close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీవితమే ఓ సినిమా!

ఎన్టీఆర్‌... తెలుగు సినీ రాజకీయ రంగాలలో ఆ పేరే ఓ కేక, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక. తెలుగువారందరిచేతా ‘అన్న’ అని ఆత్మీయంగా పిలిపించుకున్న ఎన్టీఆర్‌... మరణించిన 23 ఏళ్ళ తరవాత మళ్ళీ మన కళ్ళ ముందుకు వస్తున్నారు. కథానాయకుడిగా వందల పాత్రలు పోషించిన మహా నటుడు తానే ఒక పాత్రగా మారి వెండితెరమీద కనిపించబోతున్నారు. ఆయనొక్కరే కాదు వైఎస్‌ఆర్‌, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఘంటసాల... ఇలా ఆ వరుసలో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్లందరూ బయోపిక్‌ల ద్వారా ఈ ఏడాది మనల్ని పలకరించనున్నారు.

హాలీవుడ్‌, బాలీవుడ్‌ ఇప్పుడు మన టాలీవుడ్‌... ప్రతిచోటా వినిపిస్తున్న మాట బయోపిక్‌. నిజజీవిత గాథలనే సినిమా కథలుగా మార్చుకుని రూపొందించే సినిమాలే ఈ బయోపిక్‌లు. గత దశాబ్ద కాలంగా సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖుల జీవితాలు హాలీవుడ్‌, బాలీవుడ్‌లలో బయోపిక్‌లుగా తెరకెక్కుతున్నాయి. గత రెండేళ్లలో ఇవి మరీ ఎక్కువగా వచ్చాయి. ప్రేక్షకులు కృత్రిమ కథల్ని చూసీ చూసీ విసిగిపోయి నిజమైన కథలకోసం వేచిచూస్తున్నారన్న విషయాన్ని ఇవి చెప్పకనే చెబుతున్నాయి. ఈ విషయాన్ని మనవాళ్లు కాస్త ఆలస్యంగానైనా కూడా బాగానే అర్థంచేసుకున్నారు. అందుకే, 2019లో మునుపెన్నడూ లేనంతగా బయోపిక్‌లను టాలీవుడ్‌లో చూడబోతున్నాం. టాలీవుడ్‌లో ఏటా 200-250 సినిమాలు విడుదలవుతాయి. ఏదో ఒక ప్రత్యేకత లేకపోతే బాక్సాఫీసు దగ్గర విజయం కష్టం. అందుకే రీమేక్‌లూ, మల్టీస్టారర్లూ, పీరియడ్‌ సినిమాలూ... ఇలా నిత్యం ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నడుస్తున్నది బయోపిక్‌ల ట్రెండ్‌.

