close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్ష్మణరేఖ 

- చివుకుల హరిప్రియ

నగనగా ఓ ఇల్లు... ఆ ఇంట్లో ఓ కుటుంబం. రఘు, అతని తల్లి వరదమ్మ, భార్య నర్మద, పిల్లలు- అయిదేళ్ళ మేఘన, మూడేళ్ళ హర్ష, గోడమీద ఫొటోలో గతించిన రఘు తండ్రి వెంకటరత్నంగారు, తాత రఘురామయ్యగారు ఇంకా ఇతర దేవుళ్ళ ఫొటోలు. అందరిలాంటి కుటుంబమే. ప్రత్యేకతలేమీ లేవు. కొడుకంటే ప్రేమా కోడలంటే అభిమానంగల తల్లీ... ఉద్యోగం చెయ్యగలిగే చదువు ఉన్నా సొంత ఇష్టంతో ఇల్లాలు ఉద్యోగం చేస్తున్న నర్మదా... ప్రేమించి పెళ్ళి చేసుకున్న నర్మదనీ ఇద్దరు పిల్లల్నీ కంటికిరెప్పలా చూసుకునే రఘూ... ముద్దుముద్దుగా అల్లరి చేస్తూ ఇప్పుడిప్పుడే చదువులకి అలవాటుపడుతున్న పిల్లలూ... అంతా మామూలే, మిగతా అన్ని కుటుంబాల్లాగానే! 
కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక సమస్య వచ్చింది. సంఘటన మామూలుదే. చాలా ఇళ్ళలో జరిగినదే, జరుగుతున్నదే! జరగవచ్చు అని మన సమాజం ఒప్పుకున్నదే! అదేంటంటే...

*  *  *

క్యాంపుకు వెళ్ళిన రఘు... ఇంట్లో అతనికోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు. 
‘‘అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు?’’ అడిగింది మేఘన నర్మదని. 
‘‘వచ్చేస్తారు నాన్నా... ఇంకో గంటలో అనుకుంటా.’’ 
‘‘అమ్మా, నాన్న మాకు బొమ్మలు తెస్తారా ఊరినుంచి?’’ అని అడిగాడు హర్ష. 
‘‘తెస్తారు బుజ్జీ, మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి’’ అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదతో మాటల్లో పడింది వరదమ్మ. 
‘‘ఏంటో నర్మదా, వాడికి క్యాంపులు ఎక్కువవుతున్నాయి. ప్రతీ పదిహేను రోజులకొకసారి రెండుమూడు రోజులు వెళ్ళి వస్తున్నాడు. అలసటవల్లనేమో పరధ్యానంగా ఉంటున్నాడు. వాడి ఆరోగ్యం ఏమవుతుందో అని బెంగగా ఉంది.’’ 
‘‘అదే నేనూ అడిగాను అత్తయ్యా- మొన్న వెళ్ళేటప్పుడు. ఇంకో రెండుమూడు నెలలు ఇలాగే ఉంటుందట. తరవాత తగ్గిపోతాయన్నారు. ప్రమోషన్‌ కూడా వస్తుందేమో అనుకుంటున్నారట.’’ 
‘‘అలాగా అమ్మా, పోన్లే వాడి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు... అదే మనకి ఆనందం’’ అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం విని లేచారు అందరూ. పిల్లలయితే అమాంతం బయటకు పరిగెత్తారు. మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళింది నర్మద. ఇంతలో పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకొచ్చారు. 
‘‘అమ్మా, నాన్న మాకేం తెచ్చారో తెలుసా... చిన్న బేబీని తెచ్చారు, మేం ఆడుకోవడానికట’’ అంటూ. 
ఏదో పాప బొమ్మ తెచ్చారు అనుకుంటూ బయటికి వచ్చిన నర్మద స్థాణువైంది. చేతిలో రోజుల వయసున్న పసిపాపతో నిలబడిన రఘుని చూసి. అక్కడ వరదమ్మ పరిస్థితి కూడా అంతే. 
ఆ తరవాత జరిగిన సంభాషణలు కూడా కొత్తవేం కాదు, అందరూ ఊహించగలిగేవే.

