close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ శివయ్య కరుణాకటాక్షమే!

భూమ్యాకాశాలు ఏకమైనచోటూ శివుడి నివాసం అయిన కైలాస శిఖరం కళ్లముందు కనిపిస్తుంటే, ‘ఓం నమశ్శివాయ...’ అన్న పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ కైలాసగిరి పరిక్రమ చేశామంటూ ఆ విశేషాలను మనతో పంచుకుంటున్నారు వైజాగ్‌కు చెందిన పి.కనకదుర్గ.

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ కైలాసమానససరోవర యాత్రకి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభించింది అనుకుంటూ బయలుదేరాం. వైజాగ్‌ నుంచి ఎయిరిండియా విమానంలో దిల్లీకి చేరుకుని అక్కడినుంచి ఖాట్మండు విమానాశ్రయానికి చేరుకున్నాం. ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకుని బయటకు వచ్చేసరికి ట్రావెల్స్‌ వాళ్లు రెడీగా ఉన్నారు. హోటల్‌ రూమ్‌కి చేరేసరికి సాయంకాలమైంది. మర్నాడు ఉదయాన్నే లేచి ఖాట్మండులోని పశుపతినాథ్‌ దేవాలయానికి వెళ్లాం. ఇది పురాతన శివాలయం. గర్భగుడికి నలువైపులా ద్వారాలు ఉన్నాయి. లింగానికి నాలుగువైపులా శివుడి ముఖాలు ఉన్నాయి. గుడి ఆవరణలో ఆంజనేయుడు, సూర్యభగవానుడు, కాలభైరవుడు... ఇంకా అనేక దేవతామూర్తులు కొలువుతీరారు. అవన్నీ దర్శించుకుని గుహ్యేశ్వరీ మాత ఆలయానికి వెళ్లాం. అక్కడ విగ్రహం అంటూ ఏమీ లేదు. ఓ నీటిగుంట, దానిమీద కలశం ఉన్నాయి. పూజారులు దానికే పూజలు చేస్తున్నారు. భక్తులకోసం ఓ ఉత్సవ విగ్రహం ఉంది. అక్కడే నమస్కారం చేసుకున్నాం. తరవాత జలనారాయణ దేవాలయానికి వెళ్లాం. చుట్టూ ప్రహరీ, మధ్యలో ఓ పెద్ద సరస్సు, దానిపైన పవళించి ఉన్న శ్రీమహావిష్ణు విగ్రహం తేలుతుంటుంది. పై కప్పు ఏమీలేదు. ఆశ్చర్యంగా అనిపించింది. నిజానికి ఆరోజే కైలాస యాత్రకు బయలుదేరాలి. వాతావరణ కారణాలవల్ల ప్రయాణం వాయిదా పడింది. ఆ మూడురోజుల్లో కాఠ్‌మాండూలోని బౌద్ధస్తూపం, డోలేశ్వర్‌ దేవాలయం, చంద్రగిరి, స్వయంభూ దేవాలయాలన్నీ చూశాం. అక్కడ ఏ దుకాణంలో చూసినా రుద్రాక్షలూ కెంపులూ పచ్చలూ ఉన్నాయి. అక్కడ మన రూపాయలతోనే కొనుక్కోవచ్చు.

నీటిలో మేఘాలు! 
ఎట్టకేలకు కైలాస మానస సరోవరయాత్ర మొదలైంది. ఉదయం ఎనిమిది గంటలకు రోడ్డుమార్గం గుండా బయలుదేరాం. 14 గంటలు ప్రయాణించి రాత్రి 10 గంటలకు సబ్బుబెన్సీ అనే ఊరు చేరుకున్నాం. దారి పొడవునా ఒకవైపు త్రిశూల్‌ నదీ ప్రవాహం, రెండోవైపు పర్వతాలూ కనువిందు చేశాయి. ఒకరోజంతా అక్కడే ఉండిపోయాం. ఆ మర్నాడు ఉదయం ఆరు గంటలకే బయలుదేరాం. కానీ వర్షం వల్ల చాలాచోట్ల రోడ్డుమీదకి నీళ్లు వచ్చేయడంతో ప్రయాణం వేగంగా సాగేదికాదు. దారిమధ్యలో పెద్ద పెద్ద జలపాతాలు కొండలమీద నుంచి లోయలోకి పడుతుండేవి. చాలాచోట్ల రోడ్లు పాడయినప్పటికీ అప్పటికప్పుడే సిబ్బంది మరమ్మతులు చేస్తుండటంతో ప్రయాణానికి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లాం.

