close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంకొన్ని మెరుపులూ మరకలూ...

వెనక్కి తిరిగి చూసుకుంటే... ప్రతి మనిషికీ, ప్రతి సమాజానికీ, ప్రతి దేశానికీ, మొత్తంగా చెప్పాలంటేప్రపంచానికి ఏవో కొన్ని జ్ఞాపకాలుంటాయి. సాధించిన మైలురాళ్లూ, నింగికెగసిన ఆనందాలూ, మరపురాని మనుషులూ, మరచిపోనివ్వని విషాదాలూ... ఇలా ఎన్నో. మరి 2018లో మనమేం చూశామంటే...

విజయం

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో అత్యంత బరువైన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3-డీ2 రాకెట్‌ ద్వారా కమ్యూనికేషన్‌ ఉపగ్రహం జీశాట్‌-29ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. బాహుబలి రాకెట్‌గా పిలుచుకుంటున్న ఇది 4 వేల కిలోల బరువుండే ఉపగ్రహాల్ని మోసుకెళ్లగలదు. ఈ నవంబరులో ఈ రాకెట్‌ మోసుకెళ్లిన జీశాట్‌-29 3,423 కిలోల బరువుతో ఇస్రో చరిత్రలోనే బరువైన ఉపగ్రహంగా ఘనత సాధించింది. ఇస్రో ఈ ఏడాది మొత్తం 17 ప్రయోగాలు చేపట్టింది. 35 రోజుల వ్యవధిలో 3 రాకెట్లు ప్రయోగించి చరిత్ర సృష్టించింది.

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ అరిహంత్‌ అణు జలాంతర్గామి తన తొలి అణునిరోధక గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. ఇది గరిష్ఠంగా 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యం మీద దాడి చేయగలదు. అరిహంత్‌ విజయవంతమవడంతో గాలి, నీరు, భూమి నుంచి అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ దేశాల సరసన ఆరో దేశంగా భారత్‌ చేరింది.

ఈ ఏడాది అక్టోబరులో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ‘డూయింగ్‌ బిజినెస్‌ 2019’ నివేదికలో భారత్‌ 77వ స్థానంలో నిలిచింది. గతేడాది వందో ర్యాంకులో ఉన్న మన దేశం ఈ ఏడాది 33 స్థానాలు పైకి ఎగబాకింది.

మహాత్మాగాంధీ 149వ జయంతిని ఈ అక్టోబరు 2న దేశ, విదేశాల్లో ఘనంగా నిర్వహించారు. దీంతో సంవత్సరం పాటు జరిగే 150వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి.

తెలుగులో కొలకలూరి ఇనాక్‌ రాసిన ‘విమర్శిని’ గ్రంథానికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 

ఈ ఏడాది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అమితవ్‌ఘోష్‌ ఆ గౌరవం అందుకున్న తొలి భారతీయ ఆంగ్ల రచయిత. 

దిల్లీ ఐఫిల్‌ టవర్‌గా పిలుచుకుంటున్న ‘సిగ్నేచర్‌ బ్రిడ్జి’ ఈ నవంబరులో ప్రారంభమైంది. దాదాపు 575 మీటర్ల పొడవుతో తీగల సాయంతో గాల్లో వేలాడేలా నిర్మించిన ఈ వంతెన ఓ ఇంజినీరింగ్‌ అద్భుతం. ఉత్తర ఈశాన్య దిల్లీల మధ్య దూరాన్ని తగ్గించేందుకు దీన్ని నిర్మించారు.

విలయం

సెప్టెంబరులో ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో వచ్చిన భూకంపం, దాని పర్యవసానంగా వచ్చిన సునామీల వల్ల 1400 మందికి పైగా మృతిచెందగా, కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 

కేరళ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన వరదలు విలయాన్ని సృష్టించాయి. సుమారు పది లక్షల మంది నిరాశ్రయులవగా 500 మంది మృత్యువాతపడ్డారు. 

తిత్లీ, పెథాయ్‌ తుపానులు తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తే, గజ తుపాను తమిళనాడును అల్లకల్లోలం చేసింది. ఇవన్నీ ప్రాణనష్టంతో పాటు భారీ ఆస్తినష్టాన్ని కలిగించాయి.

విప్లవం

హాలీవుడ్‌లో ప్రారంభమైన మీటూ ఉద్యమం సెగ తనుశ్రీదత్తాతో బాలీవుడ్‌కీ తగిలింది. పనిచేసేచోట మహిళల మీద జరిగిన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నడిచిన ఈ ఉద్యమం దేశంలోని వివిధ రంగాల్లో అతివల పైన జరిగిన దాడుల్ని బట్టబయలు చేసింది. 

రుణమాఫీని కోరుతూ మహారాష్ట్రకు చెందిన వేల మంది రైతులు అఖిల భారత కిసాన్‌ సభ ఆధ్వర్యంలో నాసిక్‌నుంచి ముంబయి వరకూ పాద యాత్రను నిర్వహించారు. 

ముస్లింలు మూడు సార్లు తలాక్‌ చెప్పడం ద్వారా భార్యకు తక్షణ విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఈ ఏడాది భారత ప్రభుత్వం ఆర్డినెన్సును జారీ చేసింది. 

విషాదం 

మనదేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేసిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఈ ఏడాది కన్నుమూశారు. 

అతిలోక సుందరి శ్రీదేవి ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిమానుల్ని శోక సంద్రంలో ముంచెత్తుతూ తిరిగిరాని లోకాలకు మరలిపోయింది. 266 సినిమాల్లో నటించిన ఈమె 15 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న ఏకైక కథానాయిక.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.