close
ఈమాత్రం

 కంఠిమహంతి విజయ పద్మజ

‘‘ఈ విషయాన్ని మీరు అన్నయ్య దగ్గర ప్రస్తావించవలసిందే, అంతేకాదు అన్నయ్యని ఒప్పించవలసిందే. తప్పదుగాక తప్పదు’’ కొంచెం కఠినత్వం కలిసిన గొంతుతో ‘ఇదే నిశ్చయం సుమా’ అని ధ్వనించింది ఆమె మాట.

‘‘నా మాట విను రాధా, అలా అడగడం భావ్యం కాదని నా ఉద్దేశ్యం’’ అనునయంగా అన్నాను.

‘‘ఈ విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాటా వినేదిలేదు’’ తెగేసి చెప్పింది.

‘‘అంటే నేను నీ మాటే వినాలన్నమాట’’ కాస్త కోపంగా అన్నాను.

‘‘అవును’’ నొక్కి వక్కాణించింది.

‘‘ఇదిమాత్రం నావల్ల కాదు రాధా! మధు నీ అన్నయ్య అన్నమాటేగానీ, అంతకంటే ఎక్కువగా నా ఆప్తమిత్రుడు. నా ఆప్తమిత్రుడ్ని ‘ఒరేయ్‌ బావా, నీ కూతుర్ని నా కోడలిగా చేసుకోవాలంటే పదిలక్షలు కట్నంగా సమర్పించాల్సిందే’ అని నేను అడగను, అడగలేను’’ ఉరిమిచూడ్డం చేతగాక అసహాయంగా అన్నాను. ‘‘అదీగాక ఈ విషయం మన అభీకి తెలిస్తే వాడు మన గురించి ఏమనుకుంటాడో ఆలోచించావా? మిగతావారి మనసులో కూడా కొడుక్కి రేటు కట్టారు అనే భావన చోటుచేసుకోదా!’’

‘‘కొడుక్కి రేటు కట్టడం అనేమాట వాడొద్దన్నానా? ఇపుడు కట్నం తీసుకోవడం అంత విపరీత విషయం ఏం కాదుగా. మొన్నటికి మొన్న మీ కొలీగ్‌ రామారావుగారు సాధారణ బ్యాంకు క్లర్క్‌ అయిన తన కొడుక్కి యాభై లక్షలు తీసుకున్నారు. ఎవరైనా ఇది అన్యాయం అన్నారా? నిన్నటికి నిన్న మన పనిమనిషి రావుడు తన వాచ్‌మేన్‌ కొడుక్కి మూడు లక్షలు తీసుకుంది. వారంక్రితం మీ మేనత్త మనవడికి...’’ మాటల ప్రవాహాన్ని అడ్డుకోక తప్పలేదు నాకు.

‘‘ఎవరి విషయమో మనకెందుకు? ఎవరి ఇష్టాయిష్టాలు వారివి. ఎవరి పరిస్థితులు వారివి.’’

‘‘అదే... ఆ మాటే చెప్పేది నేను కూడా. ఇపుడు ఎవరూ ఎవర్నీ పట్టించుకునే రోజులు కాదు. పైగా మీ ఆదర్శానికి భంగం కలగకుండా ఉండేలా ఈ విషయం ఎవరికీ తెలీకుండా ఉంచాలనే షరతు విధిద్దాం.’’

సంభాషణా నిడివి పెరుగుతున్నకొద్దీ నా భార్య నా దృష్టిలో చిన్నగా కన్పించడం మొదలైంది. దాదాపు ఇదే వాదన కొంచెం అటూ ఇటూ తేడాగా నాలుగు రోజుల్నుంచీ మామధ్య జరుగుతోంది. ఈ ముప్ఫై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇంత తీవ్ర వాగ్వివాదం నాకు తెలిసీ ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఎలాంటి వాదోపవాదాలూ జరగలేదని కాదు. పిల్లల పెంపకం విషయాల్లో, వారి కెరీర్‌ ఎంపిక విషయాల్లో చాలా జరిగాయి. కానీ ఇంత తీవ్రరూపం దాల్చడం ఇదే ప్రథమం. నిజానికి రాధని నా భార్య అనడంకంటే నా జీవితభాగస్వామి అంటేనే సబబుగా ఉంటుంది.