రాత్రి 9 గంటలకు కెరుంగ్‌కి చేరుకున్నాం. అక్కడి నుంచి మర్నాడు ఉదయాన్నే బయలుదేరి చైనా బోర్డరు దాటాం. అక్కడ ఇమిగ్రేషన్‌ పూర్తిచేసుకుని సాగా చేరుకున్నాం. ఆ రాత్రికి అక్కడే బస చేసి, మర్నాడు ఉదయాన్నే బయలుదేరి సాయంకాలానికి మానససరోవరం చేరుకున్నాం. దారిపొడవునా ఇసుకపర్వతాలూ దూరంగా మంచుకొండలు తెల్లగా మెరుస్తూ కనిపించేవి. ప్రయాణమంతా ఎత్తుపల్లాలే. ఒక్కోసారి మేఘాలు చేతికి అందుతున్నట్లే ఉండేవి. వాటిని చూస్తూ మైమరిచిపోయాం. బస్సు దిగి బ్యాటరీతో పనిచేసే మరో బస్సు ఎక్కి మానస సరోవర పరిక్రమ చేసుకున్నాం. సరోవరం పక్కనే మాకు కాటేజీలు ఇచ్చారు. ఆరోజు పౌర్ణమి కావడంతో సరోవరం ఒడ్డున కూర్చుని నదిలో పూర్ణ చంద్రబింబాన్ని చూస్తూ కాలాన్నే మరిచిపోయాం. బ్రహ్మదేవుడి మానసం నుంచి ఉద్భవించిన ఆ సరోవరాన్ని చూసినా, ఆ పవిత్ర జలాలను తీర్థంగా స్వీకరించినా జన్మజన్మల పాపాలు తక్షణమే పోతాయనీ, ఒక్కసారి సరోవరం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఈ జన్మలో పాపాలన్నీ పటాపంచలయిపోతాయనీ చెబుతారు. అందుకే టిబెటన్లు 108 సార్లు పరిక్రమ చేస్తారట. సరస్సులోని నీరు స్వచ్ఛంగా మెరుస్తుంది. దాంతో ఆకాశంలోని మేఘాలు సరోవరం మీదకే వచ్చి వాలాయా అన్నట్లు అందులో ప్రతిబింబించేవి. ఆ రెండింటినీ అలా కలిపి చూడటం ఎంతో అపురూపంగా అనిపించింది. తరవాతి రోజు ఉదయాన్నే లేచి ప్రకృతి అనుకూలించడంతో మానససరోవరంలో స్నానం చేయగలిగాం. ఒడ్డునే హోమం, పూజ చేసుకున్నాం.