మహానటి స్ఫూర్తి...
మిగతా కథల్లోలా కాకుండా ప్రముఖుల జీవితాలకు అన్నివర్గాల్లోనూ, అన్ని వయసులవాళ్లలోనూ ఆసక్తి ఉంటుంది. తెలిసిన వ్యక్తి కాబట్టి సినిమా పేరు ప్రేక్షకుల్ని సులభంగా సినిమాహాళ్లకు తీసుకువస్తుంది. దర్శకుడి బాధ్యతల్లా అలా వచ్చిన వారిని రెండున్నరగంటలపాటు తన కథా కథనాలతో మెప్పించడమే. నిజానికి మన దగ్గర బయోపిక్‌లు గతంలోనూ వచ్చాయి. ఆంధ్రకేసరి, అల్లూరి సీతరామరాజు ఆ కోవలోనివే. కానీ ఇప్పుడు మాత్రం బయోపిక్‌ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా గతేడాది వచ్చిన ‘మహానటి’. సావిత్రి జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమా ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ప్రస్తుతం వస్తోన్న మన బయోపిక్‌లకు ఒక స్ఫూర్తి, కొలమానం, దిక్సూచి కూడా. ‘అలనాటి సావిత్రి కథను తెరకెక్కించడం సాధ్యమేనా’ అన్న సందేహాలను పటాపంచలు చేసి యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఆనాటి వేషభాషలూ, సామాజిక పరిస్థితుల్ని కళ్లకు కట్టారు. ‘మహానటిద్వారా బయోపిక్‌ల చిత్రీకరణలో నాగ్‌ అశ్విన్‌ ఒక బెంచ్‌మార్క్‌ని పెట్టాడు. ఓ బయోపిక్‌ని ఎలా తీయొచ్చో చూపాడు’ అని చెబుతారు ఎన్టీఆర్‌ బయోపిక్‌ దర్శకుడు క్రిష్‌. బడ్జెట్‌, మార్కెట్‌, సాంకేతికత దృష్ట్యా మనం బయోపిక్‌లు తీయగలమా అన్న అనుమానం ఉండేది మొన్నమొన్నటిదాకా. అయితే, బయోపిక్‌లు తీయడమే కాదు, తీసి అద్భుత విజయాన్నీ అందుకోగలమని నిరూపించింది మహానటి. మహానటిలోని ‘మాయాబజార్‌’ సెట్‌ని మళ్లీ తెరపైన చూపించడానికి పాత సినిమాలోని ప్రతి ఫ్రేమునూ విశ్లేషించారు. ఇలా పాత ఫొటోలూ, వీడియోల్లోని అణువణువునీ పరిశోధించి, విశ్లేషించగల సదుపాయాన్ని నేటి కంప్యూటర్‌ సాంకేతికత అందిస్తోంది. అంతేకాదు, ప్రధాన పాత్రలు వేసే వ్యక్తుల రూపురేఖలు ఆ పాత్రకి చెందిన అసలు వ్యక్తుల్ని గుర్తుచేయాలి. కేవలం మేకప్‌తోనే అదంతా సాధ్యం కాదు. ఇక్కడా కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, సీజీ ప్రాసెసింగ్‌ కీలకపాత్ర పోషిస్తాయి. ఇలాంటి సాంకేతిక సదుపాయాలు నాణ్యతను పెంచడంతోపాటు ఖర్చుని భారీగా తగ్గిస్తాయి కూడా. వీటన్నింటి మీదా అవగాహన ఉంటే, అన్నిటినీ జాగ్రత్తగా సమన్వయం చేసుకోగలిగితే చక్కని బయోపిక్స్‌ తీయడం అసాధ్యమేమీకాదని రుజువు చేసింది మహానటి చిత్ర బృందం.

విజయ శాతం ఎక్కువ
2018లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా సంజు. సంజయ్‌దత్‌ జీవితకథ అయిన ఈ సినిమాని రూ.100 కోట్లతో నిర్మించగా అంతకు నాలుగు రెట్లు వసూళ్లు రాబట్టింది. (అదే జోరులో ఇప్పుడక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా ‘మణికర్ణిక’ వస్తోంది. కంగనా రనౌత్‌ టైటిల్‌పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకుడు.) రాజి, గోల్డ్‌, ప్యాడ్‌మాన్‌, సూర్మా... ఇలా గతేడాది బాలీవుడ్‌లో వచ్చిన ప్రతి బయోపిక్‌ మంచి లాభాల్నే తెచ్చిపెట్టింది. మన దగ్గర మహానటి కూడా బడ్జెట్‌కు మూడు రెట్ల వసూళ్లు రాబట్టింది. దీన్నిబట్టి వీటికి కమర్షియల్‌ సక్సెస్‌ కూడా ఎక్కువేనని అర్థమవుతోంది. అయితే, విజయంతోపాటు బయోపిక్‌లలో వాస్తవికత తగ్గుతోందన్న విమర్శలూ రావడం గమనార్హం. బయోపిక్‌లు డాక్యుమెంటరీలు కాదుకాబట్టి కొంత వరకూ సృజనాత్మక స్వేచ్ఛ తీసుకునే అవకాశం ఉంది. కాకపోతే కథను బలంగా చూపించే ప్రయత్నంలో వాస్తవాల నుంచి మరీ దూరంగా వెళ్ళకూడదు. కథలోని వ్యక్తి పాతతరం వారయితే దానిమీద వచ్చే అభ్యంతరాలు కాస్త తక్కువగా ఉంటాయి. అదే సమకాలీన వ్యక్తులు అయితే వారిని చూసినవాళ్ళూ, వారి గురించి తెలిసినవాళ్ళూ ఇప్పటికీ ఉంటారు కాబట్టి వివాదాలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు. ‘సంజు’లో సంజయ్‌దత్‌ను మచ్చలేని మనిషిగా చూపారని చాలామంది విమర్శించారు. మహానటికి సంబంధించి కూడా కొందరు వ్యక్తులూ, కొన్ని అంశాలపైన అభ్యంతరాలు వచ్చాయి. ‘సావిత్రి జీవితాన్ని తెరకెక్కించే క్రమంలో సినిమా స్వేచ్ఛను తీసుకున్నాం. ఆమె జీవితాన్నీ, గొప్పతనాన్నీ, నటిగా ఆమె వైభవాన్నీ చూపించాలనుకున్నాం. తేదీలూ, స్థలాలూ, వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఈ సినిమా తీయలేదు. ఒకవేళ అలానే తీస్తే సినిమా అని చెప్పి డాక్యుమెంటరీ తీశారేంటని అడుగుతారు. సినిమా విషయంలో నా తొలి, మలి ప్రాధాన్యం కూడా సావిత్రిగారే’ అంటారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇవి మాత్రమే కాదు, కల్పితాలు వాస్తవాల్ని దాచేశాయన్న విమర్శల్ని దాదాపు అన్ని బయోపిక్‌లూ ఎదుర్కోక తప్పలేదు. గానగంధర్వుడు ఘంటసాల, అలనాటి నటుడు కత్తి కాంతారావు, ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరి, బాడీ బిల్డర్‌గా ప్రఖ్యాతి సాధించిన కోడి రామ్మూర్తి, దర్శకరత్న దాసరి నారాయణరావు... ఇలా తెలుగునాట ఇంకా చాలామంది ప్రముఖుల జీవితాలు తెరమీదకు వస్తాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, తెలుగుజాతి గొప్పతనాన్నీ తెలుగునేల విశిష్ఠతనీ చాటిచెప్పిన మహనీయుల కథలు ఎన్ని వచ్చినా తెలుగు ప్రేక్షకులకు ఆనందమే, తెలుగు జాతికది గర్వకారణమే.

