close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అక్కడ సింహం మా పక్కనే కూర్చుంది..!

‘ఎత్తైన పర్వతాల్నీ లోతైన లోయల్నీ విశాలమైన గడ్డిమైదానాల్నీ సుందర సరస్సుల్నీ వాటి మధ్యలో జీబ్రాల గుంపుల్నీ చిరుతపులుల కుటుంబాల్నీ సింహాల రాజసాన్నీ ఏనుగుల క్రమశిక్షణనీ... ఇలా ప్రకృతి సౌందర్యాన్నీ అడవి జంతువుల హావభావాల్నీ బాగా దగ్గరగా చూడాలంటే ఆఫ్రికాలోని టాంజానియా అటవీ ఉద్యానవనాల్లో సఫారీ పర్యటనకి వెళ్లి తీరాల్సిందే’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డి.ఎస్‌.కుమార్‌.

హైదరాబాద్‌ నుంచి ఒమాన్‌ మీదుగా దార్‌-ఎస్‌-సలాం చేరుకున్నాం. దీన్నే దార్‌ లేదా దారుస్సలాం అనీ అంటారు. వాళ్ల భాషలో స్వర్గానికి ద్వారం అని అర్థం. ఇది దేశంలోని అతిపెద్ద నగరం. వీధులన్నీ శుభ్రంగా అందంగా ఉన్నాయి. ట్రాఫిక్‌ క్రమబద్ధంగా ఉంది. వాళ్లకి మర్యాదలు చాలా ఎక్కువ. కనిపించిన ప్రతివాళ్లూ వాళ్ల భాషలో జాంబో(హలో) చెబుతారు. మొదటి రెండు రోజులు ఊరంతా తిరిగాం. ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడుని మించకపోవడంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. టాంజానియా పర్యటన అనగానే అందరికీ గుర్తొచ్చేది సఫారీ యాత్రల్ని నిర్వహించే జాతీయ ఉద్యానవనాలే. విమానాశ్రయం నుంచి బయలుదేరి అరుష అనే నగరానికి చేరుకున్నాం. విమానం దిగగానే మాకోసం కేటాయించిన టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ వ్యాన్‌ వచ్చింది. దాని డ్రైవర్‌ కమ్‌ గైడ్‌ రిచర్డ్స్‌కి ఇంగ్లిష్‌ వచ్చు. పైగా అటవీటూరిజంలో శిక్షణ తీసుకున్నాడు. మమ్మల్ని పరిచయం చేసుకుని, లంచ్‌ ప్యాకెట్లు తీసుకుని బయల్దేరాడు. మనకు ఏ రకమైన భోజనం కావాలో ముందుగా టూర్‌ ఆపరేటర్లకు చెబితే, ఆ ప్రకారం భోజనం సిద్ధం చేస్తారు. అరుషలో మన్యరా జాతీయపార్కుకి బయలుదేరాం. రోడ్డు బాగానే ఉన్నా నిబంధనల ప్రకారం ఈ రకం వ్యాన్లు గంటకు 50 కిలోమీటర్ల వేగానికి మించకూడదు. ఇంకొంచెం దూరంలో పార్కు వస్తుందనగా వ్యానుని ఓ చెట్టు కింద ఆపి లంచ్‌కు ఉపక్రమించాం. వ్యానులోనే ఉన్న ఫోల్డింగ్‌ టేబుల్‌ సర్ది, టేబుల్‌ క్లాత్‌ వేసి కుర్చీలను వేశాడు రిచర్డ్స్‌. తెచ్చుకున్న ప్యాకెట్లలోని భోజనాన్ని పూర్తిచేసేటప్పటికీ రోడ్డుకి అవతలి వైపునకు కనిపించింది ఓ పెద్ద జిరాఫీల గుంపు. అడవిలోకి వెళ్లకముందే అవి కనిపించేసరికి ఆనందంగా అనిపించింది. టోల్‌గేటు దగ్గర ఐడెంటిఫికేషన్‌ చూపించి, అనుమతి తీసుకోవాలి. ఆ పనులన్నీ రిచర్డ్స్‌ చేస్తుండగా మేం అక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండిపోయాం.

 

