close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2018 స్మృతి పథంలో...

కొన్ని మెరుపులూ కొన్ని మరకలూ, కాస్త ఆనందం కాస్త విషాదం, కాసిని నవ్వులూ కాసిని కన్నీళ్ళూ అన్నిటినీ తనలో ఇముడ్చుకుని వెళ్లిపోతోంది 2018. కొంచెం ఇష్టం కొంచెం కష్టమన్నట్లుగా సాగిన ఈ ఏడాదిలో చిన్న సినిమాల పెద్ద హిట్లూ ప్రముఖుల పెళ్లి సందళ్ళూ వినోదపు జల్లుల్ని కురిపిస్తే ప్రకృతి విపత్తులకుతోడు అభిమాన తారలూ నాయకుల మరణాలు కన్నీటి సుడుల్ని తెప్పించాయి. బూజుపట్టిన పాత చట్టాలకు పాతరవేస్తూ న్యాయవ్యవస్థ ఇచ్చిన సంచలన తీర్పులు ఆహా అనిపిస్తే మృగాళ్ల వెన్నులో వణుకు పుట్టించింది ‘మీటూ’ ఉద్యమం.
ఇక, లేటెస్ట్‌ ఫ్యాషన్లూ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ యువతలో కిర్రాకు పుట్టిస్తే, క్రీడల్లో సరికొత్త రికార్డులూ అయిదురాష్ట్రాల హోరాహోరీ ఎన్నికలూ అందరిలో ఉత్కంఠను రేకెత్తించాయి. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు ఈ ఏడాది మన చుట్టూ ఏం జరిగిందో ఓసారి గుర్తుచేసుకుందాం.

‘తీర్పరి’నామ సంవత్సరం!

న్యాయదేవత ఈ ఏడాది మౌనంగా తన పని తాను చేసుకుపోలేదు. కాస్త గట్టిగానే గళం విప్పింది.శతాబ్దాలనాటి చట్టాల బూజు దులిపింది. ఇరవై ఒకటో శతాబ్దంలోనూ ఇంకా మూఢనమ్మకాలా... అని విసుక్కుంది.ప్రజల ప్రాణాలకూ ప్రాథమిక హక్కులకూ విలువ ఇవ్వమంది. కరకు చట్టాలకు చల్లని మానవీయస్పర్శను అద్దింది. మొత్తంగా 2018ని తీర్పరినామ సంవత్సరంగా చరిత్రలో నిలిపింది.

ఆధార్‌... అన్నిటికీ అక్కర్లేదు

బ్యాంకుకు వెళ్తే ఆధార్‌... బడికెళ్లే పిల్లలకూ ఆధార్‌... రేషన్‌కి ఆధార్‌. ఆరోగ్యశ్రీకి ఆధార్‌. ప్రతిపనికీ ఆధార్‌ని అనుసంధానించమంటూ ప్రజలను పరుగులు పెట్టించిన ప్రభుత్వానికి ముకుతాడు వేసింది సుప్రీంకోర్టు. ఆధార్‌ రాజ్యాంగబద్ధమైనదే అయినప్పటికీ బ్యాంకు ఖాతా తెరవడానికి అది ఉండాల్సిన అవసరంలేదని స్పష్టంచేసింది. రేషన్‌ సరకులు పొందడంతో మొదలెట్టి ఆదాయపు పన్ను కట్టడం వరకూ సిమ్‌ కార్డు నుంచి బ్యాంకు అకౌంటు వరకూ ప్రతిదానికీ ఆధార్‌ని లింక్‌ చేయడంతో చాలామందిలో వ్యతిరేకత మొదలైంది. దీనివల్ల తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఆధార్‌ అవసరాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన 31 పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఆధార్‌ చట్టబద్ధమైన విధానమేనని ప్రభుత్వాన్ని సమర్థించింది. అయితే ఎక్కడ దాన్ని తప్పనిసరి చేయాలో, ఎక్కడ అక్కరలేదో స్పష్టంగా పేర్కొంది. ఐటీ రిటర్న్స్‌ సమర్పించేవారికీ, పాన్‌ నంబర్‌ పొందగోరేవారికీ ఆధార్‌ తప్పనిసరిగా ఉండాలంది. పథకాల ప్రయోజనాలు తప్పుదారి పట్టకుండా అర్హులకే అందాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్‌ అవసరమేనని చెప్పింది. అయితే మొబైల్‌ ఫోన్లకీ, బ్యాంకు ఖాతా తెరవడానికీ, పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికీ, ప్రవేశ, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకీ ఆధార్‌ అవసరం లేదని తేల్చిచెప్పింది. ఆధార్‌ కోసం ప్రజలు ఇచ్చిన వివరాలు ప్రైవేటు సంస్థల చేతికి ఇవ్వవద్దనీ, సమాచారమంతా భద్రంగా ఉండేలా బలమైన వ్యవస్థను ఏర్పాటుచేయాలనీ ప్రభుత్వానికి నొక్కిచెప్పింది.