‘మహానటి’ సావిత్రి, విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్‌... ఆ పేర్లని నెట్‌లో కొట్టగానే బోలెడు సమాచారం వచ్చిపడుతుంది. ఎన్నో వీడియోలు వరసకడతాయి. డాక్యుమెంటరీలూ, ఇంటర్వ్యూలూ పలకరిస్తాయి. ఈ ఇద్దరే కాదు ఏ ప్రముఖుల గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడు చిటికెలో పని. వాళ్ల గురించి ఇంతగా తెలుసుకునే అవకాశమున్నా బయోపిక్‌ని ప్రేక్షకులు థియేటర్‌లకి వెళ్లి చూడటానికి ప్రధాన కారణం మనకు తెలిసిన వ్యక్తుల జీవితాల్లో మనకు తెలియని కోణాలను తెలుసుకోవాలన్న ఆసక్తేనని చెప్పాలి. నటీనటుల నటనో, దర్శకుల టేకింగో, నేపథ్య సంగీతమో ఇవన్నీ కలిసి పండించే మెలోడ్రామానో ప్రేక్షకులుగా మనల్ని కట్టిపడేస్తాయి. ఆయా వ్యక్తుల జీవితాల్లోని వైరుధ్యాలూ ప్రత్యేకతలతోపాటు వారి మీద ఉండే అంతులేని అభిమానమూ ఆరాధనా వల్లే మామూలు జానర్‌లకన్నా బయోపిక్‌లు అనూహ్య విజయం సాధిస్తున్నాయి. నిన్న ‘మహానటి’ అదే నిరూపించింది...! నేడు ‘ఎన్టీఆర్‌’ అదే నమ్మకంతో మన ముందుకు వస్తోంది...!!

