close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ కేకు... కేక..!

ముచ్చటగా తయారైన పెళ్లికూతురిని పలకరించాలనో, ముద్దొచ్చే శునకాన్ని ఓసారి తాకాలనో, షోకేసులోని గౌనుని చూసి వేసుకోవాలనో, సారెలో పంపిన నగల్ని అలంకరించుకుందామనో అనుకుంటే భంగపాటు తప్పదు. తెల్లనివన్నీ పాలు కానట్లే ఈ పెళ్లికూతురూ, శునకమూ, గౌనూ, చీరా, నగలూ... అన్నీ కళ్లను మాయచేస్తోన్న కేకు కళాఖండాలు మరి!

క్రిస్మస్‌ పండగ, కొత్త సంవత్సరం, పుట్టినరోజు, పెళ్లిరోజు... ఇలా వేడుక ఏదయినా కేకుని కోయడం సహజమే. కానీ అందరూ ఒకేలాంటి కేకుని కోస్తే ఎలా? పుట్టినరోజు దుస్తులో లేదా పెళ్లి నగల అలంకారంలో తమదైన ముద్ర కనిపించాలని కోరుకున్నట్లే, కోసుకుని తినే కేకు కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలనుకుంటోంది ఈతరం. అందుకే కేకు రోజురోజుకీ మారిపోతోంది, అందమైన బొకేలా, కుందనాల బొమ్మలా; చూడచక్కని సోఫాలా, నిలువెత్తు బర్గరులా... ఇలా కోరుకున్న రూపంలో కనువిందు చేస్తుంది. అసలు ఇది కేకేనా అన్నరీతిలో ఎంతో రియలిస్టిక్‌గా కేకు కళాకారులు వాటిని తయారుచేస్తున్నారు. ఎమ్మా జానె మోరిస్‌, ఆర్ఫాన్లీ ఎరోల్‌... వంటి ప్రముఖ కేకు డిజైనర్లు చేసే రియలిస్టిక్‌ కేకుల్ని చూస్తే ఓ పట్టాన అవి కేకులంటే నమ్మశక్యం కాదు. అచ్చుగుద్దినట్లుగా పిల్లల్నీ మనుషుల్నీ జంతువుల్నీ పోలిన ఆ కేకు కళాఖండాల్ని చూస్తే ఎవరికీ వాటిని కోయడానికి మనస్కరించదు అంటే అతిశయోక్తి కాదు.

ఎన్నెన్నో రూపాలు!
ఒకప్పుడు కేకు అంటే మైదా, గుడ్లు, పంచదార, వెన్న కలిపి బేక్‌ చేసి కాస్త అందంగా ఐసింగ్‌ చేసి అలంకరించేవారు. లేదంటే దానికి చాకొలెట్‌, పండ్లు, నట్స్‌... వంటి విభిన్న రుచుల్ని జోడించి బేక్‌ చేసేవారు. అందుకే అప్పట్లో సాదా, ప్లమ్‌, స్పాంజ్‌, చాకొలెట్‌, పైనాపిల్‌, షిఫాన్‌, కాఫీ, స్ట్రాబెర్రీ... ఇలా రుచుల్ని బట్టి రకరకాల కేకులు ఉండేవి. కేక్‌ బాల్స్‌, కప్‌ కేక్స్‌, లేయర్డ్‌ కేక్స్‌, షీట్‌ కేక్స్‌, స్విస్‌రోల్‌ కేక్స్‌... అంటూ ఆకారాన్ని బట్టీ కేకుల్లో కొన్ని రకాలు మాత్రమే ఉండేవి. కానీ క్రమంగా రుచి కన్నా కేకు ఆకారం, ముస్తాబే ప్రధానంగా మారాయి. దాంతో కేకుల్లోనూ కొత్త కొత్త రకాలు పుట్టుకొచ్చాయి. చీరలూ నగలూ, నగలపెట్టెలూ, కుషన్లూ, జంతువులూ, పిల్లలూ, మనుషులూ, ఫొటోలూ... ఇలా ఒకటనేముంది, వస్తు, మనుష్య ప్రపంచంలో కంటికి అందంగా కనిపించే అన్ని ఆకారాల్లోనూ కేకుని తయారుచేసి అది నిజమనిపించేంత అందంగా దాన్ని రంగురంగుల ఐసింగ్‌తో అలంకరిస్తున్నారు.