శబరిమల... ఎవరైనా వెళ్లవచ్చు

2006లో ఒకరోజు... భక్తీ సేథీ, ప్రేరణాకుమారి అనే యువ న్యాయవాదులు కబుర్లు చెప్పుకుంటూ పేపరు చదువుతున్నారు. పేపరులో ఓ వార్త చూసి ప్రేరణ నుదురు చిట్లించింది. నటి జయమాల శబరిమల వెళ్లిందని అక్కడి పూజారి ఆలయమంతా శుద్ధిచేశాడన్నది ఆ వార్త. ఈరోజుల్లోనూ ఇలాంటి పద్ధతులు అవమానకరమనీ, స్త్రీలు ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్లకూడదో నిర్ణయించే అధికారం పురుషులకు ఎవరిచ్చారని స్నేహితురాళ్లిద్దరూ చర్చించుకుంటుండగా లక్ష్మీ శాస్త్రి, అల్కా శర్మ, సుధాపాల్‌ అక్కడికి వచ్చారు. స్నేహితురాళ్ల వాదనతో వారూ ఏకీభవించారు. అలాంటి పద్ధతులు స్త్రీల ప్రాథమిక హక్కుల్ని కాలరాయడమేననుకున్నారు. ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో కలిసి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తేవాలనుకున్నారు. తాము వివక్షను ప్రశ్నిస్తున్నామనీ మతాచారాన్ని కాదనీ స్పష్టంచేస్తూ పుష్కరం క్రితం వాళ్లు వేసిన పిటిషన్‌ ఫలితమే సెప్టెంబరులో వెలువడిన శబరిమల తీర్పు. భక్తిలో లింగవివక్ష కూడదనీ వయసుతో నిమిత్తం లేకుండా స్త్రీలు ఆలయంలోకి వెళ్లవచ్చనీ సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తితో సహా ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు శబరిమలలో అమలులో ఉన్న నియమాన్ని ప్రశ్నించారు. దేవుడిముందు స్త్రీ పురుషులు వేర్వేరు కాదన్నారు. స్త్రీకి నెలసరి రావడమనేది సహజాతిసహజమైన విషయమనీ పాపపుణ్యాలతో దానికి సంబంధం లేదనీ స్త్రీలు అడుగుపెడితే ఆలయం మైలపడిపోతుందనుకోవడానికి అది కాలుష్యం కాదనీ... అభిప్రాయపడ్డారు న్యాయమూర్తులు. శరీర స్వభావం కారణంగా వివక్షను ప్రదర్శించే సంప్రదాయం ఏదైనా రాజ్యాంగ విరుద్ధమేననీ, మహిళల గౌరవానికి భంగం కలిగించడమేననీ అన్నారు. ఇతర అయ్యప్ప ఆలయాల్లో ఈ నియమం లేదనీ శబరిమల ఆలయం కూడా ఒక బహిరంగ ప్రార్థనా స్థలమే కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా అక్కడికి వెళ్లవచ్చనీ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు.