సినిమాగా తారకరాముడు

సంక్రాంతి పండక్కి ఎన్టీఆర్‌ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ ఈసారి పండక్కి ‘ఎన్టీఆర్‌’ ఓ సినిమాగా వస్తున్నాడు. దానికోసం ఆయన అభిమానులే కాదు, యావత్‌ తెలుగుజాతి ఎదురుచూస్తోంది. ఎందుకంటే తెలుగువారికి అసలు సిసలు కథానాయకుడూ, మహానాయకుడూ ఆయనే. ఈ రెండు కోణాల్నీ చూపిస్తూ రెండు భాగాలుగా వస్తున్న సినిమా ‘ఎన్టీఆర్‌’. ఆయన తనయుడు బాలకృష్ణ ఎన్టీఆర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకీ అనువదించనున్నారు. ఎన్టీఆర్‌ ప్రాజెక్టును ప్రారంభించింది మొదలు సినీ ప్రేమికులూ రాజకీయవర్గాలూ ఆ సినిమా గురించి చర్చించుకోని రోజులేదు. మొదటిభాగం ‘ఎన్టీఆర్‌-కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా జనవరి 9న వస్తుండగా, రెండో భాగం మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదలవుతుంది. ‘తెలుగు సినిమా హీరోలు’ అంటే ఎన్టీఆర్‌తోనే ఆ జాబితా మొదలవుతుంది. ఇక ‘తెలుగు రాజకీయ నాయకులు’ అంటే ఎన్టీఆర్‌ తర్వాతే మిగతా పేర్లు వచ్చి చేరుతాయి. ఈ సినిమాలో ఇలా రెండు రంగాలకు సంబంధించి ఆయన ప్రస్థానం ఉంటుంది. ఈ రెండు రంగాలకూ చెందిన వ్యక్తుల పాత్రలు ఉంటాయి. వీటికితోడు కుటుంబ సభ్యులు. అందువల్లే ఈ సినిమాలో 55 మంది ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, అడవి రాముడు, జస్టిస్‌ చౌదరి... ఇలా ఎన్టీఆర్‌ పోషించినవాటిలో 63 సినిమా పాత్రల్ని ఈ సినిమాలో చూడొచ్చట. చరిత్రకు విజయాలూ, పరాజయాలూ ఉండవు. చరిత్ర చరిత్రే. ఎన్టీఆర్‌ ఒక చరిత్ర. ఈ సినిమా కూడా చరిత్రగా నిలిచిపోతుందని ఆశిద్దాం!

యుద్ధానికి సైరా!

స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ఈ ఏడాది వస్తోన్న మరో సినిమా సైరా నరసింహారెడ్డి. చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో చేస్తున్న రెండో సినిమా ఇది. దీన్లో 1800 సంవత్సరం ప్రాంతంలో బ్రిటిష్‌ పాలకులపైన తిరుగుబాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌లో వస్తుంది. సైరాకి పరుచూరి బ్రదర్స్‌ కథ రాయగా, బుర్రా సాయిమాధవ్‌ మాటలూ, బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ స్వరాలూ అందిస్తున్నారు.

వైఎస్సార్‌ ‘యాత్ర’

తెలుగు రాజకీయ చరిత్రలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డిది ఓ ప్రత్యేక అంకం. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తోన్న సినిమా ‘యాత్ర’. రాజశేఖర్‌రెడ్డి 2003లో చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మహి రాఘవ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజశేఖర్‌రెడ్డి పాత్రను మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి పోషిస్తున్నారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో మమ్ముట్టి తెలుగు డబ్బింగ్‌ చెప్పడం విశేషం. అందుకోసం ఓ సహాయకుడిని నియమించుకుని మరీ డైలాగులు ప్రాక్టీసు చేశారట.

సైనా జీవితం కూడా..

మన తెలుగు నేలకి చెందిన ముగ్గురు షట్లర్‌ల బయోపిక్‌లు ఈ ఏడాది రాబోతున్నాయి. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ఇప్పటికే షూటింగ్‌ మొదలైంది. నటి శ్రద్ధాకపూర్‌ ఆమె పాత్ర పోషిస్తోంది. ఇక, పూసర్ల సింధు జీవితాన్ని ప్రముఖ నటుడు సోనూసూద్‌ నిర్మాతగా తెరపైకి తీసుకురాబోతున్నాడు. షట్లర్ల గురువు పుల్లెల గోపీచంద్‌ జీవితాన్ని ‘పీఎస్‌ గరుడవేగ’ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్నాడు. నటుడు సుధీర్‌బాబు గోపీచంద్‌గా కనిపిస్తాడు. ఎం.ఎస్‌.ధోనీ, మేరీకోమ్‌, అజార్‌... ఇవన్నీ బయోపిక్‌లుగా బాలీవుడ్‌లో హిట్టుకొట్టిన సినిమాలు. క్రీడాకారుల జీవితకథల్లో ప్రధాన అంశం ‘స్ఫూర్తి’ అని చెప్పాలి. సచిన్‌ తెందూల్కర్‌, ఎం.ఎస్‌.ధోనీ, మిల్కా సింగ్‌... వీళ్లంతా తమ కలల్ని నిజం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాటిని దాటి కోటిలో ఒక్కరిగా నిలిచారు. క్రీడాకారుల సినిమాలకు పిల్లలనుంచి పెద్దలవరకూ అందరి ఆదరణా ఉంటుంది. అందుకే అత్యంత విజయవంతమైన బయోపిక్‌లలో క్రీడాకారులవి మొదటి వరుసలో ఉంటున్నాయి.

