close
గోళ్లలోపల కదిలే చీమలు!

సోషల్‌ మీడియా వచ్చాక ఎంత వింతగా ఉంటే అంత ఫ్యాషన్‌ అన్నట్లు మారిపోయింది పరిస్థితి. అందులో ఇంకాస్త శృతి మించిందే ఈ ‘చీమల మానిక్యూర్‌’. ఈ కొత్త ఫ్యాషన్‌ను సృష్టించింది రష్యాకు చెందిన ‘నెయిల్‌ సన్నీ’ సెలూన్‌. దీన్లోభాగంగా గొట్టంలా వంపు తిరిగిన కృత్రిమ గోళ్లను మామూలు గోళ్లకు అంటించి, గోరు వెనకభాగంలో ఉండే వంపుని మందపాటి ప్లాస్టిక్‌ షీట్‌తో మూస్తారు. దాంతో ఆ గోరు పూర్తిగా గొట్టంలా మారుతుంది. అందులోకి బతికున్న గండుచీమను పంపించి అది బయటకు రాకుండా ముందుభాగాన్ని కూడా మూసేస్తారు. ఇలా చేసిన మానిక్యూర్‌ వీడియోని నెయిల్‌ సన్నీ సెలూన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. గోళ్లలో చీమలు కదులుతున్నట్లున్న ఈ వీడియోకి రెండుమూడు రోజుల్లోనే ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాదు, ‘గోళ్లలోపల బతికున్న చీమల్ని పెట్టడం ఏంటీ... లోపల గాలి ఆడక అవి కాసేపటికి చనిపోవా... ఇదెక్కడి ఫ్యాషన్‌’ అంటూ ఎంతోమంది ఆ సెలూన్‌ నిర్వాహకుల మీద విరుచుకుపడ్డారు కూడా.

ఇవి కరిగే శిల్పాలు!

కూల్‌డ్రింకుల్లోనూ బీర్‌లోనూ ఐసు క్యూబులు వేసుకోవడం అందరికీ తెలిసిందే. కానీ జపాన్‌కు చెందిన ‘సంటొరీ విస్కీ’ కంపెనీ ఆ ఐస్‌ క్యూబులకు కూడా అందమైన రూపాలనిచ్చింది. అవును, ఇక్కడ డ్రింకు గ్లాసుల్లో చూడచక్కగా కనిపిస్తున్న మందిరం, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ, గిటార్‌, సాగరకన్య... లాంటివన్నీ ఐసుతో చేసినవే. చేతివేడికే కరిగిపోయే ఐసుతో ఇంత తీరుగా స్పష్టమైన రూపాలను ఎలా చెక్కగలిగారంటే... ఆ గొప్పతనమంతా ‘సీఎన్‌సీ రూటర్‌’ అనే మెషీన్‌దే. ఈ యంత్రంలో ఏదైనా త్రీడీ ఫొటోని నిక్షిప్తం చేస్తే చాలు, దేన్నైనా అచ్చుగుద్దినట్లూ ఆ రూపంలో చెక్కేస్తుంది. అయితే, ఇప్పటివరకూ ఈ మెషీన్‌ని చెక్క, ప్లాస్టిక్‌... లాంటి వాటికి కొత్త రూపాల్ని ఇచ్చేందుకు మాత్రమే ఉపయోగించేవారు. తమ సంస్థ ప్రచారం కోసం సంటొరీ విస్కీ మొదటిసారి ఆ పద్ధతిలో ఐసు క్యూబుల్నీ చూడచక్కని శిల్పాలుగా మలిచింది. చెక్కేటపుడు ఐసు కరిగిపోకుండా ఉండేందుకు మైనస్‌ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర వీటిని తయారుచేశారట. ఇంకేముందీ... సంటొరీకి బోలెడు ప్రచారం వచ్చింది.

టూర్‌కి వస్తే రూ.72లక్షల జీతం!

ప్రపంచాన్ని చుట్టిరావడం అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు... కాకపోతే ఉద్యోగ బాధ్యతలూ ఆర్థిక ఇబ్బందులతో వెనుకంజ వేస్తుంటారు. అలాంటివారికి ఉచితంగా విమానాల్లో తిప్పి, ప్రపంచంలోని అందాలను చూపించి, విలాసవంతమైన హోటళ్లలో విడిది సౌకర్యాలు కల్పించి, సరదాగా గడిపిన ఆ సమయానికి లక్షల జీతం కూడా ఇస్తామంటే ఎగిరి గంతేయరూ... నిజం, ఇలాంటి ఓ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చంటూ బ్రిటన్‌కి చెందిన ‘పెర్‌ఫోకల్‌’ వెబ్‌సైట్‌లో ఈమధ్య ఓ ప్రకటన వచ్చింది. స్థానికంగా ఉండే ఓ ధనిక కుటుంబం ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలనుకుంటోందట. అలా వెళ్లినపుడు జీవితాంతం మధురజ్ఞాపకంలా మిగిలిపోయే ఫొటోలను తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్‌ను వెంట తీసుకెళ్లాలన్నది వారి ఆలోచన. ఇంకేముందీ... ‘ఫొటోలు తీయడం బాగా వచ్చినవారెవరైనా మాతో రావొచ్చు’ అంటూ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. అన్నిసౌకర్యాలూ కల్పించడంతో పాటు, ఏడాదికి జీతం రూ.72 లక్షలు ఇస్తారట. పర్యటనకు వెళ్లని సమయంలో ముప్ఫైరోజులు సెలవులు తీసుకోవచ్చు. సిక్‌లీవ్‌లు కూడా ఉంటాయట. మీకు ఫొటోలు తియ్యడం వచ్చా మరి..!

ఈ టవర్‌ గాలిని శుద్ధి చేస్తుంది!

వాయుకాలుష్యం... ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. చైనా కూడా అందులో ఒకటి. దానికి పరిష్కారంగానే ఆ దేశం స్థానిక జియాన్‌ నగరంలో వంద మీటర్ల ఎత్తులో ఈ టవర్‌ని నిర్మించింది. దీనికీ కాలుష్యానికీ సంబంధం ఏంటంటారా... ఇది ప్రపంచంలోనే ఎత్తైన ఎయిర్‌ ప్యూరిఫయర్‌. సౌరశక్తితో పనిచేసే ఈ టవర్‌ కాలుష్యపూరితమైన గాలిని గ్రహించి దాన్ని వేడిచేసి, ఫిల్టర్లద్వారా శుభ్రంచేసి బయటికి పంపిస్తుంది. అలా పది చదరపు కి.మీ పరిధిలో రోజుకి కోటి క్యూబిక్‌ మీటర్ల గాలిని శుభ్రం చేస్తుందట. ఈ టవర్‌ పెట్టాక చుట్టుపక్కల గాలిలో కాలుష్యం చాలావరకూ తగ్గిందట. ఎంత మంచి ఆలోచనో...

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.