close
‘పిల్లా రా...’ విని ముంబయి పిలిచారు!

ఆ అబ్బాయి పాట పాడితే గొంతుమాత్రమే కాదు, ప్రాణం కూడా పెట్టేస్తాడు. అందుకే అది చెవుల్లో దూరి ఆగిపోకుండా మెత్తగా హృదయాన్ని తాకుతుంది.  అతడి గొంతునుంచి వస్తే మెలోడీలోని తీయదనం, విషాదంలోని చేదుదనం, హుషారు పాటలోని కుర్రతనం... ఎన్నో రెట్లు పెరుగుతుంది. అందుకే పాతికేళ్ల అనురాగ్‌ కులకర్ణికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాటగాడితో మాట కలిపితే...

గతేడాది మంచి హిట్‌లు వచ్చినట్లున్నాయి...
అవునండీ, 2018లోనే ఎనభై పాటలు పాడాను. ఏడాది ప్రారంభంలో ‘ఛలో’ సినిమాలోని ‘చూసీ చూడంగానే నచ్చాశావే...’ పాట మంచి హిట్‌ అయింది. ఆ పాట తెలుగుతోపాటు కన్నడ, తమిళ, మలయాళీ అభిమానుల్నీ ఇచ్చింది. తర్వాత ప్రతిష్ఠాత్మక సినిమా ‘మహానటి’లో టైటిల్‌ సాంగ్‌తోపాటూ ‘మూగ మనసులు...’ పాటనీ పాడాను. తర్వాత వచ్చిన ‘ఆర్‌ఎక్స్‌ 100’లోని ‘పిల్లా రా’ నన్ను యూత్‌కి బాగా దగ్గర చేసింది. గతేడాది యూట్యూబ్‌లో అత్యధికంగా చూసిన తెలుగు పాటల్లో అదొకటి. దాదాపు మూడు నాలుగు నెలలు అదే టాప్‌లో ఉంది. మణిశర్మగారు ‘దేవదాసు’లో మూడు పాటలు పాడించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ‘ఆగి ఆగి సాగె మేఘమేదో’... పాటకు పరిశ్రమలోని చాలామంది నుంచి ప్రశంసలు అందుకున్నాను. నాక్కూడా ఆ పాట బాగా నచ్చుతుంది. కేరాఫ్‌ కంచరపాలెంలోని ‘ఆశ పాశం...’ కూడా అలాంటిదే. ఆ సినిమా సంగీత దర్శకుడు స్వీకార్‌ అగస్తి మణిశర్మగారి దగ్గర అసిస్టెంట్‌. మేం చాలా సినిమాలకి కలిసి పనిచేశాం. ఆ పరిచయంతో రెమ్యునరేషన్‌ తీసుకోకుండానే పాడాను. ఇప్పుడు దానికి వచ్చిన గుర్తింపే పెద్ద రెమ్యునరేషన్‌. ‘పడి పడి లేచె మనసు’లో ‘కల్లోలం...’ 2018కి మంచి ముగింపునిచ్చింది. సీతారామశాస్త్రిగారి సాహిత్యానికి(మహానటిలోని మూగ మనసులు, దేవదాసులోని ‘వారు వీరు’) నా గొంతివ్వడం ఎప్పటికీ మర్చిపోలేను.

ఫస్ట్‌ ఛాన్స్‌ ఎలా వచ్చింది?
2015లో... అజయ్‌ అరసాడ సంగీతం అందించిన ‘జగన్నాటకం’లో మొదటి పాట పాడాను. అందులో రెండు లైన్లే పాడాను. సూపర్‌ సింగర్‌-8లో విజేతగా నిలిచాను. ఆ కార్యక్రమానికి జడ్జిగా వచ్చిన కీరవాణిగారు ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’లో ‘క్రేజీ’ అనే పాటపాడించారు. అదే ఏడాది నిఖిల్‌ సినిమా ‘శంకరాభరణం’ సంగీత దర్శకుడు ప్రవీణ్‌ గారికి సహాయకుడిగా పనిచేశాను. ఆ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలాచోట్ల నేను పాడిన ఆలాప్‌లు వినిపిస్తాయి. 2016లో రామ్‌ సినిమా ‘హైపర్‌’లోని ‘బేబీ డాల్‌’ పాటకి మంచి గుర్తింపు వచ్చింది.

