close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కలగన్నారు... సాధించారు!

 

కలలు కనేవాళ్లందరూ విజేతలు కాకపోవచ్చు. కానీ విజేతలందరూ కలలు కంటారు. ఆ కలల సాకారం కోసం అనుక్షణం తపిస్తారు. చివరకు అనుకున్నది సాధిస్తారు. అవును మరి... కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పట్టనీయకుండా చేసేది, విజేతలుగా నిలిపేది... ఇదిగో, ఈ కుర్రాళ్ల లాగా అన్నమాట!

పదహారేళ్లు... రూ. 2 కోట్లు!

దహారేళ్ల కుర్రాడు... అక్షరాలా రెండు కోట్ల రూపాయల బహుమతి గెలుచుకున్నాడు. బహుమతి అంటే ఏ లాటరీలోనో కాదు. కష్టపడి చదివి, సృజనాత్మకంగా ఆలోచించి, సైన్సు సబ్జెక్టుకి సంబంధించి ఒక కొత్త విషయం కనిపెట్టి, దాన్ని మూడే మూడు నిమిషాల్లో అర్థమయ్యేలా అద్భుతమైన వీడియోని రూపొందించి, దాంతో హేమాహేమీల్లాంటి శాస్త్రవేత్తల మనసు దోచుకుని... ఆ బహుమతి గెలుచుకున్నాడు సమయ్‌ గొడిక. బెంగళూరుకు చెందిన సమయ్‌ 11వ తరగతి చదువుతున్నాడు. ఈ టీనేజర్‌ తన టీచరుకీ చదువుతున్న పాఠశాలకీ కూడా పేరుతో పాటు విలువైన బహుమతులూ సంపాదించిపెట్టాడు. ప్రతిష్ఠాత్మక బ్రేక్‌త్రూ జూనియర్‌ ఛాలెంజ్‌ పోటీలో గెలిచినందుకు సమయ్‌కి దాదాపు రూ.2 కోట్లూ, అతడికి సైన్సు పాఠాలు చెప్పిన టీచరు ప్రమీలా మేనన్‌కి రూ.36లక్షలూ, అతడు చదువుతున్న స్కూలుకి రూ.72 లక్షల విలువ చేసే ఆధునికమైన సైన్సు ప్రయోగశాలా లభించాయి. సమయ్‌కి చిన్నప్పటినుంచి జీవశాస్త్రమంటే ఇష్టం. అమెరికాలో పుట్టిన ఆ అబ్బాయి ఆస్తమా సమస్య వల్ల బెంగళూరులో ఉంటూ అక్కడి నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్లో చదువుతున్నాడు. దాంతో అమెరికా ప్రయాణం అనేది వారి కుటుంబంలో మామూలు విషయమైంది. తన ఆస్తమా ఇబ్బందులకు తోడు అమెరికా వెళ్లి వచ్చేవారి జెట్‌ లాగ్‌ సమస్యనీ, పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతున్న దగ్గరి బంధువునీ చూసిన సమయ్‌కి మనిషి జీవగడియారం పట్ల ఆసక్తి కలిగింది. ఏడెనిమిది తరగతుల్లో ఉన్నప్పటినుంచే దాని గురించి రకరకాల ప్రశ్నలు వేసేవాడు టీచర్ని. సమయ్‌ ఆసక్తి గమనించిన ప్రమీలా మేనన్‌ స్కూలు అయిపోయాక కూడా అతడిని కూర్చోపెట్టి పాఠ్యాంశాల్లో లేని విషయాలనూ నేర్పించేవారు. మిగిలిన పిల్లలంతా క్రికెట్‌ అనీ సంగీతమనీ స్విమ్మింగ్‌ అనీ రకరకాల హాబీ క్లాసులకు వెళ్తుంటే సమయ్‌ మాత్రం గంటల తరబడి టీచరు దగ్గర కూర్చుని ఆ పాఠాలను శ్రద్ధగా వినేవాడు. తనకొచ్చే ఆలోచనలను ఆమెతో పంచుకునేవాడు. బ్రేక్‌త్రూ జూనియర్‌ ఛాలెంజ్‌ గురించి బంధువుల ద్వారా తెలుసుకున్న సమయ్‌ టీచరుతో చెప్పి తానూ పాల్గొంటానన్నాడు. ఆమె ప్రోత్సహించడమే కాక సమయ్‌కి అవసరమైన మార్గదర్శకత్వం వహించారు. గత ఏడాది కూడా పోటీలో పాల్గొన్న సమయ్‌ పాపులర్‌ ఓట్‌ గెలుచుకుని ఫైనల్స్‌ చేరుకున్నాడు కానీ విజేత కాలేకపోయాడు. మరింత పట్టుదలగా ప్రయత్నించి ఈ ఏడాది విజేతగా నిలిచాడు. 13-18 మధ్య వయసు పిల్లల్లో సైన్సు పట్ల ఆసక్తిని పెంచేందుకు సిలికాన్‌ వ్యాలీలో కొందరు ప్రముఖులు కలిసి ఏర్పాటుచేసిన ప్రతిష్ఠాత్మక ప్రైజ్‌ - బ్రేక్‌త్రూ ఛాలెంజ్‌. సైన్సులో పై చదువులు చదవడానికి తోడ్పడేలా విజేతకు పెద్ద మొత్తం బహుమతిగా ఇస్తున్నారు. దీనికి ఏటా పాతికవేలకు పైగా ఎంట్రీలు వస్తాయి. నాలుగైదు దశల్లో వడపోత జరుగుతుంది. 15 మంది ఫైనలిస్టుల నుంచి విజేతని ఎంపిక చేస్తారు. ఈ ఏడాది ఫైనలిస్టుల్లో ముగ్గురూ భారతీయ విద్యార్థులే కావడం విశేషం. బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉందనీ న్యూరోసైన్స్‌లో పై చదువులు చదువుతాననీ చెబుతున్నాడు ఈ యువ శాస్త్రవేత్త.