యమద్వార్‌ నుంచి... 
అక్కడి నుంచి దార్బిన్‌కు చేరుకున్నాం. కైలాస పరిక్రమ మొదలయ్యే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే ఎనిమిది గంటలకు బయలుదేరాం. బ్యాక్‌ప్యాక్‌లో కాసిని డ్రైఫ్రూట్లూ, ఫ్లాస్కూ, మందులూ ఇలా అత్యవరసరమైనవన్నీ పెట్టుకున్నాం. డ్రెస్సు విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. థెర్మల్‌ఇన్నర్‌వేర్‌, జీన్‌ప్యాంట్‌, టాప్‌ అయితే సౌకర్యంగా ఉంటాయి. స్వెట్టర్‌, మంకీక్యాప్‌, గ్లవుజ్‌లు తప్పనిసరి. జాకెట్‌ విత్‌ క్యాప్‌ ట్రావెలర్స్‌ వాళ్లే ఇస్తారు. ఇక్కడ చైనా కరెన్సీనే కావాలి. ముందే వెంట తెచ్చుకోవాలి. ఒక్క చైనా యువాన్‌ మన 11 రూపాయలతో సమానం. యమద్వార్‌ ఇంకాస్త దూరం ఉందనగా అక్కడే అందరినీ వేచి ఉండమన్నారు. గుర్రం కావాల్సినవాళ్లు క్యూలో నిలబడాలి అని చెప్పారు టూర్‌ నిర్వాహకులు. ఒక పెట్టెలో గుర్రాల యజమానుల పేర్లు రాసి ఉంచారు. ఒక్కొక్కరు చీటీ తీసుకుని ఎవరికి వచ్చిన పేరుగల గుర్రం వాళ్లు ఎక్కాలి. అలా అందరికీ గుర్రాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి యమద్వార్‌కు  నడుచుకుంటూ వెళ్లాం. ఇది రెండు ద్వారాలతో ఉన్న చిన్న కట్టడం. దీన్నే మృత్యుద్వారం అనీ అంటారు. చుట్టూ ప్రదక్షిణ చేసి అందులోకి వెళ్లి వచ్చాం. యమద్వారం గుండా కైలాస శిఖరాన్ని వీక్షిస్తే నరకలోకం నుండి విముక్తి లభిస్తుందని  విశ్వసిస్తారు. మేం కూడా అక్కడినుంచి ఆ కైలాసంలో కొలువైన శివయ్యకి ప్రణమిల్లి గుర్రం ఎక్కాం. కైౖలాస పరిక్రమలో ఇదే ప్రారంభస్థానం. గుర్రాల యజమానులంతా టిబెట్‌వాసులే. చిన్నపిల్లల్ని వీపునకు కట్టుకుని ఆడవాళ్లు కూడా గుర్రాలను నడిపించారు. అక్కడివరకూ ఎంతమంది కలిసి వచ్చినా యమద్వార్‌ నుంచి ఎవరి ప్రయాణం వాళ్లదే. దారి ఇరుకుగా ఉంటుంది. ఒక్కో గుర్రం వెళుతుంటుంది. లగేజీ బ్యాగుతో గుర్రం యజమాని ముందు నడుస్తుంటే వెనక అతన్ని గుర్రమ్మీద అనుసరిస్తూ ముందుకు వెళ్లసాగాం.

సంకల్పబలం ఉంటేనే... 
పరిక్రమ చేస్తున్నంతసేపూ కైలాస పర్వతం అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఒకవైపు సెలయేళ్లూ మరోవైపు కైలాస పర్వతమూ వాటిమధ్యలో నడుస్తుంటే మనసు ఆనందతాండవమే. సుమారు రెండు గంటల ప్రయాణం తరవాత భోజనాలకు ఆపారు. డేరాల్లో చెక్కబల్లలు ఉన్నాయి. బయలుదేరేటప్పుడే లంచ్‌బాక్సులు ఇచ్చారు. ఎత్తు ప్రదేశాల్లోని వాతావరణ మార్పులవల్ల శరీరం కొంత ఇబ్బంది పడుతుంది. భోజనం తినబుద్ధి కాదు. కాస్త దూరం నడిస్తేనే ఆయాసంగా అనిపిస్తుంటుంది. అందుకే మధ్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటారంతా. విదేశీయుల్లో కొందరూ మనవాళ్లలో చాలామందీ నడుస్తూ కనిపించారు. చైనా భక్తుల్లో కొందరు సాష్టాంగ నమస్కారం చేస్తూ పరిక్రమ చేస్తున్నారు. వాళ్లందర్నీ చూసి గుర్రంపై కూర్చున్న మాకు సిగ్గుగా అనిపించేది. కానీ శివనామస్మరణ చేస్తూ కైలాసాన్ని చూస్తూ ఈ భాగ్యం చాలు అనుకుంటూ మొదటిరోజు పరిక్రమ పూర్తిచేసుకుని, డేరావుక్‌లో మాకు ఏర్పాటు చేసిన గదికి చేరుకున్నాం. ఇక్కడి నుంచి కైలాస పర్వతం అతి దగ్గరగా కనిపిస్తుంది. పక్కనే బ్రహ్మపుత్రా నదీప్రవాహం. అక్కడ కూర్చుని కైలాసగిరిని చూస్తుంటే సమయం తెలియలేదు. రాత్రి 8 గంటలకీ వెలుతురు బాగా ఉంది. ఎక్కువసేపు బయట ఉండొద్దు అని హెచ్చరించడంతో లోపలకి వెళ్లాం. ఏడుగురికి కలిపి ఒక రూము కేటాయించారు. అందరికీ బెడ్డూ రజాయిలూ ఉన్నాయక్కడ. భోజనం తరవాత అందరి ఆరోగ్యాన్నీ పరీక్షించారు. రెండో రోజు ప్రయాణం చాలా కష్టతరం. ఎవరూ రిస్క్‌ తీసుకోవద్దు. మార్గమధ్యలో ఇబ్బంది వస్తే ఎలాంటి సహాయం చేయడం కుదరదు. ఏమి జరిగినా మా బాధ్యత ఏమీలేదు అని చెప్పారు. చాలామంది అక్కడితో వెనక్కి వెళ్లడానికి నిశ్చయించుకున్నారు. కొంతమంది మాత్రమే ముందుకు వెళ్తామని చెప్పారు. నేను కూడా పరిక్రమ పూర్తిచేయడానికే సంకల్పించుకున్నాను.