బ్రేక్‌ ఇచ్చిన పాట ఏదంటారు?
కచ్చితంగా ‘శతమానం భవతి’లోని ‘మెల్లగా తెల్లారిందోయ్‌’... అనే చెప్పాలి. అనురాగ్‌ అనే ఒక సింగర్‌ ఉన్నాడని ఈ పాటద్వారా చాలామందికి తెలిసింది. ఆ సినిమా హిట్టుకావడమే కాకుండా జాతీయ అవార్డూ అందుకుంది. తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండగ. సంక్రాంతి పాటల్లో ఇదీ ఒకటిగా వినిపిస్తోంది. ఆ సినిమా సంగీత దర్శకుడు మిక్కీ గారి దగ్గరకి నిజానికి మరో సినిమాలో కోరస్‌ కోసం వెళ్లాను. అప్పుడోపాట పాడి వినిపించాను.
‘బాగుంది నీ వాయిస్‌. చాలా ఫ్రెష్‌నెస్‌ ఉంది. ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాను. అందులో నీ గొంతును వాడేందుకే ఓ పాటను పెడతాను’ అని చెప్పిమరీ ‘మెల్లగా తెల్లారిందోయ్‌...’ అవకాశం ఇచ్చారు. ఈ పాట వచ్చిన రెండు నెలల గ్యాప్‌లో కాటమరాయుడులో ‘మిరా మిరా మీసం’ పాడాను. పవన్‌ కల్యాణ్‌ గారి పాట, అది కూడా టైటిల్‌ సాంగ్‌ కావడంతో మంచి గుర్తింపు వచ్చింది. విన్నర్‌లో ‘సూయ... సూయ’, ‘పైసా వసూల్‌’లో టైటిల్‌ సాంగ్‌, ‘లై’లో ‘మిస్‌ సన్‌షైన్‌...’ ఇలా 2017లో కూడా చాలా పాటలు హిట్‌ అయ్యాయి.

మీ పేరు వింటే ఉత్తరాది వారనిపిస్తోంది...
ఇక్కడివాణ్నేనండి. మా సొంతూరు ‘నీల’. నిజామాబాద్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. గోదావరి ఒడ్డున ఉంటుంది. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర. ఆ ఊళ్లో చాలా మరాఠా కుటుంబాలు ఉంటాయి. వాటిలో మాదీ ఒకటి. అమ్మ రమ తెలుగింటి ఆడపడుచే. వాళ్లది కామారెడ్డి. నాకు తెలుగు చదవడం, రాయడం బాగా వచ్చు. ఇంట్లో పెద్దవాళ్లంతా మరాఠీ మాట్లాడతారు. అలా రెండు భాషలూ వచ్చాయి. నాన్న మారుతిరావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. ఆయన ఉద్యోగరీత్యా నిజామాబాద్‌, భువనగిరి... ఇలా తెలంగాణలో చాలా ఊళ్లు తిరిగాం. చివరకు హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. మీ జీవితంలోకి పాట ఎలా వచ్చింది? ఇంట్లో పెద్దవాళ్లంతా రేడియోలో పాటలు బాగా వినేవారు. పండిట్‌ భీమ్‌సేన్‌ జోషి సంగీతం అంటే అందరికీ ఇష్టం. మా ఇంట్లో పూజలు ఎక్కువగా చేస్తారు. నేను మొదట్లో దేవుడి పాటలు నేర్చుకున్నాను. మేం మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి భక్తులం. నా చిన్నపుడు ఓసారి ఆయన కామారెడ్డి వచ్చారు. అపుడు స్టేజీమీద పిల్లలచేత పాటలు పాడించారు. నేను కూడా ఆరోజు పాడాను. నా పాట విన్నాక ఆయన నన్ను దగ్గరికి పిలిచి ‘నీ గొంతు బావుంది, సంగీతం నేర్చుకో. మంచి సంగీతకారుడివి అవుతావు’ అని చెప్పారు. ఆయన చెప్పిన మాటల్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఎనిమిదో తరగతిలో ఉండగా నాకు సంగీతంలో శిక్షణ ఇప్పించాలని మా కుటుంబం హైదరాబాద్‌ వచ్చింది. నేను హిందూస్థానీ సంగీతం వింటూ పెరిగాను. కాబట్టి అందులోనే శిక్షణ తీసుకోవాలనుకున్నాను. మూడేళ్లపాటు గురువుకోసం వెతికాకకానీ జంగయ్య గారి గురించి మాకు తెలియలేదు. అప్పటికి నేను ఇంటర్మీడియెట్‌కి వచ్చాను. అప్పుడు నేర్చుకోవడం మంచిదా, కాదా అన్న డౌట్‌ మొదలైంది. ఇన్నాళ్లు ప్రయత్నించి ఇప్పుడు వెనక్కి తగ్గడం మంచిది కాదని వెళ్లి జంగయ్యగారిని కలిశాం. ఆయనకు నా గొంతు నచ్చి డబ్బు గురించి పట్టించుకోకుండా క్లాసులు చెప్పడానికి సరేనన్నారు. దాదాపు నాలుగేళ్లపాటు ఆయన దగ్గర శిష్యరికం చేశాను. క్లాసులో నేను ఒక్కణ్నే. ఆయనకు చిన్నపుడే అంధత్వం వచ్చింది. దానివల్లనేమో గ్రాహకశక్తి కూడా ఎక్కువగా ఉండేది. ఏ విషయాన్నైనా చాలా లోతుగా వెళ్లి నేర్పేవారు. మా శిక్షణకు టైమ్‌ లిమిట్‌ అంటూ ఉండేదికాదు. ఒక్కోసారి మూడు గంటలపాటు కూడా సాగేది. 2012లో ఆయన చనిపోయేంతవరకూ అలా నేర్చుకున్నాను. కొన్ని విషయాల్ని చెబుతూ... ‘నీకు అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకో. మన్ముందు అర్థమవుతాయి’ అనేవారు. ఆయన భీమ్‌సేన్‌ జోషీతో కలిసి కచేరీలు చేశారు. వినడంద్వారా నిత్య విద్యార్థిగా ఎలా ఉండొచ్చో చెప్పారు. అందుకే నేను నిత్యం ఇంగ్లిష్‌, మెక్సికన్‌, జర్మన్‌, అరబ్‌... ఇలా అన్ని భాషల సంగీతాన్నీ వింటుంటాను. ఆయన దగ్గర సంగీతం
నేర్చుకుంటూ, ఆ తర్వాత ‘సప్త స్వరాలు’, ‘పాడుతాతీయగా’, ‘ఐడియా రాక్స్‌ ఇండియా’ లాంటి రియాలిటీ షోలకూ వెళ్లాను.

