close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముసుగు తీసిన హేతువు

- పద్మజ అమళ్ళదిన్నె (మల్లాది)

‘‘పరమేశ్వరశాస్త్రిగారు వచ్చినట్టున్నారే?’’ లోపలికి వస్తూనే అడిగాడు భార్యను ఉద్దేశించి రాజశేఖరం. ‘‘అవును, మిమ్మల్ని కూడా రమ్మని చెబుదామని ఫోన్‌ చేస్తే ఎత్తనేలేదు మీరు. ఓ గంట పర్మిషన్‌ తీసుకుని రావాల్సింది, ఆయన చాలా మార్పులు చెప్పాడు.’’ ‘‘తెలుస్తోంది...’’ ఖాళీగా ఉన్న హాలు వంక చూస్తూ అన్నాడు.

‘‘బాగానే గమనించారు. సోఫా ఇక్కడ ఉండబట్టే మన అబ్బాయికి ఆ గతి పట్టిందట. రెండేళ్ళనుండీ ఒక్క సంబంధమూ కుదిరిచావకపోవటానికి అదే కారణమట. ఆ దిక్కులో అసలు ఎక్కువసేపు నిలబడనే కూడదట. మనం అక్కడే కూర్చుని గంటలు గంటలు టీవీ చూస్తున్నాం. రాహువు రెండో ఇంట నుండి వక్రంగా అటే చూస్తున్నాట్ట.’’ ‘‘ఏంటీ... సోఫా వంకే’’ భయంగా అడిగాడు రాజశేఖరం.

‘‘మరే...’’ కాఫీ ఇస్తూ ‘‘అదిగో అలా కూర్చోండి, అక్కడ అయితే మంచిదట’’ సగం బెడ్‌రూమ్‌లోనూ సగం హాల్లోనూ ఉన్న సోఫా వంక చూపిస్తూ అంది సావిత్రి.

‘‘బెడ్‌రూమ్‌లోకి వెళ్ళటం ఇబ్బందికదే...’’ సోఫావంక చూస్తూ అన్నాడు.

‘‘మనం ఇప్పుడు దాన్ని బెడ్‌రూమ్‌గా వాడితే గదా. ఆ మూల చలనంలేని వస్తువులు పడుండాలట. మనం కాదు ఉండాల్సింది. మన పడగ్గదిని స్టోర్‌రూమ్‌లోకి మార్చేశానులెండి. మీ ఆఫీసులో గొడవలకి అదే కారణం.’’

‘‘అవునా..! ఇప్పుడు పర్లేదంటావా... ఒకటే గొడవలు మా బాస్‌తో. సర్దుకుంటాయంటావా?’’

‘‘సుబ్బరంగానూ... ఇంకా వంటింట్లో కూడా చిన్నపాటి మార్పులు చెప్పాడండీ. గ్యాస్‌ పొరపాటున కూడా ఆ మూల ఉంచగూడదట. దేవుణ్ణి తీసుకుపోయి ఆ మూల అగ్గిమీద కూర్చోబెట్టేశామట. ఆయన్ని తీసుకెళ్ళి నిప్పులమీద కూర్చోబెడితే ఆయన మనల్ని చల్లగా ఎలా చూస్తాడూ..?’’

‘‘అవునా..? ఎంత పొరబాటు చేసేశాం’’ భయంగా పశ్చాత్తాపపడుతూ కాఫీగ్లాసు పక్కనపెట్టి లెంపలేసుకున్నాడు రాజశేఖరం.

‘‘మరి బీరువా అక్కడ నిలబెట్టొచ్చా?’’ ‘‘అదొక్కటే కరెక్ట్‌గా పెట్టామట. అందుకే ఈమాత్రం మనం ఇలా నిలబడి ఉన్నామట. లేకపోతే ఏనాడో నేలమీద దేకుతూ పోయేవాళ్ళమట.’’ ‘‘అమ్మో, అయితే తెలీకుండా ఓ మంచి పని చేశామన్నమాట బీరువా అటుపెట్టి. అన్నట్టు... మీ అమ్మ ఫొటో గురించి అడిగావా?’’

