close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పండు పండు దానిమ్మ పండు!

పచ్చగా చిగురించి, అందంగా విరిసి, ముచ్చటగా పిందె తొడిగి, పండుగా మెరిసి, రత్నాల్లాంటి ఎర్రెర్రని గింజలతో ఇంటిల్లిపాదికీ ఆయురారోగ్యాలు ప్రసాదించే అపురూపమైన చెట్టే దానిమ్మ. అందుకే అది పెరట్లో ఉంటే ఇంట్లో మందుల దుకాణం ఉన్నట్లే అంటుంటారు.

మ్మాయి నెల తప్పింది... అనగానే పండంటి పాపాయికోసం మార్కెట్‌కి వెళ్లి కొనుక్కొచ్చేవాటిల్లో మొదట దానిమ్మే ఉంటుంది. సుస్తీ చేసినవాళ్లని పలకరించడానికి వచ్చేవాళ్లు తెచ్చే పండ్లలో మొదటిస్థానమూ దానిమ్మదే. పుట్టబోయే బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉండేందుకూ; అనారోగ్యం నుంచి త్వరగా కోలుకునేందుకూ దానిమ్మపండుని మించింది లేనేలేదు. అందుకే ఒలుచుకుని తినడం విసుగైనా సరే, తియ్యని దానిమ్మగింజల్ని ఇష్టపడనివాళ్లు ఉండరు. 
అన్ని పండ్లూ ఆరోగ్యానికి మంచివే అయినా దానిమ్మను పండ్లలోనే రారాజుగా భావిస్తారు తూర్పు దేశీయులు. మంచిపనులకోసం దేవుడే దానిమ్మ పండుని సృష్టించాడని ఖురాన్‌ చెబుతోంది. అరేబియన్లూ గ్రీకులూ ఐరోపావాసులూ దానిమ్మ పండుని సిరిసంపదలకి ప్రతీకగా భావిస్తే; సంతానసాఫల్యతకీ లైంగికశక్తికీ దానిమ్మను మించింది లేదని నమ్ముతారు చైనీయులు. అందుకే కొత్తదంపతులకి దానిమ్మపండ్ల బొమ్మలతో ఎంబ్రాయిడరీ చేసిన దుప్పట్లనూ దిండ్లనూ బహూకరిస్తారట. శవపేటికల్లో దానిమ్మ పండ్లను ఉంచితే వాళ్లకి అమరత్వం సిద్ధిస్తుందని ఈజిప్షియన్లు నమ్మితే; శుభ సంకేతమన్న కారణంతో దానిమ్మపండు ఒలవనిదే గ్రీకుల ఇంట పెళ్లే కాదట, పెళ్లివంటలన్నింటిలోనూ ఆ గింజలు కనిపించాల్సిందేనట. దానిమ్మ చుట్టూ ఇలాంటి ఆచారాలూ నమ్మకాలు ఎన్నో ఎన్నెన్నో.

వంటల్లోనూ...

కొన్ని ప్రాంతాల్లో పుల్ల దానిమ్మ పచ్చిగింజల్ని ఎండబెట్టి పొడిచేసి మసాలాద్రవ్యంగా వాడతారు. అలాగే పండిన గింజల్ని ఎండబెట్టి, పొడి చేసి కూడా వంటల్లో వాడుతుంటారు. గింజల్ని నేరుగా తినడం, జ్యూస్‌గా తాగడమే కాకుండా అనేక రకాల వంటల్లోనూ వాడుతుంటారు. టర్కీలో ఏ వేడుకయినా దానిమ్మ గింజల వంటకాలు వడ్డించాల్సిందే. పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేయడం ఇటీవల మనదగ్గరా పెరిగింది. సలాడ్లలో సరేసరి. దానిమ్మగింజల్లోకన్నా తొక్కలో పాలీఫినాల్స్‌, కెటెచిన్స్‌, గాలోకెటెచిన్స్‌... వంటి పోషకాలు మూడు రెట్లు ఎక్కువ. అందుకే దాన్నుంచి ఆయా పోషకాలను సేకరించి సప్లిమెంట్లూ ప్రిజర్వేటివ్స్‌లో వాడుతుంటారు. దానిమ్మ తొక్కలూ విత్తులతో చర్మంమీది ముడతల్ని తొలగించే క్రీముల్నీ నూనెల్నీ కూడా తయారుచేస్తున్నారు. ఎండబెట్టిన గింజల నుంచి తీసిన నూనెనీ పొడినీ కూడా అనేక వ్యాధుల నివారణలోనూ సౌందర్య ఉత్పత్తుల్లోనూ ఆహారపదార్థాల తయారీలోనూ వాడుతుంటారు.

