close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ ఆలయాలకు అంతర్జాతీయ గుర్తింపు..!

ఎన్నో ఆనందాలనూ మరెన్నో అనుభూతులనూ మనకందించిన 2018 ఆధ్యాత్మికంగానూ మర్చిపోలేని జ్ఞాపకాలనే మిగిల్చింది. భక్తిభావనను నలుదిశలా వెదజల్లుతూ హిందూ సంస్కృతికీ సంప్రదాయానికీ ప్రతీకలుగా నిలుస్తున్న మన దేవాలయాల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది.

సనాతన హైందవ సంప్రదాయంలో దేవుడితోపాటు దేవాలయానికీ ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆలయ నిర్మాణంలో ప్రదర్శించే శిల్పకళా చాతుర్యం, భక్తిభావనను పెంపొందించే ఆలయ పరిసరాల నిర్వహణ, దేవుడి అనుగ్రహం పొందామన్న తృప్తిని అందించే ప్రసాద వితరణ... ఇలా ప్రతి అంశాన్నీ ఎంతో శ్రద్ధగా చేపడతారు ఆలయ నిర్వాహకులూ, భక్తులూ. అయితే నేటి వరకూ ఇవన్నీ ఆ దేవదేవుడికి భక్తితో చేసే సేవలూ కైంకర్యాలుగానే పరిగణించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. దేవాలయాలూ నేటి స్థితిగతులకు తగ్గట్టుగారూపుదిద్దుకుంటున్నాయనడంలో ఎలాంటి సందేహంలేదు. కార్పొరేట్‌ కంపెనీలకూ ఎంతో ప్రఖ్యాతి చెందిన సంస్థలకూ అందించే ఐఎస్‌ఓ (ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డైజేషన్‌) సర్టిఫికెట్‌ ఇప్పుడు ఆలయాలకూ లభిస్తుండటం దీనికి ఉదాహరణ. మూలవిరాట్టుకు చేసే పూజలూ అభిషేకాలూ అర్చనల దగ్గరనుంచీ ఇచ్చే ప్రసాదం, ఆలయనిర్మాణం, నిర్వహణ, పారిశుద్ధ్యం... ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఉన్నతమైన ప్రమాణాలను పాటిస్తూ అంతర్జాతీయ ఖ్యాతినిపొందుతున్నాయి. ఇలా ఒక దేవాలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు రావడం కొన్నేళ్ల క్రితమే ప్రారంభమైనా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మాత్రం ఈ ఏడాదే ఆ ఘనతను సాధించాయి.

మొదట యాదాద్రి
తెలంగాణ తిరుపతిగా పేరుపొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం 2018లో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందుకుని మరోసారి వాటి విశిష్టతను చాటుకున్నాయి. చక్కని పర్యావరణం, మంచి పాలన, ఆకట్టుకునే వాతావరణం కలిగిన ఈ ఆలయాలు ప్రపంచఖ్యాతిని సొంతం చేసుకున్నాయి. యాదాద్రి-భువనగిరి జిల్లాలో కొలువైన నరసింహస్వామి క్షేత్రం ఈ ఏడాది సరికొత్త గుర్తింపు పొందింది. పరిపాలన, నిర్వహణ విభాగంలో ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పొందిన మొదటి తెలంగాణ ఆలయంగా రికార్డులకెక్కింది. ప్రహ్లాదుడిని రక్షించడానికి ఉగ్రనారసింహుడి రూపంలో వచ్చిన విష్ణుమూర్తి శాంతించిన తర్వాత లక్ష్మీదేవితో కలిసి యాదాద్రిలో వెలిశాడనీ అందుకే ఇది స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతోందని స్థలపురాణం పేర్కొంటోంది. అంతటి చారిత్రక ప్రశస్తి ఉన్న ఈ ఆలయం ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌తో మరో మైలురాయిని అందుకుంది. మూల విరాట్టుకు నిర్వహించే ధూపదీప నైవేద్యాలు, వివిధ విభాగాల్లో భక్తులకు అందించే భద్రత, మౌలిక సదుపాయాల కల్పన... మొదలైన అంశాల్లో మెరుగైన ప్రమాణాలు పాటిస్తున్న దేవాలయంగా ఖ్యాతి పొందింది. యాదగిరిగుట్ట దేవస్థానానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌తోపాటు ఆలయ అభివృద్ధి కమిటీకి మరోనాలుగు విభాగాల్లో అవార్డులు రావడం విశేషం.

మల్లన్నకు దక్కిన గౌరవం
ప్రసిద్ధిచెందిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ ఖ్యాతి ఈ ఏడాది విశ్వవ్యాప్తం అయ్యింది. రాష్ట్రంలో తిరుమల తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం ఐఎస్‌ఓ గుర్తింపును పొంది మరో రికార్డునూ సొంతం చేసుకుంది. ఈ ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులూ, భక్తుల భద్రత, నాణ్యమైన ఆహారాన్ని అందించడం, విద్యుత్‌ వినియోగం... మొదలైన విభాగాల్లో అత్యున్నతస్థాయి ప్రమాణాలు పాటించడంతో శ్రీశైలానికి ఈ పురస్కారం లభించింది. ఒక ప్రత్యేకమైన ప్రదేశం నుంచి శ్రీశైల ఆలయశిఖరాన్ని చూస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తారు. భక్తవరదుడిగా పేరుపొందిన పరమశివుడు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిగా, లోకమాత పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి శక్తి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లోని ఒకటిగా విరాజిల్లుతోంది. చుట్టూ దట్టమైన నల్లమల అడవుల్లో కొలువుదీరిన శ్రీశైల క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగానే కాదు ప్రముఖ పర్యటక కేంద్రంగానూ ఖ్యాతి పొందడం విశేషం. మొత్తంమీద 2018 తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలకు అంతర్జాతీయ గుర్తింపైన ఐఎస్‌ఓ సర్టిఫికెట్లను అందించి ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలాచేసింది. దీంతో ఐఎస్‌ఓ గుర్తింపు పొందిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలూ చోటుసంపాదించుకుని తెలగువారి భక్తినీ ఆలయాల కీర్తినీ ప్రపంచానికి చాటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.