నేను ఒక పేరున్న బ్యాంకులో ఆఫీసరు హోదాలో ఉంటూ, సమాజం దృష్టిలో సక్సెస్‌ఫుల్‌ జీవితం గడుపుతున్న లిస్టులో పేరు కొట్టేశానంటే అందులో రాధ పాత్ర తక్కువేమీ కాదు. పెళ్ళయిన కొత్తల్లోనే తను టీచరుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసింది. తరచూ బదిలీలతోపాటు కాస్తయినా రోజులో ఖాళీ సమయం దొరకని నా ఉద్యోగ బాధ్యతే అందుకు కారణం. నా ఉద్యోగ ధర్మాన్ని మనస్ఫూర్తిగా, స్వేచ్ఛగా నిర్వర్తించగలుగుతున్నానంటే అందుకు కారణం రాధ సహకారం మాత్రమే. సాధారణంగా ఇంటి బాధ్యతలన్నీ ఆమె ఆధ్వర్యంలోనే తొంభైతొమ్మిది శాతం జరిగిపోతుంటాయి. మిగిలిన ఆ ఒక్క శాతం నాదైనప్పటికీ అందులో పిల్లల పాఠశాల పేరెంట్‌్్స మీటింగ్‌లకి హాజరవడమూ, సెలవుల్లో విహారయాత్రలూ, దగ్గరి బంధువుల ఇళ్ళల్లో జరిగే ముఖ్య కార్యక్రమాలకి హాజరవడమూ, అవసరమైన ఫోన్‌ సంభాషణలూ వంటివే ఉంటాయి. ఎంత బిజీలోనైనా కనీసం ఓ అరగంట కుటుంబంతో గడపడం అనే మహత్తర బాధ్యత మాత్రమే అన్నింటిలోకీ పెద్ద బాధ్యత. ఇక పిల్లల పెంపకమూ వారి చదువులూ వాటి సంబంధిత సమస్యలూ వీలయినంత వరకూ నా వరకూ రానిచ్చేది కాదు రాధ. నాకిద్దరు సంతానం. అందులో ఇందు తొలి సంతానం కాగా... అభిలాష్‌ మలి సంతానం. ఇందు ఇంజినీరింగ్‌ పూర్తిచేసి ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సంవత్సరం క్రితమే అదే కంపెనీలో పనిచేస్తున్న రవికిచ్చి వివాహం జరిపించాం. ఊర్లోనే ఉద్యోగాలు అవడంతో ఆడపిల్లని పెళ్ళిచేసి పంపాం అన్న బాధ లేకుండా కనీసం వారానికొక్కసారైనా ఇంటికి వస్తూపోతూ ఉంటుంది. ఇక అబ్బాయి అభిలాష్‌ సి.ఎ. పూర్తిచేసి సక్సెస్‌ఫుల్‌ ఆడిటర్‌గా సెటిలైపోయాడు. ఈమధ్యే వాడికి పెళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాం. ప్రయత్నాలు అంటే సంబంధాల కోసం వెతకడం, పెళ్ళిచూపులకు వెళ్ళడం లాంటి బాదరబందీలేవీ కాదు. ఎందుకంటే మా బావమరిది కూతురు సుధని కోడలుగా చేసుకోవాలనే అభిప్రాయం అది పుట్టినప్పట్నుంచీ మాలో ఉన్నప్పటికీ ఆ అభిప్రాయం నిర్ణయంగా మారడానికి బావా మరదళ్ళు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అత్యంత ఉత్సాహంగా అందరమూ పెళ్ళి పనుల్లోకి దిగాం. ఈ సందడిలో ఎక్కువ భాగం షాపింగ్‌లే ఆక్రమించాయి.

