరామ్‌ గోపాల్‌ కొంతమంది స్నేహితులతో కలిసి చెన్నైలో సొంత సాఫ్ట్‌వేర్‌ సంస్థ నిర్వహిస్తున్నాడు. అది లాభాలబాట పట్టి సాఫీగా సాగుతోంది. దాంతో శ్రీరామ్‌ ఇంకేదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. ఓరోజు యూట్యూబ్‌ వీడియోలు చూస్తుండగా విదేశీ వ్యవసాయానికి సంబంధించిన ఓ వీడియో అతడిని ఆకట్టుకుంది. యూట్యూబ్‌ వీడియోలు చూస్తూనే అవసరమైన పనిముట్లు తయారుచేసుకుని డాబామీద ప్రయోగాలు చేశాడు. మంచి ఫలితం కన్పించింది. దాంతో అతడిలోని వ్యాపారవేత్తకి మరో పని దొరికింది. ‘ఫ్యూచర్‌ఫార్మ్స్‌’ పేరుతో అతను పెట్టిన కంపెనీ ఇప్పుడు అదానీ, డాబర్‌, కల్పతరు, ప్యారీ ఆగ్రో లాంటి పెద్ద సంస్థలకి కమర్షియల్‌ ప్రాజెక్టులు చేసి పెట్టే స్థాయికి ఎదిగింది.
ఓ చేత్తో సాఫ్ట్‌వేర్‌నీ మరో చేత్తో సాగుబడినీ సవ్యసాచుల్లా సాధనచేస్తున్న నగర రైతులు వీరంతా. తక్కువ వనరులతో ఎక్కువ దిగుబడి సాధించి తద్వారా అందరికీ ఆహారాన్ని అందించగల రేపటి వ్యవసాయం ఇదేనని చాటుతున్న ఈ కొత్త తరం రైతులు అందుకు ఎంచుకున్న విధానమే... హైడ్రోపోనిక్స్‌!

హైడ్రోపోనిక్స్‌ అంటే...
మట్టి లేకుండా కేవలం నీళ్లలో మొక్కల్ని పెంచడాన్నే హైడ్రోపోనిక్స్‌ అంటారు. మట్టి లేకుండా మొక్కల్ని పెంచవచ్చని పదహారో శతాబ్దంలోనే శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే ప్రయోగశాలలకే పరిమితమైన ఈ పరిశోధనని పంట పొలాలవరకూ తీసుకురావడం కొంతకాలంక్రితం మాత్రమే మొదలైంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లో రైతులు ఈ విధానంలో కూరగాయల్నీ ఆకుకూరల్నీ పండిస్తున్నారు. పండ్లతోటల్నీ సాగుచేస్తున్నారు. ఆ స్ఫూర్తితోనే మనదేశంలోనూ పలువురు విద్యావంతులు గత కొన్నేళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. కొందరు వ్యాపారస్థాయిలో పనిముట్లను తయారుచేసి విక్రయించడమూ, ఆసక్తి కలవారికి శిక్షణ ఇవ్వడమూ ప్రారంభించడంతో ఇప్పుడు ఔత్సాహికులు చాలామంది హైడ్రోపోనిక్స్‌ బాటపడుతున్నారు.

మామూలుగా వ్యవసాయం చేయడానికి- నేలా నీరూ కావాలి. వాతావరణం అనుకూలించాలి. అందుకే మన వ్యవసాయాన్ని దైవాధీనం అంటారు. అన్నీ సరిగా ఉన్న ఏడాది పంటలు పండుతాయి. లేనప్పుడు కరవు రాజ్యమేలుతుంది. ఆ దైవాధీనం పద్ధతిని మన అదుపులోకి తెచ్చుకునే ప్రత్యామ్నాయమే హైడ్రోపోనిక్స్‌ అంటున్నారు ఈ నవతరం రైతులు. అందులో అన్నీ మన అధీనంలోనే ఉంటాయి కాబట్టి సీజన్‌తో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా పంటల్ని పండించుకోవచ్చు.

