close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఎన్నికల సంబరం...

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకంటే పెద్ద పండగ ఉండదు. ఈ ఏడాది పొడుగునా ఆ సంబరం నడిచింది. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా ఏడాది చివర్లో జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్ని 2019 సార్వత్రిక  ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన వేళ...  ఇవి చలికాలంలోనూ రాజకీయ వేడిని పుట్టించాయి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య  భారతంలోని మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. త్రిపురలో కమ్యూనిస్టు కోట బద్దలైంది. ఇరవైఏళ్లపాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న మాణిక్‌ సర్కార్‌ గద్దె దిగారు. అక్కడ మొదటిసారి భాజపా పాగా వేసింది. భాజపాకు చెందిన బిప్లబ్‌కుమార్‌ దేబ్‌ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. నాగాలాండ్‌లో భాజపా-ఎన్‌డీపీపీల సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్‌డీపీపీకి చెందిన నెఫియూ రియో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీకి చెందిన కాన్రాడ్‌ కె.సంగ్మా ముఖ్యమంత్రి అయ్యారు. 60 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌ 21 స్థానాల్ని గెల్చుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ పీపీపీ, భాజపా సహా అయిదు పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి.

కర్నాటకం...
ఈ ఏడాది అత్యంత నాటకీయ పరిస్థితులు నెలకొన్న ఎన్నికలంటే మేలో కర్ణాటక శాసనసభకు జరిగినవే. ముక్కోణపు పోటీవల్ల అక్కడ హంగ్‌ ఏర్పడింది. 222 సీట్లున్న కర్ణాటక శాసనసభలో 104 సీట్లతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మ్యాజిక్‌ నంబరుకు ఎనిమిది సీట్ల దూరంలో నిలిచింది. కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 38 సీట్లు రాగా. ఇతరులు రెండు చోట్ల గెలిచారు. భాజపా నాయకుడు యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా, బలాన్ని నిరూపించుకోలేక మూడు రోజుల్లోనే రాజీనామా చేశారు. చివరకు హెచ్‌.కుమారస్వామి ముఖ్యమంత్రిగా జేడీఎస్‌-కాంగ్రెస్‌ల సంకీర్ణం ఏర్పాటైంది.

దూసుకువెళ్లిన కారు...
డిసెంబరు 7న తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి విజయ ఢంకా మోగించింది. కె.చంద్రశేఖరరావు రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెరాసకు పట్టణ-గ్రామీణ అన్న భేదం లేకుండా అన్నిచోట్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 47 శాతం ఓట్లను సంపాదించుకుని 119 స్థానాలకుగానూ 88 చోట్ల తెరాస విజయకేతనం ఎగరవేసింది. కేసీఆర్‌ కారు వేగానికి కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా కూటమి దరిదాపుల్లోనూ నిలవలేకపోయింది. ప్రతిపక్షం హామీలకంటే పాలక పక్షం అయిదేళ్ల పాలనకే ఓటర్లు మొగ్గు చూపారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌... లాంటి పథకాలతోపాటు తెలంగాణ స్థానికత సెంటిమెంటు బాగా పనిచేసింది. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు ఏడు, తెదేపాకు రెండు సీట్లు వచ్చాయి. క్రితంసారి అయిదుచోట్ల గెలిచిన భాజపా ఈసారి ఒక్క స్థానానికే పరిమితం అయింది.

ఉత్తరాదిలో కాంగ్రెస్‌...
ఈ ఏడాది మార్చి నాటికి భాజపా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అధికార పక్షంలో ఉండగా అవన్నీ దాదాపు ఉత్తరాదిలోనే ఉన్నాయి. వాటిలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ కూడా ఉన్నాయి. 2014 లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 65 లోక్‌సభ స్థానాలకుగానూ 62చోట్ల భాజపా గెలిచిందంటే అక్కడ భాజపాకు ఉన్న బలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో ఆ రాష్ట్ర శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్‌-భాజపాల మధ్యనే ఉండటంతో అవి దేశ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించాయి. చివరకు ఆ మూడుచోట్లా భాజపా అధికారాన్ని కోల్పోవడమే కాదు, అన్నిచోట్లా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రాజస్థాన్‌లో సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లోత్‌ మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగా, యువనేత, పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాకుండా పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు దక్కాయి. ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ బఘేల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. మిజోరమ్‌లో పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోయింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారాన్ని చేజిక్కించుకుంది. అక్కడ భాజపా ఒకేఒక్క సీటు సంపాదించింది.

2019 లోక్‌సభ ఎన్నికల ముంగిట నిల్చిన వేళ అయిదు రాష్ట్రాల ఎన్నికల్ని సెమీఫైనల్స్‌గా భావించాయి అన్ని పార్టీలూ. గత అయిదేళ్లుగా వరస పరాజయాల్ని చవిచూస్తున్న కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాల్లో విజయం, ప్రత్యేకించి అది ఉత్తరాదిలో కావడంతో ఫైనల్స్‌లో పోరాటానికి ఆత్మవిశ్వాసం, నైతిక బలం పెరిగాయని చెప్పాలి. అదే సమయంలో ఈ మూడు రాష్ట్రాల్లో బీఎస్పీ 18 సీట్లు గెల్చుకుంది. ఈ పార్టీ మద్దతుతోనే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారానికి కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను అందుకోగలిగింది. ఈ ఎన్నికలు సంకీర్ణ అవసరాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మొత్తంమీద 2019 సార్వత్రిక సమరం భాజపా-కాంగ్రెస్‌ల మధ్య పోరు అవుతుందో లేదా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ విజయం ఫెడరల్‌ ఫ్రంట్‌కు పడిన పునాది అవుతుందో చూడాలి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.