దాదాపు ప్రతిరోజూ పిల్లలు షాపింగ్‌లకి వెళ్తూనే ఉన్నారు. మిగతా పనులు రాధా, వాళ్ళన్నయ్యా వదినా చూసుకుంటున్నారు. ఇటువంటి ఆనందాల వెల్లువలో ఒక పెద్ద బండరాయి పడింది. ఆ బండ ఎవరో పరాయివాళ్ళు కాదు, నా శ్రీమతి రాధే పడెయ్యడం నా దురదృష్టం కాక మరేమిటి? అదేంటంటే- పెళ్ళికి వరకట్నంగా పది లక్షలకి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా క్యాష్‌ రూపంలో ఇవ్వాలనేది ఆమె డిమాండు. పైగా ఒక షరతు కూడా పెట్టింది. ఈ విషయం మా ఇద్దరు దంపతులకీ వాళ్ళ అన్నావదినలకూ తప్ప ఎవరికీ తెలీకూడదనేది. ఈ షరతు వలన ఇందూ, అభి మద్దతు పొందే అవకాశం కూడా నాకు లేకపోయింది. ఇలాంటి వాగ్వివాదాలు చేయడంలో, అదీ నా బెటర్‌హాఫ్‌ రాధతో అంటే నేనే ఓడిపోవడం ఖాయం.

‘‘అన్నయ్యా వదినా వచ్చారు, రండి’’ అన్న రాధ మాటలతో నా ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చాను. ఎప్పటి చనువుతో మధుమూర్తి కళ్ళలో కళ్ళుపెట్టి పలకరించలేకపోయాను. మధు వయసులో నాకంటే పది సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ రాధలాంటి అందమైన యువతికి అన్నయ్య అనే అర్హత నాకు అతనితో స్నేహం చేయాల్సిన అవసరాన్ని కలిగించింది. స్నేహం మొదలుకావడానికి హేతువు రాధే అయినప్పటికీ అతని మృదుస్వభావం, స్నేహపూరిత ప్రవర్తనా తొందరలోనే ‘మీరు’ అనే సంబోధన నుండి ‘ఒరేయ్‌’ అనుకునే చనువు వరకూ తీసుకెళ్ళాయి. ఆ తర్వాత కాలంలో రాధ నా శ్రీమతి కావడంతో మిత్రత్వం, బంధుత్వంతో కలగలిసి అరమరికలులేని బంధంగా రూపుదాల్చింది. అలాంటి మా ఇద్దరు మిత్రుల పిల్లల వివాహానికి నా శ్రీమతి ముడిపెట్టిన షరతుల్ని ప్రస్తావించడం నాతరం కావడం లేదు. వాళ్ళ ఎదురుగా అన్యమనస్కంగా కూర్చొని ఉన్నాను. ఇంతలో సెల్‌ మోగింది. వీడియోకాల్‌. నా కాబోయే కోడలు సుధ ఏదో షాపు నుంచి చేసినట్లుంది. ‘‘మామయ్యా, ఈ డ్రెస్‌ నాకెలా ఉంటుందీ’’ అని అడుగుతోంది. ఏది కొనుక్కోవాలన్నా- ఆఖరికి నెయిల్‌పాలిష్‌ అయినా సరే, ‘మామయ్యా, నాకిది ఎలా ఉందీ’ అని అది అడగడం, ‘చాలా బాగుంది’ అని నేను చెప్పడం, దాని చిన్నప్పటి నుండీ రివాజు. సుధ అంటే నాకు చాలా గారాబం. నా ఒళ్ళో పెరిగిన పిల్ల. దానికి మధు దగ్గరకంటే నా దగ్గర విపరీతమైన చనువు. వాళ్ళమ్మా నాన్నలతో దెబ్బలాడిన ప్రతిసారీ నావద్దకే వచ్చేస్తుంది. నేను వాళ్ళని మందలించే వరకూ తన పంతాన్ని వీడదు. అన్నీ ‘మీ అత్త పోలికలే’ అని మురిపెంగా అనడం నాకెంతో ఇష్టం. కట్నం అడిగి ఆ పిల్లముఖం ఇకముందు నేను ఎలా చూడగలను అన్పించింది.