ఎన్నో రకాలు..!

ప్రపంచవ్యాప్తంగా పండే దానిమ్మలో రకాలెన్నో. తెల్లని గింజలతో పుల్లగా ఉండే అడవిరకం హిమాలయాల్లో ఎక్కువగా పండుతాయి. ఒకప్పుడు దేశవాళీ రకాల్లో గింజలున్నవే ఎక్కువ. కానీ ఇటీవల గింజల్లేని హైబ్రిడ్‌ రకాల్నే ఎక్కువగా పండిస్తున్నారు. సాధారణంగా ఇవి పండేకొద్దీ రంగుని సంతరించుకుంటాయి. కానీ కొన్నిరకాల దానిమ్మలు తొక్కతోనూ పండటంతోనూ సంబంధం లేకుండా ఎప్పుడూ తెల్లగానే ఉంటాయి. తెలుపు, ముదురు నారింజ, ఎరుపు, కెంజాయ, నలుపు... ఇలా గింజల రంగులోనే కాదు, తొక్కని బట్టీ అనేక రకాలు ఉన్నాయి. లేతాకుపచ్చరంగు తొక్కతో లేత ఎరుపురంగు గింజలతో గణేశ్‌, ఎర్రని తొక్కతో ముదురు వంకాయ లేదా నలుపు రంగు గింజలతో అంబ్రోసియా, గులాబీరంగు తొక్కతో మృదువైన ఎర్రని గింజలతో ‘ఉటా స్వీట్‌’ రకాలు నోరూరిస్తుంటాయి. ఇవే కాదు, సువాసనభరితమైన ఎర్రని గింజలతో ఉండే కాశ్మీర్‌ బ్లెండ్‌; పసుపురంగు పూలతో వికసించి, గులాబీ రంగు గింజలతో కనువిందు చేసే ‘స్వీట్‌’, ఎర్రని మృదువైన గింజలతో ఉండే ‘ఏంజెల్‌ రెడ్‌’, వండర్‌ఫుల్‌, రెడ్‌సిల్క్‌... ఇలా ఎన్నో వెరైటీలు. దానిమ్మలో అచ్చంగా పూలకోసమే పెంచుకునేవీ ఉన్నాయి. ముద్దమందారాల్ని తలపించే ఈ పూలకోసమే కుండీల్లోనూ పెంచుకుంటారు.

సంప్రదాయ వైద్యంలో...

దానిమ్మ వేరు, బెరడు, గింజలు, పూమొగ్గలు, పూలు, ఆకులు, కాండం, పండు, గింజలు... ఇలా ఆ మొక్కలోని అణువణువూ ఔషధమే. అందుకే మన పెరట్లో తులసి చెట్టు ఉన్నట్లే చైనాలో దానిమ్మ లేని ఇల్లు ఉండదు. రక్తశుద్ధికి దానిమ్మను మించింది లేదు. అందుకే రోజూ కాసిని దానిమ్మ గింజల్ని తింటే మంచిదన్న నియమాన్ని చైనీయులు తు.చ. తప్పక పాటిస్తారు. మనిషికి వచ్చే అనేకానేక సమస్యలకి ప్రకృతి ప్రసాదించిన అపురూప ఔషధం దానిమ్మ అంటోంది మన ఆయుర్వేదం. దానిమ్మగింజలు రోజూ కాసిని తింటే కడుపులో మంట, జ్వరాలు, గొంతు సమస్యలూ రావట. 
దానిమ్మ రసాన్ని క్రమం తప్పక తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. 
దానిమ్మరసం, తేనె, అల్లంరసం టీస్పూను చొప్పున కలిపి ఉదయాన్నే తీసుకుంటే ఆస్తమా, దగ్గు, గొంతుమంటలన్నీ తగ్గుతాయి. 
దానిమ్మ ఆకులు యాంటీబ్యాక్టీరియల్‌. కాబట్టి తాజా ఆకుల్ని నూరి పుండ్లకీ గాయాలకీ రాస్తే ఉపశమనం ఉంటుంది. అలాగే తొక్కల్ని ఎండబెట్టి గోరువెచ్చని ఆవనూనెలో కలిపి చర్మంమీద రాసినా మంచిదే. ఆకుల కషాయం తాగిస్తే పొట్టలోని నులిపురుగులు చనిపోతాయి. చిగుళ్లు నమిలితే నోటిపూత తగ్గుతుంది. 
మూత్రపిండాల్లో లేదా మూత్రాశయంలో చిన్న చిన్న రాళ్లు ఉంటే దానిమ్మ గింజలని ముద్దగా నూరి ఓ చెంచాడు ముద్దని ఓ కప్పు ఉలవచారుతో కలిపి తీసుకుంటే నెమ్మదిగా ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటకు పోతాయి. 
టేబుల్‌స్పూను దానిమ్మరసం, తేనె కలిపి రోజుకి రెండుమూడుసార్లు చొప్పున కొంతకాలం వాడితే కడుపులో మంట తగ్గిపోతుంది. 
జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది దానిమ్మరసం. మొటిమల్నీ తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండటంతో చర్మకణాలకి ఆక్సిజన్‌ బాగా అంది చర్మం మెరుస్తుంటుంది. ఈ రసాన్ని ముఖానికి రాసుకుంటే టోనర్‌లా పనిచేసి మచ్చల్నీ మృతకణాల్నీ తొలగిస్తుంది. 
దానిమ్మపండు తొక్క నూరి రసం తీసి, ఓ టీస్పూను రసంలో టీస్పూను నెయ్యి, పావుటీస్పూను జాజికాయపొడి కలిపి రోజుకోసారి తీసుకుంటే వాంతులూ విరేచనాలూ తగ్గుతాయి. 
ఇదండీ తియ్యని దానిమ్మ పండు కథాకమామీషు!