 

చదివింది డిప్లొమా... జీతం 70 లక్షలు!

డుగురు సంతానంలో రెండోవాడైన మొహమ్మద్‌ ఆమిర్‌ అలీ క్లాసులో ఎప్పుడూ ఫస్టే. దిల్లీలోని ప్రఖ్యాత జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదవాలని కలలు కన్నాడు. కానీ సీటు రాలేదు. ఎన్‌ఐటీలో సీటు వచ్చినా ఫీజు కట్టలేనంటూ చేతులెత్తేశాడు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే తండ్రి. తాను కన్న కలలకూ కుటుంబ స్థితిగతులకూ లంగరు అందదని తెలిశాక పరిస్థితులతో రాజీపడ్డాడు ఆమిర్‌. ఇంజినీరింగ్‌ చదవాలనుకున్న చోటే మెకానికల్‌ డిప్లొమా కోర్సులో చేరాడు. కానీ మనసులో అసంతృప్తి. ఇంకా ఏదో చేయాలి. ఏదో సాధించాలి... నిద్ర పట్టేది కాదు. ఏ కాస్త టైమ్‌ దొరికినా గ్యారేజ్‌లోకి వెళ్లి కూర్చునేవాడు. అక్కడ ఉన్న పనిముట్లతో తోచింది చేస్తూ గడిపేవాడు. విద్యుత్తుతో నడిచే వాహనాల గురించి లెక్చరర్‌ చెప్పిన పాఠం ఆసక్తిగా అనిపించి దాని గురించి ఇంకా తెలుసుకోవడానికి దొరికిన పుస్తకమల్లా చదివేవాడు. ఎలక్ట్రీషియన్‌ అయిన తండ్రిని అడిగితే అవేవీ తనకు తెలియవనేవాడు. మరొకరి దగ్గర నేర్చుకుని పనిచేయడం తప్పితే అతడేమీ చదువుకున్నవాడు కాదు. దాంతో తన సందేహాలన్నీ కాలేజీలో లెక్చరర్లనే అడిగేవాడు ఆమిర్‌. కనపడితే ప్రశ్నలతో చంపేస్తాడని లెక్చరర్లు కూడా అతడిని తప్పించుకువెళ్లేవారు.