‘‘ఓస్‌ ఇంతేనా బావా! ఇది చెప్పడానికి ఇంత మొహమాటపడతావేం. అసలు నీకో విషయం చెప్పాలి. నీ చెల్లీ నేనూ కలిసి అలక సంబరంలో అల్లుడికి ఐ20 కారు ఇచ్చిసర్‌ప్రైజ్‌ చెయ్యాలనుకున్నాం. దాన్ని మీరు క్యాష్‌ రూపంలో ఇవ్వమంటున్నారు, అంతేకదా. మాకేం అభ్యంతరం లేదు.’’

‘‘ఏమండీ! అన్నయ్యా వదినలతో మాట్లాడుతుండండి, కాఫీ తెస్తాను’’ అని హెచ్చరికగా అంది రాధ.

బేలగా ఆమె వైపు చూశాను. హూంకరించినట్లుగా కనుసైగ చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇక తప్పేలా లేదు మరి! ఎలాగో నోరు పెగల్చుకుని ఈ విషయం చెప్పాను. మధు కళ్ళల్లో నాపట్ల ఉండే స్నేహభావం దెబ్బతినడం చూడలేక తల వంచుకున్నాను. ‘‘ఓస్‌ ఇంతేనా బావా! ఇది చెప్పడానికి ఇంత మొహమాటపడతావేం. అసలు నీకో విషయం చెప్పాలి. నీ చెల్లీ నేనూ కలిసి అలక సంబరంలో అల్లుడికి ఐ20 కారు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చెయ్యాలనుకున్నాం. దాన్ని మీరు క్యాష్‌ రూపంలో ఇవ్వమంటున్నారు, అంతేకదా. మాకేం అభ్యంతరం లేదు. సి.ఎ. అల్లుడంటే యాభై లక్షలైనా ఇవ్వాలని నా కొలీగ్స్‌ అంటున్నారు. కానీ నాకు అంత స్థోమత లేదు కదా. ఈమాత్రం అడగడం మీ మంచితనంకాక మరేమిటి?’’ అంటూ తబ్బిబ్బయిపోవడంలో లేశమాత్రం వ్యంగ్యభావం లేకపోయినా నేను తలెత్తుకోలేకపోయాను. నన్ను రక్షించడానికే అన్నట్టు సెల్‌ మోగడంతో ఆ సాకుగా నా గదిలోకి వెళ్ళిపోయాను. నా మనసంతా అవమానభారంతో నిండిపోయింది. ఇలాంటి పరిస్థితి కల్పించిన రాధపైన పీకలదాకా కోపం వచ్చింది.

మధుమూర్తి ఒక సాధారణ ఉద్యోగి స్థాయి నుండీ రిటైరయ్యేనాటికి సూపరింటెండెంట్‌ హోదా పొంది ఈమధ్యే పదవీ విరమణ చేశాడు. ఇంటికి అతనే పెద్దకొడుకు అవడంతో తమ్ముళ్ళూ చెల్లెళ్ళ బాధ్యతలు తండ్రితో పంచుకోవడంలోనే సగం సర్వీసు పూర్తి చేసుకున్నాడు. తదనంతరం అతని ముగ్గురు కూతుళ్ళ బాధ్యతలూ మొదలయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె వివాహం చేశాడు. నా కోడలు కాబోతున్న సుధ రెండవది. సుధ తర్వాత అయిదు సంవత్సరాలకు మూడవ కూతురు రమ్య పుట్టడంతో ఆ అమ్మాయి ఇంకా ఇంటర్‌ చదువులోనే ఉంది. రిటైరయ్యేనాటికి నాకు తెలిసి 10 నుండి 15 లక్షలు రిటైర్మెంట్‌ సొమ్మూ, తండ్రి ద్వారా సంక్రమించిన చిన్న డాబా ఇల్లూ, నెలకు ముప్ఫైవేలు పెన్షన్‌ మధు చేతిలో ఉన్న స్థిర చరాస్థులు. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని కట్నం అడగడం నాకు మింగుడుపడని విషయంగా ఉంది. ఎప్పుడూ రాధలో కన్పించని ఈ చీకటి ఛాయలు నన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. ఇన్నేళ్ళ నా వైవాహిక జీవితంలో ఆమెలో నేను చూడని కోణం ఇది.