*  *  *

సామాను బయటే వదిలి పాపతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు. 
అప్పుడు చూసింది నర్మద పాపని పరీక్షగా. లోలోపల బాంబు పడినట్లుగా ఉలిక్కిపడి కట్రాటయ్యింది. పాప ముఖంలో స్పష్టంగా రఘు పోలికలు. హర్ష చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు. తండ్రి పోలిక అనేవారంతా. ‘అంటే... అంటే... ఈ పాప... ర..ఘు కూతురా..?’ 
అవునంటోంది బుద్ధి. అవకూడదంటోంది మనస్సు. కానీ మనసు మాట ఎప్పుడు గెలిచింది కనక? 
చేతిలో పాప గుక్కపట్టి ఏడవడం మొదలెట్టింది. 
‘‘నర్మదా!’’ పిలిచాడు రఘు. 
ఎంతయినా స్త్రీ హృదయం కదా, పాపని యాంత్రికంగా అందుకుంది. 
‘‘అమ్మా, కొంచెం పాలు తెస్తావా? పంచదార వెయ్యకు, పాపకి కఫం చేస్తుంది. నా బ్యాగులో పటికబెల్లం ఉంటుంది చూడు.’’ 
రఘు మాటలైతే బయటికి వస్తున్నాయి కానీ చూపులు పైకి లేవట్లేదు. పసిపిల్ల కంకటిల్లుతుంటే యాంత్రికంగా లోపలికి కదిలింది వరదమ్మ. 
నర్మద ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది. ఆ రాత్రి...

*  *  *

తప్పొప్పులూ న్యాయాన్యాయాలూ తెలియని పసితనం కాబట్టి - పాలు తాగి పసిపిల్లా, చాలా సంతోషంతో అన్నం తిని మేఘనా, హర్షా నిద్రపోయారు ప్రశాంతంగా. 
అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని ‘‘ఎవర్రా ఆ పాప?’’ అని తీవ్ర స్వరంతో. 
నర్మద ఇంకా తనకెదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది. 
‘‘అమ్మా, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఇప్పుడు జరిగిందంతా చెప్పక తప్పదు. ఏడాదిన్నరక్రితం క్యాంపుకని చెన్నై వెళ్ళినప్పుడు మా క్లాస్‌మేట్‌ సుధ అని ఒక అమ్మాయిని కలిశాను. తను నర్మదకి కూడా తెలుసు. మా కంపెనీ చెన్నై బ్రాంచీలో పనిచేస్తోందట. కాలేజీలో నన్ను ప్రేమించింది. ఫేర్‌వెల్‌ రోజున నాతో చెప్పింది. కానీ అప్పటికే నర్మదా నేనూ ఒకరినొకరు ఇష్టపడటం, ప్రేమించుకోవడం జరిగిపోయాయి. మా విషయం అందరిలో నానడం ఇష్టంలేక మేము ఎవరికీ చెప్పలేదు. ఆ విషయమే తనకి చెప్పి నన్ను క్షమించమన్నాను. తను బాధపడింది. అయినా అర్థంచేసుకుని మాకు శుభాకాంక్షలు అందజేసింది. ఆ తరవాత మేం కలుసుకోవడం జరగలేదు. ఆరోజు మీటింగ్‌లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది. నేను మా పెళ్ళి సంగతీ పిల్లల సంగతీ చెప్పాను. చాలా సంతోషించింది. తన సంగతి చెప్పినప్పుడు మాత్రం మాట దాటేసింది. ఏవైనా సమస్యలు ఉన్నాయేమో, అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను. 