ప్రకృతి మీద ఆధారపడరు!
ఏ మొక్కకైనా కావలసింది కాసిన్ని పోషకాలూ కొద్దిగా నీరూ వెలుతురూ. ప్రకృతి మీద ఆధారపడకుండా వాటన్నిటినీ అందించడమే ఈ మట్టిలేని సాగు విధానం. అందుబాటులో ఉన్న స్థలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ నిలువుగా, అడ్డంగా నీటి గొట్టాల్ని అంచెలంచెలుగా అమరుస్తారు. వాటికి రంధ్రాలు చేసి ఆ రంధ్రాల్లో పేపర్‌ టీ కప్పుల్లాంటి జాలీ కప్పుల్ని పెడతారు. కొబ్బరిపీచుతో తయారుచేసే కోకోపీట్‌ని ట్రేలో పరిచి అందులో విత్తనాలను నాటతారు. అవి మొలకెత్తాక ఒక్కో కప్పులో ఒక్కో మొక్క చొప్పున పైపులకు అమర్చిన జాలీ కప్పుల్లోకి మారుస్తారు. మొక్క వేళ్లు జాలీలోనుంచి పైపులోకి వెళ్తాయి. పైపులో మొక్కలకు అవసరమైన పోషకాలు కలిపిన నీరు నిరంతరం నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నీరు మొత్తం పైపు అంతా ప్రవహించి తిరిగి ట్యాంకులోకి చేరుతుంది. మళ్లీ అదే నీరు పైపుల్లోకి వెళ్లేలా ఏర్పాటుచేస్తారు. అంటే ఒక్క చుక్క కూడా నీరు వృథా కాదు. భూమిలోకి చొచ్చుకునిపోయి నీరూ పోషకాలను వెతుక్కునే శ్రమ ఉండదు కాబట్టి మట్టిలో పెరిగినట్లుగా ఈ మొక్కల వేళ్లు పెద్దగా పెరగవు. దాంతో ఆ పెరుగుదల అంతా మొక్క పైభాగంలో కన్పిస్తుంది. ఇక ఎండ ఎక్కువ పడకుండా పైన నీడ ఏర్పాటుచేస్తారు. ఎండపడని ప్రదేశమైతే తగినంత వెలుతురు కోసం ఎల్‌ఈడీ లైట్లను అమరుస్తారు. మొత్తమ్మీద మొక్కలు పెంచుతున్న చోట ఉష్ణోగ్రతా వెలుతురూ గాలిలో తేమా... అన్నీ ఎక్కువా తక్కువా కాకుండా తగు మోతాదులో మాత్రమే ఉంటాయి.

అన్నీ లాభాలే!
ఈ విధానం వల్ల ఎన్నో వెసులుబాట్లు ఉన్నాయంటారు హైదరాబాద్‌కు చెందిన శ్వేత. కలుపుమొక్కలు ఉండవు. బయటి వాతావరణంతో సంబంధం ఉండదు కాబట్టి చీడలూ తెగుళ్లూ ఏవీ మొక్కలకు సోకవు. దాంతో క్రిమి సంహారకమందుల అవసరం ఉండదు. ఒకవేళ ఎప్పుడన్నా వాడాల్సి వచ్చినా వేపనూనె, వెల్లుల్లి రసం లాంటివి వాడతారు. మట్టే ఉండదు కాబట్టి భూసారం ప్రసక్తీ, రసాయన ఎరువులు వాడాల్సిన అవసరమూ ఉండదు. మొక్కలు వేగంగా పెరుగుతాయి. అచ్చంగా నీటిలో పెరిగే మొక్కలే అయినా మట్టిలో పెరిగే మొక్కలతో పోలిస్తే ఈ మొక్కలకు 10 శాతం నీరే చాలు. పెరట్లో, చిన్న బాల్కనీల్లో, మేడల మీదా, మిద్దెల మీదా... ఎక్కడ చిన్న స్థలమున్నా చాలు. దానికి తగిన రీతిలో మొక్కలు పెట్టుకోవచ్చు. మొక్కలకు అవసరమైన ప్రాథమిక పోషకాలూ సూక్ష్మపోషకాలూ కలిపిన ద్రావణం వేర్వేరు పంటలకోసం రడీమేడ్‌గా దుకాణాల్లో దొరుకుతుంది.