*

రేపు నాకెంతో ఇష్టమైన రోజు. అక్టోబరు 26, నా పుట్టినరోజు. అదేంటోగానీ నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ పుట్టినరోజు ఒక ప్రత్యేక దినంగా జరుపుకోవడం నాకెంతో ఇష్టమైన విషయాల్లో ఒకటి. చిన్నప్పుడు అలా జరుపుకోవడం సహజమే కానీ యాబైల్లో పడిన ప్రస్తుత కాలంలో కూడా ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటాను. ఆరోజు ఎన్ని పనులున్నా పక్కనపెట్టి ఉదయాన్నే కుటుంబసభ్యులందరమూ గుడికి వెళ్ళివచ్చాక సాయంత్రం వరకూ నవ్వుల్లో గడపడం, సాయంత్రం సమయం కేవలం రాధా నేనూ మాత్రమే మా దాంపత్య అనుభూతుల్ని కలబోసుకుంటూ ఏ బీచ్‌ ఒడ్డునో గడపడం రివాజు. అటువంటి సమయంలో నేను ఊహించని బహుమతి ఇవ్వడం ద్వారా రాధ నన్ను విస్మయానికి గురిచేస్తుంది. అలా రాధ ద్వారా నేను పొందిన బహుమతుల్లో తలమానికమైనది ‘తండ్రి హోదా’. ఇంతలా నాకోసం చేసే రాధ పుట్టినరోజు మాత్రం నేను మరిచిపోతుంటాను. రేపటి పుట్టినరోజుని మాత్రం ఆనందంగా జరుపుకోలేనేమో అని భయపడుతూ కలత నిద్రపోయాను.

వేకువజామునే ఎవరో తట్టినట్లుగా ఉలికిపాటుగా కళ్ళు విప్పాను. రాధ లేపింది. నేను కళ్ళు తెరిచేసరికి నా గుండెలపైన తలపెట్టి తన అందమైన కళ్ళని కొంచెంగా ఎత్తి ప్రేమగా నా కళ్ళల్లోకి చూస్తూ ‘‘జన్మదిన శుభాకాంక్షలు’’ మత్తుగా చెప్పింది. వెంటనే తలవంచి ఆమె నుదుటిపై చిరుముద్దుతో కృతజ్ఞతలు చెప్పాను. కానీ రాధ అలా నన్ను అంటిపెట్టుకుని ఉంటే తొలిసారి కాస్త ఇబ్బంది ఫీలయ్యాను. అది గ్రహించినట్లుగా కొంచెం పక్కకి జరిగి పడుకుంటూ ‘‘మీరలా ఫీలవడం ఇప్పటి పరిస్థితుల్లో చాలా సహజం’’ అంది. అదే ఆమె గొప్పదనం. ఆమె దగ్గర నా హృదయం కూడా నన్ను మోసగిస్తుంటుంది, రహస్యాలన్నీ ఆమెకి వెంటనే చేరవేయడం ద్వారా. ఇలాంటి ఆమె వశీకరణశక్తి చూసి అప్పుడప్పుడూ ఈర్ష్యకి గురవుతుంటాను. ‘రాధ నన్ను ప్రేమించినంతగా నేను ఆమెని ప్రేమించలేకపోతున్నానా?’ అనే అనుమానం కూడా నాలో రేగుతుంటుంది. కోపంగా ఉన్నా కదా... నేనేం మాట్లాడలేదు. ఆమె నావైపు వత్తిగిలి తన కుడిచేతిని నా గుండెలపైన వేసింది. ఆ చేతిని విసిరికొడదామని మరీమరీ అనిపించింది. కానీ ఏదో అశక్తత నన్ను ఆపేసింది.

