close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సోషల్‌ మీడియా కోటీశ్వరులు!

ఒక ఆఫీసు లేదు, ఉద్యోగం చేయరు. పెద్ద వ్యాపారాలూ కాదు. అయినా నెల తిరిగేసరికి లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.  తోటివారంతా సోషల్‌ మీడియాతో కాలక్షేపం చేస్తుంటే దాన్ని అర్థవంతంగా వాడుకోవడమెలాగో చేసి చూపిస్తున్నారు ఈ యువ కిశోరాలు. తమకు నచ్చిన పనినే సోషల్‌ మీడియా మెచ్చేలా చేస్తూ తమకు తామే సాటి అనిపించుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌తో కోటి!

ఆష్నాష్రాఫ్‌... ఈ పాతికేళ్ల యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కోటీశ్వరురాలైన తొలి భారతీయురాలు. స్కూల్లో ఉన్నప్పుడే ప్రారంభించిన ఆ ఖాతాలో అందరు టీనేజర్లలా సెల్ఫీలు పెట్టకుండా తనకు తెలిసిన మేకప్‌, స్టైల్‌ చిట్కాలను చెబుతూ ఫొటోలు పెట్టేది. అవి చాలామందికి నచ్చాయి. ఫాలోవర్లు పెరిగారు. అలా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిన ఆష్నా ఇన్‌స్టాగ్రామ్‌ సంపాదన ఇప్పుడు నెలకు 5-10 లక్షల మధ్య ఉంటుంది. ఏదైనా సాధించాలంటే డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదని అమ్మ చెప్పిన సలహా నచ్చేసి, ఇంటర్‌తో చదువు ఆపేసి, ఆన్‌లైన్‌ స్టోర్‌ ప్రారంభించేసింది. మరో పక్క ఫ్యాషన్‌, టూరిజం అంశాలపై సొంత బ్లాగు రాస్తోంది. దాని ద్వారా కూడా మరో ఏడెనిమిది లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. వీటికి తోడు యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. ఫ్రెండ్స్‌ అంతా ఉన్నత చదువులూ పోటీ పరీక్షలతో తలమునకలవుతోంటే ఆష్నా తానే కొందరికి ఉద్యోగం ఇచ్చి బిజీబిజీగా దేశాలు తిరిగేస్తోంది. ఆష్నా చిన్నప్పుడే అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. తల్లి ఉద్యోగం చేస్తూ ఆష్నాని పెంచింది. ఇల్లు గడపడానికి అమ్మ పడుతున్న కష్టం చూసిన ఆష్నాకి ఎప్పుడెప్పుడు పెద్దదాన్నై సంపాదించాలా అని ఉండేదట. ఆ కోరికకి పట్టుదలను చేర్చి కష్టపడి పనిచేసి పాతికేళ్లకే కోటీశ్వరురాలవడమే కాదు సొంతిల్లు కొని తల్లినీ తాతయ్యనీ కూడా సంతోషపెట్టింది. ‘చేసే పనిలో నాదైన ప్రత్యేకత చూపడమే నా విజయరహస్యం...’ అంటుందీ యువతి.

వీడియోలతో యాభై లక్షలు!

