close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లక్ష్మీనారాయణుల ఆవాసం... మార్గశిరం

మంచుతెరలు దాటి వీనులవిందుచేసే విష్ణుసహస్రనామ పారాయణలూ, మోక్షానికి దారిచూపే ఉత్తరద్వార దర్శనాలూ, ఆస్తికుల లోగిళ్లకు పండగవాతావరణాన్ని తీసుకొచ్చే నోములూ వ్రతాలూ, కర్మయోగాన్ని వివరించే గీతాప్రవచనాలూ... ఇలా మార్గశిర మాసంలో కనిపించే ప్రతి దృశ్యమూ మనోహరమైందే. ఆధ్యాత్మిక శోభను నలుచెరగులా ఇనుమడింపజేసేదే. 

చాంద్రమానం ప్రకారం మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వస్తుండడంతో ఈ మాసాన్ని మార్గశిరమాసం అంటారు. ‘మాసానాం మార్గశీర్షోహం...‘అర్జునా! మాసాల్లో మార్గశిరం నేను’’ అని స్వయంగా గీతాచార్యుడు ప్రకటించుకున్నాడు. అందుకే ఈ మాసాన్ని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెబుతారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లో శ్రేష్ఠమైందీ తలమానికమైందీ మార్గశిరమే. ఈ మాసంలో వచ్చే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించినా, లక్ష్మీనారాయణులను అర్చించినా, గీతాపారాయణ చేసినా, కాలభైరవుడిని పూజించినా... మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. 
రోజూ ప్రత్యేకమే... 
మనిషిని భగవంతుడికి దగ్గరగా చేర్చేవీ, మంచి ఆలోచనలను ప్రేరేపించేవీ వ్రతాలూ పూజలూ. ఆ ప్రకారం... లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతి ఘడియా శుభప్రదమైందే. ప్రతిరోజూ విశేషమైందే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీ స్నానం చేసి దీపాలు వదలడం శ్రేష్ఠమని చెబుతారు. 
తదియనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే మార్గశిరం మాధవుడికేకాదు మహేశ్వరుడికీ ప్రీతికరమైనదంటారు. శుద్ధ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు. పగలనకా రాత్రనకా చేట్టూచేమల్లో తిరిగే తమ పిల్లలను కాపాడమంటూ నాగేంద్రుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. లోకకంటకుడిగా మారిన తారకాసురుడిని స్కందుడు అంతమొందించింది కూడా ఈ రోజే. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించినవారికి ఉత్తమమైన సంతానం లభిస్తుందని చెబుతారు. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు అవతరించిన రోజు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తుల పాపపుణ్యాలను స్వయంగా లెక్కచూస్తుంటాడంటారు. కాలభైరవ స్వరూపమైన శునకాన్ని ఈ రోజు పూజించి, గారెలు దండగుచ్చి వేస్తారు. 

ముక్కోటి ఏకాదశి 
శుక్లపక్ష ఏకాదశినే మోక్షదా ఏకాదశీ, సౌఖ్యదా ఏకాదశీ అని కూడా అంటారు. ఆ రోజు వైకుంఠం ద్వారాలు తెరుచుకోవడంతో ముక్కోటి దేవతలూ శ్రీహరి దర్శనానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనికూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పరిపాటి. సంవత్సరం పొడవునా ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండలేని వాళ్లు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజైనా ఉపవాసం ఉంటే చాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు అన్ని దేవాలయాల్లో జరిపే ఉత్తరద్వార దర్శనాలు అత్యంత శుభప్రదమైనవి. శ్రీకృష్ణపరమాత్మే స్వయంగా గీతామకరందాన్ని మానవాళికి అందించింది కూడా ఈ రోజే. సులభమైన పద్ధతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని ఇందులో వివరించాడు కృష్ణుడు. కర్మయోగం, భక్తియోగాలను తెలిపి జగత్తును జాగృతం చేశాడు.ఆ రోజు గీతాపారాయణ చేయడానికి అవకాశంలేనివాళ్లు భగవద్గీతలోని కనీసం పద్దెనిమిది శ్లోకాలనైనా పఠించాలని చెబుతారు. శుద్ధ నవమి రోజున త్రిరాత్రి వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఆ రోజు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామిని ఆరాధిస్తారు. 
శుద్ధ త్రయోదశిరోజున హనుమద్‌ వ్రతం చేయాలని చెబుతారు పండితులు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు హనుమద్‌ వ్రతాన్ని ఆచరించిన తర్వాతే హనుమంతుడి సహాయాన్ని పొందాడన్న కథనం ప్రచారంలో ఉంది. మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్తజయంతి. దీన్నే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజు అగ్ని పురాణాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటారు. త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి అంశగా జన్మించిన దత్తుడు మౌనముద్రతోనే లోకానికి ఉపదేశంచేసి జగద్గురువయ్యాడు. అందుకే ఆ రోజు దత్తచరిత్రను పారాయణచేసి ఆయన్ను స్మరించుకుంటారు. వీటితోపాటు కృష్ణపక్షంలో అనఘాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, మల్లి ద్వాదశి, యమత్రయోదశి... మొదలైన పర్వదినాలు వస్తాయి. 

గురువార వ్రతం 
మార్గశిర మాసం శివకేశవులకే కాదు లక్ష్మీదేవికీ అత్యంత ఇష్టమైన మాసంగా చెబుతారు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని అర్చించి, వ్రతకథను చదువుకుని, అందులో సూచించిన విధంగా మొదటి గురువారం పులగం; రెండో వారం అట్లూతిమ్మనం; మూడోవారం అప్పాలు, పరమాన్నం; నాలుగోవారం చిత్రాన్నం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ధనానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. నోములైనా వ్రతాలైనా పూజలైనా అభిషేకాలైనా మనలోని బద్ధకాన్ని వదిలించి, మన మనసులను ధర్మబద్ధం చేయడానికి పెద్దలు మార్గశిర మాసం రూపంలో ఏర్పాటు చేసిన విధివిధానాలే.!

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 040 -
23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.