‘‘నేనలా చేయడానికి కారణం ఉంది’’ అంటూ మొదలుపెట్టింది రాధ. ‘ఏమిటి’ అని నేనడగలేదు. తన మాటల్ని కొనసాగిస్తూ ‘‘నాకు ఊహ తెలిసిన దగ్గర్నుంచీ నేను గమనించిందేమంటే పెద్దన్నయ్య ఇంటి బాధ్యతల్లో నాన్నకు ఎంతో సహాయంగా ఉండేవాడు. నేనూ చిన్నక్కా పెద్దక్కా చిన్నన్నయ్యా అందరం మాకేం కావాలన్నా నాన్నని అడగడానికి కొంచెం భయపడేవాళ్ళం. పెద్దన్నయ్యనే అడగడం అలవాటు. ఎప్పుడూ ‘లేదు, కాదు’ అనే మాటలు వాడి నోటివెంట విన్నట్లు నాకు గుర్తులేదు. వాడికి ఉద్యోగం వచ్చిన కొత్తలోనే మా ఆఖరి మేనత్త పెళ్ళయింది. వాడి మొదటి జీతం కూడా ఆ పెళ్ళికే ఖర్చుపెట్టిన గుర్తు. ఆ తర్వాత పెద్దక్క పెళ్ళీ, మా అందరి చదువులూ పెళ్ళిళ్ళూ వాడి భుజాల ఆసరాతోనే నాన్న చెయ్యగలిగారు. నా పెళ్ళయిన మూడు సంవత్సరాలకి అన్నయ్య పెద్దకూతురు పుట్టింది. అదే సమయంలోనే మన ఇందూ, తర్వాత అభి. ఇక్కడ మన పిల్లల ప్రసక్తి ఎందుకంటే నా పురుళ్ళ భారం కూడా
అన్నయ్యదే కదా! ఆ తర్వాత సుధ, మరో అయిదేళ్ళకి రమ్య. వాడి జీవితం ఎప్పుడూ బాధ్యతల ముంపులోనే ఉక్కిరిబిక్కిరి అయింది. చివరికి రిటైరయ్యేనాటికి ఇంటర్‌ చదువుతోన్న రమ్య మరో బాధ్యతగా మిగిలింది. నేను పది లక్షల కట్నం కోరడానికి ఇదే ముఖ్య కారణం.’’

‘‘అమాయకంగా మా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ ‘బావా, నాకున్నది ఒక్కగానొక్క మగపిల్లవాడు. వాడి పెళ్ళి పూర్తిగా మా ఖర్చుతోనే చెయ్యాలని మీ చెల్లి దేముడికి మొక్కుకుందట. ఈమాత్రమైనా భార్య కోరిక తీర్చవలసిన బాధ్యత నాదే కదా, ఏమంటావ్‌?’ అని చెప్పాలి.’’

మోకాలికీ బోడిగుండుకీ లింకు లాగే ఉందే! కోపాన్ని కుతూహలం క్రమంగా జయించగా నేను ఆసక్తిగా ఆమెవైపు తిరిగాను.

‘‘దానికీ దీనికీ లింకేమిటీ అనే కదా మీ అనుమానం! పెద్దల నుండి అన్నయ్యకు తాతలనాటి ఇంటితోపాటు మధ్యతరగతి మానుకోలేని భేషజాలన్నీ వారసత్వంగా అందాయి. అక్కచెల్లెళ్ళ రాకపోకలూ పురుళ్ళూ బారసాలలూ వాళ్ళ పిల్లల రజస్వల సంబరాల్లో మేనమామ పాత్ర, ఆ తర్వాత కూతుళ్ళ బాధ్యతలూ ఇవన్నీను. వీటన్నిటికీ మూలకారణం అయిన మాట ఒకటుంటుంది- ఇంటికి పెద్దకొడుకు! ఇంకోటేంటంటే, ‘ఈ ముచ్చట మళ్ళీ మళ్ళీ వస్తుందా... ఈమాత్రం చెయ్యకపోతే ఎలా?’ అనే పెద్దల జనాంతిక వాక్యాలు. ‘ఈమాత్రం’ అనేమాట మధ్యతరగతి వారికి ఒక శాపం. ఈమాట దేన్నీ మానుకోనివ్వదు, అసలు మానుకోవాలనే ఆలోచన్నే దగ్గరికి రానివ్వదు. ప్రతీ సందర్భంలోనూ
ఈమాటే మా అన్నయ్యని అప్పుల ఊబిలోకి నెట్టేసింది’’ ఆపింది.