‘‘అన్నిటికన్నా ముఖ్యమైంది అదే కదా, ఎలా మర్చిపోతానూ... అడిగాను. ‘పూలదండ ఏ పక్కకి పడిందీ... ఎన్నిసార్లు...’ అని అడిగాడు.’’ ‘‘రెండుసార్లే కదా పడింది, కుడిపక్కకే కదా. నాకు అలానే గుర్తుంది. అదే చెప్పాను. అదే ఎడమపక్కకి పడుంటే పెద్ద కీడే జరిగేదట. తృటిలో ప్రమాదం తప్పింది అన్నాడు’’ ప్రమాదం తప్పినందుకు రిలీఫ్‌గా ఫీలవుతూ చెప్పింది సావిత్రి. ‘‘అయినా పోయినవాళ్ళ ఫొటోలవంక చూడాలంటే నాకు చచ్చే భయమని నీకు తెలుసు కదా. నువ్వేమో ‘మా అమ్మ, మా నాన్న’ అంటూ ఏకంగా హాల్లో తగిలించేశావు. నా మాట విని తీసి పెట్టెలో పెడుదూ... దానికి దండ వేయకపోతే ఓ భయం, వేస్తే  ఓ భయం.’’

సావిత్రి కూడా ఫొటోవంక ఓసారి భయంగా చూసి ‘‘ఎందుకయినా మంచిది లోపల పెట్టేస్తానులెండి’’ అంది. ‘‘అవునూ... ఇంతకుముందు వచ్చిన పతంజలిగారు ఇన్ని మార్పులు చెప్పలేదే?’’

‘‘ఎలా చెప్తాడు... ఆయనకంతా హాఫ్‌ నాలెడ్జ్‌ అంట. పరమేశ్వరశాస్త్రిగారు అంటే సిటీలో నంబర్‌ వన్‌. అందుకే కదా ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకటానికి ఇంతకాలం పట్టింది. ఆ మధ్యలో మీ తమ్ముడు పంపాడే... రేవంత్‌ స్వామి... ఆయన కూడా
దిగదుడుపే ఈయన ముందర. అసలు ఏం మనిషీ... ఏం విగ్రహం... ఎంత గంభీరం అనుకున్నారు..? అన్నీ ఇట్టే చూడగానే చెప్పేశాడు. అన్నట్టు మీరు పొద్దున కిందకి దిగగానే పై అపార్టుమెంట్‌లో ఉండే బ్రహ్మచారి వెధవ కూడా దిగాడు. మీకు ఎదురయ్యాడా ఏంటి? మళ్ళీ వెనక్కి రాకపోతే ఎదురు అవలేదేమో అనుకున్నా.’’

‘‘ఎందుకు కాలేదూ... ఇలా బండి తీశానో లేదో ‘హాయ్‌ అంకుల్‌, గుడ్‌ మార్నింగ్‌ పెంకుల్‌’ అంటూ తయారైపోయాడు. వీడి మాణింగ్‌కి శార్థం పెట్ట. చచ్చినట్టు బండి పార్క్‌ చేసి, వాచ్‌మన్‌ని అడిగి కాళ్ళు కడుక్కుని వెళ్ళా. మళ్ళీ ఇంత పైకి ఏం రానూ..?’’ పొద్దు జరిగింది పూసగుచ్చినట్టు చెప్పుకున్నాడు భార్యకి.

‘‘మంచిపని చేశారు, ఆపాట్న వెళ్ళకండి ఎప్పుడూనూ. అన్నట్టు, ఇంకోటి చెప్పాడండీ... వీధిగుమ్మం మార్చుకోమని. ఆ పక్కన కిటికీ ఉన్న స్థానంలో గుమ్మం ఉండాలట. ‘గోడమీద ఒక్క దెబ్బపడ్డా అపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరూ యుద్ధానికొచ్చేస్తారండీ’ అని చెప్పాను.’’