అదేమీ నేరం కాదు

వాళ్లూ అందరిలాంటి మనుషులే. కానీ సమాజానికి ఎందుకో వారంటే చిన్నచూపు. వారి ఆనందాలూ అనుభూతులూ అన్నిటిమీదా ఆంక్షలే. మనిషి సహజలక్షణమైన ప్రేమని భౌతికంగా వ్యక్తంచేయనీయకుండా వారిని పంజరంలో పెట్టారంటూ ఆ పరిస్థితిని ప్రశ్నించింది సుప్రీం తీర్పు. లైంగికసంబంధం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. పరస్పర అంగీకారంతో జరిగే దానివల్ల సమాజానికి ఎలాంటి నష్టమూ లేనప్పుడు సమాజంలో అధిక శాతం ప్రజల అభిప్రాయాన్ని వారి మీద రుద్ది అవమానించడం, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని స్పష్టంచేసింది. శతాబ్దాలుగా అవమానించి వెలివేసిన స్వలింగ సంపర్కులకూ వారి కుటుంబసభ్యులకూ చరిత్ర క్షమాపణ చెప్పాల్సి ఉందంది. స్వలింగ సంపర్కం మానసిక అవలక్షణం కాదనీ శారీరక అవసరమనీ హుందాగా బతికే హక్కు వారికీ ఉందని గుర్తుచేసింది. ఇన్నాళ్లూ స్వలింగ సంపర్కాన్ని అసహజ లైంగిక చర్యగా భావించి ఐపీసీ 377 ప్రకారం శిక్షించేవారు. పదేళ్ల నుంచీ యావజ్జీవం వరకూ జైలు శిక్ష విధించేవారు. నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సెక్షన్‌ని ప్రశ్నిస్తూ 2001లో దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారించిన న్యాయస్థానం స్వలింగ సంపర్కం నేరం కాదని 2009లో తీర్పు చెప్పింది. దానిపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో 2013లో సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసింది. దాంతో స్వలింగ సంపర్కం నేరంగానే ఉండిపోయింది. అయితే ఈ తీర్పుల మీద వివిధ వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉన్న నేపథ్యంలో సమాజంలోని పరిస్థితులను వివరిస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ సహా మరికొందరు ప్రముఖులు దీన్ని మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు తెచ్చారు. దాంతో అన్ని కోణాల్లో విచారించిన న్యాయస్థానం పరస్పర ఆమోదంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని 493 పేజీల చరిత్రాత్మక తీర్పు చెప్పింది. 150 సంవత్సరాలకు పైగా అమల్లో ఉన్న ఐపీసీ సెక్షన్‌ 377లోని కీలకమైన నిబంధనలనూ, స్వలింగ సంపర్కాన్నీ నేరంగా పరిగణిస్తూ 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ కూడా కొట్టేసింది.

హుందాగా మరణించడమూ హక్కే

‘నా బిడ్డ చికిత్స తెలియని వ్యాధితో బాధపడుతోంది. బిడ్డ బాధ చూడలేను. నాకో మార్గం చూపండి’. ‘మేమిద్దరం ముసలివాళ్లమయిపోయాం. పిల్లల్లేరు. అనారోగ్యంతో మరొకరి మీద ఆధారపడి బతికే పరిస్థితి వస్తే మా జీవితాలకు ముగింపు పలికేందుకు అనుమతి ఇవ్వండి’
... ఇలాంటి వినతులెన్నో సుప్రీంకోర్టుకీ రాష్ట్రపతికీ అందుతుంటాయి. ప్రాణం దేవుడిచ్చిన గొప్ప వరమనీ, మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఉంటాయనీ అందరికీ తెలుసు. అయినా బతకలేక, చావు రాక- రెంటికీ మధ్య ఊగిసలాడుతున్నప్పుడు ఆ రోగి ఇష్టాన్ని గౌరవించడం సబబా కాదా అన్న చర్చ ఈనాటిది కాదు. గౌరవప్రద మరణాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని కోరుతూ కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2005లో ఓ ప్రజాహిత వ్యాజ్యం వేసింది. దాన్ని విచారించిన న్యాయస్థానం- నయం కాని రోగాలతో జీవచ్ఛవాలుగా బతుకుతున్నవారికి మరణప్రక్రియను వేగవంతం చేయడమూ గౌరవప్రద జీవన హక్కులో అంతర్భాగమేనని గతంలోనే తీర్పు ఇచ్చింది. తన శరీరాన్ని ఏం చేయాలన్న దానిపై ముందస్తు నిర్ణయం తీసుకునే హక్కు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉన్న ప్రతి వ్యక్తికీఉంటుందని పేర్కొంటూ ఇప్పుడు సజీవ వీలునామా(లివింగ్‌ విల్‌)కూ చట్టబద్ధత కల్పించింది. భవిష్యత్తులో కోలుకోలేని రోగాల పాలబడి అచేతన స్థితికి జారిపోయినప్పుడు వైద్య ప్రక్రియను నిలిపివేసి పరోక్ష కారుణ్యమరణానికి సంసిద్ధత చాటుతూ ముందుగా రాసేదే ‘లివింగ్‌ విల్‌’. చావు కోసం వేచిచూడడం మినహా మరే ఆశా లేనప్పుడు రోగి లేదా అతడి తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి (పాసివ్‌ యూథనేషియా) సమ్మతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ప్రజాప్రభుత్వానిదే పైచేయి

ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏమీ చేయలేని పరిస్థితి వస్తే ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యతను వారు ఎలా నెరవేరుస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తుది నిర్ణయాధికారం ఎప్పుడూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. దిల్లీ రాష్ట్రప్రభుత్వమూ లెఫ్టినెంట్‌ గవర్నర్ల మధ్య వివాదం సుప్రీం ముంగిటికి చేరగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి స్వతంత్ర అధికారాలు లేవని తీర్పుచెప్పిన న్యాయస్థానం ప్రజాస్వామ్యస్ఫూర్తిని నిలబెట్టింది. ఎన్నికైన ప్రభుత్వానికి గవర్నరు సహాయకారిగా ఉండాలే తప్ప పాలనకు ఆటంకం కలిగించకూడదని పేర్కొంది. దిల్లీలో ఆమ్‌ ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గొడవలు మొదలయ్యాయి. రాష్ట్రప్రభుత్వ అధికారాలకు కేంద్రం కత్తెరవేయడంతో ముఖ్యమంత్రితో సంప్రదించకుండానే అప్పటి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా ఇతర అధికారులను నియమించారు. ఆ చర్యను కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రశ్నించింది. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా గవర్నర్‌ అధికారాలను సమర్థించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి సహాయకారి పాత్ర మాత్రమే గవర్నర్‌దని స్పష్టంచేసింది.

భార్య... భర్త ఆస్తి కాదు

స్త్రీ కో న్యాయం పురుషుడికో న్యాయమా? అటువంటప్పుడు సమానత్వ హక్కుకి అర్థమేమిటి? మారుతున్న కాలానికీ సమాజానికీ తగినట్లుగా చట్టాలు మార్చుకోవద్దా... అంటూ తరాల అంతరాన్ని ప్రశ్నించారు సాక్షాత్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. సెక్షన్‌ 497ని మహిళల గౌరవాన్ని మంటకలిపే చట్టమన్నారు. పురుషాధిక్యతకు పట్టంకడుతోందని దుయ్యబట్టారు. ఈ సెక్షన్‌ స్త్రీపురుషుల మధ్య వివక్షను చట్టబద్ధం చేస్తోందన్నారు మరో మహిళాన్యాయమూర్తి. ఇందులో వివాహవ్యవస్థ పవిత్రత కన్నా భార్యను ఆస్తిగా పరిగణించడమే ప్రధానంగా కన్పిస్తోందన్నారు ఇంకో జడ్జి. సుప్రీంకోర్టు జడ్జీలను ఇంతగా కదిలించిన సెక్షన్‌ 497 ఏమిటంటే... 150 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ ప్రభుత్వం తెచ్చిన చట్టమిది. ఒకరి కూతురిగానో మరొకరి భార్యగానో తప్ప స్త్రీకి ప్రత్యేక గుర్తింపూ గౌరవం లేని ఆనాటి సమాజంలో భార్య కూడాపురుషుడి ఆస్తిలో భాగమే. భర్త అనుమతిస్తే మహిళకున్న వివాహేతర సంబంధం నేరం కాదు. అయితే రోజులు మారాయి. రాజ్యాంగం స్త్రీపురుషులకు సమానహక్కులు కల్పించినా ఇంకా బూజుపట్టిన పాత చట్టాన్నే అనుసరించడాన్ని పలువురు పలుసార్లు ప్రశ్నించారు. కేరళకు చెందిన ఓ ప్రవాస భారతీయుడు ఈ సెక్షన్‌ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయగా విచారించిన న్యాయస్థానం భార్య భర్త ఆస్తి కాదనీ, వివాహేతర సంబంధం విడాకులకు కారణం కావచ్చు కానీ నేరం కాదనీ స్పష్టంచేసింది. ఈ తీర్పు ద్వారా మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే, వారిని అసమానంగా చూసే ఏ నిబంధనా రాజ్యాంగబద్ధం కాదని తేల్చిచెప్పింది.

