close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ ఏడాది ఎన్ని ‘టెక్కు’లో..!

వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి క్షణంలో మన ముందు ప్రత్యక్షమైపోతాడు. కాసేపు కూర్చుని మాట్లాడి మాయమైపోతాడు. మనిషి అవయవాలు ప్రయోగశాలలో తయారైపోతాయి. కార్లూ బైక్‌లూ గాల్లో రివ్వున ఎగురుతాయి. టీవీ ఆన్‌ చేసినపుడే గోడమీద కనిపిస్తుంది. ఇదంతా బ్రహ్మంగారి కాలజ్ఞానం కాదు, కొత్త సంవత్సరం తీసుకురాబోయే టెక్‌ పరిజ్ఞానం. ఇలా... కలయో మాయో అనిపించేలా టెక్నాలజీ పరంగా భవిష్యత్తులో ఎన్నో మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. కొత్తతరం గ్యాడ్జెట్లు సరికొత్త మార్పులు తీసుకురావడంతో పాటు, మన జీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగానూ మార్చబోతున్నాయి. 

క్షణంలో ప్రత్యక్షం

జీన్స్‌ సినిమా చూసే ఉంటారు. అందులో ఐశ్వర్యారాయ్‌ని ఇద్దరుగా చూపించేందుకు త్రీడీ హోలోగ్రామ్‌ టెక్నాలజీని ఉపయోగించి ఆమె ప్రతిరూపాన్ని సృష్టించి ఐశ్వర్యారాయ్‌ పక్కనే డాన్స్‌ చేయిస్తారు కూడా. ఆశ్చర్యం ఏంటో తెలుసా... ముందు ముందు మనం కూడా అలాగే మన వర్చువల్‌ రూపాన్ని సృష్టించేయొచ్చు. అంతేకాదు, ఆ రూపంతోనే వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాస్‌ ముందు క్షణంలో వాలిపోవచ్చట. మీటింగుల్లో పాల్గొనొచ్చట. వీటినే హోలోగ్రామ్‌ మీటింగులని కూడా అంటారు. అంటే వీడియో కాన్ఫరెన్స్‌లకు బదులు భవిష్యత్తులో ఈతరహా మీటింగులు వస్తాయన్నమాట. ఓ వ్యక్తి టీవీలో కనిపిస్తూ మనతో మాట్లాడటం వీడియో కాన్ఫరెన్స్‌ అయితే, అచ్చంగా మన ఎదురుగా కూర్చుని మాట్లాడ్డం హోలోగ్రామ్‌ మీటింగ్‌ అన్నమాట. అలా అని ఇక్కడ పురాణాల్లోలా కృష్ణుడు రుక్మిణి దగ్గర మాయమై సత్యభామ దగ్గర ప్రత్యక్షమైనట్లు ఉండదు. వీడియో కాన్ఫరెన్స్‌లో కనిపించాలంటే కెమేరా ముందు కూర్చున్నట్లూ హోలోగ్రామ్‌ మెషీన్‌ ముందు కూర్చుని కావల్సినవారికి కనెక్ట్‌ చేసుకోవాలి. అది ఇక్కడ మనం ఎలా కూర్చుంటే అలా ఆ రూపాన్ని అవతలివారిముందు త్రీడీలో ప్రతిబింబిస్తుంది. అంటే అక్కడున్నవారికి మనం ఎదురుగా ఉండి మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫాంటసీ సినిమాల్లో ఆత్మలు అచ్చం మామూలు మనుషుల్లా కనిపిస్తాయీ మాట్లాడతాయీ కానీ వాటిని మనం ముట్టుకోలేం చూడండి, అలా అన్నమాట. ఫోన్లలోనూ ఈ టెక్నాలజీని ఇమిడ్చి ఇపుడు వీడియోకాల్‌ చేసుకున్నట్లూ భవిష్యత్తులో హోలోగ్రాఫిక్‌ త్రీడీ కాల్‌ని చేసే సదుపాయాన్ని కల్పించడానికి వొడాఫోన్‌, శాంసంగ్‌... లాంటి సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 

ఎగిరే బైక్‌!