ఆ సాయంత్రం హోటల్‌కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది. నేను సందేహిస్తుంటే ‘మా ఆయనా, అత్తామామలూ ఏమీ అనుకోర్లెండి’ అంది. సరే అనుకుని వెళ్ళాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఇల్లంతా ఖాళీగా కనపడింది. ‘ఏరీ మీ ఆయన? ఆఫీసు నుంచి ఇంకా రాలేదా?’ అడిగాను. ‘అసలు నాకు పెళ్ళయితేగా!’ అంది. నేను అయోమయంగా తనవైపు చూశాను. అప్పుడు చెప్పింది- నన్ను ప్రేమించి, మరొకరిని చేసుకోలేక తను పెళ్ళే చేసుకోలేదనీ, ఎంతచెప్పినా వినకపోయేసరికి కూతురి జీవితం ఎడారిగా మిగిలిపోయిందన్న బాధని మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరి వెళ్ళిన తన తల్లిదండ్రులు కేదారనాథ్‌ వరదల్లో చనిపోయారనీ. 
నాకోసం ఒంటరిగా మిగిలిపోయిన తనని చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను. తను హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుని ‘నన్ను పెళ్ళి చేసుకుంటావా రఘూ’ అని అడిగింది. నా డబ్బు అవసరంలేదనీ, కేవలం నా భార్యగా ఉండే అదృష్టం దక్కితే చాలనీ ప్రాధేయపడింది. నాకోసం అన్నీ కోల్పోయిన తన ఒక్క కోరికా కాదనలేకపోయాను. వాళ్ళింట్లో దేవుడి ముందు తాళి కట్టాను. ఆ తరవాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది. తన భర్త విదేశంలో ఉన్నారని అక్కడ చెప్పింది. నేను అప్పుడప్పుడూ వెళ్ళి తనని కలిసేవాణ్ణి. ఒకరోజు తను నెల తప్పానని ఎంతో ఆనందంతో చెప్పింది. నేను కొంచెం ఆందోళనపడ్డాను. భయపడవద్దనీ తనవల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్యా రానివ్వననీ, ప్రసవం తరవాత అమెరికాలో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతాననీ, నా గుర్తుగా పుట్టిన బిడ్డని చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తాననీ చెప్పింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్‌ వచ్చి ప్రసవమైన వెంటనే తను చనిపోయింది. పోతూ పోతూ ఈ పసిగుడ్డుని నాకు అప్పగించిపోయింది. పాపని అక్కడ అనాథగా వదిలేసి రావడానికి నాకు మనసొప్పలేదు. అందుకే ఏమయితే అది అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. సుధ ప్రేమనీ ఆరాధననీ... ఈ పసిదాని పరిస్థితినీ... నర్మద అర్థంచేసుకోగలదన్న నమ్మకంతోనే ఇలా చేశాను’’ అని ఇంకా ఏదో అనబోయేంతలో రఘు చెంప ఛెళ్ళుమంది. 
నిర్ఘాంతపోయి చూసిన రఘుకి నిప్పులుకక్కే కళ్ళతో నిలబడ్డ వరదమ్మా, ఆ వెనకాలే నిస్తేజమైన చూపులతో నర్మదా కనిపించారు.