ఎలా సంపాదించారో చెప్పాల్సిందే

ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఆర్థికవ్యవహారాల్లో పొదుపు పాటిస్తే ఒక క్రమపద్ధతిలో ఆస్తులు పెంచుకోవచ్చు. కానీ ఆదాయ మార్గం చెప్పకుండా వందల రెట్లు ఆస్తులు పెంచుకోవడం రాజకీయ నాయకుల విషయంలోనే జరుగుతోంది. ఇరవై ఆరుగురు ఎంపీలూ, 257మంది ఎమ్మెల్యేల ఆస్తులు వారి పదవీకాలంలో కొన్ని వందల రెట్లు పెరిగినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విచారణలో తేలింది. దాన్ని ఆధారంగా చూపుతూ లోక్‌ప్రహారి అన్న ఎన్జీఓ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ సమయంలో తమ ఆదాయమార్గాలను కూడా ప్రకటించేలా ఆదేశాలివ్వాలని కోరింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 33ఎ సెక్షన్‌ ప్రకారం నామినేషన్‌ సమయంలో అభ్యర్థులు ఆస్తుల వివరాలు వెల్లడించాలి. అయితే ఈ వివరాల్లో వాస్తవాలెంత అన్నది ధ్రువీకరించే యంత్రాంగం లేదు. ఈ నేపథ్యంలో లోక్‌ప్రహారి పిటిషన్‌పై విచారణజరిపిన సుప్రీంకోర్టు ఆదాయవనరులతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయంటే వారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారనే అనుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. ఎన్నికల నియమావళిని సవరించి అభ్యర్థులు తమ ఆదాయమార్గాల్నీ, చేస్తున్న వ్యాపారాల వివరాల్నీ, కుటుంబ సభ్యుల సంపదల్నీ సవివరంగా వెల్లడించేలా చట్టం చేయాలనీ, అసత్య ప్రకటన చేసిన అభ్యర్థిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలనీ ఆదేశించింది. ప్రజాప్రతినిధుల సంపదపై అభ్యంతరాలు వస్తే విచారణ జరిపేందుకు ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పరచాలని ప్రభుత్వాన్నీ, ఎన్నికల సంఘాన్నీ ఆదేశించింది.

ఎవరి పెళ్లి వారిష్టం!

జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వ్యక్తిగతం. ప్రతివ్యక్తికీ ఆ స్వేచ్ఛ ఉంటుంది. పరువు పేరుతోనో, మరో కారణంగానో ప్రేమనీ పెళ్లినీ అడ్డుకోవడం, వారి స్వేచ్ఛకి భంగం కలిగించడం చెల్లదని సుప్రీంకోర్టు గట్టిగా వాతలు పెట్టింది. ఎవరి జోక్యమైనా చట్టవిరుద్ధమేనని పేర్కొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఖాప్‌ పంచాయతీల తీర్పులు చెల్లవని చెబుతూ పరోక్షంగా పరువుహత్యలకూ చెక్‌ పెట్టింది. ఖాప్‌ పంచాయతీల తీర్పులను నియంత్రిస్తూ పార్లమెంటు చట్టం చేసేదాకా అమల్లో ఉండేలా కొన్ని మార్గదర్శకాలను ప్రకటించింది. ప్రేమించి పెళ్లి చేసుకునే గ్రామీణ ప్రాంత యువతకు ఖాప్‌ పంచాయతీలు పెద్ద బెడదగా తయారయ్యాయనీ ప్రేమికుల ఆత్మహత్యలకూ, పరువు హత్యలకూ కారణమవుతున్నాయనీ శక్తివాహిని అనే ఎన్జీఓ 2010లో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం విచారించింది. ఏ జంటయినా తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేస్తే వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రాంత పోలీసులదీ రాష్ట్రప్రభుత్వానిదీనని స్పష్టంచేసింది.

ఇవే కాదు, రాజ్యాంగపరంగా ప్రాధాన్యం ఉన్న కేసులు విచారించేటప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అనుమతించడమూ, ఒకసారి రిజర్వేషన్‌తో ఉద్యోగం పొందితే అంతటితో వివక్ష ముగిసినట్లేననీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అవసరంలేదనీ స్పష్టం చేయడమూ... ఇలా సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో ముఖ్యమైన కేసుల్లో ఈ ఏడాది సుప్రీంకోర్టు తీర్పులిచ్చింది. ఆధునిక సమాజ ఆలోచనాధోరణిని తీర్పుల్లో ప్రతిబింబిస్తూ 2018 సంవత్సరానికి చారిత్రక ప్రాధాన్యాన్ని కల్పించింది.

 

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.