close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ టెక్‌ పక్కాలోకల్‌!

సామాన్యుల సమస్యల్ని తీర్చడమే లక్ష్యంగా తయారుచేసిన పరికరాలివి. శాస్త్రవేత్తల సృజన పేద ప్రజల కోసం తపించి రూపొందించిన ఆవిష్కరణలివి. సాంకేతికతలోని సంక్లిష్టతనీ, వ్యయాన్నీ బాగా తగ్గించి వాటిని మామూలు ప్రజానీకానికి చేరువ చేసిన సందర్భం ఇది. వైద్య సేవల్లో కొత్త విప్లవానికి నాంది ఇది.

ఓ చిన్న అట్టముక్కతో... 

నేటికాలంలో చాలామందికి పసితనంలోనే దృష్టిలోపాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా, దూరదృష్టి, హ్రస్వదృష్టి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యలనే ‘రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌’ అంటారు. వీటిని పసిగట్టడానికి వైద్యులు ‘ఫొరాప్టర్‌’ అనే పరికరాన్ని వాడతారు. చిన్నచిన్నగా గుండ్రంగా ఉండే రకరకాల అద్దాలతో ఓ ఇనుప మాస్క్‌లా ఉంటుందీ పరికరం. దీని ధర వేలల్లో ఉండడంతో దీన్ని ఉపయోగించి చేసే పరీక్షలకీ ఎక్కువగా రుసుము వసూలు చేస్తారు. ఈ పరికరానికి బదులుగా, ప్రాథమిక దశలోనే దృష్టిలోపాలని కనిపెట్టేందుకు కేవలం అరవై రూపాయల ఖర్చుతో ఓ కాగితం ఫొరాప్టర్‌ని కనిపెట్టింది హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ కంటివైద్య కేంద్రం. ఓ టూత్‌పేస్ట్‌ అట్టపెట్టెలా ఉండే ఈ పరికరాన్ని వైద్యులూ, నిపుణుల సాయం లేకుండా ఎవరైనా ఇట్టే వాడుకోవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రభుత్వ బడుల్లోని చిన్నారి విద్యార్థులూ వాటిని వాడి తమకు తామే కంటి పరీక్షలు చేసుకోగలుగుతున్నారు. చదువురాని పెద్దవాళ్లూ ఉపయోగిస్తున్నారు. ఈ కాగితం ఫొరాప్టర్‌ లక్ష్యం కూడా అదే! దూర, దగ్గరి దృష్టిలోపాలని ముందుగా పసిగట్టలేకపోవడం వల్ల ఏర్పడే అంధత్వం ప్రపంచవ్యాప్తంగా మూడుశాతమే ఉంటే మన దేశంలో 19 శాతం వరకూ ఉందట. ఈ కంటి లోపాల్ని పసిగట్టే పరికరాలు పల్లెసీమలకి అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణం! వాటిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఎల్వీప్రసాద్‌ ఆసుపత్రిలోని సృజన్‌- ఇన్నోవేషన్‌ సెంటర్‌ దీన్ని కనిపెట్టింది. 

ఇంట్లోనే మలేరియా టెస్టు!