‘‘అమ్మో... మరి ఏదైనా రెమెడీ ఉందంటనా?’’ భయంతో గొంతు జీరబోయింది రాజశేఖరానికి.

‘‘ఎందుకు లేదూ... ఉందట. మనం గ్రిల్లు వాకిలిలోంచి లోపలికొచ్చాక డోర్‌ తీయకుండా, పక్కన కిటికీ ఉందే... దాన్లోంచి లోపలికి వస్తే చాలట. మేస్త్రీ నరసింహానికి వెంటనే ఫోన్‌ చేశా. రేపొచ్చి ఆ కిటికీ గ్రిల్లు తీసేస్తానన్నాడు. ఇదిగో ఈ ముక్కాలిపీట అక్కడ
వేసుకుంటే ఎత్తు సరిపోతుంది, ఎక్కడానికీ దిగటానికీ వీలుగా ఉంటుంది. ఎవరైనా వస్తేనే ఆ వాకిలి తీద్దాం... మనం ఇదే వాడుకుందాం. ఇంకో విషయం కూడా చెప్పాడండీ... నన్ను బొట్టు కుడి కనుబొమకి కొంచెం పైన పెట్టుకోమన్నాడు. మూడోవారానికల్లా మన అబ్బాయికి పెళ్ళి సంబంధం ఇంటి ముందుకు వస్తుందట.’’

‘‘ఇవన్నీ ఫర్లేదు కానీ... మరీ బొట్టు కనుబొమ మీద ఏవిటే...’’ సందేహంగా అంటున్న భర్తని మధ్యలోనే ఆపేసి అంది సావిత్రి-

‘‘ఏమవుతుందీ... ఎవరైనా నవ్వుతారనా. నవ్వితే నవ్వి పోనీండి. మనం ప్రమాదాలు కొనితెచ్చుకుంటామా - పక్కవాళ్ళు ఏమనుకుంటారో అని. అయినా రెండు నెలలేనట. ఎంతలో గడిచిపోతాయిలెండి రెండ్నెల్లు. అన్నట్టు... మీరు అనంతపురం క్యాంపు వెళ్ళాలి అన్నారు ఇవ్వాళా... రేపా?’’

‘‘ఇవ్వాళే. నాలుగున్నరకల్లా డ్రైవర్‌ వచ్చేస్తాడు. ఇంకో గంటలో బయలుదేరాలి. ఒక జత బట్టలు పెట్టు బ్యాగులో. ఒకరోజే క్యాంపు’’ భార్య బ్యాగు సర్దేలోపు ఇల్లంతా ఓమారు కలియతిరిగి స్థిమితపడ్డాడు రాజశేఖరం.

‘‘మర్చిపోతావేమో, ఇంకోసారి ఫోన్‌ చెయ్యి మేస్త్రీ నరసింహానికి’’ కారు ఎక్కుతూ గుర్తుచేశాడు భార్యకి.

కారు హైవే మీద దూసుకుపోతోంది. ముప్పయ్యేళ్ళొచ్చినా కొడుక్కి పెళ్ళి కాకపోవటం గురించీ తనకి తరచూ బాస్‌తో జరిగే గొడవల గురించీ ఆలోచనలోపడ్డాడు రాజశేఖరం. ‘‘టీ తాగుతారా సార్‌’’ అడిగాడు  డ్రైవర్‌.

‘‘ఇంకా ఎంత దూరం ఉందయ్యా, అప్పుడే రెండు గంటలు దాటింది కదా బయలుదేరి’’ వాచ్‌ చూసుకుంటూ అన్నాడు.

‘‘ఇంకో మూడు గంటల్లో వెళ్ళిపోతాం సార్‌.’’

