close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అరవై రూపాయలకే లీటరు పెట్రోలు!

ఇదేదో పండగ సందర్భంగా ప్రకటించే భారీ తగ్గింపు ఆఫర్‌ కాదు. ఈ పెట్రోలు మీకు ఏ బంకులోనూ దొరకదు. హైదరాబాద్‌లోని ‘హైడ్రాక్సి సిస్టమ్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌’ సంస్థ అరవై రూపాయలకి లీటరు పెట్రోలూ, యాభైకే డీజిలూ అమ్ముతోంది. పరిశ్రమలు వద్దనుకున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలని ఇలా పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌-గా మార్చి మనకందిస్తున్నారు హైడ్రాక్సీ వ్యవస్థాపకుడు, పరిశోధకుడు భోగిరెడ్డి వెంకట సతీష్‌ కుమార్‌!

మనం వాడుతున్న ప్లాస్టిక్‌ ఎన్నో రసాయనాల కలబోత. కాబట్టే దాన్ని ‘పాలీ-మర్‌’ అని కూడా అంటారు. ఆ మిశ్రమంలో పెట్రోలూ, డీజిల్‌, కిరోసిన్‌కి మూలమైన ‘క్రూడ్‌ ఆయిల్‌’ కూడా ఉంటుంది. అలా కలగలసిపోయిన మిశ్రమాలని వివిధ స్థాయుల ఉష్ణోగ్రతలో మండించి దేనికిదాన్నే వేరుచేయొచ్చు. దీన్ని డీ-పాలిమరైజేషన్‌ అంటారు. ఆ ప్రక్రియ కింద మొదట క్రూడ్‌ ఆయిల్‌ని, దాన్నుంచి మళ్లీ పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌లని వేరు చేస్తున్నారు సతీష్‌కుమార్‌. ఇదేమీ ప్రపంచం ఇదివరకు ఎరగని విషయమేం కాదు. పాశ్చాత్యదేశాల్లో ఇప్పటికే చేస్తున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో, అంతకన్నా అతితక్కువ ధరతో ఇలా పెట్రో ఉత్పత్తుల్ని అందించడమే సతీష్‌ కుమార్‌ ప్రత్యేకత!

లక్ష్యం అది కాదు... 
పెట్రోలూ, డీజిళ్లని తక్కువ ధరకి అమ్ముకోవడమే సతీష్‌కుమార్‌ పరిశోధనల లక్ష్యం కాదు. ఆయన అసలు ఉద్దేశం వృధా ప్లాస్టిక్‌ వల్ల ఏర్పడే కాలుష్యాన్ని పరిహరించడమే! నిజానికి ప్లాస్టిక్‌ వాడకం మన సామాన్య జనాల్లోకన్నా పరిశ్రమల్లో ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్‌ తయారీ సంస్థలన్నీ నెలకి టన్నులకొద్దీ ‘డెడ్‌ ప్లాస్టిక్‌’ని(అనేకమార్లు రీ-సైక్లింగ్‌ చేసి వాడి... ఇక పనికిరాదు అనుకున్న ప్లాస్టిక్‌) గుంతలు తవ్వి పూడ్చేస్తాయి. ఆ ప్లాస్టిక్‌ భూమిలో కరగకుండా భూసారాన్నీ, జలమట్టాన్నీ దెబ్బతీస్తుంది. ప్రధానంగా ఆ సమస్యని పరిష్కరించడానికే ‘డీ-పాలిమరైజేషన్‌’ పద్ధతుల్ని వాడటం మొదలుపెట్టారు సతీష్‌కుమార్‌. ఆయన పుట్టిపెరిగింది హైదరాబాద్‌లోనే. భీమవరం ఎస్సార్‌కేఆర్‌ కాలేజీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు. చేసేది ఇంజినీరింగ్‌ అయినా... ఆయన మనసంతా పరిశోధనలవైపే ఉండేది. ఫ్రెండ్స్‌తో కలిసి యూఎస్‌బీ పరికరాల తయారీ సంస్థనీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలనీ ఏర్పాటుచేసినా ఆయన మనసు అటువైపు మొగ్గలేదు. నీటితో విద్యుత్తు పుట్టించే ‘హైడ్రోజన్‌ పవర్‌’పైన పరిశోధించడానికి పూనుకున్నారు. అందుకోసమే 2013లో ‘హైడ్రాక్సి సిస్టమ్‌ ప్రయివేటు లిమిటెడ్‌’ సంస్థని ప్రారంభించారు.