మేఘాలలో తేలిపొమ్మన్నది... తూఫానులా రేగి పొమ్మన్నది... అని పాడుకుంటూ బైక్‌ మీద దూసుకుపోతుంటారు యువత. మామూలు బైక్‌కే ఇలా అనుకుంటే ఇక, నిజంగా గాల్లో ఎగిరే బైక్‌ వారి చేతికొస్తే ఉల్లాసం ఏ స్థాయిలో ఉంటుందో కదా... రష్యన్‌ కంపెనీ ‘హోవర్‌సర్ఫ్‌’ 2019లో మార్కెట్లోకి తీసుకురాబోయే హోవర్‌ బైక్‌లు రోడ్డుమీద దూసుకుపోవడంతో పాటు, గాల్లోనూ ఎగురుతాయట మరి. ఛార్జింగ్‌తో పనిచేసే ఈ బైక్‌ గంటకు 96 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందట. రిమోట్‌ కంట్రోల్‌ డ్రోన్‌ మోడ్‌లోనూ దీన్ని నలభై నిమిషాల పాటు నడపొచ్చు. ఇదుంటే, వందల కొద్దీ వాహనాల ట్రాఫిక్‌ని ఒక్క ఉదుటున దాటుకుని వెళ్లిపోవచ్చు. షార్ట్‌కట్‌ దారుల్లో త్వరగా గమ్యాన్ని చేరుకునేందుకూ చెరువులూ నదులూ కొండలూ గుట్టల్ని దాటేందుకూ ఇది బాగా ఉపయోగపడుతుంది. రక్షణ చర్యలకూ ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే దుబాయ్‌ పోలీసులు దీన్ని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా.

టీవీ కనిపించదు... బొమ్మ కనిపిస్తుంది!

భవిష్యత్తులో ఎవరింటికైనా వెళ్లినపుడు వాళ్లింట్లో అన్ని సామాన్లూ ఉండి, టీవీ ఒక్కటీ లేకపోతే ‘ఎందుకు కొనుక్కోలేదూ... ’అని గభాలున అడిగేయకండి. ఎందుకంటే 2019లో కంటికి కనిపించని టీవీలదే ట్రెండ్‌. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమండీ బాబూ. ఎల్‌జీ కంపెనీ రూపొందించిన ‘సినీ బీమ్‌ 4కే ప్రొజెక్టర్‌, రోలబుల్‌ ఓఎల్‌ఈడీ’ టీవీలు ఆ కోవలోనివే. దీన్లో సినీ బీమ్‌ ప్రొజెక్టర్‌ టీవీ -మామూలుగా చూస్తే చిన్న పెట్టెలా ఉంటుంది. దీన్ని గోడకు దగ్గరగా పెట్టి స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు. ప్రొజెక్టర్‌ నుంచి 120 అంగుళాల టీవీ తెర 4కే రిజల్యూషన్‌లో గోడమీద పడుతుంది. మనం చెబితేగానీ అది నిజమైన టీవీ కాదని ఎవరికీ అర్థం కాదంటేనే దీన్లోని బొమ్మ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశవంతంగా ఉండడం వల్ల పగటి, రాత్రి వెలుగుల్లోనూ ఈ ప్రొజెక్టర్‌ మీది బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుందట. పైగా మామూలు ప్రొజెకటర్లలా దీన్ని గోడకు దూరంగా పెట్టనక్కర్లేదు. కొన్ని అంగుళాల దగ్గరగా పెట్టినా బొమ్మ చక్కగా గోడమీద ప్రతిబింబిస్తుంది.

ఇక, రోలబుల్‌ ఓఎల్‌ఈడీ టీవీ విషయానికొస్తే... ఇది ఇంట్లో ఉంటే టీవీని ఆన్‌ చేసిన ప్రతిసారీ థియేటర్‌లో కర్టెన్‌ రైజ్‌ అయిన అనుభవం కలుగుతుంది. మామూలుగా చూసినపుడు టీవీ స్థానంలో పొడవుగా గొట్టంలా ఉన్న ఓ పెట్టె మాత్రమే కనిపిస్తుంది. రిమోట్‌ ఆన్‌ చెయ్యడం ఆలస్యం, ఆ పెట్టెలో నుంచి 65 అంగుళాల టీవీ నెమ్మదిగా పైకి వచ్చేస్తుంది. మనం చూడ్డం అయిపోయాక మళ్లీ బటన్‌ నొక్కితే, స్క్రీన్‌ నెమ్మదిగా లోపలికి వెళ్లిపోతుంది. పోస్టర్‌లా పలుచగా ఉండే ఈ టీవీ దానికింద భాగంలో ఉన్న పెట్టెలోకి చుట్టుకుపోతుంది మరి. ఇవి మార్కెట్లోకి వస్తే పెద్ద పెద్ద టీవీలను గోడలకు అమర్చడం, వాటికి దుమ్ము పట్టకుండా చూసుకోవడం లాంటి సమస్యలుండవు. పైగా పిల్లలు ఆడుతూ ఆడుతూ ఏ బంతో బొమ్మో టీవీ మీదికి విసురుతారని భయపడాల్సిన పనీలేదు. ఇల్లు మారేటపుడు వీటిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం కూడా సులువే.

