close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమ్మోహనం 

- దివ్య మురళి

రణి ఇల్లంతా కళ్ళారా చూసి తృప్తిగా నవ్వుకుంది. తను ఎప్పటినుంచో కలలుకంటున్న బృందావనం ఇప్పటికి సిద్ధమైంది. హాల్లోని కృష్ణుని ప్రతిమ దగ్గరికి వెళ్ళి పాదాలపై తలవాల్చి కూర్చుంది. ఇల్లంతా రకరకాల కృష్ణుని చిత్రాలతో ఎంతో అందంగా అలంకరించింది. ఎప్పట్నుంచో సేకరించిన వాటన్నింటినీ ఒక పద్ధతిలో అమర్చడంతో ఎంతో అందం వచ్చింది. ఒక్కో చిత్రాన్ని సరైన స్థానంలో అమర్చి, అందంగా తీర్చడానికి చాలా సమయం వెచ్చించింది చరణి. శ్రీకృష్ణ జననం దగ్గర నుంచీ కాళీయ మర్దనం, రాసలీలలు, గోవర్ధనోద్ధరణ... ఇలా చాలా చిత్రాలు ఉన్నాయి తన దగ్గర. వాటిని సేకరించడంలో ఎక్కడా చిన్న విషయానికి కూడా రాజీపడలేదు. కృష్ణుని రూపం విషయంలో అయితే అస్సలు రాజీపడేది కాదు. ఎంత అందమైన చిత్రమైనా పూర్తి తృప్తినిచ్చేది కాదు తనకి. కృష్ణ స్వరూపం ఎంతో మనోహరమైంది. ఎంతటి చిత్రకారుడికైనా ఆ రూపాన్నీ ఆ అందాన్నీ చిత్రించడం అసాధ్యం అంటూ ఉంటుంది ఎప్పుడూ తన భర్త నీరజ్‌తో. కృష్ణ నామాన్ని స్మరిస్తూ ఉంటే మరింకేమీ అక్కర్లేదు అనిపించేది తనకి. కానీ ఇవాళెందుకో... 
ఆ కృష్ణ పాదాలు స్పృశిస్తూ ఉంటే, ఈ బృందావనం అంతా అల్లరి నవ్వులతో నింపుతూ తిరిగే చిన్నచిన్న పాదాల కన్నయ్య ఉంటే ఎంత బావుంటుంది అనిపించింది. మరుసటిరోజు ఆ మాట తన భర్తతో చెప్పింది. వాళ్ళ పదేళ్ళ వైవాహిక జీవితంలో సంతానం లేకపోవడం ఒక పెద్ద లోటే అయినా ఎప్పుడూ దాన్ని గురించి పెద్దగా బాధపడింది లేదు. పెళ్ళయిన రెండేళ్ళకే తెలిసింది... ఇద్దరికీ సంతాన సాఫల్యతా అవకాశాలు తక్కువ అని. కొంత బాధగా అనిపించినా సంతానం మీద ప్రేమను సమాజం మీద చూపాలి అనుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కూడా. ఇప్పుడు చరణి మాట విన్నాక, మొదట ఎలా స్పందించాలో అర్థంకాలేదు అతనికి. కొంతసేపు ఆలోచించాక అన్నాడు ‘‘ఎవరి ప్రేమకీ నోచుకోని అనాథను దత్తత తీసుకుందామా?’’ అని. 
వెంటనే ఎంతో ఆనందంగా ఒప్పుకుంది. అసలు ఇన్నాళ్ళూ ఈ ఆలోచన రానందుకు బాధపడింది కూడా. ఆ వారాంతంలోనే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళి ప్రయత్నించాలి అనుకున్నారు. ముద్దులొలికే చిన్ని కన్నయ్య చిత్రాలన్నీ చూపిస్తూ, తన కొడుకు ఎలా ఉండాలో చెప్పనారంభించింది... ‘‘ఇలా ఇంతలేసి కళ్ళతోటి, అమాయకంగా ఎవ్వరికైనా చూడగానే ఎత్తుకుని ముద్దులాడాలి అనిపించాలి’’ అంది కృష్ణ జననం చిత్రంకేసి చూస్తూ పరవశంగా. ‘‘నేను కోప్పడ్డాననుకోండీ... ఇదిగో ఇలా బుంగమూతితో నా కోపం మరచిపోయేలా చేసెయ్యాలి.’’ నవనీత చోరుడికేసి చూపిస్తూ మురిసిపోసాగింది. ఏదో గుర్తొచ్చినదానిలా నీరజ్‌ చేయి పట్టుకుని మెట్ల మీదకి లాక్కెళ్ళింది. అక్కడ మధ్యలో ఉన్న చిత్రంలో చిటికెన వేలిపై గోవర్ధనగిరిని సునాయాసంగా ఎత్తి నిలుచున్న కృష్ణుడి రూపాన్ని చూపిస్తూ అంది ‘‘నాకెప్పుడైనా ఏదైనా బాధగా అనిపించిందే అనుకోండీ... ‘నేనున్నాగా అమ్మా’ అన్నట్టు ఇలా తన చిద్విలాసంతో నా బాధనంతా పోగొట్టేయాలి...’’ అంటూ ఇంకా ఏదో చెబుతుంటే- 
‘‘కృష్ణుడి రూపాన్ని ఎంతసేపు చూసినా ఆ కబుర్లు ఎన్ని చెప్పినా నీకు తనివి తీరదు కానీ, అలాంటి బాబునే వెతికి తెచ్చుకుందాం, ప్రశాంతంగా పడుకో, రేపు ఆదివారం ఆ పనిమీదే వెళ్దాం’’ అని బుజ్జగిస్తూ తమ గది వైపుకి తీసుకెళ్ళాడు ఆమెని. ఆ కరుణ పొంగే కన్నులూ ముగ్ధమనోహర మైన నవ్వూ... ఆ కన్నయ్యే వచ్చి తన ఒడిలో ఆదమరిచి నిద్రపోతున్నట్టుగా ఊహించు కుంటూ ఎప్పటికో నిద్రలోకి జారింది. కలలో తను ఎక్కడో ఒక పూలతోటలో కూర్చుని ఉంది. ఎక్కడినుంచో కిలకిలా నవ్వులు వినపడుతున్నాయి. లేచి ఆ నవ్వులు వచ్చే వైపుగా వెళ్ళింది. అక్కడ ఓ చెట్టుకింద చిన్న బుట్టలో కేరింతలు కొడుతూ నవ్వుతూ ఓ పసికందు. తను ఆర్తితో చేతుల్లోకి తీసుకొనేంతలో మాయమైపోయాడు. మళ్ళీ అదే నవ్వులు... పక్కనే ఉన్న పొన్నపూల చెట్ల దగ్గరనుంచి... పరుగున వెళ్ళింది. ఈసారి మాయమైపోనివ్వకుండా ఎత్తుకుని గుండెలకి హత్తుకుంది. ఆ అనుభూతి అనిర్వచనీయం అనిపించింది. అలా ఎంతసేపు ఉందో తెలియదు. ఆ చిన్నారి నిద్రలోకి జారినట్టు అనిపించి, ఒడిలో పడుకోబెట్టుకుంది. 
అప్పుడు చూసింది ఆ చిన్నారి రూపాన్ని. ఎవరో అంతరాంతరాల్లో ఛెళ్ళున చరిచినట్టు అనిపించి దిగ్గున మెలకువ వచ్చింది చరణికి. పొద్దున్నే లేచి తన పనులన్నీ మామూలుగానే చేసుకుపోతున్నా, తానేదో బాధపడుతోంది అని అర్థమైంది ఆమె భర్త నీరజ్‌కి. టిఫిన్‌ చేస్తున్నప్పుడు అంది ‘‘ఆరాధన ఆశ్రమానికి ఓసారి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను, మీకు కుదిరితే ఇద్దరమూ వెళ్దాం’’ అంది. 
ఆశ్చర్యం నిండిన చిరునవ్వుతో ఆమె కళ్ళలోకి చూశాడు ‘అవునా!?’ అన్నట్టుగా. మెల్లగా తలూపి మళ్ళీ అంతలోనే ముభావంగా మారిపోయింది. 
ఏమైంది అన్నట్టు అనునయంగా చూశాడు. ‘‘ఇన్నాళ్ళూ నేను ఆలోచించిన తీరుకి నామీద నాకే చిరాగ్గా ఉంది నీరజ్‌, అసలు అంత అవివేకంగా ఎలా ఉన్నాను ఇన్నాళ్ళూ అనిపిస్తోంది’’ అంది.