*  *  *

ఆ తరవాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరసన కొనసాగింది. రఘు ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ, వరదమ్మ కానీ స్పందించడం మానేశారు. కానీ, పసిదాని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రవర్తించడం వాళ్ళవల్ల కాలేదు. 
ఇంట్లో ఏం జరుగుతోందో తెలియక మేఘన, హర్ష బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలుపెట్టారు. 
పదిరోజుల తరవాత రాత్రి భోజనాలయ్యాక డైనింగ్‌టేబుల్‌ సర్దుతున్న నర్మద దగ్గరకి వచ్చాడు రఘు. 
‘‘నీతో మాట్లాడాలి.’’ 
‘‘... ... ... ...’’ 
‘‘ఇలా ఎన్నాళ్ళు నర్మదా! దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను మోసం చెయ్యాలన్న ఉద్దేశంతో అలా చెయ్యలేదు. నామీద సుధ పెంచుకున్న ప్రేమని తిరస్కరించలేకపోయాను. ఒక ఆడదానిగా సుధ బాధ అర్థంచేసుకోవడానికి ప్రయత్నించు నర్మదా! అప్పుడు నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు తెలుస్తుంది. అయినా నేను నీకు ఏ లోటూ చెయ్యలేదు కదా. సుధ మరణించకుండా ఉన్నట్లయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు. అయినా ఇప్పుడు సుధ ఈ లోకంలో లేదు. ఆ పసిపిల్ల తప్పు ఏముంది? మన పిల్లల తప్పు ఏముంది? మనమిలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు. జరిగినదంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉందాం. నీకు ఇష్టంలేదంటే చంటిదాన్ని ఏ ఆశ్రమంలోనో...’’ 
చప్పున తలెత్తి చూసిన నర్మద చురకత్తుల్లాంటి చూపులకి తత్తరపడి ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు. 
నిస్త్రాణగా కుర్చీలో కూలబడిపోయిన నర్మద దగ్గరికి వచ్చి లాలనగా తలమీద చెయ్యి వేసింది వరదమ్మ. 
గుండెల్లో గూడుకట్టుకున్న ఆవేదన అంతా ఉబికివస్తూండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి భోరున ఏడవసాగింది నర్మద. 
‘‘వాడు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. నీ ముఖం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తోంది. చేసిన తప్పుల్ని అందంగా ప్రేమా, ఒంటరితనమూ లాంటి ముసుగులో కప్పేసి ఆడవాళ్ళని ‘అర్థం’చేసుకోమని చెప్పేయడం మగవాళ్ళకి ఈ సమాజం పెంపకంతో నేర్పిన విద్య. కానీ మనం ఆడవాళ్ళం తల్లీ. ఇలాంటివన్నీ భరించమని దేవుడు మన తలరాతగా రాసి భూమి మీదకి పంపాడు. నీ పిల్లలకోసమైనా నువ్వు గుండె దిటవు చేసుకోవాలి. వాడు చేసిన పనికి బాధతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు? నీ కుటుంబం, నీ పిల్లలూ వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. వాడు నా కొడుకని ఈ మాట చెప్పడం లేదు. ఒక తల్లిగా, కుటుంబ భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ చెబుతున్నాను. ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కూడా భరించాను తల్లీ. నేనేకాదమ్మా, ఎంతోమంది మౌనంగా భరిస్తూనే బతికారు, బతుకుతున్నారు. ఇక నీ ఇష్టం. ఏ నిర్ణయమైనా ఆలోచించి, వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకో.’’ 
ఆ క్షణం కాలానికీ గాలికీ ఆకాశంలో చంద్రుడికీ, అలాంటి ఎన్నో ఇళ్ళ తలుపులకీ గోడలకీ, ఆ గోడలకి వేళ్ళాడుతున్న వంశ క్షేత్రాలైన స్త్రీల పటాలకీ కనుక మాటలు వచ్చినట్లయితే ఇలాంటి మాటలు ఎన్ని ఇళ్ళలో ఎంతమంది కోడళ్ళూ కూతుళ్ళతో ఎందరు అత్తలూ తల్లులూ చెప్పారో, ఎన్ని స్త్రీ హృదయాలు వేదనతో అలమటించి కృత్రిమమైన కోమలత్వాన్ని అలముకున్నాయో, సామాజిక, ఆర్థిక అసహాయతల మధ్య కొట్టుమిట్టాడి ఎందరు అతివలు ‘అర్థం’చేసుకుని ఆత్మవంచన చేసుకున్నారో చెప్పేవి. 
ఇది కూడా అలాంటి ఒక సంఘటనేనా...

*  *  *

ఆ మరుసటిరోజు ఎప్పటిలాగానే తెల్లవారింది. అంతకన్నా ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలాగా మారిపోయింది. 
‘‘మేఘనా, హర్షా లేవండి, స్కూలుకి టైమైపోతోంది.’’ 
‘‘అత్తయ్యా, పాపని పట్టుకోండి. 
వీళ్ళని స్కూలుకి పంపించి పాపకి స్నానం చేయిద్దాం!’’ 
‘‘రఘూ, మీరు ఆఫీసుకి తయారవండి. ఇదిగో కాఫీ!’’ 
‘‘లక్ష్మీ, పనులన్నీ అయ్యాయా... అత్తయ్య గదిని ఇంకోసారి డెట్టాల్‌ వేసి తుడువు, పాపని పడుకోబెట్టాలి.’’ 
ఇలా ఎప్పటిలాగా నర్మద తిరుగుతుంటే రఘూ వరదమ్మా ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. 
‘‘నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుందనుకోలేదమ్మా. ఏమైతేనేం, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. 
ఎక్కడున్నా సుధ కూడా చాలా సంతోషపడుతుంది. నువ్వు కూడా నన్ను క్షమించినట్లేగా!’’ 
‘‘పిచ్చి నాన్నా, అంతా నర్మద ఇష్టం. 
తనే నిన్ను క్షమించాక ఇక నేనెవరిని?’’ 
‘‘అమ్మా, మరి చంటిదాని పరిస్థితి?’’ 