అగ్రి- ఇంజినీరింగ్‌
ఈ పద్ధతి యువతరాన్ని ఇంతలా ఆకర్షించడానికి కారణం ఇందులో వ్యవసాయం ఎంత ఉందో ఇంజినీరింగూ అంత ఉండడమే. హైడ్రోపోనిక్స్‌ గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు శ్రీరామ్‌కి అది వ్యవసాయం కన్నా ఎక్కువగా ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులాగా అన్పించిందట. అతడు యూట్యూబ్‌ వీడియోలను చూసి హైడ్రోపోనిక్‌ కిట్‌ని స్వయంగా తయారుచేసుకున్నాడు. దాంతో పనిచేస్తూ అనుభవంతో మెరుగులు దిద్దాడు. తనలాగా ఆలోచించే కొందరు స్నేహితుల్ని భాగస్వాములుగా చేసుకుని ‘ఫ్యూచర్‌ ఫార్మ్స్‌’ సంస్థని నెలకొల్పాడు. ఈ కంపెనీ తమ వెబ్‌సైట్‌ ద్వారా హైడ్రోపోనిక్‌ కిట్స్‌ని అమ్ముతోంది. ఆ కిట్లు సైజుని బట్టి వెయ్యి రూపాయలనుంచి 70వేల వరకూ ఉంటాయి. 200 చదరపు అడుగుల స్థలంలో హైడ్రోపోనిక్‌ ఫార్మ్‌ ఏర్పాటుకి లక్ష రూపాయలదాకా పెట్టుబడి అవసరం అవుతుంది. రెండేళ్లు కష్టపడితే ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడనక్కరలేదంటాడు శ్రీరామ్‌. దేశవ్యాప్తంగా పలు పెద్ద పెద్ద సంస్థలకి ఫార్మ్స్‌ ఏర్పాటుచేసిన శ్రీరామ్‌ వ్యాపారాన్ని ఎప్పుడూ రేపటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎంచుకోవాలంటాడు. అతడి కంపెనీ గత ఏడాది ఏడు కోట్ల రూపాయల టర్నోవరు సాధించింది. స్ట్రాబెర్రీ పంటకు చల్లటి వాతావరణం కావాలి. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా పండిస్తారు. అలాంటిదాన్ని మధ్యప్రదేశ్‌లో పండించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు అరవింద్‌ ధక్కడ్‌. అరవింద్‌ గత పదేళ్లుగా హైటెక్‌ నర్సరీని నిర్వహిస్తున్నాడు. పనిలో పనిగా తానూ పంటల్లో ప్రయోగాలు చేసేవాడు. ఆ ప్రయోగాల్లో ఎంతగా విజయం సాధించాడంటే తమ ప్రాంత రైతులు ఎవరూ ఊహించని విధంగా స్ట్రాబెర్రీని పండించాడు. అందుకు అతడు హైడ్రోపోనిక్స్‌ని ఎంచుకున్నాడు. సోమ్‌వీర్‌సింగ్‌ అమెరికాలో బ్యాంకర్‌గా మంచి ఉద్యోగం చేసేవాడు. ఓసారి చండీగఢ్‌ వచ్చినప్పుడు సోదరుడు చేస్తున్న వ్యవసాయాన్ని పరిశీలించాడు. దానికి విదేశాల్లో తాను చూసిన కొత్త విధానాలను జతచేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చనుకున్నాడు. ఉద్యోగం మానేసి వచ్చి సాగుపనులకు శ్రీకారం చుట్టాడు. కొద్దికాలంలోనే మంచి ఫలితాలు రాబట్టాడు. ఇప్పుడిక కొత్త పంటలకు అనువుగా హైడ్రోపోనిక్‌ కిట్స్‌ని కూడా తయారుచేసుకోగలుగుతున్న సోమ్‌వీర్‌ తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని పొందడమే కాక సేంద్రియ వ్యవసాయంలో ఇది మరో అడుగు ముందుకు వేయడమేనంటాడు. పైగా సంప్రదాయ సాగు సాధ్యం కానిచోట కూడా చేయవచ్చు కాబట్టి మొదట్లో పెట్టుబడి ఎక్కువనిపించినా రానురానూ లాభసాటిగానే ఉంటుందని చెబుతున్నాడు.