ఇద్దరూ టీ తాగి కారు ఎక్కబోతుండగా ఎదురుగా వచ్చిన నల్లపిల్లి రాజశేఖరం దృష్టిలోపడింది. ‘ఉండు, ఉండు’ అని కారు దిగి వెనక్కెళ్ళి, టీబంక్‌వాణ్ణి నీళ్ళు అడిగి కాళ్ళు కడుక్కుని, ముందున్న బెంచిమీద కూర్చుని కొంచెంసేపు ధ్యానం చేసుకుని బయలుదేరాడు రాజశేఖరం.

మెల్లగా హైవే మీద సాగుతున్న కారుతోపాటు... సన్నగా జల్లు కూడా మొదలైంది. ఇంకో గంటన్నరలో టౌన్లోకి ప్రవేశిస్తాం అనగా వానజోరు పెరిగి ఈదురుగాలులు తోడయ్యాయి. మరో పదిహేను నిమిషాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది.

ఏడు గంటలకే చిమ్మచీకట్లు కమ్ముకున్నట్టుగా అయిపోయింది. ఈదురుగాలికి చెట్లకొమ్మలు విరిగి పడుతున్నాయి. దాంతో కరెంటు తీగలు తెగిపోయి, రోడ్డుకిరుపక్కలా ఉన్న లైట్లు పోయాయి. కష్టం మీద కారు నడుపుతున్న డ్రైవర్‌ ఇంకో పది నిమిషాల్లో చేతులెత్తేశాడు.
‘‘ఇంక లాభంలేదు సార్‌. వర్షం బాగా ఎక్కువైంది. ముందేమీ కన్పించటం లేదు. ఫ్లడ్‌లైట్స్‌ వెలుతురు సరిపోవటం లేదు. ఎక్కడైనా ఆగాల్సిందే’’ అని కారు ఆపేశాడు డ్రైవర్‌.

‘ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా ఇలా అయిపోయింది ఏమిటా...’ అని గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మనసులోనే దండం పెట్టుకుంటున్నాడు రాజశేఖరం.వాన అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కారు చక్రాల సగం వరకూ నీరు వచ్చినట్టు గమనించాడు డ్రైవర్‌. అప్పుడు అర్థం అయింది వాళ్ళకి- తాము ఒక లోతట్టు ప్రాంతంలో కారు ఆపామని. వెంటనే కారు స్టార్ట్‌ చేశాడు డ్రైవర్‌. కానీ అది స్టార్ట్‌ కాలేదు.

‘‘పదండి సార్‌, కారు దిగండి. ఇందాక మెరుపుల్లో అక్కడొక ఇల్లు చూశాను. ఆ ఇంటికి వెళ్దాం. ఇక్కడే కారులో ఉంటే ప్రమాదం’’ డోర్‌ తీసుకుని హడావుడిగా కారు దిగాడు డ్రైవరు.

ఇద్దరూ కొంచెం దూరంలో ఉన్న చిన్న ఇంటివైపు మెరుపుల ఆధారంతో అడుగులు వేయటం మొదలుపెట్టారు.

వాన బాగా ఎక్కువ అయిందనీ కారు ట్రబుల్‌ ఇచ్చి ఆగిపోయిందనీ కొంచెం షెల్టర్‌ ఇవ్వమనీ తలుపు తీసిన పెద్ద మనిషితో మొరపెట్టుకున్నాడు రాజశేఖరం.

‘‘అయ్యో, దాందేముంది సామీ... రండి లోపలికి. దానికంతగా అడగాల్నా రండి, రండి’’ అంటూ సాదరంగా లోపలికి పిలిచాడు ఆ ఇంటాయన.

విసురుగా వస్తున్న గాలికి తలుపు బందోబస్తు చేసి ‘‘తడిసిపోయారుగంద సామీ... ఈ టవలుతో తుడుసుకోండ్రి. ఈ పంచలు కూడా కట్టుకోండ్రి’’ అంటూ ఇద్దరికీ రెండు లుంగీల్లాంటివి ఇచ్చాడు.