‘‘చూస్తున్నావుగా, పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటోందో! నా కోడలు మనసు బంగారంరా!’’ 
రఘు ఆఫీసుకు వెళ్ళిపోయాడు నిశ్చింతగా. రఘుతో అలా మాట్లాడిందేగానీ వరదమ్మ మనసులో ఏదో వెలితి కొట్టుమిట్టాడుతూనే ఉంది. అదేంటో ఆమెకే అర్థంకావడం లేదు.

*  *  *

రాత్రి భోజనాలయ్యాక పాపతోబాటు పడుకోవడానికి వరదమ్మ గదిలోకి వెళ్ళింది నర్మద. 
‘‘అబ్బాయి ఎదురుచూస్తున్నాడు. పాపని నేను చూసుకుంటాలేగానీ నువ్వు వెళ్ళి మీ గదిలో పడుకోమ్మా’’ అంది హాల్లో కూర్చున్న వరదమ్మ. 
అక్కడ గదిలో రఘు నర్మద కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు. 
‘‘ఎవరి గది అత్తయ్యా’’ అంటోంది నర్మద. 
‘‘అదేంటమ్మా, మీ గది’’ అంది వరదమ్మ అయోమయంగా. 
‘‘ ‘మీ’ అనే పదానికి భార్యా భర్తా అనేదే అర్థమైతే - ఈ ఇంట్లో వాళ్ళు లేనే లేరత్తయ్యా. ఉన్నది మీరూ, ముగ్గురు పిల్లలూ వాళ్ళ తల్లీ వాళ్ళ తండ్రీ... అంతే!’’ 
‘‘నర్మదా!’’ 
చురుగ్గా తిరిగి రఘు వైపు చూసింది నర్మద. ఆశ్చర్యంతో చూస్తున్నాడు రఘు. 
‘‘మిమ్మల్ని క్షమించాననుకుంటున్నారా? అది ఈ జన్మలో జరగదు. అయినా ఏమనుకుంటున్నారు మీరు... నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్ళి చేసుకుని, సంసారం చేసి, బిడ్డని కని, ఆ అమ్మాయి చనిపోతే... ఇక నన్ను మోసంచేసే అవకాశంలేక, పాపని చూసే దిక్కులేక, నా ఇంటికి తీసుకొస్తే నేను అన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా? పైగా ఏమన్నారు... సుధ ప్రేమని నేను అర్థంచేసుకోవాలా? నేను కూడా నన్ను ప్రేమించే ఇంకెవరితోనో సంసారం వెలగబెట్టి మీ దగ్గరకి వచ్చి ‘అర్థం’చేసుకోండి అంటే చేసుకుంటారా?’’ 
అక్కడ రెండు నిమిషాలు మౌనం రాజ్యమేలింది. తరవాత మళ్ళీ నర్మద కంఠం వినబడింది. 
‘‘ఎర్రబడిన మీ ముఖమే చెబుతోంది మీ సమాధానమేమిటో. మరి మీకు కష్టమైన పని నేనెలా చేయగలననుకుంటున్నారు? నేను ఆడదాన్ని కాబట్టి, అంతేగా. ఆత్మాభిమానానికీ మనసుపడే వేదనకీ ఆడా మగా తేడా ఉండదని ఒక మగవాడు అర్థంచేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలియదు. కానీ, ఒక్కమాట వినండి... నేను మొదట ‘స్త్రీ’ని. తరవాతే భార్యనీ తల్లినీ.ఆడదానిగా నా ఉనికిని కాపాడుకోవడం, నా మనస్సాక్షి ముందు తలెత్తుకుని నిలబడగలగడం నా హక్కు. ఈ పరిస్థితుల్లో దానికి విడాకులు తీసుకోవడమే మార్గం. మీ ప్రవర్తన కారణంగా చూపించి విడాకులు పొందడమూ, నా పిల్లల్ని నా దగ్గరకి తెచ్చుకోవడమూ కష్టం కాదు. కానీ ఇక్కడ తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి పడాలి? మనం తల్లిదండ్రులుగా జీవితాంతం తోడుగా ఉంటామనే ఒక భరోసాతో పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాం. ఇద్దరి ప్రేమా పొందడం వాళ్ళ హక్కు. అది కోల్పోయి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి? తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తనవాళ్ళూ తోబుట్టువులూ ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి? ఎందుకు బాధపడాలి? తప్పు చేసింది ‘మీరు’ కాబట్టి, శిక్ష ‘మీకు’ పడాలి. మీ భార్యని శాశ్వతంగా మీకు దూరం చెయ్యడమే నేను మీకు వేసే శిక్ష,  నాకు నేను ఇచ్చుకునే గౌరవం. ‘మీరు లేకపోతే నేనేమైపోతానో’ అనే భయమో బాధో కానీ, మన అనుబంధంపట్ల బాధ్యత కానీ ఇక నాకు లేవు. అవి ఏమైనా ఉంటే ఇద్దరికీ ఉండాలి. నాపట్ల మీకు అలాంటివేమీ లేవు కాబట్టి మీపట్ల నాకు ఉండాలని ఆశించకండి. ఇప్పుడు మనముందు ఉన్నది పిల్లలపట్ల బాధ్యత మాత్రమే. మీ ముగ్గురు పిల్లలకి తండ్రినీ తల్లినీ దగ్గరచేసి నా పిల్లలపట్ల నేను నా బాధ్యత నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను. ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అనుకుంటే, మీకు మీ ఇద్దరు పిల్లలు అక్కర్లేదు అనుకుంటే, తరవాత మీ చిన్నకూతురికి కన్నతల్లిలా ప్రేమనందించగల మరొక సవతితల్లిని తేగలను అనే నమ్మకం మీకు ఉంటే మీ ఇష్టం. మరొక్కమాట... పాప కాస్త పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరబోతున్నాను. నన్ను పోషిస్తున్నాననే భావం మీలో అధికారాన్ని పెంచకూడదనే ఈ నిర్ణయం. ఇంకోమాట... ఈ ఇంట్లో ఉన్నంతవరకూ నా పిల్లలకి తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను. మీరూ మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి. మన బంధం అంతవరకే. ఇది నేను గీస్తున్న లక్ష్మణరేఖ. ఇది గనక మీరు మీరినట్లయితే మీ పిల్లలు మీరు అందుకోలేనంత దూరం వెళ్ళిపోతారని గుర్తుంచుకోండి.’’ 
‘‘పిల్లలు మాత్రమే కాదు, నిన్ను కన్న తల్లి కూడా.’’ 
పక్కనుంచి వినపడిన మాటలకి అప్పటికే అవమానంతో తలదించుకున్న రఘూ, ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మదా ఉలిక్కిపడి చూశారు. 
మనసులో ఎక్కడో ఉన్న వెలితి తీరిపోయినట్లుగా సంతృప్తితో వెలిగిపోతోంది వరదమ్మ ముఖం. ఇప్పుడామె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు. ఒక అతివ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్నీ హక్కునీ బాధ్యతనీ సమాతూకం వేసి నిర్ణయం తీసుకోగల ఒక మగువ విజ్ఞతనీ, మగవాడికి ‘లక్ష్మణరేఖ’ గీయగల ఒక సబల ధైర్యాన్నీ ఆనందబాష్పాలతో అభిషేకిస్తున్న మరొక స్త్రీ మాత్రమే.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.