close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అణువణువూ అద్భుతం.. బృహదీశ్వరాలయం..!

‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారుహైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌. 

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటినుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట. 
ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే. 

ఆలయం... అద్భుతనిలయం! 
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 
ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి. 

వ్యవసాయ క్షేత్రం! 
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు. 

త్యాగరాజ సమాధి! 
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట. 
సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.