close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిడికెడు బియ్యం ఇస్తే చాలు!

చిరుజల్లు కుంభవృష్టి అయింది. వాననీరు ఏరులా మారింది, వరదై పొంగింది. ఫలితంగా ఆ గ్రామం పంట మొత్తాన్నీ నష్టపోయింది. ఆకలికి అల్లాడింది. వారి బాధను చూసిన ఓ అమ్మ మనసు కదిలింది. ఆ వరద నుంచే స్ఫూర్తి పొందమంది. ప్రతి ఇంటి నుంచీ పిడికెడు బియ్యాన్ని ఓ చోట చేర్చి బియ్యం రాశులు సృష్టించేలా పురిగొల్పింది. పేద ప్రజల కడుపునింపింది. ఇప్పుడా ముందడుగు అన్నపూర్ణాలయంగా లక్షల మంది ఆకలి తీరుస్తోంది. ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పుతోంది. మరెందరికో ఆశ్రయాన్నిస్తోంది. 

క్కడైనా గుడిలో గంట కొట్టి భక్తులు దేవుడిని ప్రార్థిస్తారు. కానీ ఆ గుడిలో గంట కొట్టారంటే అర్థం ఆకలిగా ఉన్నవాళ్లు వచ్చి భోజనం చెయ్యండని. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని జిల్లెళ్లమూడి గ్రామంలో ఉన్న అన్నపూర్ణాలయంలో గత అరవయ్యేళ్లుగా రోజుకి రెండు సార్లు ఆ గంట మోగుతూనే ఉంది. ఎంతోమందికి ఆకలి తీరుతూనే ఉంది. ఈ మహత్కార్యానికి పునాది వేసింది జిల్లెళ్లమూడి అమ్మగా పేరుపొందిన అనసూయాదేవి. 1936లో గ్రామానికి దగ్గర్లోని వాగు పొంగి వరద రావడంతో చుట్టుపక్కల ఉన్న పంటలన్నీ మునిగిపోయాయి. పేదలకు తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అది చూసిన అనసూయాదేవి ‘గ్రామసేవ- పిడికెడు బియ్యం’ పథకానికి శ్రీకారం చుట్టారు. ‘రోజూ వండుకునే బియ్యం నుంచి పిడికెడు బియ్యం తీసి ఓ సంచిలో వేస్తే, పేదల ఆకలి తీర్చొచ్చు’ అని పిలుపునిచ్చారు. ఆ మాటలకు ఎంతోమంది స్ఫూర్తి పొందారు. అలా సేకరించిన బియ్యాన్ని వండి రోజూ పేదలకు భోజనం పెట్టేవారు అమ్మ. . ఆ ఏడాది తర్వాతా ఆమె సేవలు ఆగలేదు. 1958లో అన్నపూర్ణాలయం ఏర్పాటు చేశారు. పగలూ రాత్రీ అని తేడాలేకుండా  ఎవరొచ్చినా కడుపునిండా అన్నం పెట్టేవారు ఆమె. 

ఎంతోమంది సాయం 
అనసూయమ్మ సేవలు చూసి ఎంతోమంది ఆర్థికంగానూ తమవంతు సాయం చెయ్యడం మొదలుపెట్టారు. మరెంతోమంది ఆమెకు భక్తులైపోయారు. నలభై అయిదేళ్ల కిందట ఒకేరోజు లక్షమందికి అన్నదానం చేయగలిగారంటేనే ఆమె పెద్ద మనసును అర్థం చేసుకోవచ్చు. ‘విశ్వజననీ పరిషత్‌’ పేరుతో ప్రారంభమైన ట్రస్టు అనసూయమ్మ మరణానంతరమూ ఆ సేవల్ని కొనసాగిస్తోంది. ఒకేసారి వేలమంది వచ్చినా భోజనం వండేందుకు వీలుగా ఇక్కడ ఆధునిక వంటశాలను నిర్మించింది సంస్థ. ఏటా రైతులూ భక్తులూ ధాన్యాన్ని విరాళంగా ఇస్తుంటారు. జిల్లెళ్లమూడిలో నిత్యాన్నదానంతో పాటు,  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వరదల్లాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో బాధితులకు భోజనం, దుస్తులు అందిస్తోంది సంస్థ. 

ఉచిత విద్య, భోజనం! 
అన్నపూర్ణాలయం ఆవరణలో 1971లో స్థాపించిన మాతృశ్రీ ఓరియంటల్‌ సంస్కృత పాఠశాల, కళాశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి డిగ్రీ వరకూ ఉచిత సంస్కృత విద్యను బోధిస్తున్నారు. ఇక్కడ చదివే విద్యార్థులందరికీ వసతితో పాటు భోజన సౌకర్యాలూ సంస్థే కల్పిస్తుంది. వేదవిద్యను నేర్పేందుకు ఇక్కడ ‘వేద పాఠశాల’ కూడా ఉంది. ఈ రెండు విద్యాలయాల్లోనూ కలిపి ప్రస్తుతం మూడొందలమంది విద్యనభ్యసిస్తున్నారు. 

ఆదరణాలయం 
‘మా సంస్థ ప్రారంభించిన ఆదరణాలయం ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం ఇస్తోంది.  వీరి  బాగోగులన్నీ మేమే చూసుకుంటాం’ అంటారు విశ్వజననీ పరిషత్‌ అధ్యక్షుడు బ్రహ్మాండరావు. పిల్లలు విదేశాల్లో ఉండడంతోనూ ఇతర కారణాలతో ఒంటరైన పెద్దలు కూడా విశ్వజననీ సంస్థ నిర్వహించే ‘అందరిల్లు’  భవనంలో ఉండొచ్చు. ఇలా దాదాపు రెండొందల మంది ఇక్కడ ఒకే కుటుంబంలా ఉంటున్నారు. వీరందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. ఇక, ‘మాతృశ్రీ మెడికల్‌ సెంటర్‌’ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, రోగులకు వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేస్తోంది. అంతేకాదు, జిల్లెళ్లమూడి గ్రామస్థులందరికీ సంస్థ తరఫున మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చారు. అందరికీ సురక్షిత మంచినీటిని అందించేందుకు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ని ఏర్పాటుచేశారు. ఇలా... విశ్వజననీ పరిషత్‌ చేసే సేవాకార్యక్రమాలెన్నో. వీటన్నిటికీ దేశ విదేశాల్లోని దాతలు అందిస్తున్న విరాళాలే ఆధారం.

- గెంటిల నిఖిల్‌ కుమార్‌, ఈనాడు పాత్రికేయ పాఠశాల 
ఫొటోలు: జి.సురేష్‌కుమార్‌, న్యూస్‌టుడే బాపట్ల

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.