close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సంబరాల సంక్రాంతి

మంచుపూల రెమ్మలను తాకుతూ వీచే చల్లగాలుల నడుమ ప్రతి ఇల్లూ ప్రతి ఊరూ ధాన్యపు రాశులతో నిండిపోతూ సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నాయి. డూ..డూ.. బసవన్నల ఆటపాటలూ, ముంగిట్లో ఇంద్రధనుస్సును నిలిపే రంగవల్లులూ పల్లెకు పండగ శోభను అద్దేస్తున్నాయి.

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అందుకే మనకి సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తాయి. వాటిలో విశేషమైంది పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంతోపాటు సంక్రాంతి సంబరాలూ మొదలవుతాయి. నిజానికి ధనుర్మాసం ప్రారంభంతోనే పల్లే పట్టణం అని తేడాలేకుండా ప్రతిచోటా సంక్రాంతి వాతావరణం చలిచలిగా ప్రారంభమవుతుంది. నెలరోజులూ పెళ్లికాని యువతులంతా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, కళ్లాపి చల్లి, అందమైన రంగవల్లులతో వాకిలి నింపేస్తారు. వాటిమీద ఆవుపేడతో ముద్దలు చేసి, పసుపు, కుంకుమలు పెట్టి, గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెడతారు. ఆ తర్వాత ఆడపిల్లలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ముగ్గుల చుట్టూ తిరుగుతూ... 
సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే 
చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే 
మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే 
...అంటూ పాటలుపాడతారు.

భోగాలనిచ్చే భోగి 
భుజ్‌ అనే సంస్కృత ధాతువు నుంచి భోగి అన్న పదం వచ్చిందంటారు. ప్రియభక్తురాలైన గోదాదేవిని సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే వచ్చి వరించి ఆమెకు భోగభాగ్యాలు ప్రసాదించిన రోజు కాబట్టి భోగిగా పేరొచ్చిందని చెబుతారు పెద్దలు. 
ఆ రోజు ఇంద్రుడికి పూజచేస్తే మంచి జరుగుతుందంటారు. ఇంట్లోని పాత వస్తువులన్నింటినీ భోగిమంటల్లో వేస్తారు. కొత్తవాటితో నిత్యనూతనంగా జీవితం ఆరంభించడానికి గుర్తుగా పాత వస్తువులతోపాటూ కష్టాలూ కాలి బూడిదవ్వాలన్నది ఆ సంప్రదాయపు పరమార్థం. భోగి రోజు సాయంత్రం బొమ్మల కొలువు జరుపుతారు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే రేగుపళ్లూ, శనగలూ, పూలూ, కొన్ని చిల్లర నాణేలతో భోగిపళ్లు పోస్తారు. దీనివల్ల కనుదిష్టి పోతుందన్నది ఓ నమ్మకం. రేగుపళ్ల వాసన మానసికోల్లాసాన్ని ఇస్తే, పండ్లలోని పోషకాలు ఉదరసంబంధ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

పెద్దలకు తర్పణాలు 
మకర సంక్రాంతినే పెద్దపండగ అని కూడా అంటారు. ఆ రోజు తెల్లవారగానే పాలుపొంగించి కొత్తబియ్యం, చెరకుగడలతో క్షీరాన్నాన్ని తయారుచేసి సూర్యభగవానుడికి నివేదిస్తారు. ఏ లోకాల్లోనో ఉన్న తాతముత్తాతలను ఒక్కసారి కృతజ్ఞతతో తలుచుకొమ్మంటుంది పెద్దపండగ. 
మకర సంక్రాంతి రోజున పెద్దలకు తర్పణాలు వదలడం ఆనవాయితీ. ఈ రోజున పితృదేవతల పేరిట బియ్యం, పప్పూ, కూరగాయలూ దానమిస్తారు. పితృతర్పణం చేసిన వాళ్లు గుమ్మడికాయ దానం చేస్తే మంచిదంటారు. ప్రతి సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలంటారు.

కనుమ ఇలా... 
రైతన్నకీ వ్యవసాయానికీ వెన్నుదన్నుగా నిలిచే వృషభరాజాల పట్లా, పాడిపశువుల పట్లా కృతజ్ఞత తెలిపే రోజు కనుమ. దీన్నే కొన్ని ప్రాంతాల్లో పశువుల పండగగా వ్యవహరిస్తారు. ఆ రోజు పశువులకూ, జోడెడ్లకూ బొట్టుపెట్టి పసుపురాసి దండం పెడతారు. పశువుల కొట్టంలో పొంగలి చేసి, మూగజీవాలకు వడ్డిస్తారు. ఆ పొంగలిలోనే కొద్దిగా పసుపూ కుంకుమా కలిపి పొలాల్లో చల్లుకుంటారు. దీన్నే పొంగలి చల్లడం అంటారు. కనుమనాడు మినుము తినాలన్నది పెద్దలు చెప్పేమాట. అందుకే ఆ రోజు మినపగారెలూ, ఆవడలూ తప్పక చేస్తారు. పెద్దపండగకు చేసే పిండి వంటలు శరీరానికి పుష్టినిస్తాయి. రంగవల్లులూ, గొబ్బెమ్మలూ ఇంటికి కొత్త కళను తీసుకువస్తాయి. గొబ్బిపాటలూ, హరినామ సంకీర్తనలూ పల్లెకు సందడిని తీసుకువస్తాయి... ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి పండగలో జరిగే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జతచేసేదే. బంధుత్వాలని కలుపుతూ ఆనందాలని పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండగ.!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.