సామాన్యుల కథలూ...!

సెలబ్రిటీల కథలే కాదు సామాన్యులుగా ఉంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచినవాళ్లపైనా బయోపిక్‌లు వస్తున్నాయి. పట్టుపోగుల్ని పేనడానికి ఉపయోగించే ఆసు యంత్రాన్ని కనిపెట్టి పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం కథ ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోంది. కొత్తతరం కమెడియన్‌లలో మంచి పేరుతెచ్చుకుంటున్న ప్రియదర్శి పులికొండ ఇందులో హీరోగా కనిపించబోతున్నాడు. అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు రాజ్‌ ఈ సినిమా కోసం స్క్రీన్‌ప్లే రాసి మెగాఫోన్‌ పట్టాడు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే వచ్చినవాటిలో ఎవరెస్టునెక్కిన తెలుగమ్మాయి మలావత్‌ పూర్ణ జీవితం ఆధారంగా బాలీవుడ్‌ నటుడు రాహుల్‌ బోస్‌ రూపొందించిన ‘పూర్ణ-కరేజ్‌ హ్యాజ్‌ నో లిమిట్‌’ 2017లో విమర్శకుల ప్రశంసలందుకుంది. అతితక్కువ ధరకి శానిటరీ న్యాప్‌కిన్‌లు అందించడం మొదలుపెట్టిన మురుగానందం జీవితం ఆధారంగా అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ప్యాడ్‌మ్యాన్‌’ ఎంత హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు!

రాజకీయ వేడి...

2019లో లోక్‌సభ ఎన్నికలుంటాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జమిలి ఎన్నికలు సమీపిస్తున్నవేళ రాజకీయ వేడి రాజుకుంటోంది. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌. ఎన్టీఆర్‌ తెదేపా ముఖచిత్రం, వైఎస్‌ఆర్‌ వైకాపా ముఖచిత్రాలుగా ఉన్న నేపథ్యంలో ‘ఎన్టీఆర్‌’, ‘యాత్ర’ సినిమాలు రాజకీయ వర్గాల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. కథాపరంగా రెండు సినిమాలకీ ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ పరోక్షంగా అవి ఆయా పార్టీలకు ఎంతవరకూ లాభం చేకూరుస్తాయన్న విషయంపైన అంతటా ఆసక్తి నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జీవితం ఆధారంగా ఇప్పటికే ‘ఉద్యమ సింహం’ పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆయన విజయాలపైన మరో రెండుమూడు సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. వీటిలో ఒక్కటైనా ఈ ఎన్నికల ముందు వచ్చే అవకాశాలున్నాయి. ఇక, విడుదలకు ముందే వివాదాస్పదం అవుతోన్న సినిమా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’. ట్రైలర్‌లోని డైలాగుల్ని బట్టి చూస్తే ఇది కాంగ్రెస్‌ పార్టీకి రుచించే కథలా లేదు. మరోవైపు మహారాష్ట్రలో శివ సేన పార్టీ వ్యవస్థాపకుడు, వివాదాస్పద వ్యక్తి బాల్‌ థాక్రేమీద తీసిన సినిమా ‘థాక్రే’ కూడా జనవరి 25న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడా వాతావరణం వేడెక్కింది. రాజకీయాలతో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న వ్యక్తుల జీవితకథలు ఇలా ఎన్నికల ముందు సినిమా కథలుగా రావడం ఇదివరకు ఎప్పుడూ జరగలేదనే చెప్పాలి!
- సుంకరి చంద్రశేఖర్‌

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.