 

సాంకేతిక సొబగులు
ఆర్తీ మోదీ బెంగళూరులో డెంటిస్టు. ఆమె తన మేడ మీద 24 చదరపు అడుగుల స్మార్ట్‌ గార్డెన్‌ని ఏర్పాటుచేసుకుంది. దానికి ఆమె చేయాల్సిన పని ఎక్కువేమీ లేదు. మొక్కలు నాటడమూ, పండిన కాయగూరల్ని కోసుకోవడమూ తప్ప. నెలకోసారి నీటి ట్యాంకు నింపితే చాలు, ఇంటికి సరిపడే కూరగాయలు పండుతున్నాయి. పైగా రోజూ కాసేపు ఆ మొక్కల మధ్య కూర్చుంటే కంటికీ మనసుకీ ఎంతో హాయి అంటుందామె. 
వ్యవసాయమూ టెక్నాలజీ రెండూ వేర్వేరనే అభిప్రాయం సమాజంలో పాతుకుపోయిందన్నది అజయ్‌ నాయక్‌ అభిప్రాయం. అందుకే క్రిమి సంహారకాల ప్రభావం లేని నాణ్యమైన కూరగాయల్ని పండించడానికి సాంకేతికత సాయం తీసుకోవాలనుకున్నాడు. తమ డాబా మీద 150చ.మీ.ల స్థలంలో హైడ్రోపోనిక్స్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేసుకుని సలాడ్‌ గ్రీన్స్‌తో వ్యవసాయం మొదలెట్టాడు. మంచి దిగుబడి రావడంతో అతడిలోని వ్యాపారవేత్త విజృంభించాడు. రెండేళ్లక్రితం లెట్‌సెట్రా అగ్రిటెక్‌ పేరుతో సంస్థను ప్రారంభించాడు. పాలీహౌస్‌లో హైడ్రోపోనిక్స్‌ సాగు విధానానికి చదరపు అడుగుకీ రూ.3500దాకా ఖర్చవుతుందని లెక్కలు వేశాడు. పెట్టుబడిదారులను వెతుక్కున్నాడు. బెంగళూరులో పెద్ద ఫార్మ్‌ని నెలకొల్పి రోజుకు ఐదు టన్నుల కూరగాయలు పండించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. పెరటితోటలూ మిద్దెతోటలూ నిన్నటి మాట. నీటితోటలదే నేటి ముచ్చట అంటున్నారు నగరాలకు చెందిన యువతీయువకులు. పచ్చదనం మీద ఇష్టంతో కొందరూ నాణ్యమైన కూరగాయల్ని స్వయంగా పండించుకోవాలనే కోరికతో కొందరూ ఉద్యోగవ్యాపారాల్లో ఒత్తిడిని వదిలించుకోవడానికి మరికొందరూ... సాగుకు సై అంటున్నారు. వీరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని బాల్కనీల్లో, కారిడార్లలో, డాబాలపైనా... ఎక్కడ పెట్టుకోవడానికైనా పనికివచ్చేలా రకరకాల సైజుల్లో హైడ్రోపోనిక్‌ కిట్స్‌ని తయారుచేసి విక్రయించడమే కాక పంటలు పండించడంలో శిక్షణను కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి పలు సంస్థలు. సెల్ఫ్‌ వాటరింగ్‌, ఆటోమేటెడ్‌ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక సొబగులద్దిన ఈ కిట్స్‌ వల్ల ఎక్కువ శ్రమ లేకుండానే పంటలు పండించొచ్చు. ఫ్యూచర్‌ఫార్మ్స్‌తోపాటు అర్బన్‌ కిసాన్‌, టెక్‌మాలి, గ్రీనోపియా, బిట్‌మాంటిస్‌, జంగాఫ్రెష్‌అండ్‌గ్రీన్‌, గ్రీన్‌టెక్‌లైఫ్‌... లాంటి సంస్థలు ఇలాంటి సేవల్ని అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆర్నెల్ల క్రితమే పనిచేయడం ప్రారంభించిన అర్బన్‌కిసాన్‌ ఇప్పటికే 75 కిట్స్‌ని అమ్మింది.