మూడువందలసార్లు ప్రయత్నించి... 
తన పరిశోధనలో భాగంగా కొన్ని ప్లాస్టిక్‌ తయారీ పరిశ్రమల్ని చూడటానికి వెళ్లినప్పుడే వాళ్లు వృథా ప్లాస్టిక్‌ని భూమిలో పాతిపెట్టడం గమనించారు సతీష్‌. అలాచేయడం వల్ల పర్యావరణానికి ఏర్పడే నష్టాన్ని గ్రహించి ప్లాస్టిక్‌ని పర్యావరణహిత పద్ధతుల్లో కరిగించడంపైన దృష్టిసారించారు. తాను చదివింది మెకానికల్‌ ఇంజినీరింగైనా డీ-పాలిమరైజేషన్‌ పద్ధతుల కోసం కొత్తగా రసాయనశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. కేవలం ప్లాస్టిక్‌ని పర్యావరణహిత పద్ధతుల్లో కరిగిస్తే సరిపోదనుకున్నారు. వాటి నుంచి ఇంకేదైనా ప్రయోజనం అందేలా ప్రత్యేక ఫిల్టరింగ్‌ పద్ధతులని కనిపెట్టి పెట్రోలు, డీజిల్‌, కిరోసిన్‌ని వేరుచేయడం మొదలుపెట్టారు. 2013లో ఇందుకోసం చిన్నస్థాయిలో మెషిన్‌లని ఏర్పాటుచేసి తన ఇంటినే ప్రయోగశాలగా మార్చుకున్నారు. దాదాపు ఆరునెలలపాటు నాలుగువందలసార్లు ప్రయోగాలు చేశాకకానీ విజయం 
దక్కలేదట. పెట్రో ఉత్పత్తులు అనుకున్నస్థాయిలో ఉత్పత్తిచేయగలమనే నమ్మకం వచ్చాక 2015లో దీన్నే కాస్త పెద్ద ఎత్తున చేపట్టాలనుకున్నారు. ఇందుకోసం తన ఇల్లూ, తనకున్న మరో స్థలం అమ్మి ఒకటిన్నర కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లోనే యూనిట్‌ ప్రారంభించారు. విప్రోలో పనిచేస్తున్న ఆయన భార్య శీల కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ సంస్థకి మేనేజర్‌గా మారారు.

నెలకి కిలో లీటర్లు... 
ప్రస్తుతం సతీష్‌కుమార్‌ నెలకి వెయ్యి లీటర్ల మేర పెట్రో ఉత్పత్తుల్ని తయారుచేస్తున్నారు. వాటన్నింటినీ హైదరాబాద్‌లోని బేకరీ పరిశ్రమలూ, చెన్నైలోని ఇటుక తయారీ సంస్థలూ ముందే బుక్‌ చేసుకుని మరీ తీసుకుంటున్నాయి. ఈ పెట్రో ఉత్పత్తుల కోసం నెలకి 200 టన్నుల వృథా ప్లాస్టిక్‌ని హైదరాబాద్‌లోని వివిధ పరిశ్రమల నుంచి సేకరిస్తున్నారు సతీష్‌కుమార్‌. పెట్రో ఉత్పత్తుల్ని పొగ, కాలుష్యం లేకుండా ఇలా తయారుచేయడం దేశంలో ఇదే ప్రథమమని డీఆర్‌డీఓ మాజీ ఛైర్మన్‌ వీకే సారస్వత్‌, తెలంగాణ పీసీబీ ఛైర్మన్‌ రాజీవ్‌శర్మ ప్రశంసించారు! ఈ ఏడాదిలోపు నెలకి ఐదువేల లీటర్ల వరకు పెట్రో ఉత్పత్తుల్ని తయారుచేసేంతగా తమ యూనిట్‌ని విస్తరిస్తామంటున్నారు సతీష్‌. అప్పుడుకానీ, పెట్రోలు బంకులా ఏర్పాటుచేసి రీటైల్‌గా అందరికీ అమ్మలేనని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే... పరిశ్రమలకు పోగా మిగిలిన పెట్రోలూ, డీజిల్‌ని తమ యూనిట్‌కి పక్కనే ఉన్న కాలనీవాసులకి మాత్రమే విక్రయిస్తున్నారు!

ఫొటోలు: దుర్గా వల్లభరావు, న్యూస్‌టుడే, పటాన్‌చెరు


కూర్చోవచ్చు... కుర్చీలో!

ఇవాళ ఉదయాన్నే మా సందులో కేక వినిపించింది. మైకులో పెద్దగా చెబుతున్నాడు... ‘కేవలం 400 రూపాయలు పెట్టుబడి పెడితే, 
మీరు జీవితాంతం హాయిగా కాలుమీద కాలేసుకుని కూర్చోవచ్చు...’ అని. ఎంతో ఆశగా బయటికి వచ్చి చూశా... వాడి దుంపతెగ... కుర్చీలు అమ్ముతున్నాడు.


క్లారిటీ ఉండాలి..!

భార్య: ఏమండీ ఓ మాట అడగనా..? 
భర్త: అడుగు 
భార్య: మీరు రోడ్డు మీద వెళుతున్నారు. ఓ అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది. అప్పుడు మీరేం చేస్తారు? 
భర్త: ప్రశ్న క్లియర్‌గా లేదు 
భార్య: ఎందుకు లేదు?! 
భర్త: అప్పుడు నువ్వెక్కడున్నావో కూడా చెప్పాలి కదా!




ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.