close
రేగుపండు.. భోగిపండు!

సంక్రాంతి పండగంటేనే ఊరంతా సందడి. గాలిపటాలూ కోడిపందాలూ హరిదాసులూ గంగిరెద్దులూ గొబ్బెమ్మలూ...ఇలా ఎన్నెన్నో సరదా వేడుకలు. అవన్నీ ఒకెత్తయితే, భోగభాగ్యాలతో తులతూగాలని చిన్నారులను దీవిస్తూ పోసే భోగిపండ్ల వేడుక మరొక ఎత్తు. ఈ వేడుక వెనక రేగుపండ్ల రుచితోపాటు బోలెడంత ఆరోగ్యమూ దాగుంది మరి..!

ప్రపంచంలో ఎన్నో పండ్లు ఉన్నా ఓ పండు పేరుతో పుణ్యక్షేత్రం వెలిసినా ఓ పండగ పేరునీ సొంతం చేసుకున్నా అది ఒక్క రేగుకే చెల్లింది. ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్‌ ప్రాంతంలో శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తుండగా ఆయనకి నీడనిచ్చి దాహం తీర్చడానికి లక్ష్మీదేవి రేగు(బదరీ)చెట్టులా అవతరించిందట. ఆ ప్రదేశమే బదరీవనంగా మారిందనీ, అక్కడ సాలగ్రామ రూపంలో వెలసిన విష్ణుమూర్తి బదరీనారాయణుడిగా పేరొందాడనీ, ఆ క్షేత్రం బద్రీనాథ్‌గా ప్రాచుర్యంలోకి వచ్చిందనేది పౌరాణిక కథనం. ఆ ప్రాంతంలో రేగుచెట్లు ఎక్కువగా ఉండడానికి అదే కారణమన్నది స్థానికుల విశ్వాసం. భోగినాడు పిల్లలకు ఈ పండ్లు పోస్తారు కాబట్టి ఏకంగా పండగ పేరుతోనూ ఇవి ప్రాచుర్యం పొందడం విశేషం. శివుడికీ రేగు ప్రీతికరమే. అందుకే  శివరాత్రినాడు రేగుపండును నైవేద్యంగా పెడుతుంటారు భక్తులు. రామాయణంలో శబరి ఎంగిలి చేసి రాముడికి తినిపించిన పండు రేగుపండే. ఇలా మన సంస్కృతీ సంప్రదాయాలతో విడదీయలేని బంధాన్ని పెనవేసుకున్న రేగునే హిందీలో బేరిపండు అనీ అంటారు. అక్బర్‌తో జరిగిన యుద్ధంలో ఓడిపోయి, అడవుల్లోకి వెళ్లిన మహారాణా ప్రతాప్‌నీ, ఆయన సైన్యాన్నీ ఆరావళీ పర్వతాల్లోని ఈ రేగుపండ్లే బతికించాయట. అందుకే దీన్ని దుఃఖభంజని అనీ అంటారు. ఈ చెట్టు ఒక్కటి ఉంటే చాలు, అన్ని బాధలూ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఒకప్పుడు దిల్లీలో బెరీవాలాభాగ్‌ పేరుతో రేగుచెట్ల వనం ఉండేది. రోడ్ల విస్తరణలో భాగంగా అక్కడ చెట్లు పోయినప్పటికీ అందుకు గుర్తుగా రేగుపండ్లు మాత్రం అమ్ముతుంటారక్కడ.