గౌరీకుండ్‌! 
రెండోరోజు ఐదు గంటలకే గుర్రం వాళ్లు రావడంతో వెంటనే బయలుదేరాం. మళ్లీ ప్రకృతి అందాలతో మమేకమవుతూ ప్రయాణం... క్రమేణా కైలాస పర్వతం కనుమరుగయిపోయింది. చుట్టూ ఎత్తైన పర్వతాలు కోటగోడలా ఉండేవి. కైలాసంలో ప్రవేశించిన అనుభూతి. సుమారు నాలుగు గంటలపాటు ప్రయాణం చేశాక, ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడంతా జెండాలు కట్టి ఉన్నాయి. అదే డోల్మలా పాస్‌. సముద్రమట్టానికి 5,630 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ దిగి ఆ మహాశివుడు కొలువైన కైలాసానికి నమస్కరించాం. డోల్మలా పాస్‌ నుంచి నడచుకుంటూనే కిందకి ప్రయాణించాలి. గుర్రంమీద వీలు కాదు. కర్రసాయంతో నెమ్మదిగా దిగసాగాం. కర్పూరం వాసన చూస్తూ దారిమీద శ్రద్ధ పెట్టి నడవాలి. సుమారు రెండు గంటలపాటు నడచుకుంటూ వెళ్లాక గౌరీకుండ్‌ కనిపిస్తుంది. అది నడక దారికి కుడివైపుగా చాలా దిగువగా ఉంటుంది. కొంత ఆకుపచ్చా మరికొంత నీలిరంగులో ఎంతో అందంగా కనిపిస్తుందా సరస్సు. వినాయకుడిని కాపలా పెట్టి పార్వతీదేవి స్నానమాడిన సరస్సు ఇదేనట. ఇంకాస్త దూరం నడిచాక మంచు సరస్సు మీదుగా నడుచుకుంటూ వెళ్లాం. అక్కడి నుంచి నడక చాలా కష్టం. ఎలాగో భోజనాలకోసం వేసిన డేరాలకు చేరుకున్నాం. మళ్లీ అక్కడనుంచి గుర్రాలమీద ప్రయాణించి, సాయంత్రానికి జుతుల్‌పుక్‌కి చేరుకున్నాం. అలసటతో వెంటనే నిద్రపోయాం. మూడోరోజు తెల్లవారుజామున గుర్రాలవాళ్లు వచ్చి లేపారు. పది నిమిషాల్లో బయలుదేరాం. అంతా చిమ్మచీకటి. గుర్రాల గంటల శబ్దం ఒకటే వినిపిస్తుంది. ఓ గంట ప్రయాణించాక గుర్రాలు దిగి, మళ్లీ నడుచుకుంటూ వెళ్లాం. మార్గం చాలా ఇరుకుగా ఉంది. తెల్లవారుతోంది. మసక వెలుతురులో సెలయేటి గలగలలు వింటూ గంభీరమైన పర్వతాలను చూస్తూ శివనామస్మరణతో ముందుకు సాగాం. అలా మూడుగంటలపాటు ప్రయాణించి, మా మూడోరోజు పరిక్రమ ముగించుకున్నాం. ఆ మర్నాడు బస్సులో కిందకి వచ్చేశాం. వచ్చేటప్పుడు అందరిలో ఎనలేని ఉత్సాహం. ఆ పరమేశ్వరుని నివాసమైన కైలాస పరిక్రమ చేయగలిగాం అంటే ఆ శివయ్య కరుణాకటాక్షమే.


 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.