చదువు సంగతి...
చదువులో మొదట్నుంచీ ముందుండేవాణ్ని. ఎప్పుడూ మార్కులు 80 శాతానికి తగ్గింది లేదు. ఇంట్లో కూడా ‘చదువు తర్వాతే ఏదైనా’ అన్నట్టు ఉండేవారు. హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ కాలేజీలో ఇంజినీరింగ్‌ చదివాను. కాలేజీలో ఫ్రెండ్స్‌తో కలిసి రాక్‌బ్యాండ్‌ని కూడా ఏర్పాటుచేశాను. ఇంజినీరింగ్‌ తర్వాత ఉద్యోగమా, సంగీతమా అన్న కన్‌ఫ్యూజన్‌ బాగా ఉండేది. సరిగ్గా అప్పుడే సూపర్‌ సింగర్‌లో అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమం తర్వాత మళ్లీ గ్యాప్‌. చెన్నై వెళ్లి ఎనిమిదినెలలపాటు ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశాను. అక్కడే పాటలకోసం ప్రయత్నం చేద్దామని ఉండేది. కానీ తెలియని చోట, తెలియని భాషలో అవకాశాల కోసం ప్రయత్నించడం సరికాదేమో అనిపించింది. చివరకు ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ‘అమ్మో ఒకవేళ అవకాశాలు రాకపోతే’ అన్న భయం మొదలైంది. ‘రాకపోతే అప్పుడు మళ్లీ ఉద్యోగం వెతుక్కుందాం’ అనుకుని హైదరాబాద్‌ వచ్చేశాను. మళ్లీ కొన్ని నెలల గ్యాప్‌. అనూప్‌ రూబెన్స్‌ గారి బంధువుల్లో ఒకరు నాన్నకు స్నేహితుడు. ఓరోజు ఆయన సాయంతో అనూప్‌ సర్‌ని కలిశాను. ఆయన నా వాయిస్‌ విని... ‘ఇలాంటి వాయిస్‌ కోసం చాలా రోజులుగా చూస్తున్నాను’ అన్నారు. ఆ తర్వాత నుంచి ఆయన దగ్గర కోరస్‌, ట్రాక్‌లు పాడుతుండేవాణ్ని.