లోపల ఓ మూలగా కుంపటి మీద అన్నం ఉడుకుతోంది. పక్కనే మరో కుంపటి మీద పులుసు మరుగుతోంది. రెండు వాసనలూ కలిసిపోయి ముక్కుపుటాల్ని కమ్మగా తాకుతోంది. ఓ మూలగా లాంతరు... అది ఇల్లు అనటంకన్నా ఓ మాదిరి పెద్ద గది అనొచ్చు. అతి తక్కువ సామానుతో ఉంది. ఓ మూలగా చాపమీద- అతని తండ్రి అయి ఉండొచ్చు - ఓ పెద్దాయన పడుకుని కనిపించాడు.

‘‘మీరేమీ అనుకోకపోతే... నాతోపాటు బువ్వ తినుండ్రి సామీ. నేను పులుసు బాగా కాత్తానంటది నా పెళ్ళాం’’ అన్నాడతను.

అప్పటికే ఆ వాసనలకి కడుపులో ఆకలి మొదలైంది ఇద్దరికీ.

తేరిపార చూశాడు అతన్ని రాజశేఖరం. బలిష్టంగా ఉన్నాడు. మొహం కరుగ్గా ఉన్నా మాటల్లో మార్దవం, కళ్ళల్లో ఆత్మీయతా కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఒక్క నిమిషం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది అతనికి. ‘ఇదే సిటీలో అయితే ఇలా జరుగుతుందా? ఎవడైనా వస్తే దోచుకుపోవటానికే వచ్చాడన్పిస్తుందెందుకు?’ అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ‘ఇతనింట్లో ఏముందని దోచుకుపోవటానికి... ఇక వీళ్ళకి భయమెందుకుంటుంది?’ అని సమర్థించుకున్నా కానీ ఆ ఆత్మీయత వెలకట్టలేనిదని మనసు చెప్పకనే చెప్తోంది. హోరుగాలీ... వానా... లోపల కుంపట్ల మధ్య వెచ్చగా... అంతవరకూ ముఖపరిచయం కూడా లేని వ్యక్తి కొసరి కొసరి పెట్టిన సత్తుపళ్ళెంలోని వేడివేడి అన్నమూ పులుసూ... లాంతరు వెలుతురూ... ఆ వ్యక్తి చెప్పే కబుర్లూ... ఓ అద్భుతమైన వింత అనుభవంలా తోచింది రాజశేఖరానికి.

‘‘ఈ గాలీ వానా తగ్గేలాగా లేదు సామీ. ఈ రాత్రికి ఇక్కణ్ణే పడుకుని రేపు పొద్దుగాల లేసి పొండ్రి’’ అన్నాడు అతను.

దేవుడిలా కన్పించాడు అతను ఇద్దరికీ. రెండు కంబళ్ళు ఇచ్చి, రెండు చాపలు పరిచాడు. వెచ్చగా కప్పుకుని నడుం వాల్చేటప్పటికి ప్రాణం కుదుటపడింది. బయట హోరుగా ఉన్నా లోపల ఏదో ప్రశాంతత.

పల్లెటూరి స్వభావంతో తన విషయాలన్నీ ఏకరువు పెడుతున్నాడు అతను. అతని పేరు సాంబయ్య అనీ, ఆ ఇల్లు ఇటీవల తనలాంటి వారి కోసం ప్రభుత్వం కట్టించిందనీ, భార్యా కొడుకూ పుట్టింటికి వెళ్ళారనీ... అలా ఏకరువు పెడుతూ మధ్యలో ‘‘నీకెంత మంది సామీ పిల్లలూ’’ అని అడిగాడు.

ఇప్పుడు సాంబయ్య చాలా ఆత్మీయుడయిపోయాడు రాజశేఖరానికి. తన ఇంటి విషయాలన్నీ చెప్తూ కొడుక్కి ఎంతకీ పెళ్ళి కావటంలేదని కూడా చెప్పుకున్నాడు.