విద్యార్థులందరూ లెక్చరర్లు చెప్పింది నేర్చుకోవడానికి కిందా మీదా పడుతుంటే ఆమిర్‌ మాత్రం స్వయంగా ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ- రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్‌ వాహనాన్ని ఛార్జింగ్‌ చేయడం ఎలాగో కనిపెట్టాడు. ఆ విషయం లెక్చరర్లకు చెబితే ఎవరూ నమ్మలేదు, అతడిని పట్టించుకోలేదు. ఒక్క ప్రొఫెసరు మాత్రం ఆమిర్‌ వెన్నుతట్టాడు. నమూనా తయారుచేయమని ప్రోత్సహించాడు.

నమూనా అంటే మాటలతో అయ్యే పని కాదు. తండ్రిని బతిమాలి, సోదరుల దగ్గరా, స్నేహితుల దగ్గరా చేబదుళ్లు తీసుకుని సెకండ్‌ హ్యాండ్‌ మారుతి కారు కొన్నాడు. దాన్ని ఎలక్ట్రిక్‌ కారుగా మార్చి తను కనిపెట్టిన విధానంతో ఛార్జింగ్‌ చేసి చూపించాడు. అదిచూసి అమిర్‌ ప్రతిభకు అంతా ఆశ్చర్యపోయారు. మనదేశంలో విద్యుత్తు వాహనాలకు చార్జింగే పెద్ద సమస్య అనీ, ఇంతవరకూ ఎవరూ దాని గురించి ఆలోచించలేదనే ఆమిర్‌ అందుకే తనని మొదట ఎవరూ నమ్మలేదంటాడు. ప్రొఫెసర్‌ చెప్పాక, యూనివర్శిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వాళ్లు కూడా ప్రోత్సహించాక ఆమిర్‌ ప్రతిభని అందరూ గుర్తించారు. యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో ఆ ప్రాజెక్టును పెట్టారు. ఆ ఒక్క సంఘటనే ఆమిర్‌ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. వెబ్‌సైట్‌లో ఆమిర్‌ ప్రాజెక్టు చూసిన అమెరికా కంపెనీ ఫ్రిసన్‌ మోటార్‌ వర్క్స్‌ 70 లక్షల రూపాయల వార్షిక వేతనంతో అతనికి ఉద్యోగం ఇచ్చింది. డిగ్రీ అర్హత లేకుండా కేవలం డిప్లొమా చేసినవారికి ఇంత పెద్ద మొత్తం జీతంతో ఉద్యోగావకాశం రావడం మనదేశంలో ఇదే మొదటిసారి. బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తూ తన పరిశోధన కొనసాగిస్తాననీ, విద్యుత్‌ వాహనాల తయారీలో విప్లవాత్మక మార్పులు తెచ్చి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడమే తన జీవితాశయమనీ అంటున్నాడు ఆమిర్‌.

కప్పులు కడగాల్సిన కుర్రాడు ఐఏఎస్‌ కొట్టాడు!