గూగుల్‌లో కన్పించని కొత్త విషయాన్ని ఒకే ఒక్క నిమిషంలో చెప్పేస్తానంటూ ‘నాస్‌ డైలీ’ అనే తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా కోటి మంది అభిమానులను సంపాదించుకున్నాడు నుసీర్‌ యాసిన్‌. మూడేళ్లుగా ప్రపంచమంతా తిరుగుతూ పలుప్రాంతాల ప్రత్యేకతలను వన్‌ మినిట్‌ వీడియోలుగా సమర్పిస్తూ యాసిన్‌ ఇటీవలే వెయ్యి వీడియోల వ్రతం పూర్తిచేశాడు. ఇజ్రాయెల్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు అమెరికా వెళ్లి హార్వర్డ్‌లో చదువుకున్నాడు. బోలెడు జీతంతో మంచి ఉద్యోగం వచ్చినా కొన్నాళ్లకే అది మానేసి ప్రపంచయాత్ర మొదలెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్‌నీ ఇద్దరు సహాయకుల్నీ వెంటపెట్టుకుని వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ అక్కడి విశేషాల వీడియోలను ఫేస్‌బుక్‌లో పెడుతూ వచ్చాడు. ఒక్కో విషయం గురించీ ఆరుగంటలు చిత్రీకరించి 4 గంటలపాటు ఎడిట్‌ చేస్తే ఒక్కనిమిషం వీడియో తయారయ్యేది. ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా అతడి టాలెంట్‌ అందరికీ తెలిసింది. ఈ ప్రచారాన్ని తన నైపుణ్యాలను మార్కెట్‌ చేసుకోవడానికి వినియోగించుకున్నాడు యాసిన్‌. ఎక్కడికి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద సంస్థలు అతనిచేత ప్రత్యేకంగా వీడియోలు తీయించుకునేవి. మల్టీమీడియా కన్సల్టెంట్‌ సేవలూ అందించేవాడు. ఆన్‌లైన్‌లో టీషర్టులు అమ్ముతాడు. అలా నెలకు యాభైలక్షలకు పైగా సంపాదిస్తూ పాతికేళ్లకే ప్రపంచమంతా చూసేశాడు. ఇప్పుడిక తన దగ్గరున్న వీడియో కంటెంట్‌తో ఓ ఆన్‌లైన్‌ లైబ్రరీ ఏర్పాటుచేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. సమాజానికి ఉపయోగపడే మంచి పనుల్ని యాసిన్‌ తన వీడియోల్లో చూపించాడు. అవి చూసిన చాలామంది అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారనీ అంతకు మించిన సార్థకత ఏ పనికైనా ఏముంటుందంటాడు యాసిన్‌.

యూట్యూబ్‌ లక్షాధికారి

‘బీబీ కీ వైన్స్‌’ అనే యూట్యూబ్‌ కామెడీ ఛానల్‌తో యువతరాన్ని పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న భువన్‌ బామ్‌ కోటి సబ్‌స్క్రైబర్లు దాటిన తొలి భారతీయ యూట్యూబ్‌ వీడియో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రికార్డు సృష్టించాడు. 24 ఏళ్ల భువన్‌ దిల్లీలో చదువుకున్నాడు. రెస్టరెంట్లలో గాయకుడిగా కెరీర్‌ ప్రారంభించిన భువన్‌ చదువుకునేటప్పుడే సరదాగా అప్పుడప్పుడు వ్యంగ్య రచనలతో యూట్యూబ్‌ వీడియోలు తీసి పెట్టేవాడు. తరచుగా అవి వైరల్‌ అవడంతో యూట్యూబ్‌లో సొంత ఛానల్‌ ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. డిగ్రీ అవగానే దాన్ని ఆచరణలో పెట్టాడు. 2-8 నిమిషాల మధ్య ఉండే ఈ వీడియోలన్నీ నగరాల్లోని మధ్యతరగతి టీనేజర్‌ జీవితాన్ని సరదాగా ఒకింత వ్యంగ్యంగా చిత్రీకరిస్తాయి. స్క్రిప్టు రాసుకోవడం, నటించడం, వీడియో తీయడం, ఎడిటింగ్‌ చేసుకోవడం... అంతా స్వయంగా చేసుకుంటాడు. గత నవంబరుకి కోటీ పది లక్షలమంది సబ్‌స్క్రైబర్లను సంపాదించి మోస్ట్‌ పాపులర్‌ ఛానల్‌ అవార్డు పొందిన ఈ ఛానల్‌లో దాదాపు వంద వీడియోలు ఉన్నాయి. ఒక్కో వీడియోకీ భువన్‌కి 4 నుంచి 5 లక్షల వరకూ ఆదాయం వస్తోందట. హిందుస్థాన్‌ టైమ్స్‌వారి ‘గేమ్‌ ఛేంజర్‌’ అవార్డూ అందుకున్నాడు భువన్‌. మరో పక్క సంగీతంలో తన కెరీర్‌నీ కొనసాగిస్తున్నాడు. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ నెలకు ఐదు లక్షల వరకూ  సంపాదించేస్తున్నాడు ఈ కుర్రాడు.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.