దానిమ్మ... భలే మంచి మందు!

రోగ్యాన్ని అందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ మిగిలినవాటితో పోలిస్తే దానిమ్మలోని ప్యునికాలజిన్‌, ప్యునిక్‌ ఆమ్లం అనే పదార్థాలు రెడ్‌ వైన్‌, గ్రీన్‌ టీల్లోని యాంటీఆక్సిడెంట్లకన్నా కన్నా శక్తిమంతంగా పనిచేస్తాయి. ఇవంటే రక్తంలోని కొలెస్ట్రాల్‌కీ భయమేనట. గుండెజబ్బుతో బాధపడుతోన్న 45 మందికి రోజుకి పావులీటరు చొప్పున దానిమ్మ రసాన్ని మూడునెలలపాటు ఇవ్వగా వాళ్లలో గుండెకు రక్త సరఫరా 17 శాతం పెరిగినట్లు తేలింది. అందుకే హృద్రోగనివారణకు దానిమ్మ గింజల్ని మించిన సహజమైన మందు లేదట. బీపీ రోగులు కూడా పన్నెండు వారాలపాటు రోజూ ఓ గ్లాసు దానిమ్మ రసం తాగితే బీపీ తగ్గిందట. వయసుమీద పడనీయని మందుగానూ దీన్ని చెబుతారు. దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ప్రొస్టేట్‌, రొమ్ముక్యాన్సర్లనీ, డయాబెటిస్‌, ఆస్టియోఆర్ధ్రయిటిస్‌... వంటి వ్యాధుల్నీ నివారిస్తాయట. దాదాపు 40 రోజులపాటు ఓ గ్లాసు దానిమ్మరసం తాగిన వాళ్లలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడంతో అనేక వ్యాధులు నియంత్రణలో ఉంటాయని తేలింది. యాంటీఆక్సిడెంట్లతోబాటు విటమిన్లూ ఖనిజాలూ పీచూ కార్బొహైడ్రేట్లూ వంటి పోషకాలన్నీ దానిమ్మలో ఎక్కువే. రోజూ ఒక మీడియం సైజు దానిమ్మని తింటే శరీరానికి కావలసిన సి-విటమిన్‌ లభ్యమైనట్లే. దానిమ్మలో ఇ, కె విటమిన్‌లతోబాటు ఫోలేట్‌ కూడా పుష్కలమే. 
ఈ పండు శృంగారప్రేరితం కూడా. స్త్రీ, పురుషుల్లో టెస్టోస్టెరాన్‌ స్థాయుల్ని పెంచి సంతాన సమస్యల్ని నివారిస్తుంది. 
దానిమ్మరసం తాగినా గింజల్ని తిన్నా దంతాలూ, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే దానిమ్మలో యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువ. అందుకే దంతాలమీద ఉన్న పాచిని తొలగించడంతోబాటు దంత సంబంధిత ఇన్ఫెక్షన్లన్నింటినీ తగ్గిస్తుంది. 
వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌, మతిమరపుతో బాధపడేవాళ్లకి రోజూ ఓ గ్లాసు దానిమ్మరసం ఇస్తే వాళ్లలో జ్ఞాపకశక్తి పెరిగినట్లు తేలింది. మధ్యతూర్పు, భారత్‌ దేశాల్లో ఇన్సులిన్‌ను నియంత్రిస్తుందన్న కారణంతో దానిమ్మను మధుమేహానికి మందుగానూ వాడతారు.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.