close
పది చర్చిలు ఒక్కచోటే..!

ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టుగా కనువిందుచేసే రంగురంగుల గోపురాలూ, అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడే అందమైన గోడలతో క్రైస్తవుల స్వర్గధామంగా ప్రసిద్ధిచెందింది రష్యాలోని సెయింట్‌ బాసిల్స్‌ కేథడ్రల్‌. ఒకేచోట పది చర్చిలు ఉండటం, విజయానికి చిహ్నంగా దీన్ని నిర్మించడం, యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపుపొందడం... ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవు ఇది.

‘నిన్ను వలె నీ పొరుగువారినీ ప్రేమించు...’ ఏసుక్రీస్తు ఈ మానవాళికి ఇచ్చిన అద్భుతమైన సందేశం. శత్రువును ప్రేమించాలి. ద్వేషించేవారిని ప్రేమించాలి. అపకారం చేసినవారిని ప్రేమించాలి... ఎందుకంటే ప్రేమ ఒక్కటే దేవుని చేరేందుకు ఉన్న ఏకైక మార్గమని చాటిచెప్పిన కరుణామయుడు ఏసుక్రీస్తు. అందుకే ఆయన భూమ్మీదకు వచ్చి వేల సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ క్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ప్రపంచమంతా క్రిస్మస్‌ సంబరాలకుముస్తాబవుతున్న వేళ అత్యంత సుందరమైన చర్చిల్లో ఒక్కటిగా పేరుతెచ్చుకున్న సెయింట్‌ బాసిల్స్‌ కేథడ్రల్‌ విశేషాలు తెలుసుకుందాం.

నిర్మాణం ఇలా
సెయింట్‌ బాసిల్స్‌ చర్చి మాస్కోలోని ప్రముఖ సందర్శక ప్రాంతాల్లో ఒక్కటి. అద్భుతమైన శిల్పకళను సొంతంచేసుకున్న ఈ చర్చి మాస్కోలోని రెడ్‌స్క్వేర్‌ ప్రాంతంలో ఉంది. మొదట్లో ఈ ప్రాంతంలో ఒక చిన్న చర్చి మాత్రమే ఉండేది. తర్వాతి కాలంలో కాజాన్‌, ఆత్రఖాన్‌ ప్రాంతాలమీద సాధించిన విజయానికి గుర్తుగా 1552లో రష్యా రాజైన ఇవాన్‌ ఈ చర్చిని నిర్మించాడు. 1555 సంవత్సరంలో ప్రారంభమైన ఈ నిర్మాణం 1561 వరకూ కొనసాగింది. దీన్ని ఎవరు డిజైన్‌చేశారన్న విషయంమీద భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం... బార్మా, పోస్ట్నిక్‌ అనే వాస్తుశిల్పులు ఈ చర్చిని రూపొందించారు. అయితే ఇలాంటి చర్చి మరెక్కడా నిర్మించకూడదనే ఉద్దేశంతో దీని నిర్మాణం పూర్తయిన వెంటనే అప్పటి రాజు వీరిని అంధులుగా మార్చేశాడట.

పేరు వెనక...
క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే ఈ చర్చిని అధికారికంగా ‘కేథడ్రల్‌ ఆఫ్‌ ది మోస్ట్‌ హోలీ థియోటోకోస్‌ ఆన్‌ ది మౌట్‌’ అని పిలుస్తారు. కందకం మీద ఉన్న అతి పవిత్రమైన దేవుని స్థలం అని దీని అర్థం. ఈ చర్చికి ‘బాసిల్‌ ది బ్లెస్డ్‌’ (ఆశీర్వదించబడిన పవిత్ర ప్రదేశం) అనే మరోపేరు కూడా ఉంది. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే... 1547లో వాసిలీ అనే క్రైస్తవ విశ్వాసకుడు ఈ చర్చిలో అగ్ని ప్రమాదం జరుగుతుందని చెప్పాడట. అయితే అతడి మాటను ఎవ్వరూ నమ్మలేదు సరికదా అలా అన్నందుకు అతడికి జీవితాంతం కనీస అవసరాలైన భోజనం, దుస్తులూ, ఇల్లూ లేకుండా వెలేశారట. కానీ, చివరకు ఆయన చెప్పినట్లుగానే చర్చిలో అగ్నిప్రమాదం జరగడమేకాక మాస్కో నగరం కూడా పూర్తిగా కాలిపోయింది. దీంతో అప్పటి రష్యారాజు అతడిని దైవదూతగా ప్రకటించాడు. వాసిలీ మరణించిన తర్వాత రాజలాంఛనాలతో ఆ చర్చిలోనే అంత్యక్రియలు జరిపించడంతోపాటు, అతడి సమాధి మీద పదో చర్చిని నిర్మించారు. అప్పటి నుంచీ ఈ పది చర్చిలను కలిపి బాసిల్‌ ది బ్లెస్డ్‌ పేరుతో పిలుస్తున్నారు.

పది చర్చిలు...
రంగురంగు గోపురాలతో ఉన్న ఈ చర్చిని ఆకాశం నుంచి చూస్తే బోగిమంటలు మండుతున్నట్టుగా కనిపించడం విశేషం. ఈ భవనంలో మొత్తం పది చర్చిలు ఉన్నాయి. భవనానికి ఎనిమిది మూలల్లో ఎనిమిది చర్చిలు వచ్చేలా దీన్ని నిర్మించారు. వీటి మధ్యలో ‘సెంట్రల్‌ చర్చ్‌ ఆఫ్‌ ఇంటర్‌సెక్షన్‌’ పేరుతో తొమ్మిదో చర్చిని నిర్మించారు. సెయింట్‌ వాసిలీ సమాధిమీద 1588 సంవత్సరంలో పదో చర్చిని ఏర్పాటు చేశారు. సుమారు 460 సంవత్సరాల చరిత్ర కలిగిన సెయింట్‌ బాసిల్స్‌ కేథడ్రల్‌ మాస్కోలో ఎక్కువ ఫొటోలు తీసిన ప్రదేశంగా ప్రసిద్ధిచెందింది. కొన్ని అధికారిక కారణాల వల్ల ఈ చర్చిని 1923లో మ్యూజియంగా మార్చారు. మళ్లీ 1990లో ఇక్కడున్న మొత్తం పది చర్చిలను పునరుద్ధరించి, చర్చి కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం ప్రారంభించారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.