 

రేపటి అవసరం
వ్యవసాయానికి నేడు మనం అనుసరిస్తున్న పద్ధతులు ఇలాగే కొనసాగిస్తే మరో 60 ఏళ్లకల్లా నేల పూర్తిగా సారాన్ని కోల్పోతుందని నిపుణుల అంచనా. భూగర్భజలాలూ చాలాచోట్ల అందనంత లోతుకి వెళ్లిపోయాయి. ఇటు మట్టీ పనికిరాకా అటు నీళ్లూ లేకా వ్యవసాయం భవిష్యత్తు ఏమవుతుందో ఎవరైనా ఊహించవచ్చు. మరోపక్క పుష్కరానికో వంద కోట్ల చొప్పున ప్రపంచ జనాభా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరిమిత వనరులతో అపరిమిత అవసరాలు తీర్చాల్సినప్పుడు ప్రత్యామ్నాయాల అన్వేషణ అవసరాన్ని చాటి చెబుతున్నారు ఈ ఔత్సాహిక వ్యవసాయదారులు. ట్రాన్స్‌పరెన్సీ మార్కెట్‌ సంస్థ అంచనాల మేరకు 2025నాటికి గ్లోబల్‌ హైడ్రోపోనిక్స్‌ మార్కెట్‌ లక్షకోట్ల రూపాయలకు చేరనుంది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం అందులో కీలకపాత్ర పోషించనుంది. ఇప్పటికే సగానికి పైగా జనాభా నగరాల్లో నివసిస్తున్న నేపథ్యంలో వారికి అవసరమైన ఆహారాన్ని వారే పండించుకునేందుకు వీలు కలిగించేది ఈ విధానమొక్కటేనంటున్నారు నిపుణులు.

*          *         *

ఓ పక్క పల్లెకీ పంటపొలాలకీ దూరమైన నగరవాసులకు శ్రమలేకుండా పంటలు పండించే అనుభవాన్నీ, మరో పక్క తక్కువ వనరులతో ఎక్కువ లాభం పొందే అవకాశాన్నీ ఇస్తోంది ఈ నీటిలో పంటల సాగు పద్ధతి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని సాగునీ సాంకేతికతనీ ఒక్క తాటిమీదికి తెచ్చి మరో హరితవిప్లవానికి వేదిక సిద్ధంచేస్తున్నారు అర్బన్‌ ఫార్మర్స్‌! ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దామా మరి!

 

హైడ్రోపోనిక్స్‌... కొన్ని విశేషాలు!