‘‘అందుకే గదా, నేను...’’ నేననబోయే మాటల్ని ‘నన్ను పూర్తి చేయనివ్వండి’ అనే అర్థవంతమైన రాధ చూపు ఆపింది.

‘‘ఆ తర్వాత సుధకి ఉద్యోగం వచ్చాక తండ్రి చేసిన అప్పులు క్రమంగా తీర్చడంతోపాటు ఇక ఎలాంటి అప్పూ చేయకూడదని కట్టడి చేశారు ముగ్గురు కూతుళ్ళూ. అతి కష్టం మీద నాకే ‘అప్పూ లేదు’ అనే భరోసాతో రిటైరవ్వగలిగాడు. ఇంకా ముందుముందు చుట్టుముట్టడానికి అవకాశంగల అనారోగ్య సమస్యలు ఉంటాయి. రమ్య పెళ్ళి బాధ్యత ఎటూ మిగిలే ఉంది. ఇప్పుడు ఈ పెళ్ళితో మళ్ళీ ‘ఈమాత్రం సి.ఎ. అల్లుడికి ఇవ్వకపోతే ఎలా?’ అంటూ కారు రూపంలో ‘ఈమాత్రాన్ని’ నిద్రలేపాడు. ఈ విషయం సుధ ద్వారా తెలుసుకున్న నేను బాగా ఆలోచించి ‘కట్నం’ రూపంలో చెక్‌ పెట్టడానికి నిర్ణయించుకున్నాను. ఈ విషయం సుధకి చెప్పాను. ‘సై అత్తా’ అంది. రేపు ఆ డబ్బు తీసుకుని రమ్య
పేరుమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చెయ్యాలి మనం’’ అంటూ ముగించింది.

అమ్మ నా కోడలూ! నెయిల్‌పాలిష్‌ కొన్నాకూడా ఎలా ఉంది మామయ్యా అని అడుగుతుందిగానీ ఈ విషయాన్ని మాత్రం అత్తతో పంచుకుంది. ఆ క్షణంలో మరో ఆడపిల్లని కనలేకపోయినందుకు చాలా చింతించాను.

‘‘అంత బాధపడకండి. అభి పెళ్ళినాడే మీకు రెండో కూతురు గిఫ్ట్‌’’ అంటున్న రాధని చూసి ‘థ్యాంక్స్‌’ అంటూ బుగ్గపైన ముద్దాడాను.

‘‘ఆగండాగండీ, రేపు అన్నయ్యని వియ్యంకుడి రూపంలో మరో కోరిక కోరాలి మీరు!’’అనుమానంగా చూశాను. ‘‘ఇంకో కోరికా?’’‘‘భయపడకండి, ఇది- మీరు మా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా అడగగలిగేది’’ నవ్వుతూ అంది.
‘‘ఏంటో చెప్పు’’ నా చెయ్యి గారంగా ఆమెను చుట్టుకుంది.

‘‘అమాయకంగా మా అన్నయ్య కళ్ళల్లోకి చూస్తూ ‘బావా, నాకున్నది ఒక్కగానొక్క మగపిల్లవాడు. వాడి పెళ్ళి పూర్తిగా మా ఖర్చుతోనే చెయ్యాలని మీ చెల్లి దేముడికి మొక్కుకుందట. ఈమాత్రమైనా భార్య కోరిక తీర్చవలసిన బాధ్యత నాదే కదా, ఏమంటావ్‌?’ అని చెప్పాలి’’.

ఒక బలమైన గాఢ కౌగిలి ఆపై ఆమెని మాట్లాడనివ్వలేదు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.