* * * * * * * * * * 

కొన్నాళ్ళక్రితం ఒకరోజు సాయంత్రం పక్కనే ఉన్న పార్కుకి వాకింగ్‌కి వెళ్ళి వస్తూ ఉండగా ట్రక్‌ ఒకటి వేగంగా వచ్చి, ఆ పక్కనే రోడ్డు దాటుతూ ఉన్న ఒక యాచకురాలిని ఢీకొట్టింది. పరుగున వెళ్ళి చూసింది చరణి. ఒక పిచ్చామె... 20 ఏళ్ళు ఉంటాయేమో... ఒళ్ళంతా రక్తం... ఆమె చేతిలోని మూటలోని బట్టలన్నీ కొంచెం దూరంలో విసిరినట్టుగా పడిపోయాయి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు చరణి. ఆ అమ్మాయిని చుట్టూ ఉన్న జనం సాయంతో తన కారు దగ్గరకి తీసుకెళ్దాం అని ప్రయత్నిస్తూ ఉండగా, దూరంగా పడిపోయిన తన బట్టలమూటకేసి చూపించసాగింది ఆమె. ఏదో పిచ్చితనంలే అనుకుంది చరణి. కారులో పడుకోబెడుతూండగా వినపడింది బిగ్గరగా పసికందు ఏడుపు. పార్కు వాచ్‌మాన్‌ భార్య బట్టల మధ్యలో పడి ఉన్న చిన్న నెలల బిడ్డను ఎత్తుకుని వచ్చింది. అంత బాధలోనూ పిచ్చిదైనా తన బిడ్డను మరువలేదా తల్లి అనుకున్నారు అందరూ. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళి నీరజ్‌కి ఫోన్‌ చేసింది. ఆ అమ్మాయిని ఐసీయూకి తరలించారు. చరణికి సాయంగా వచ్చిన పార్కు వాచ్‌మాన్‌ భార్య అంది ‘‘ఎక్కడినుంచి వచ్చిందో తెలీదమ్మా పాపం! ఒక ఏడాదిపైనే అయ్యుంటది... అసలు ఎవరితోనూ మాటాడేది కాదు, తనలో తానే ఏదో గొణుగుతూ ఉండేది. ఆ మాటల్నిబట్టి బాగా సదువుకున్న పిల్లేమో అనిపించేది. మా వాకిట్లోనే పడుకునేది. క్రితం సెలవుల్లో ఊరెళ్ళొచ్చేతలికి ఏ యదవలో పాడుసేసి కాలవ పక్కన తుప్పల్లో పడేసి పొయ్యారంట. ఇంక ఆ తరవాత తొమ్మిది నెల్లూ నరకం సూసిందమ్మా పాపం! మీరు దయగల తల్లి గాబట్టి మీ కారులో తీసుకొచ్చేరు, ఆనాడు నడిరోడ్డు మీద పడి అర్ధరాత్రి నొప్పులు పడతావుంటే ఎవురికీ కనికరం కలగలేదు తల్లీ. ఎవుడి పాపానికి పుట్టినా ఈ బిడ్డని మాత్రం వదిలేదిగాదు ఆ పిచ్చిపిల్ల. ఎవురైనా సూడబోయినా కొట్టడానికి వచ్చేసేది’’ అంటూ తనకేదో పనుందనీ వెళ్ళాలనీ చెప్పి, ఆ బిడ్డను చరణి చేతుల్లో పెట్టింది. 

ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే ఏదో తెలియని మధురానుభూతి అనిపించింది చరణికి. చుట్టి ఉన్న మురికి బట్టల్ని తొలగించి ముఖంలోకి చూసింది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. ఒక కంటి మీద నుంచి బుగ్గ వరకూ గోటితో బలంగా రక్కేసిన గాయంతో, పుల్లల్లాంటి కాళ్ళూ చేతులతో దయనీయంగా ఉందా పాప. అయిదారు నెలల్లోపే ఉంటుంది వయస్సు ఆ పసికూనకి. ఒళ్ళంతా కూడా గాట్లూ గాయాలూ. ఆ పాపతో తను పిల్లల వార్డు వైపు వెళ్తుండగా వచ్చాడు నీరజ్‌. ఆ తరవాత రెండు రోజులకే కన్ను మూసింది ఆ పాప తల్లి. పాపకి చికిత్స చేసిన డాక్టర్‌ సలహా మేరకు ఆ పాపని ఆయన తరచూ వెళ్ళే దగ్గర్లోని ఆరాధన ఆశ్రమంలో చేర్పించారు నీరజ్‌ దంపతులు.

* * * * * * * * * *

వర్షిస్తున్న కళ్ళతో అంది చరణి

‘‘కృష్ణతత్వం అంటే ఆయన సమ్మోహనమైన రూపమే అనుకునేదాన్ని. కృష్ణతత్వం అంటే ఎల్లలెరుగని ప్రేమ అని గ్రహించలేక పోయాను. అసలు సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడికి రూపమేంటి నా పిచ్చి కాకపోతే?

కలువల్లాంటి చారెడేసి కన్నుల్లోనే కాదు, అసలు వెలుగే చూడలేని కన్నుల్లో ఉన్నదీ ఆయనే కదా!? చిద్విలాసమూర్తిగా వైభవంగా గుడిలో దర్శనమిచ్చినా ఆకృతిలేని ముఖంతో వంకరపోయిన చేతులూ కాళ్ళతో గుడి బయట కనిపించినా... అంతా ఆయనే కదా!? లోకంలోకి వచ్చిన తరవాత తానే లోకంగా మారి పెంచుతుంది తల్లి బిడ్డని. అసలు లోకమే మరిచిన తల్లికి పుట్టీ, ఆ తోడు కూడా కోల్పోయి అనాథగా మిగిలిన ఆ పసిదానిలో నాకెందుకు కనిపించలేదండీ ఆ కన్నయ్య!? నా చుట్టూనే ఇన్ని రూపాలలో నిండి ఉన్న ఆ సమ్మోహనాకారుణ్ణి అందంలో వెతుక్కున్నానా..? సమ్మోహనం అంటే ‘మనసుల్ని ప్రేమతో నింపి, ఆనందం కలిగించడం’ అన్న సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోయాను..?’’ తన భుజంపై తలవాల్చి బాధపడుతున్న చరణి కళ్ళు తుడిచి, ప్రేమగా ఆమె నుదుటిని ముద్దాడాడు నీరజ్‌.

* * * * * * * * * *

తొలిసారి వెచ్చని పెదవుల స్పర్శ తన లేత బుగ్గల్ని తాకేసరికి గిలిగింతగా అనిపించిందేమో సమ్మోహనంగా నవ్వింది పాప. ఆ నవ్వు చూడగానే అప్రయత్నంగా అంది చరణి ‘‘సమ్మోహన’’ అని, మళ్ళీ ముద్దాడింది. ఆ పేరు తనకి నచ్చినట్టు మరింత సమ్మోహనంగా నవ్వింది పాప, అమ్మ ఒడిలోని హాయిని ఆస్వాదిస్తూ. ఆ నవ్వులతో నిండిన ఇల్లు అసలైన బృందావనమైంది. కృష్ణతత్వం అంటే ఆయన సమ్మోహనమైన రూపమే అనుకునేదాన్ని. కృష్ణతత్వం అంటే ఎల్లలెరుగని ప్రేమ అని గ్రహించలేకపోయాను. అసలు సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడికి రూపమేంటి నా పిచ్చికాకపోతే?

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.