ఇతర భాషల్లో పాడారా?
మహానటిలో నేను పాడిన రెండు పాటల్నీ తమిళ వెర్షన్‌లోనూ నాచేతే పాడించారు. ‘రోషగాడు’ సినిమాలో ఓ డబ్బింగ్‌ పాట పాడటానికి చెన్నై వెళ్లాను. విజయ్‌ ఆంటోనికి నా వాయిస్‌ నచ్చి తమిళ వెర్షన్‌నీ నాచేతే పాడించారు. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’ని మలయాళంలో డబ్‌ చేశారు. అక్కడ పాడాను. ఛలో సంగీత దర్శకుడు సాగర్‌... ‘కుమారి 21ఎఫ్‌’ కన్నడ రీమేక్‌కి పనిచేశారు. అలా కన్నడలోనూ అవకాశం వచ్చింది. బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదుకానీ ఓ హిందీ ఆల్బమ్‌ కోసమైతే పాడాను. బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది చేస్తున్న ఓ తెలుగు సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారు. యూట్యూబ్‌లో ‘పిల్లా రా’ పాట చూసి నాకు ఆ ఛాన్స్‌ ఇచ్చారు. తమిళ దర్శకుడు డి.ఇమాన్‌ కూడా ఆ పాట వినే డబ్బింగ్‌ సినిమా ‘గజరాజు’లో అవకాశం ఇచ్చారు. తెలుగు సినిమాల్లో పాడటానికి చెన్నై, ముంబయిల నుంచి గాయకులు వస్తున్న ట్రెండ్‌ మారి మనవాళ్లు అక్కడికి వెళ్లివచ్చే రోజు రావాలన్నది నా కల.

పాడటం వరకేనా...
ఇప్పటివరకూ అయితే పాడటం వరకే. ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ కూడా నేర్చుకుంటే బావుంటుందనిపించి ఈ మధ్యనే పియానో సాధన మొదలుపెట్టాను. ఇది నా సంగీత సాధనకు ఒక కొనసాగింపులా ఉంటుందన్న ఉద్దేశంతోనూ చేస్తున్నాను.

పాటతో ప్రయాణం ఎలా ఉంది?
చాలా సంతృప్తికరంగా ఉందండీ. నా చిన్నపుడు తెలుగు సినిమా వజ్రోత్సవాల వేడుకల్లో పాట పాడాను. ఆ వేదికమీద మహామహుల్ని చూశాను. అప్పుడే సింగర్‌ అవ్వాలన్న కోరిక బలంగా నాటుకుంది. దానికోసం ఎంత కష్టమైనా పడాలనుకున్నాను. మొదట్లో కోరస్‌, బ్యాక్‌గ్రౌండ్‌లోనూ పాడించేవారు. తర్వాత ట్రాక్‌లు పాడాను. ‘చూసీ చూడంగానే...’ అలా పాడిందే. చివరకు అదే ఫైనల్‌ చేశారు. ‘మిరా మిరా మీసం’ పాట ట్రాక్‌ పాడాను. ఆ తర్వాత అయిదారుగురిచేత పాడించారు. ఆ వెర్షన్లన్నీ విన్న దర్శకుడు నా వాయిస్‌నే ఉంచమని చెప్పారట. మహానటి సమయంలో కూడా సంగీత దర్శకుడు మిక్కీ నాచేత పాడించినపుడు... ‘ఈ సినిమాలో విజువల్స్‌కి సరిపోయే పాటలే ఉంటాయి. మనం చేస్తున్నవి చివరి వరకూ ఉంటాయో లేదో తెలీదు. ఒక వేళ ఉన్నా... దర్శక నిర్మాతలు వేరేవాళ్లచేత పాడిస్తామంటే నేను అడ్డు చెప్పలేను’ అని ముందే చెప్పారు. కానీ అందరికీ నచ్చి నేను పాడిన పాటల్ని ఉంచారు. అవకాశం చిన్నదా, పెద్దదా అని చూడకుండా వచ్చినవన్నీ వినియోగించుకుంటున్నాను. అదృష్టవశాత్తూ నేను అందరు దర్శకుల దగ్గరా పాడాను. ఒకసారి పాడించినవాళ్లే మళ్లీ మళ్లీ నాచేత పాడిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కొందరు దర్శకులు నా వాయిస్‌ కావాలని పిలిచి నేరుగా పాడిస్తున్నారు. సీనియర్లయిన మణిశర్మ, కీరవాణి... వీళ్లంతా బాలూగారి లాంటి సీనియర్లతో పనిచేశారు. ఆ అనుభవంతో నాలాంటి వాళ్లకి చాలా విషయాల్ని చెబుతుంటారు. నిజంగా చెప్పాలంటే ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఆ నేర్చుకోవడం ఎప్పటికీ ఆగకూడదని అనుకుంటున్నాను.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.