close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ మాట నన్ను దుఃఖపెడుతుంది...

మేరీ కోమ్‌... ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ గెల్చుకున్న బాక్సర్‌. తల్లి అయ్యాక కూడా పతకాల వేటను విజయవంతంగా కొనసాగించడం మేరీ ప్రత్యేకత. ఈ ఏడాది ఇప్పటివరకూ నాలుగు స్వర్ణాలు గెలిచింది. భార్య, తల్లి పాత్రలు పోషిస్తూనే క్రీడల్లోనూ కొనసాగుతున్న మేరీకి మించిన స్ఫూర్తి ఎవరు! మరి, ఆమెకు అది ఎలా సాధ్యమవుతోందంటే...

ఆరోజు బాధనిపించింది

వృత్తిజీవితమూ ఉండే అందరు తల్లుల్లానే మేరీ కూడా కొన్నిసార్లు ఇష్టంలేకపోయినా పిల్లలకు దూరంగా వెళ్లాల్సి వస్తుంది. 2011లో చైనాలో జరిగిన ఆసియా కప్‌ ఛాంపియన్‌షిప్‌ సమయంలో కవలల్లో ఒకరికి గుండె ఆపరేషన్‌ చేస్తున్నారు. ‘నేను ఆ సమయంలో మానసికంగా బాగా కుంగిపోయాను. సరిగ్గా ట్రైనింగ్‌ కూడా తీసుకోలేదు. ఓన్లెర్‌ ఫర్వాలేదని చెబితే బరువైన గుండెతోనే వెళ్లాను. ఒకసారి ఆటలో పడ్డాక అన్నీ మర్చిపోవాల్సిందేగా. దేవుడి దయవల్ల నేను స్వర్ణం గెలిచాను. మా అబ్బాయి సర్జరీ కూడా సక్సెస్‌ అయింది’ అని ఆరోజుల్ని గుర్తుచేసుకుంటుంది.

ముగ్గురు పిల్లలు

మేరీకి ముగ్గురు అబ్బాయిలు. మొదటి ఇద్దరూ కవలలు. వారి వయసు 11 ఏళ్లు, మూడోవాడికి అయిదేళ్లు. ఏ టోర్నీకి వెళ్లి వచ్చినా దేశానికి పతకంతోపాటు పిల్లలకు బహుమతులు తెస్తుంది మేరీ. పిల్లలకి ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. వాళ్లకోసం ఎక్కువగా స్పోర్ట్స్‌ కిట్స్‌ తెస్తుంది. ‘నేను ఎప్పుడు టోర్నీకి బయలుదేరినా, ‘మళ్లీ ఎప్పుడు వస్తావమ్మా’ అని అడుగుతారు దిగులుగా. ఆ మాట కొన్నిసార్లు నన్ను చాలా దుఃఖపెడుతుంది’ అంటుంది మేరీ. పెద్ద పిల్లలకు మేరీ గురించి తెలుసు. ‘అమ్మ మెడల్‌ తెచ్చిన ప్రతిసారీ మాకెంతో సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది’ అనేది కవల పిల్లల మాట.

ఏడాది వ్యవధిలో

పిల్లలు పుట్టాక కూడా బాక్సింగ్‌ని వదిలిపెట్టాలనే ఆలోచన తనకు రాలేదంటుంది మేరీ. కవలలకు ఏడాది వయసొచ్చాక మళ్లీ రింగ్‌లో అడుగుపెట్టిన రోజులు తన జీవితంలో అత్యంత క్లిష్టమైన దశగా చెబుతుంది. ‘2008 ఒలింపిక్స్‌ సమయంలో వేరే నగరంలో శిక్షణ తీసుకుంటున్నాను. ఆ సమయంలోనే మణిపూర్‌లో ఉద్యమాల కారణంగా మూడు నెలలపాటు రవాణా స్తంభించింది. ఇంట్లో బేబీ ఫుడ్‌ అయిపోవచ్చింది. అప్పుడు మా స్పాన్సర్లతో మాట్లాడి పిల్లలకు ఫుడ్‌ అందించాకే నా మనసుని శిక్షణ మీద పెట్టగలిగాను. చిన్నవాడు పుట్టినపుడు వచ్చిన రెండేళ్ల గ్యాప్‌లో పెద్ద పిల్లలకి నచ్చింది వండి పెట్టేదాన్ని, స్కూల్‌కి సిద్ధం చేసేదాన్ని. చిన్నోడికి ఏడాది తిరిగేసరికి మళ్లీ గ్లవ్స్‌ తొడిగాను’ అని చెప్పే మేరీ... 2018 కామన్వెల్త్‌ స్వర్ణాన్ని తన ముగ్గురు బిడ్డలకు అంకితమిచ్చింది.

ఎలా సాధ్యమంటే...

మేరీ రాజ్యసభ సభ్యురాలు కూడా. ఇన్ని బాధ్యతలు చేపట్టడం ఎలా సాధ్యమని అడిగితే... ‘అందరూ చెప్పేదే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. టోర్నీ ఉన్నా లేకున్నా రోజూ ప్రాక్టీసు చేస్తాను. డెలివరీ అయిన రెండుసార్లూ దాదాపు 65 కేజీల నుంచి నేను పోటీ పడే 48 కేజీలకు బరువు తగ్గడానికి ఎంతో శ్రమించాను. బాక్సింగ్‌ రింగులో ఎలాగైతే చురుగ్గా ఉంటానో రోజువారీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో, పనులు చేయడంలో అంతే చురుగ్గా ఉంటాను. దీనివల్ల పనుల్ని సకాలంలో చేయగలుగుతాను. క్రీడాకారిణిగా ఉండటంతోపాటు ఒక మహిళగా, తల్లిగా ఉండటాన్నీ ఎంతో ఆస్వాదిస్తాను’ అని చెబుతుంది మేరీ.

ఆయన త్యాగం

కే ఓన్లెర్‌ కోమ్‌ని 2005లో పెళ్లాడింది మేరీ. ఓన్లెర్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు. పిల్లలు పుట్టాక ఫుట్‌బాల్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి వాళ్లని చూసుకోవడానికి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ‘ఈరోజుల్లో చాలామందికి ఒకరిద్దరు పిల్లలే ఉంటున్నారు. కానీ నాకు ముగ్గురు పిల్లలు. అయినా కూడా నాకు ఇష్టమైన బాక్సింగ్‌ కెరీర్‌ని కొనసాగించగలగడం అదృష్టమని చెప్పాలి. నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం లేకుంటే ఇది జరిగేది కాదు’ అంటుంది మేరీ. ‘మహిళలు మాత్రమే ఎందుకు తమ కెరీర్‌ను వదులుకోవాలి. మేరీ చాలా కష్టపడి పైకి వచ్చింది. సంప్రదాయం పేరిట ఆమె కష్టాన్ని కాలరాయడం నాకు నచ్చదు’ అనేది ఓన్లెర్‌ మాట.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.