close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కనురెప్పల సౌందర్యం!

కొందరి కళ్లు చూసేకొద్దీ చూడాలనిపిస్తుంటాయి. అవి విశాలంగా ఉండటం ఒక కారణమైతే, విల్లులా వంపుతిరిగిన కనుబొమలూ రెప్పల వెంట్రుకలు దట్టంగా ఉండటం మరో కారణం. అయితే కొందరికి ఇవి ఊడిపోతుండటంతో పలుచబడి బోసిగా అనిపిస్తాయి. దాంతో కృత్రిమ ఐల్యాషెస్‌మీద ఆధారపడుతుంటారు. అందుకే అవి వత్తుగా పెరగాలంటే...

* రెండుచుక్కల ఆముదంలో ఒక చుక్క లావెండర్‌ లేదా వేప నూనె వేసి బాగా కలిపి జాగ్రత్తగా రెప్పలకి రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఇలా క్రమం తప్పక చేస్తుంటే ఆముదంలోని ఫ్యాటీఆమ్లాల వల్ల అవి వత్తుగా పెరుగుతాయి. ఆముదం వద్దనుకుంటే ఆలివ్‌, కొబ్బరి లేదా బాదం నూనె రాసినా మంచిదే. ఎలాంటి కల్తీలేని స్వచ్ఛమైన పెట్రోలియం జెల్లీని రాత్రిపూట రోజూ రాసుకున్నా మంచిదే. 
* నిమ్మతొక్కని చిన్నముక్కల్లా చేసి పావుకప్పు ఆముదం లేదా ఆలివ్‌నూనెలో రెండుమూడురోజులపాటు నాననివ్వాలి. ఆ తరవాత దీన్ని రోజూ రాత్రిపూట కనురెప్పలకి రాస్తే అందులోని విటమిన్‌-ఎ, సిల కారణంగా అవి త్వరగా పెరుగుతాయి. లేదంటే టీస్పూను గ్రీన్‌టీ ఆకుల్ని తీసుకుని కప్పు వేడినీళ్లలో వేసి కాసేపు ఉంచాలి. చల్లారాక ఆ నీటిని పడుకునేముందు రాయాలి. ఈ తేనీటిని గాలిచొరని డబ్బాలో పెట్టి మూతపెడితే నాలుగురోజుల వరకూ వాడుకోవచ్చు.

భళారే... బిర్యానీ ఆకు!

బిర్యానీ ఆకులు చాలానే కొంటాం. కానీ బిర్యానీనో పులావో చేసినప్పుడు తప్ప మళ్లీ దాని సంగతే గుర్తురాదు. వాడుకోవాలేగానీ దానితో లాభాలెన్నో. ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలంనుంచీ కూడా వంటల్లోనూ సంప్రదాయవైద్యంలోనూ ఈ ఆకుని వాడుతున్నారు.
* బిర్యానీ ఆకు అజీర్తికి మంచిమందు. పోషకాలు వంటబట్టేందుకూ  తోడ్పడుతుంది. పావులీటరు నీళ్లలో నాలుగైదు ఆకులూ, చిన్నఅల్లంముక్కా వేసి పావువంతు అయ్యేవరకూ మరిగించి తేనె కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లూ ఏర్పడవు.
* ఇందులోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా రెండుమూడు ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి, ఈ ఆవిరిని పీల్చడంతోబాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం ఉంటుంది. దగ్గూ జలుబూ జ్వరాలూ తగ్గుతాయి. నీళ్లను పావువంతు అయ్యేవరకూ మరిగించి తాగినా మంచిదే. ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదుటికి పట్టిస్తే తలనొప్పి తగ్గుతుంది.
* ఈ ఆకుల్ని నీళ్లలో వేసి బాగా నానబెట్టి ఆ తరవాత వాటిని మాడుమీద బాగా రుద్ది, షాంపూ చేస్తే అందులోని పదార్థాల కారణంగా చుండ్రు పోతుంది.
* ఇందులోని పార్థినోలైడ్‌ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియెంట్‌ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పినీ మంటనీ అద్భుతంగా తగ్గిస్తుంది. అందుకే ఆయానొప్పులతో 
బాధపడేవాళ్లు దీన్ని ఆహారంలో భాగంగా తీసుకున్నా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా ఫలితం ఉంటుంది.
* ఈ ఆకుల్లోని కెఫీక్‌ ఆమ్లం, రూటిన్‌ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇంకా కెటెచిన్లూ, లినాలూల్‌, పార్థినోలైడ్‌లు క్యాన్సర్‌ 
నివారకంగానూ పనిచేస్తాయనీ తేలింది. ఆకుల్ని పొడిచేసి నెలరోజులపాటు పావుటీస్పూను చొప్పున పరగడుపున మందులా మింగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడంవల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. కాబట్టి ఎక్కువగా వంటల్లో వాడటంతోబాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తాగినా మంచిదే.

వెన్నునొప్పి... నిర్లక్ష్యం వద్దు!

ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని బాధిస్తోన్న సమస్య నడుంనొప్పి. కదలకుండా కూర్చోవడం, కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడం, ఊబకాయం, వయసు ప్రభావం... ఇలా దీనికి సవాలక్ష కారణాలు. అందుకే ప్రపంచ జనాభాలో 80 శాతం మంది తమ జీవితంలో ఒక్కసారయినా నడుంనొప్పి బారిన పడకుండా ఉండరని తేలింది. అయితే పురుషులతో పోలిస్తే 40-80 మధ్యవయసు మహిళల్లో ఈ సమస్య చాలా ఎక్కువనీ, దీర్ఘకాలికంగా వెన్నునొప్పితో బాధపడేవాళ్లు త్వరగా మరణించే అవకాశం ఉందనీ మసాచుసెట్స్‌లోని బోస్టన్‌ మెడికల్‌ సెంటర్‌కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ నొప్పి సంబంధిత వ్యక్తుల జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా నడక తగ్గిపోతుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మానసికంగానూ కుంగిపోతారు. మొత్తంగా ఇవన్నీ కలిసి మరణానికి దారితీస్తాయి. కాబట్టి దాన్ని భరిస్తూ కూర్చోవడం కన్నా తొలిదశలోనే తగ్గించుకునే ప్రయత్నం చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. అంటే జీవనశైలినీ ఆహారపుటలవాట్లనీ మార్చుకోవడం, వ్యాయామం చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వారు వివరిస్తున్నారు.

హిస్టరెక్టమీతో మతిమరుపు!

సంతానోత్పత్తిలో కీలకమైన గర్భాశయానికి శరీరంలోని ఇతర అవయవాలతో ఎలాంటి సంబంధం ఉండదు అనే ఇప్పటివరకూ భావించారు శాస్త్రపరిశోధకులు. అందుకే సంతానంతో పనిలేదు అనుకునేవాళ్లలో దాని కారణంగా చిన్న ఇబ్బంది తలెత్తినా గర్భసంచిని హిస్టరెక్టమీ ద్వారా తేలికగా తొలగిస్తుంటారు కూడా. కానీ అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అది మంచిది కాదనీ గర్భాశయం సైతం మెదడుతో అనుసంధానమై ఉంటుందనీ ఫలితంగా జ్ఞాపకశక్తిమీద కొంత ప్రభావం చూపిస్తుందనీ అంటున్నారు. అందుకే మెనోపాజ్‌కి ముందుగానే హిస్టరెక్టమీ జరిగినవారికి కాలక్రమంలో మతిమరపు వచ్చే అవకాశాలు ఎక్కువనీ హెచ్చరిస్తున్నారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.