కష్టపడే వాళ్లకి కష్టాలే భయపడతాయేమో! నాలుగో తరగతిలోనే బడి మానేసి ఏ హోటల్‌లోనో కప్పులు కడగాల్సిన పిల్లవాడు ఐఏఎస్‌ అవుతాడని ఎవరైనా ఊహించగలరా? అన్సర్‌ షేక్‌ చేసి చూపించాడు. పైగా తొలి యత్నంలోనే 21 ఏళ్లకే ఐఏఎస్‌ అయి ఆ ఘనత సాధించిన పిన్నవయస్కుల్లో ఒకడయ్యాడు. అన్సర్‌ తండ్రి ఆటో రిక్షా నడిపేవాడు. తల్లి పొలాల్లో కూలి పనిచేసేది. అయినా ఇంట్లో ఒక పూట తింటే ఒక పూట పస్తులే. మహారాష్ట్రలోని కరవు జిల్లాలో ఉంది వారి ఊరు. కరవు రాజ్యమేలుతుంటే పనులేం దొరుకుతాయి. ఆ పరిస్థితులకు తోడు తండ్రి తాగుడు వ్యసనం. రోజూ తాగి వచ్చి అతడు చేసే గొడవ ఇంట్లో శాంతి లేకుండా చేసేది. ఆ వాతావరణం నుంచి బయటపడాలంటే చదువు తప్ప మరో మార్గం లేదని భావించిన అన్సర్‌ బాగా చదివేవాడు. కానీ తండ్రి మాత్రం బడి మానేసి హోటల్‌లో కప్పులు కడిగే పనిచేయమని బలవంతం చేసేవాడు. ఎంత చెప్పినా కొడుకు వినడం లేదని ఓసారి బడికి వెళ్లి ఉపాధ్యాయులతో గొడవపడ్డాడు. అప్పుడు అన్సర్‌ క్లాసు టీచరు చెప్పిన మాటలు అత[డి తండ్రినేమో కానీ తొమ్మిదేళ్ల అన్సర్‌ని మాత్రం బాగా ప్రభావితం చేశాయి. ‘మీ అబ్బాయి తెలివిగలవాడు. ఎప్పటికైనా మీ కుటుంబ పరిస్థితిని మార్చగలిగేది అతడి చదువే’ అని ఆయన చెప్పడంతో తండ్రి మాట్లాడకుండా వెళ్లిపోయాడు. తాను చదువుకుంటే తన కుటుంబం బాగుపడుతుందన్న మాట మాత్రమే అన్సర్‌కి అర్థమైంది. అందుకని ఎక్కడ తండ్రికి కన్పిస్తే మళ్లీ బడి మానేయమంటాడోనని మధ్యాహ్నభోజనానికి కూడా ఇంటికి వెళ్లేవాడు కాదు. ఆ టైమ్‌లోనూ క్లాసులోనే కూర్చుని చదువులో మునిగిపోయేవాడు. ప్రభుత్వ పాఠశాల కాబట్టి ఫీజుల గొడవ లేదు. సీనియర్ల దగ్గర సెకండ్‌హ్యాండ్‌ పుస్తకాలు అడిగి తీసుకుని చదువుకునేవాడు. పన్నెండో తరగతిలో 90 శాతం మార్కులు వచ్చాయి. ఉత్సాహంగా పట్నంలో డిగ్రీలో చేరాడు. ఇంగ్లిష్‌ మాట్లాడటం రాదు, మంచి బట్టలు లేవు, కాళ్లకు స్లిప్పర్లు... అతడి వాలకం చూసి చాలాసార్లు లెక్చరర్లు కూడా స్టూడెంట్‌ అనుకునేవారు కాదట. అలాంటి అనుభవాలన్నీ అన్సర్‌లో పట్టుదలను పెంచాయి. మొదటి రోజునుంచే సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా కష్టపడ్డాడు. శక్తులన్నీ కేంద్రీకరించి అటు ఇంగ్లిష్‌ నేర్చుకుంటూనే ఇటు పరీక్షకీ ప్రిపేరయ్యేవాడు. అలా డిగ్రీ పరీక్షలతో పాటు మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ రాసి ఏకంగా ఐఏఎస్‌కి ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘ఐఏఎస్‌ అయ్యాకే నా మొదటి జత బూట్లు కొనుక్కున్నా...’ అంటాడు అన్సర్‌.

పానీపూరీ అమ్మిన క్రికెటర్‌!

