close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆకలిపైన...కొట్టాయం విజయం!

కేరళలోని అతి పెద్ద జిల్లా అయిన కొట్టాయంలో ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. కొట్టాయంను ‘హంగ్రీ ఫ్రీ డిస్ట్రిక్ట్‌’గా నిలపాలన్నదే ఆ విప్లవ లక్ష్యం. ఈ అప్రకటిత లక్ష్యం కోసం సామాన్యులూ, స్వచ్ఛంద సంస్థలూ ముందుకు రావడంతో జిల్లావ్యాప్తంగా రోజూ దాదాపు 9000 మంది సామాన్యులు డబ్బు అవసరం లేకుండానే ఆకలి తీర్చుకోగలుగుతున్నారు.

నవ్‌జీవన్‌ ట్రస్ట్‌... కొట్టాయంలో ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. మూడు దశాబ్దాల కిందట పి.యు.థామస్‌ చెట్టన్‌ నెలకొల్పిన ఈ ట్రస్ట్‌... నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర రోగులూ, వారి బంధువులకు ఉచిత భోజన వసతి కల్పిస్తోంది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌, పిల్లల హాస్పిటల్‌... ఇలా అయిదారుచోట్ల ఈ ట్రస్ట్‌ ఉచిత భోజనాన్ని అందిస్తోంది. రోజూ 5000 మంది ఆకల్ని నవ్‌జీవన్‌ తీర్చుతోంది. ఇప్పుడు నవ్‌జీవన్‌ బాటలో అనేక సంస్థలూ నడుస్తూ అన్నార్తుల ఆకలి తీర్చుతున్నాయి. అనాథలూ, వయో వృద్ధులకోసం కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా డేకేర్‌ సెంటర్లను ప్రారంభించింది. కొట్టాయంలోని ‘వాయసుకరకున్ను’ ప్రాంతంలో ఏర్పాటుచేసిన ఈ డేకేర్‌ సెంటర్లో రెడ్‌ క్రాస్‌ సంస్థ ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తుంది. ఇక్కడ ప్రతిరోజూ 100 మందికిపైనే ఆకలి తీర్చుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లోనూ అన్నదాన ఉద్యమం ఇటీవల ఊపందుకుంది. జిల్లా కేంద్రానికి 20 కి.మీ.దూరంలోని ‘పాల’ పట్టణంలో స్థానికులు ఆహార పెట్టెలను ఏర్పాటుచేశారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకుంటే అక్కడ ఆహార పదార్థాల్ని పెడితే చాలు. కావాల్సిన వాళ్లు వచ్చి తీసుకుంటారు.

‘అంజప్పం’ వచ్చింది...
సామాన్యుల ఆకలి తీర్చే హోటల్‌గా ‘అంజప్పం భక్షణశాల’కు కేరళలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 2016లో మొదలైన అంజప్పం... మొన్నటివరకూ పతనంతిట్ట జిల్లాలోని కొళెన్‌చెర్రి, రన్నీ పట్టణాల్లో మాత్రమే భోజనశాలలు నిర్వహించేది. కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన నవంబరు 1నుంచి కొట్టాయం జిల్లాలోని చంగనచెర్రిలోనూ ఈ సంస్థ సేవలు మొదలయ్యాయి. బిల్లింగ్‌ కౌంటర్‌ లేకపోవడం ‘అంజప్పం’ హోటళ్ల ప్రత్యేకత. కుల, మత, వర్గ బేధాలు లేకుండా ఎవరైనా వచ్చి ఇక్కడ ఆకలి తీర్చుకోవచ్చు. భోజనం చేశాక తమకు తోచినంత మొత్తాన్ని బయట ఉండే డబ్బాలో వేయొచ్చు. అది కూడా తప్పనిసరి కాదు. ఫాదర్‌ బాబీ జోస్‌ అనే సామాజికవేత్త, మత ప్రచారకుడు దీన్ని ప్రారంభించారు. అంజప్పం కేంద్రాల్లో రోజూ మధ్యాహ్నం 12-2:30 మధ్య భోజనం అందిస్తారు. కేవలం శాకాహార భోజనం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. స్థానిక రైతులు పండించిన కాయగూరలనే వంటలకి వినియోగిస్తారు. తద్వారా రవాణా ఖర్చు తగ్గడంతోపాటు స్థానిక రైతులకూ మేలు జరుగుతుందంటారు నిర్వాహకులు. అంజప్పం నిర్వహణకు అవసరమయ్యే అదనపు మొత్తాన్ని ‘అప్పకూట్టు’ స్వచ్ఛంద బృందంలోని సభ్యులు సమకూర్చుతారు. హోటల్‌ నిర్వహణలోనూ వీళ్లు స్వచ్ఛందంగా పాల్గొంటారు. మెదడుకూ మేత ఉండాలనేది ‘అంజప్పం’నిర్వాహకులు నమ్మే సిద్ధాంతం. అందుకే సాయంత్రం వేళల్లో ఈ కేంద్రాలు గ్రంథాలయాలుగానూ పనిచేస్తాయి.

జిల్లా వ్యాప్తంగా...
‘ఆపరేషన్‌ సులేమని’... కోజికోడ్‌ పట్టణంలో మూడేళ్ల కిందట మొదలైన ఈ ఉచిత భోజన కార్యక్రమం గురించి దేశమంతా గొప్పగా చెప్పుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత భోజన కూపన్లు అందిస్తారు. వాటిని తీసుకుని ఏ హోటల్‌కి వెళ్లి ఇచ్చినా భోజనం చేయొచ్చు. అలాంటిదే తమ దగ్గరా ఉండాలనుకున్నారు కొట్టాయం జిల్లాలోని కంజరపల్లి పట్టణానికి చెందిన యువకులు. ఆ స్ఫూర్తితో ‘హంగ్రీ ఫ్రీ కంజరపల్లి’ ప్రాజెక్టుని ప్రారంభించారు. స్థానికంగా ఉండే ‘ద సోషల్‌ యాక్టివ్‌ ఫ్రెండ్స్‌’ స్వచ్ఛంద సంస్థ, పట్టణ హోటల్స్‌, రెస్టరెంట్‌్్స యాజమాన్య సంఘం కలిసి ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు. దీన్లో భాగంగా పట్టణంలోని 22 హోటళ్లు, రెస్టరెంట్లలో ఎవరైనా డబ్బులు లేకుండా కూడా భోజనం చేయొచ్చు. అందుకు అవసరమైన కూపన్లని పట్టణంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో ఉచితంగా అందిస్తారు. ఇవి మాత్రమే కాకుండా జిల్లాలోని ప్రతి చిన్న ఊళ్లోనూ యువత ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ బృందాలుగా ఏర్పడి స్థానికంగా ఆహార పెట్టెల్ని ఉంచి అడగకుండానే ఆపన్నుల ఆకల్ని తీర్చుతున్నారు. ఇవన్నీ చూసిన ప్రభుత్వ సిబ్బంది కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవినీతి లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దాంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని పేదలకూ ఆహారధాన్యాలు సకాలంలో పూర్తిస్థాయిలో అందుతున్నాయి. విద్య, పారిశుద్ధ్యం, వైద్య విభాగాల్లో ముందంజలో ఉన్న కొట్టాయం జిల్లా... ఆకలినీ జయించి ‘హంగ్రీ ఫ్రీ డిస్ట్రిక్ట్‌’గానూ గుర్తింపు పొందేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.