ఫోన్‌ని మడతపెట్టేయొచ్చు!

పెద్ద ఫోన్లు వాడుకోవడానికి బాగుంటాయి. చిన్న ఫోన్లు పట్టుకోవడానికి బాగుంటాయి. చాలామంది ఐఫోన్‌వైపు మొగ్గు చూపడానికి ఒక కారణం అది చేతిలో ఇమిడేలా ఉండడమే. కాకపోతే పెద్ద స్క్రీన్‌ అయితే ఫొటోలూ సినిమాలూ వీడియోలూ చూసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి. అందుకే, 2019లో ఈ రెండు ఉపయోగాలూ కలిగి ఉండేలా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. వీటికి శాంసంగ్‌ కంపెనీ ‘గెలాక్సీ ఎక్స్‌’, రోయాల్‌ కంపెనీ ‘ఫ్లెక్స్‌పై’ ఫోన్లు శుభారంభం చెయ్యబోతున్నాయి. 7.3 అంగుళాలుండే గెలాక్సీ ఎక్స్‌ ఫోనుని  
పుస్తకంలా మధ్యకు మడిచేస్తే సైజు 4.6 అంగుళాలకు తగ్గిపోతుందట. జియోమీ, యాపిల్‌, హువాయ్‌, గూగుల్‌, మోటోరోలా... లాంటి మరికొన్ని కంపెనీలూ భవిష్యత్తులో ఇలా మడతపెట్టేసే ఫోన్లను తీసుకువచ్చే పనిలో ఉన్నాయి. అంటే చూసేటపుడు  
స్క్రీన్‌ ట్యాబ్‌ సైజులోనూ పట్టుకునేటపుడు మామూలు ఫోను సైజులోనూ ఉంటుందన్నమాట. 

రోబో పని మనుషులు 

ఓ పక్కన ఉద్యోగాలతో బిజీ. మరోపక్క పిల్లల బాధ్యతలు. వారానికి ఒకటీ రెండు రోజులు సెలవులు దొరికితే కుటుంబంతో గడపడానికే సరిపోదు. అందుకే, ఇంటిపనులకు మనిషిని పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ ఈమధ్య నగరాల్లో పనిమనుషులు దొరకడమే గగనమైపోతోంది. దీనికి పరిష్కారంగానే భవిష్యత్తులో రోబో పనిమనుషులు రాబోతున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి రాబోతున్న ‘ఈలస్‌ రోబోట్‌’ అలాంటిదే. ఒకసారి శుభ్రంగా సర్ది ఉన్న ఇంటిని దీనికి చూపించి, ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెబితే చాలు, ఎప్పటికపుడు ఎక్కడివక్కడ సర్దేస్తుంది. సోఫాలు పక్కకు జరిగినా యథాస్థానంలోకి మార్చేస్తుంది. ఇల్లు తుడవడం, అడగ్గానే ఫ్రిజ్‌లో నుంచి పానీయాలు తెచ్చివ్వడం... లాంటి ఎన్నో పనులు చిటికెలో చేసేస్తుంది ఈ చిట్టి రోబో. ఇది దేన్నైనా ఒకసారి చూస్తే గుర్తుపెట్టేసుకుంటుంది కనుక కనిపించకుండా పోయిన తాళాలను తెచ్చిమ్మన్నా అంతకుముందు వాటిని ఎక్కడ చూసిందో గుర్తు తెచ్చుకుని క్షణంలో చేతిలో పెడుతుంది. ఇక, ఇంట్లో వృద్ధులూ వికలాంగులూ ఉన్నపుడు అనుకోకుండా వారు పడిపోయినా ఈలస్‌ రోబోట్‌ గుర్తించి ముందే ఫీడ్‌ చేసిన నంబర్లకు ఫోన్‌ చేస్తుంది. ప్రస్తుతానికి ఇది పన్నెండేళ్ల పిల్లల్లా మనుషుల్ని చూసి నేర్చుకుని పనులు చేస్తుంది. దీన్ని ఎంత ఎక్కువ వాడితే దాని తెలివితేటలు అంత ఎక్కువ పెరుగుతాయట. ముందు ముందు దీని పనితీరుని పెంచేందుకు ఎప్పటికపుడు అప్‌డేట్‌ చేస్తుంటారట. అపుడు పూర్తిగా పెద్దవాళ్లలా పని చేస్తుందన్నమాట.