రకరకాలు! 
ఎర్రగా చిన్నగా తీపీ పులుపూ కలిసిన రుచిలో ఉండే రేగుపండ్లే ఒకప్పుడు మనందరికీ సుపరిచితం. కానీ క్రమంగా వాటి స్థానంలో చిన్నసైజు ఆపిల్‌ను తలపించే ఆకుపచ్చని రేగుపండ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంగూ సైజుని బట్టి వీటిల్లో 400 రకాలకు పైగా ఉన్నాయి. షుగర్‌కేన్‌, లి, షెర్‌వుడ్‌, చికొ, హనీజార్‌ రకాలు తాజాగా తినడానికి బాగుంటే; లాంగ్‌, షాంక్సి లి రకాలు ఎండాక తినడానికి బాగుంటాయి. చైనా, వియత్నాం, కొరియా దేశాల్లో గుండ్రంగానూ కోలగానూ పెద్దసైజులో ఉండే రేగుపండ్ల పంటే ఎక్కువ. అందుకే వీటిని చైనా ఆపిల్‌, రెడ్‌ డేట్స్‌ అనీ పిలుస్తుంటారు. ఆపిల్‌ రేగుగా పిలుస్తోన్న తైవాన్‌ రకం పెద్ద సైజులో ఉండటంతోబాటు తియ్యగా ఎక్కువ రోజులు నిల్వ ఉండటంతో ఇప్పుడు మనదగ్గరా ఎక్కువగా పండిస్తున్నారు. రకమేదయినా రేగు ఓ పెద్ద పొదలా ఎక్కడైనా పెరుగుతుంది. కరవునీ తట్టుకుంటుంది. అందుకే దీన్ని పేదవాడి ఆపిల్‌ అనీ పిలుస్తారు.

ఎండిన రేగుపండ్లలో పోషకాల శాతం ఎక్కువ. అందుకే కొన్ని దేశాల్లో ఏడాది పొడవునా డ్రైఫ్రూట్స్‌ లానే ఎండు రేగుపండ్లనూ చప్పరిస్తారు. అయితే మనదగ్గర తాజాపండ్ల వాడకమే ఎక్కువ. కానీ వీటికి పండుమిర్చి, బెల్లం చేర్చి వడియాలు పట్టి ఏడాదిపొడవునా తింటుంటారు. వీటినే తమిళనాట లడ్డూల్లానూ చేస్తారు. ఇవి అజీర్తికి మంచిమందు. బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో రోటిపచ్చడీ, నిల్వపచ్చళ్లూ పడతారు. ఈ పండ్ల గుజ్జుని కేకుల్లోనూ వాడుతున్నారిప్పుడు. వియత్నాంలో ఈ పండ్లను కాల్చి తింటే, వీటితో చేసిన టీతోనే అతిథులను స్వాగతిస్తారు కొరియన్లు. మధ్యతూర్పుదేశాల్లో భోజనానంతరం ఎక్కువగా తింటారు. చైనా సంప్రదాయ వైద్యంలో రేగుకో ప్రత్యేక స్థానం ఉంది. అక్కడ ఈ పండ్లే మంచి నిద్రమాత్రలు. ఇందులోని జుజుబొసైడ్‌ -ఎ, అనే రసాయనం మెదడుని ప్రభావితం చేసి సహజంగా నిద్రపట్టేలా చేస్తుందట.

ఆరోగ్యానికో రేగు! 
రంగూ సైజుతో సంబంధం లేకుండా ఆపిల్స్‌, ఖర్జూరాల్లోని పోషకాలన్నీ రేగుపండ్లలో దొరుకుతాయి. ఔషధాలూ ఎక్కువే. సిట్రస్‌ పండ్లతో పోలిస్తే రేగులో సి- విటమిన్‌ 20 శాతం ఎక్కువ. సాధారణంగా శరీరానికి 24 అమైనో ఆమ్లాలు అవసరం. అందులో 18 రకాలు ఈ పండులోనే దొరుకుతాయి. ఈ ప్రొటీన్లకి పుండ్లను తగ్గించే గుణం ఎక్కువట. సంప్రదాయ వైద్యంలో ఈ పండునే కాదు, చెట్టు బెరడునీ ఆకుల్నీ పూలనీ కూడా వాడుతుంటారు. పండ్లలో ఎనిమిది రకాల ఫ్లేవొనాయిడ్లు ఉండటంతో ఇవి ఎన్నో వ్యాధుల్ని నివారిస్తాయని ఆధునిక పరిశోధనల్లోనూ తేలింది.