సంప్రదాయ సాగుతో పోలిస్తే అదే స్థలంలో నాలుగు రెట్లు ఎక్కువ మొక్కలు పెట్టవచ్చు.
మట్టిలేకుండా చేసే ఈ నీటిలో సాగు వల్ల 97 శాతం నీటిని ఆదా చేయొచ్చని రుజువైంది.
మొక్కలు 20 నుంచి 50 శాతం వేగంగా పెరుగుతాయి. అంటే నెలరోజులకు కాపుకొచ్చే పంట పదిరోజుల్లోనే చేతికందివస్తుంది.
ఉత్పాదకత 10 రెట్లు పెరుగుతుంది. రవాణా ఖర్చూ తగ్గుతుంది.
ఒక్క అమెరికాలోనే దాదాపు 10 లక్షలమంది ఇళ్లలో హైడ్రోపోనిక్స్‌ సాగుచేస్తున్నారని అంచనా.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇటీవలే ఒక హైడ్రోపోనిక్‌ ఫార్మ్‌ ప్రారంభమైంది. ఆటోమేటెడ్‌ విధానంలో నిర్మించిన ఈ ఫార్మ్‌లో 15 మంది మాత్రమే సిబ్బంది ఉంటారు. మిగిలిన పని అంతా రోబోలే చేస్తాయి. 
ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోపోనిక్‌ ఫార్మ్‌ నిర్మాణాన్ని దుబాయ్‌లో ప్రారంభించారు. 
900 ఎకరాల ఈ ఫార్మ్‌లో రోజుకు 5.3 టన్నుల కూరగాయలు పండించనున్నారు. ఇందులో 100 చదరపు అడుగుల వైశాల్యంలో 320 గేలన్ల నీటితో పండించే పంటకు సంప్రదాయ సేద్యంలో అయితే 8,27,640 చదరపు అడుగుల నేలా 2,50,000 గేలన్ల నీరూ అవసరమవుతాయని అంచనా.

కడుపు నింపేది ఈ విధానమేనట!

చవగ్గా అందుబాటులో ఉన్న వస్తువులతోనూ హైడ్రోపోనిక్స్‌ సాగు చేయవచ్చంటారు బెంగళూరుకు చెందిన సీవీ ప్రకాశ్‌. సైన్యంలో పనిచేసి రిటైరైన ఈయన కొన్నాళ్లు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ చూసి నేర్చుకుని వచ్చి 2008లో హైడ్రోపోనిక్స్‌ని భారతీయులకు పరిచయం చేశారు. అప్పట్నుంచీ ఈ విధానానికి సంబంధించిన కన్సల్టెంటుగా ఆయన సేవలందిస్తున్నారు. తన డాబా మీద తోటనే ప్రయోగశాలగా మార్చి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చగల శక్తి ఈ విధానానికి ఉందనే ప్రకాశ్‌ ‘పేట్‌ భరో ప్రాజెక్ట్‌’ పేరుతో ఓ సంస్థ పెట్టి దీని గురించి ప్రచారం చేస్తున్నారు.

కేరళ ఆదర్శం 
చేపల్నీ, మొక్కల్నీ ఒకేసారి పెంచుతూ దేశంలో తొలి ఆక్వాపోనిక్స్‌ గ్రామం అయింది కేరళలోని చేరై. చేపల ట్యాంకుల్లోని నీటినే హైడ్రోపోనిక్‌ విధానంలో మొక్కలకు పెట్టి రెండురకాలుగా లబ్ధి పొందడాన్ని ఆక్వాపోనిక్స్‌ అంటారు. స్థానిక సహకార బ్యాంకు అధికారుల చొరవతో చేరైలో 200 ఆక్వాపోనిక్‌ యూనిట్లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. గ్రామస్థులకు లాభాలు సంపాదించి పెడుతున్నాయి. ప్రయోగాత్మకంగా మొదలైన ఈ ప్రాజెక్టు రెండేళ్లలోనే గ్రామస్థులందరినీ ఆకట్టుకోవడం విశేషం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.