అక్కడితో ఆగితే వింతేముంది... రెయిన్‌ డ్రాప్‌ కేకులంటూ పారదర్శకంగా ఉండే జెల్లీతో కేకుల్ని చేసి కొందరు వడ్డిస్తుంటే, అందులో రంగుల్ని చొప్పించి, ఆపై వాటిల్లో పూలగుత్తుల్నీ అందంగా చొప్పించేస్తున్నారు మరికొందరు. పెయింటింగ్‌ కళలో ఆరితేరిన వాళ్లు క్లిష్టమైన స్టెయిన్డ్‌గ్లాస్‌ మెరుపుల్నీ మొజాయిక్‌ రాళ్లనీ కూడా కేకులకి అద్దేస్తున్నారు. పూలగుత్తులూ పండ్లబుట్టలూ, బంగారు బిస్కెట్లూ, కాక్టస్‌ ఉద్యానవనాలూ... ఒకదానికొకటి పొంతన లేకుండా అదీ ఇదీ అన్నది లేకుండా ‘కాదేదీ కేకు కనర్హం’ అన్న రీతిలో కేకుల్ని రూపొందిస్తున్నారు. ఇవే కాదు, గనుల్లోంచి రత్నాలు వెలికితీస్తున్నట్లో, చమ్కీ అందాలతో లోహాల్ని తలపించేలానో, గాల్లో నుంచి కేకుల్లోకి జెమ్స్‌ పడుతున్నట్లో... ఆలోచన వచ్చిందే ఆలస్యం... అది కేకులో చొప్పించేస్తున్నారు.

ఏవేవో అలంకారాలు!
ఒకప్పుడు కేకుని కేకులా మాత్రమే చేసి దానిమీద ఐసింగ్‌ లేదా ఫ్రాస్టింగ్‌ చేసి పేరు రాయడం, మార్జిపాన్‌తో చేసిన పూలనో చిన్న బొమ్మలనో అలంకరిస్తేనే ఎంతో గొప్ప. లేదంటే పంచదార, రైస్‌ పేపర్లతో చేసిన సహజ పూలూ సీతాకోకచిలుకలూ పిట్టలూ ఆకులూ కొమ్మలూ తలపించేలా బొమ్మల్ని తయారుచేసి కేకులమీద అలంకరించమే మహాగొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు కేకు కేకులా ఉండకూడదన్నదే నయా ట్రెండ్‌. దానికి తగ్గట్లే మార్కెట్లో కేకుల అలంకరణకోసం బోలెడు పరికరాలూ దొరుకుతున్నాయి. పైపింగ్‌ బ్యాగులూ సిరంజ్‌లతోపాటు అధునాతన పరికరాలతో కేక్‌ డెకరేటర్లు అద్భుతంగా ఐసింగ్‌ చేయడం ప్రారంభించారు. బటర్‌క్రీమ్‌ ఐసింగ్‌తోపాటు పంచదార తక్కువ ఉండే మార్జిపాన్‌ లేదా బాదంపేస్టుతో చేసే రాయల్‌ ఐసింగ్‌కూ, అచ్చంగా పంచదార పేస్టుతో చేసే ఐసింగ్‌లకూ ఆదరణ పెరిగింది. దాంతో లేస్‌, లాటిస్‌, బాస్కెట్‌వీవ్‌, డాటెడ్‌ స్విస్‌... అంటూ ఐసింగ్‌ టెక్చర్‌లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిండచం మొదలైంది. అంతేకాదు, ఆ పంచదార, మార్జిపాన్‌లకి జెలాటిన్‌నీ రంగుల్నీ జోడించి ముత్యాలూ రత్నాలూ వంటివి తయారుచేయడంతో కేకులు మరింత వైభవాన్ని సంతరించుకున్నాయి.
కేవలం కేకుల తయారీలో ఆసక్తి ఉండే కళాకారులు మాత్రమే కాదు, ప్రముఖ హోటళ్లూ బేకరీలూ కంపెనీలూ నిర్వహించే కేకు పోటీల పుణ్యమా అని షెఫ్‌లు సైతం తమలోని సృజనాత్మకతని కేకుల రూపంలో ఆవిష్కరిస్తున్నారు. పైగా ఛానెల్స్‌ ప్రసారం చేస్తోన్న కేక్స్‌ షోలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందడంతో ప్రత్యేకంగా కేకుల్ని రూపొందించే డిజైనర్ల సంఖ్య మనదగ్గరా పెరిగింది. మిగిలిన వేడుకల సంగతెలా ఉన్నా మెహందీ, పెళ్లి రిసెప్షన్‌... వంటి వేడుకల్లో వధూవరుల దుస్తులకీ మ్యాచయ్యేలా ప్రత్యేకంగా కేకుల్ని తయారుచేయించుకుంటున్నారు. దాంతో లక్షల రూపాయలు చెల్లించి మరీ వాటిని తమ పెళ్లివేడుకలో ప్రదర్శించానుకుంటోంది యువతరం. అందుకే ఇప్పుడు కేకు కేవలం ఏదో కోసి ఓ ముక్క తినడం కోసం కాదు, ఫొటోలకోసమే అన్నంత అందంగా రియలిస్టిక్‌గా ముస్తాబవుతోంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.