రోడ్డుపక్కన పానీపూరీ అమ్మే ఓ కుర్రాడు త్వరగా అన్నీ అమ్ముడుపోవాలని కోరుకుంటూనే మరో పక్క ‘దేవుడా వాళ్లు మాత్రం ఇటువైపు రాకుండా చూడు’ అని మనసులోనే దండం పెట్టుకునేవాడు. వాళ్లు డబ్బులివ్వకుండా తినిపోయే వీధి రౌడీలేం కాదు, తన స్నేహితులే. పైగా ప్రొఫెషనల్‌ క్రికెట్‌ని కెరీర్‌గా ఎంచుకుని నిరంతరం సాధన చేస్తున్న క్రీడాకారులు. ఆ అబ్బాయీ వారిలో ఒకడే, కాకపోతే పానీపూరీ అమ్మితే కానీ పూట గడవని నిరుపేద. వారి ముందు పరువు పోకూడదనే అతడి బాధ. అతడే యశస్వి జైస్వాల్‌. పేరు విన్నట్లుగా ఉంది కదూ! అవును, ఆసియా కప్‌ గెలిచిన అండర్‌ 19 జట్టులో ఆడి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ కుర్రాడే. చిన్న బడ్డీ కొట్టే జీవనాధారమైన యశస్వి తండ్రికి ఇద్దరు కొడుకుల్ని చదివించడమే శక్తికి మించిన పని. ఇక ఆటలు ఎక్కడ నేర్పించగలడు... అదీ ఖరీదైన క్రికెట్‌! అయినా క్రికెట్‌ పిచ్చి పదకొండేళ్ల యశస్విని యూపీ నుంచి ముంబయిలోని బంధువులింటికి చేర్చింది. పగలంతా ఆడడం, పడి నిద్రపోవడం తప్ప మరో పని చేతకాని ఆ పిల్లవాడిని నెలరోజులకే బంధువులూ ఇంట్లోనుంచి పంపించేశారు. క్రికెట్‌ ఆడాలంటే కష్టపడక తప్పదని అర్థమైంది యశస్వికి. ఆ బంధువుల సాయంతోనే ఓ క్లబ్‌లోని టెంట్‌లో ఆశ్రయం పొందాడు. పొద్దున్నుంచీ మధ్యాహ్నం వరకూ గ్రౌండ్‌లో ఆట ప్రాక్టీసు. మధ్యాహ్నం భోజనం చేశాక కాసేపు పండ్లు అమ్మేవాడు. సాయంత్రాలు పానీపూరీ అమ్మేవాడు. అలా సంపాదించిన డబ్బు బొటాబొటిగా యశస్వి తిండికి సరిపోయేది. అప్పుడప్పుడూ తండ్రి కూడా కొంత పంపుతుండేవాడు. అయినా బూట్లూ బట్టల కోసం ఎవరో ఒకర్ని సాయం అడగక తప్పేది కాదు. ఒకోసారి రెండు మూడు టీములు కలిసి పందెం కట్టి క్రికెట్‌ ఆడేవి. అందులో గెలిస్తే డబ్బులొస్తాయని యశస్వి కష్టపడి ఆడేవాడు. స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆ అబ్బాయి రోజుకు 16గంటలు కష్టపడేవాడు. దానికితోడు తనవాళ్లంటూ ఎవరూ దగ్గర లేని ఒంటరితనం ఆ పసివాడిని బాధించేది. స్నేహితులందరికీ ఇంటి నుంచి భోజనాలు వచ్చేవి. తల్లిదండ్రులు దగ్గరుండి కొసరికొసరి తినిపించేవారు. యశస్వి తాను సంపాదించుకున్న డబ్బుతో తానే కొనుక్కుని తినేవాడు. బాధతో అదీ గొంతు దిగేది కాదు. ఏడుస్తూ పడుకునేవాడు. తెల్లారి లేచి మరింత పట్టుదలగా ఆడేవాడు. అలా శక్తులన్నీ లక్ష్యం మీదే కేంద్రీకరించాడు. పదమూడేళ్ల కుర్రాడు ‘ఎ’ డివిజన్‌ బౌలర్‌ని అలవోకగా ఎదుర్కోవడం స్థానిక కోచ్‌ జ్వాలాసింగ్‌ దృష్టిలో పడింది. ఆ పిల్లవాడిలో తనని తాను చూసుకున్న జ్వాలాసింగ్‌ యశస్వికి అండగా నిలిచాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం యశస్వికి ధైర్యాన్నిచ్చింది. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ సత్తా చాటాడు. ఫలితమే- మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా అండర్‌ 19 జట్టులో అతని స్థానం.

కలల్ని నమ్మింది!