సరస్సు నిండా గులాబీలే
ప్రతి టోల్‌గేట్‌ దగ్గరా వ్యూ పాయింట్లలోనూ టాయ్‌లెట్లు ఉంటాయి. అవి ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. నీళ్లు దొరకని ప్రదేశాల్లో ట్యాంకర్లలో తెచ్చి నిల్వ చేస్తున్నారు. కొంచెం దూరం వెళ్లగానే గుంపులు గుంపులుగా కనిపించాయి బబూన్లు(నల్లమూతి కోతులు). వాటి కిచకిచలు వింటూ కొంచెం దూరం వెళ్లేసరికి అడవి పందులూ, లేళ్ల గుంపులూ కనిపించాయి. అక్కడ అన్ని జంతువుల్లోకెల్లా పిరికివి అడవి పందులే. మిగిలినవి మనం కనిపించినా చూసీ చూడనట్లే మేస్తుంటాయి. ఈ పందులు మాత్రం వ్యాను శబ్దం వినగానే పరుగు లంకించుకుంటాయి. ఆ తరవాత మళ్లీ జీబ్రాల గుంపు కనిపించింది. ఇక్కడి సరస్సు దగ్గర ఉన్న పక్షుల్లో ఎన్నోరకాలు... మరెన్నో రంగులు... పిచ్చుకల నుంచి పెలికాన్ల దాకా. చిలుకల నుంచి రాబందుల వరకూ. సరస్సునిండా తామరలు విచ్చుకున్నట్లున్న గులాబీరంగు పెలికాన్‌లను చూస్తుంటే అక్కడినుంచి కదలాలనే అనిపించలేదు. మన్యరా సరస్సు చెట్లెక్కే సింహాలకు ప్రత్యేకం. ఈ రకమైన జాతి ప్రపంచం మొత్తమ్మీద ఈ ఒక్కచోటే కనిపిస్తుంది. అవన్నీ చూసి ఫొటోలు తీసుకుని సాయంత్రానికి హోటల్‌కు చేరుకున్నాం. ఎక్కడికి వెళ్లినా హోటళ్లన్నీ బాగున్నాయి. పర్యటకుల కోసం సాయంకాలాల్లో స్థానికుల సాంస్కృతిక కార్యక్రమాలూ ఆక్రోబాటిక్‌ షోలూ ఉండేవి.

 

గోరోన్గోరో..!
రెండోరోజు గోరోన్గోరో అనే ప్రాంతానికి బయలుదేరాం. గులకరాళ్ల రోడ్డుమీద మూడు గంటల ప్రయాణం. రోడ్డుకు ఆనుకుని ఓ వైపు పెద్ద లోయ, లోయలో నుంచి రోడ్డుకన్నా ఎత్తుగా పెరిగిన పెద్ద చెట్లు, రోడ్డుకి రెండోవైపు కేవలం మూడు నాలుగు అడుగుల ఎత్తులో గోధుమరంగు పొదలతో నిండిన పెద్ద మైదానం. ఇంతలో మొదలైంది పెద్ద వర్షం. ఇరుకైన రోడ్డులో పోతూ ఉంటే కాస్త భయం అనిపించింది. కానీ పచ్చని ప్రకృతి ఆ భయాన్ని మరిపించేసింది. వర్షం వస్తూనే ఉంది. వైపర్లు పనిచేస్తూనే ఉన్నాయి. మా ప్రయాణం సాగుతూనే ఉంది. మరికాసేపటికి గోరోన్గోరో క్రేటర్‌ దగ్గరకు వెళ్లాం. అదో అగ్నిబిలం. సుమారు 3.4 మిలియన్‌ సంవత్సరాల క్రితం భారీ విస్ఫోటం సంభవించి, ఓ పెద్ద అగ్నిపర్వతం పేలిపోయిందనీ అది పేలినచోట ఓ పెద్ద గుంత ఏర్పడిందనీ మా గైడ్‌ చెప్పాడు. మేం ఆ బిలం అంచుమీదుగా ప్రయాణించి వ్యూపాయింట్‌ దగ్గర ఆగి బిలాన్ని చూశాం. ఓ పెద్ద గిన్నె అంచుమీద నిలబడి ఆ గిన్నె అడుగుభాగాన్ని చూస్తున్నట్లు అనిపించింది. దీని వైశాల్యం 260 చదరపు మైళ్లు. పైనుంచి కిందకి వెళ్లాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. బిలంలో గుండ్రంగా తిరుగుతూ వెళ్తుంది రోడ్డు. బిలం లోపలకి టెలీస్కోపులో చూస్తే జంతువులు సంచరిస్తున్నాయి.

 

ఆదిమ మానవుడి జాడలు
ఆ బిలం ఏర్పడిన కొన్ని సంవత్సరాలకు అక్కడ పడ్డ వర్షం నీళ్లు, బయటకు పోయే దారిలేక ఓ సరస్సు ఏర్పడిందనీ దానివల్లే అక్కడ జంతువులూ మనుషులూ చేరారనీ అంటుంటారు. ఆదిమ మానవుడి అడుగుజాడలు అక్కడ కనిపించాయనీ, వాటిని మ్యూజియంలో భద్రపరిచామనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ సాంస్కృతిక సంపదల్లో ఒకటిగా భావించి కాపాడుతోంది. బిలం అడుగువరకూ వెళితే విశాలమైన మైదానంలోకి వచ్చినట్లే అనిపించింది. చిన్న చిన్న సరస్సులు చాలానే ఉన్నాయి. ఒకవైపు వేలకొద్దీ జింకలూ మరోవైపు వందలకొద్దీ జీబ్రాలు. మరోవైపు అడవి దున్నలూ, బైసన్లు. సరస్సుల దగ్గర రకరకాల పక్షులు. వాటన్నింటినీ చూస్తూ ముందుకు వెళ్లాం. అప్పుడు ఎదురైంది గజరాజుల గుంపు. ఓ పెద్ద ఏనుగు అన్నింటికన్నా ముందుకు నడుస్తుంటే మిగిలిన ఏనుగులు దాని వెనకే పిల్లలతో సహా వస్తున్నాయి. అన్నింటికన్నా ముందున్న ఏనుగు దారి సురక్షితమని నిర్ణయించుకున్నాక మిగతావాటిని వెనక రమ్మంటుంది. అక్కడే ఓ పెద్ద సింహం చెట్ల పొదలలో సేదతీరుతోంది. ఆ సింహానికి ఓ అడుగు దూరంలో ఉంది మా వ్యాను. అదేమీ పట్టించుకోకుండా కాసేపు అటూ ఇటూ తిరిగి పొదలోకి దూరి నిద్రపోయింది. దారిలో నక్కలూ, తోడేళ్లు లాంటివి చాలానే కనిపించాయి. మాకిచ్చిన రిసార్టు క్రేటర్‌ అంచుపైన ఉండటంతో తనివితీరా క్రేటర్‌ అందాలు చూస్తూ ఆ చలిని భరిస్తూ విశ్రమించాం.