రేగుపండ్లు తింటే కడుపులో మంట తగ్గుతుంది. వీటి రసం నోటిపుండ్లనీ, గొంతుమంటనీ తగ్గిస్తుంది. చైనాలో అచ్చంగా రేగుపండ్ల గుజ్జుతోనే కొన్ని గుళికల్ని తయారుచేసి, వాటిని జీర్ణసంబంధ వ్యాధులకీ రక్తశుద్ధికీ వాడుతుంటారు. ఈ పండ్లు ఆకలినీ తగ్గిస్తాయి. అందుకే 
బదరీఫలంతో బరువునీ నియంత్రించుకోవచ్చు అంటారు. 
ఇరాన్‌కు చెందిన వ్యాక్సీన్‌ అండ్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం ఎండిన ఈ పండ్ల నుంచి సేకరించిన ఎక్స్‌ట్రాక్ట్‌తో క్యాన్సర్‌ కణాలను నిర్మూలించగలిగింది. 
జీవక్రియను పెంచి రక్తనాళాలను శుభ్రపరచడంద్వారా హృద్రోగాలను నివారిస్తాయి రేగుపండ్లు. వీటిల్లో సమృద్ధిగా ఉండే ఐరన్‌, ఫాస్ఫరస్‌లు రక్తకణవృద్ధికి తోడ్పడటం ద్వారా రక్తహీనతనూ తగ్గిస్తాయి. రేగులోని పొటాషియంవల్ల రక్తనాళాలు వ్యాకోచించడంతో బీపీ తగ్గుతుంది. 
ఊపిరితిత్తులూ, మూత్రపిండాల పనితీరుకు ఈ పండ్ల గుజ్జు టానిక్‌లా పనిచేస్తుంది. కాలేయ ఆరోగ్యానికీ ఈ పండు దోహదపడుతుందన్నది మరో పరిశోధన. 
దీర్ఘకాలిక మలబద్ధకంతో బాధపడేవాళ్లకి రేగుపండు మంచి మందు. 
ఆరోగ్యాన్ని పంచే రేగు సౌందర్యానికీ పేరే. వీటిల్లో అత్యధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లూ, విటమిన్‌-సి కారణంగా ఇవి వృద్ధాప్యాన్ని మీదపడనీయకపోవడంతోబాటు చర్మరక్షణకీ తోడ్పడతాయి. ఈ పండ్లతో చేసిన రసాన్ని తాగడం వల్ల సొరియాసిస్‌, ఎగ్జిమా వంటి చర్మవ్యాధులనేకం తగ్గుతాయి. ముఖంమీద ముడతలూ మచ్చలూ తగ్గుతాయి. 
నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, గొంతునొప్పి, ఆస్తమా, కండరాల నొప్పుల్నీ తగ్గించే గుణాలు ఈ పండ్లలోనూ గింజల్లో ఉండటంతో వీటిని అనేక మందుల తయారీలో ఉపయోగించవచ్చంటూ పరిశోధనలు వస్తున్నాయి. ఎందుకంటే వీటిల్లోని ఫ్లేవొనాయిడ్లు నాడీవ్యవస్థను ప్రభావితం చేయడంద్వారా మంచి నిద్రపట్టేలా చేస్తాయట. అందుకే ఈ పండ్లని మరిగించిన టీ తాగితే మంచి నిద్ర పడుతుంది అంటారు చైనీయులు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆందోళన, ఒత్తిడిలతో బాధపడేవాళ్లు ఎండిన రేగుపండ్లూ లేదా వాటితో చేసిన సప్లిమెంట్లను తినడంవల్ల అవన్నీ తగ్గి హాయిగా అనిపిస్తుంది. గింజల్ని పొడిచేసి నూనెలో కలిపి రాసుకుంటే కీళ్లనొప్పులు తగ్గుతాయట. బెరడుని మరిగించిన డికాక్షన్‌ డయేరియాకి మందుగా పనిచేస్తుంది. 
*గర్భిణీలకు వాంతులు, వికారం లేకుండా చేస్తుందీ పండు. సంతానసాఫల్యతనీ పెంచుతాయివి. ఒక్కపండులో ఇన్ని సుగుణాలా అనే అనుమానం ఎవరికైనా సహజమే. కానీ చూశారుగా... బోగినాడు పిల్లలను దీవిస్తూ పోసుకునే రేగుపండ్ల వెనక ఎంత కథ ఉందో మరి!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.