‘‘సామీ, మా అయ్యవారి బిడ్డ ఉండాది... లక్ష్మమ్మ. టీచరు పని సేత్తాండాది. నా కొడుక్కి ఆ అమ్మే సదువు సెప్పేది. మీ కులపోల్లే. నీ అడ్రస్సు ఇచ్చి పో, మా అయ్యవారికి సెప్తా’’ అని ఫోన్‌ నంబరూ, అడ్రస్సూ రాయించుకున్నాడు సాంబయ్య.కబుర్లలో ఎప్పుడు నిద్రలోకొరిగారో వాళ్ళకే తెలీదు.

హఠాత్తుగా మెలకువ వచ్చింది రాజశేఖరానికి. తలుపు సందుల్లోంచి కొడుతున్న జల్లుకి వీపు తడిసినట్టు గమనించాడు. సన్నగా చలి మొదలైంది. సాంబయ్యా, డ్రైవరూ గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. లేపటం ఇష్టంలేక పక్కనే పడుకున్న సాంబయ్య తండ్రి చాప మీదకి జరిగి, ఆయన దుప్పటి కూడా కొంచెం లాక్కుని, దగ్గరగా జరిగి వెచ్చగా పడుకున్నాక మళ్ళీ నిద్రపట్టేసింది రాజశేఖరానికి.

మెలకువ వచ్చేటప్పటికి బాగా తెల్లవారి ఉంది. వాన కూడా ఆగిపోయింది. గబుక్కున చాప మీంచి లేచాడు. డ్రైవరు కూడా అప్పుడే లేచాడు. ఓపక్క కుంపటి ముందు కూర్చుని ‘టీ’ కాచుకుంటున్నాడు సాంబయ్య.

జేబులో ఎంత ఉందో గుర్తుచేసుకున్నాడు రాజశేఖరం. ‘కనీసం ఓ రెండు వేలయినా ఉంటే బావుండు సాంబయ్యకి ఇవ్వటానికి’ అనుకున్నాడు.

టీ గ్లాసు అందుకుని ‘‘ఇంకా మీ నాన్నగారు లేవలేదే సాంబయ్యా’’ అని అడిగాడు పెద్దాయన వంక చూస్తూ.

‘‘ఆయన మా నాయన కాదు... ఆయన ఎప్పటికీ లెగడు సామీ...’’ అన్నాడు సాంబయ్య.

‘‘అంటే...’’ అర్థం కానట్టుగా నిర్ఘాంతపోయి చూశాడు రాజశేఖరం.

‘‘అవును సామీ, అది శవం. నేను ఇక్కడ కాటికాపరిని. నిన్న సందేళ వచ్చిన అనాథశవం అది. బయట వానలో ఉంచటం ఇష్టంలేక లోపల పెట్టాను.’’

‘అంటే... అంటే... రాత్రంతా తాను కావలించుకుని పడుకుంది శవాన్నా’ రాజశేఖరం చేష్టలుడిగి నిలబడిపోయాడు.

ఎత్తైన కోట బురుజులోంచి ఒక్క పెట్టున పావురాలన్నీ ఎగిరిపోయినట్టు అతనిలోని సందేహాలూ నమ్మకాలూ భయాలూ భ్రాంతులూ... అన్నీ పటాపంచలైపోయాయి. ఇంగితం ముసుగు
తొలగింది. హేతువు కళ్ళు తెరిచింది.

సోఫాసెట్టు హాల్లోకొచ్చింది... గ్యాస్‌స్టవ్‌ గట్టుమీద కెక్కింది... సావిత్రి బొట్టు నుదుటి మీదకి వచ్చింది.

సాంబయ్య పంపిన పెళ్ళి సంబంధం మూడోరోజే ఇంటిముందుకొచ్చింది. నెల తిరక్కుండా కోడలు ఇంటిలోకి వచ్చింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.