 

సెరెంగెటి జాతీయ ఉద్యానవనంలో...
ఆ మర్నాడు సెరెంగెటి అరణ్యానికి బయలుదేరాం. దూరంగా ఒకచోట నడిచి వస్తోన్న సింహాలు కనిపించడంతో అన్ని వ్యాన్ల ఇంజిన్లు ఆఫ్‌ చేశారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. మెల్లగా దగ్గరికొచ్చింది ఓ సివంగుల గుంపు... ఒకటి కాదు, రెండు కాదు, పన్నెండు సివంగులు మార్చ్‌ చేస్తున్నట్లు ఒకదాని వెనక ఒకటిగా మా వ్యాను పక్కగా నడవడం మొదలుపెట్టాయి. దూరంగా ఓ అడవి దున్నల మంద ఉందనీ అవి ఇటు వస్తాయనే ఉద్దేశంతో ఈ సింహాలు మాటువేసి వేటకు తయారవుతున్నాయనీ చిన్న గొంతుతో చెప్పాడు గైడ్‌. అందరం ఊపిరి బిగపట్టుకుని శబ్దం చెయ్యకుండా ఫొటోలూ, వీడియోలూ తీస్తూ చూస్తున్నాం.  కొన్ని సింహాలు మా వ్యానుని చాటు చేసుకుని కాచుకుని ఉంటే, మిగతావి గడ్డి పొదలతో దాక్కుని మంద రావడంకోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఆ దున్నల మంద ఇటు రాకుండా దారి మార్చుకుని వేరే వైపు వెళ్లిపోయింది. బతుకుజీవుడా అనుకుంటూ మేం మా సఫారీ కొనసాగించాం. ఆ అడవి మొత్తంలో 80 సింహాలు ఉన్నాయట. ఎక్కువగా నిద్రపోతుంటాయవి. ఒక్కో సింహం రోజుకి సుమారు 22 గంటలు నిద్రపోతుందట. ఒక జీబ్రాను తిని దాని కళేబరం పక్కనే నిద్రకు ఉపక్రమిస్తున్న సింహాన్ని ఒకదాన్ని చూశాం. మరోచోట ఓ సింహం వేటాడిన జీబ్రాపిల్లను తింటుంటే, మిగిలిన మాంసాన్ని తినడానికి కాచుకుని ఉన్నాయి హైనాలు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఆస్ట్రిచ్‌లూ కనిపించాయి. అవి పరిగెడుతుంటే తమాషాగా అనిపించింది.

 

బండరాళ్లలా ఉన్నాయవి
తర్వాతిరోజు ఓ చెట్టు దగ్గర చిరుతపులి కుటుంబం కనిపించింది. ఓ బురదమడుగు దగ్గర ఆగితే అక్కడ సుమారు వంద హిప్పోలు సేదతీరుతున్నాయి. ఇవి ఎక్కువసేపు నీటిలోనే ఉంటాయట. వాటిని చూస్తుంటే వాగులో పెద్ద బండరాళ్లు పరిచినట్లు ఉంది. ఒక్కొక్కటీ 15 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పులతో ఒక్కోటీ 3 టన్నుల బరువుతో చిన్నసైజు ఏనుగంత ఉన్నాయి. దీనికి పుట్టిన బిడ్డ 75 కిలోల బరువు ఉంటుందట. మాంసాహారులు కాకపోయినా వాటికి కోపం ఎక్కువ. దగ్గరకు వచ్చిన జంతువుల్ని నోటికి చిక్కించుకుందంటే అది ముక్కలై బయటకు రావాల్సిందే. ఆ మర్నాడు కిలిమంజారో ఎయిర్‌పోర్టు నుంచి జాంజిబార్‌ దీవికి చేరుకుని, రెండురోజులు గడిపి దారుస్సలాంకి చేరుకున్నాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.