‘కలల్ని నమ్మేవారికే అవి సొంతమవుతాయి...’ ఇలాంటి మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి. శ్వేతాఅగర్వాల్‌ చదువుకునే టేబుల్‌ మీద రాసి ఉన్న ఆ కొటేషన్‌ చూసినవారూ అలాగే అనేవారు. కానీ శ్వేత అలాంటి పెదవి విరుపుల్ని పట్టించుకోలేదు... తన కలల్నే నమ్మింది. ‘ఆడపిల్లకి పెళ్లి చెయ్యకుండా చదివిస్తావా?’ అంటూ ఏ ఊరివారైతే ఆ తండ్రి చెవిలో జోరీగలాగా రొద పెట్టారో ఆ ఊరి ప్రజలే ఓ రోజు పేపరు చూసి ‘మొత్తానికి నీ కష్టం ఫలించిందయ్యా’ అని భుజం తట్టారు. కాకపోతే ఆ రెండు సందర్భాలకీ మధ్య ఓ అమ్మాయి ఇరవయ్యేళ్ల పోరాటం ఉంది. ఓ అమ్మానాన్నల మౌనవేదన ఉంది. పశ్చిమ్‌బంగలో స్థిరపడిన మార్వాడీ కుటుంబం శ్వేతది. 15 మంది పిల్లలున్న ఆ ఉమ్మడి కుటుంబంలో కాలేజీకి వెళ్లి డిగ్రీ పూర్తిచేసిన మొదటి ఆడపిల్ల, అందరికన్నా చిన్నదైన శ్వేత. ‘పుట్టిన తర్వాత మా ఉమ్మడి కుటుంబంలో నా గురించి ఒక మంచిమాట విన్నది నేను ఐఏఎస్‌కి ఎంపికయ్యాకే’ అనే శ్వేత మాటల వెనక ఓ పుస్తకం రాయడానికి సరిపోయేంత విషాదం ఉంది. చిన్న కిరాణాకొట్టు తప్ప సరైన సంపాదన లేకపోవడం, ఆడపిల్ల తండ్రి కావడం- శ్వేత తండ్రికి కుటుంబంలో విలువ లేకుండాచేశాయి. ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక పుల్లవిరుపు మాట అనడం, అమ్మానాన్నా తమలో తాము కుంగిపోవడం చూస్తూ పెరిగిన శ్వేతలో ఎప్పటికైనా వాళ్లు తలెత్తుకు తిరిగేలా చేయాలన్న పట్టుదల కూడా పెరిగింది. కాలేజీలో చేరడానికి ఏదో సర్టిఫికెట్‌ అవసరమై ఓరోజు ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లింది శ్వేత. కాగితమ్మీద సంతకం చేసివ్వడానికి తనని మూడు గంటలు కూర్చోబెట్టిన అక్కడి సిబ్బంది మీద కోపంతో ‘ఒకరోజు నేను కలెక్టర్‌నై వస్తాను చూస్తా ఉండండి’ అని చెప్పివచ్చింది. ఎంబీఏ చదివి డెలాయిట్‌లో ఉద్యోగంలో చేరింది. ఏడాదిపాటు పనిచేసి జీతం డబ్బులు దాచుకుని ఉద్యోగం మానేసింది. ‘ఐఏఎస్‌ అంత తేలిక కాదు. టాప్‌ 90లో రావాలి. అనవసరంగా మంచి ఉద్యోగం వదులుకుంటున్నావు’ అన్నాడు అక్కడి అధికారి. టాప్‌ 90లోనే వస్తానని సమాధానం చెప్పి వచ్చిన శ్వేత పట్టణంలోనే ఉంటూ పరీక్షకు చదివేది. ఆ సంవత్సరమే సిలబస్‌ మారింది. అయినా శ్వేత పట్టుదలతో చదివి పరీక్ష రాసింది. మొదటి ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ వచ్చింది. మళ్లీ ప్రిపరేషన్‌ కొనసాగించింది. ఇంతలో మరో ఉపద్రవం. ఉద్యోగమూ పెళ్లీ లేకుండా నీ కూతురు పట్నంలో ఏంచేస్తోందంటూ ఇంట్లోవాళ్లూ ఊళ్లోవాళ్లూ శ్వేత తండ్రిని నిద్రపోనీయలేదు. అయినా పట్టువదలని శ్వేత రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కి ఎంపికై, మూడోసారి 19వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించింది. ఆడపిల్లకు చదువెందుకు అన్నవారందరి నోళ్లూ మూయించింది.

విజేత వెనక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠిన శ్రమా అంకితభావమూ అనేందుకు ఇంతకన్నా నిదర్శనం కావాలా?!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.