అవయవాలు తయారవుతాయ్‌!

నిత్యం ప్రమాదాల్లో ఎంతోమంది అవయవాలను పోగొట్టుకోవడం, కొందరు చిన్నారులకు పుట్టుకతోనే కొన్ని అవయవాలు ఏర్పడకపోవడం చూస్తూనే ఉంటున్నాం. కానీ దురదృష్టవశాత్తూ ఏ అవయవమూ ఒకసారి పోతే మళ్లీ తిరిగిరాదు. కృత్రిమమైనవి పెట్టినా వాటి పనితీరు అంతంతమాత్రమే. పైగా అది అసలు కాదని అందరికీ అర్థమైపోతుంది. దాంతో దివ్యాంగులకు ఆత్మన్యూనత, మానసిక క్షోభ. ముందు ముందు ఈ బాధంతా లేకుండా ప్రయోగశాలలో నిజమైన అవయవాలను తయారుచేస్తారట. దీనికోసం ఇప్పటికే ఎన్నో పరిశోధనలు జరిగాయి.  
వేక్‌ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీజనరేటివ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు స్టెమ్‌ సెల్స్‌తో కృత్రిమంగా అవయవాలను ఉత్పత్తి చేసే పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో ఇప్పటికే ఎంతో ప్రగతి సాధించారు. ఇవి పూర్తిగా సఫలమైతే గుండె, కాలేయం, కిడ్నీల్లాంటి వాటితో పాటు, చెవి, ముక్కూ... లాంటి అవయాలను కూడా ప్రయోగశాలలో తయారుచేయొచ్చట. ఉదాహరణకు కిడ్నీలను రూపొందించాలంటే రోగి కిడ్నీలో నుంచి చిన్న ముక్కను తీసి దాన్ని ప్రయోగశాలలో పెరిగేలా చేస్తారు. 
తర్వాత త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా లేదా అచ్చుల్లో రోగికి సరిపోయే రూపం వచ్చేలా చేస్తారు. వేక్‌ ఫారెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు ఇప్పటికే త్రీడీ ప్రింటర్‌తో చెవి, ఎముక, కండరాలను తయారుచేశారు. వీటిని జంతువులకు అమర్చగా అవి చక్కగా అమరాయి కూడా. మాసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌, హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ వైద్యులు మనిషి గుండెలోని కణాలను పోలిన కణాలను కృత్రిమంగా తయారుచెయ్యడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాలిపోయిన చర్మం స్థానంలో కొత్త చర్మం పెరిగేందుకు అమెరికా వైద్యులు ఓ విధానానికి రూపకల్పన చేశారు. దీన్లో భాగంగా రోగుల నుంచి స్టెమ్‌ సెల్స్‌ తీసుకుని గాయాల దగ్గర స్ప్రే చేస్తారు. మామూలుగా చర్మాన్ని తీసి అతికించి చేసే స్కిన్‌ గ్రాఫ్టింగ్‌ చాలా నొప్పిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. కానీ స్టెమ్‌ సెల్స్‌తో చర్మాన్ని వృద్ధి చేయడం వల్ల ఎలాంటి నొప్పీ లేకుండా కొత్త చర్మం ముందున్న చర్మంలో కలిసిపోయేలా సహజంగా ఏర్పడుతుంది. 

యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో, యూనివర్సిటీ ఆఫ్‌ వెస్ట్‌ స్కాట్‌లాండ్‌కు చెందిన నిపుణులు ఎముక మజ్జ నుంచి స్టెమ్‌ సెల్స్‌ను తీసి వాటిని కొలాజన్‌ జెల్‌లో ఉంచి చిన్నపాటి వైబ్రేషన్‌లకు గురిచేసి ‘పుట్టీ’ అనే ఓ పదార్థాన్ని తయారుచేశారు. దీన్ని విరిగిన ఎముకల్లో ఉంచితే అది కొత్త ఎముక త్వరగా ఏర్పడేలా లేదా విరిగిన ఎముక అతుక్కునేలా చేస్తుందట. యొకొహొమా సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్టెమ్‌ సెల్స్‌ నుంచి మొగ్గ దశలో ఉన్న కాలేయ కణాలను ఉత్పత్తి చేశారు. వీటిని ఎలుకల్లోకి ప్రవేశపెట్టగా అవి పూర్తిస్థాయిలో కాలేయకణాలుగా  
రూపుదిద్దుకున్నాయి. ఈ పరిజ్ఞానం ద్వారా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో కాలేయాన్ని అభివృద్ధి చేస్తారట.అదండీ సంగతి... ముందు ముందు టెక్నాలజీతో అవయవాల్ని కూడా ప్రయోగశాలలో తయారుచేసి అవసరమైనవారికి అమర్చుతారన్నమాట. ఇది పూర్తిస్థాయిలో సఫలం అయితే వైద్య రంగంలో పెనుమార్పు వచ్చినట్లే.

కారు ఎగరావచ్చు 

బయటికెళ్లాలంటే క్యాబ్‌ బుక్‌ చెయ్యడం ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే ముందు ముందు ఎగిరే క్యాబ్‌లలో వెళ్లడం కూడా ఇలాగే మామూలు విషయం అయిపోతుందట. ఆడీ, ఉబర్‌ కంపెనీలు అలాంటి సౌకర్యాలు కల్పించే పనిలోనే ఉన్నాయి. ఎయిర్‌ బస్‌, ఇటల్‌ డిజైన్‌ కంపెనీలతో కలసి ఆడీ సంస్థ రూపొందించబోయే ఈ పాప్‌ అప్‌ నెక్ట్స్‌ కార్లు అలాంటివే. రోడ్డుమీద వెళ్తున్నపుడు ఇది రెండు సీట్ల ఆడీ కారులా ఉంటుంది. అయితే, కావల్సినపుడు దీని పైభాగాన్ని పెద్దడ్రోన్‌కి అతికించి హెలీకాఫ్టర్‌లా ఎక్కడికైనా వేగంగా తీసుకెళ్లిపోయే  వీలుంటుందట. ఆశ్చర్యం ఏంటంటే ఈ ఎయిర్‌ ట్యాక్సీలు డ్రైవర్‌ లేకుండా రోబోటిక్‌ పరిజ్ఞానంతో పనిచేస్తాయి.

వెలుగే స్క్రీన్‌!

ఫోను చేతిలో ఉన్నపుడు దాంతో మెసేజ్‌లు పంపించడం, ఈమెయిల్స్‌ చెయ్యడం... ఎవరైనా చెయ్యగలిగిన పనే. అలా కాకుండా బ్రేస్‌లెట్‌ నుంచి గాల్లోనూ చేతిమీదా ప్రసరించే కాంతినే ఫోనులా ఉపయోగిస్తే అదీ అసలైన టెక్నాలజీ. హోలోగ్రాఫిక్‌ ప్రొజెక్షన్‌ టెక్నాలజీతో భవిష్యత్తులో అదే జరగబోతుందట. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కి కనెక్ట్‌ అయి ఉండే ఈ బ్రేస్‌లెట్‌ బటన్‌ నొక్కగానే ప్రొజెక్టర్‌ ద్వారా ఫోన్‌ స్క్రీన్‌ గాల్లో కనిపిస్తుంది. దీన్ని మనం మామూలు టచ్‌స్క్రీన్‌లానే ఉపయోగించొచ్చు. అంటే గాల్లో కనిపించే ఐకన్ల మీద నొక్కి మెసేజ్‌ని టైప్‌ చెయ్యొచ్చు, మెయిల్‌నీ ఫొటోలనీ పంపొచ్చన్నమాట. ఈ బ్రేస్‌లెట్లు ఉంటే అస్తమానం ఫోన్‌ని చేత్తో పట్టుకునే పనిలేకుండా పనులు కానిచ్చేయొచ్చన్నమాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.