మలేరియా... కొన్ని నెలలపాటు బాధితులని చలిజ్వరంతో పిండి పిప్పిచేసే సమస్య. అటవీ ప్రాంతాలకి దగ్గరగా ఉన్న గ్రామాల్లో వచ్చే సెరిబ్రల్‌ మలేరియా వ్యాధి ముదిరితే మనిషి ప్రాణాలకి హామీ ఉండదు. ఈ సమస్యని వీలున్నంత ముందుగా పసిగట్టి తొందరగానే మందులూ, ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు. కానీ... గ్రామీణ ప్రాంతాల్లో అలా ముందుగా పరీక్షించే అవకాశాలు చాలా తక్కువ. అలాంటివాళ్లకోసమే ఓ చిన్న బయోచిప్‌ని తయారుచేశారు ఐఐటీ-హైదరాబాద్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పరిశోధకులు. థర్మామీటర్‌ లేదా షుగర్‌ చెక్‌ పరికరాన్ని వాడినంత సులభంగా దీన్ని ఇంట్లోనే ఉపయోగించుకోవచ్చు. మలేరియా పరీక్షకి నగరాల్లోని ఆసుపత్రుల్లో 250 నుంచి వెయ్యి రూపాయల దాకా తీసుకుంటున్నారు. కానీ ఈ కొత్త బయో చిప్‌తో ఈ ఖర్చుని యాభైరూపాయలకే పరిమితం చేయొచ్చంటున్నారు ఆవిష్కర్తలు. మలేరియా వచ్చినప్పుడు మన రక్తంలో హెచ్‌పీఆర్‌-2 అనే యాంటీజెన్‌ ఉత్పత్తవుతుంది. దాన్ని పసిగట్టి స్పందించే జింక్‌ ఆక్సైడ్‌ని ఈ చిన్న బయోచిప్‌లో పెట్టగలిగారు ఈ ఐఐటీ పరిశోధకులు. ఈ ఆవిష్కరణకు 2018కి గాను కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం అందించే గాంధీయన్‌ యంగ్‌ ఇన్నోవేటివ్‌ అవార్డునీ అందుకున్నారు. 

టీకాలు భద్రంగా...! 

ఎలక్ట్రానిక్‌ వాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌... సంక్షిప్తంగా ఈవిన్‌. ప్రభుత్వ ఉన్నత లక్ష్యాలకి ఐటీ సాంకేతికత తోడైతే ఎన్ని అద్భుతాలు చేయొచ్చో నిరూపిస్తోందీ వ్యవస్థ. ప్రస్తుతం మనదేశంలో ఐదేళ్లలోపున్న 85 శాతం మంది పిల్లలకి టీకాలు ఉచితంగా వేయగలుగుతున్నాం. ‘సార్వత్రిక వ్యాధినిరోధక కార్యక్రమం’(యూవీపీ) అనే ఈ పథకం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పకడ్బందీగా అమలుచేస్తున్నా... అప్పుడప్పుడూ టీకాలని నిల్వచేయడంలో ఏర్పడుతున్న లోపాల కారణంగా చిన్నారులకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కొన్నిసార్లు ప్రాణాలూ పోతున్నాయి. టీకాలని ఉంచే ‘కోల్డ్‌ స్టోరేజీ’ వ్యవస్థలోని ఉష్ణోగ్రతల్లో ఏర్పడుతున్న లోపాలు ఇందుకు కారణం. ‘ఈ-విన్‌’ వ్యవస్థ ఆ సమస్యని నివారిస్తుంది. ప్రతి కోల్డ్‌స్టోరేజీనీ పర్యవేక్షించే ప్రత్యేక పరికరం ద్వారా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే అధికారులకి సమాచారం చేరవేస్తుంది. ఇందుకోసం జీపీఆర్‌ఎస్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సాంకేతికతని వాడుకుంటుంది. ఐక్యరాజ్యసమితి అభివృధ్ధి పథకం(యూఎన్‌డీపీ) వాళ్ల సహకారంతో కేంద్రప్రభుత్వం దేశీయంగా తయారు చేసిన ఈ-విన్‌ని ఇప్పటికే పదమూడు రాష్ట్రాల్లోని 17 వేల స్టోరేజీ కేంద్రాల్లో వాడుతున్నారు. త్వరలోనే తెలుగురాష్ట్రాల్లోని ఆరువందల పైచిలుకు కేంద్రాలకీ దీని సేవలు అందబోతున్నాయి. కేవలం ‘కోల్డ్‌ స్టోరేజీ’ల పర్యవేక్షణే కాకుండా అసలు ఏ ప్రాథమిక కేంద్ర పరిధిలో ఎన్ని వ్యాక్సిన్లున్నాయో చూసి అవసరానికంటే తక్కువ ఉన్నప్రాంతాలకి వ్యాక్సిన్‌లు చేరవేసేలా ఈ-విన్‌ పనిచేస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.